నా బాల్యపు మిఠాయి అంగడి

ఈనాటి సృజన సాహితీ పత్రిక సాహిత్యం పేజీలో నా కవిత” నా బాల్యపు మిఠాయి అంగడి” కవిత చదవండి. Wilson Rao Kommavarapu గారికి ధన్యవాదాలతో..

ఇంటి ముందున్న బంతి పూల తోట

నేను విహరించిన తొలి ఉద్యానవనం..

సూరయ్య తాత చేసిన తాటి బొర్రల బండి

నేను తోలిన రెండు చక్రాల బెంజి కారు..

దోటితో గురిచూసి కొడితే రాలిపడిన

ఎర్రెర్రని సీమచింత గుబ్బలు

నా బాల్యపు మిఠాయి అంగడి లో తిన్న జిలేబీచుట్టలు..

అప్పుడే దింపిన లొట్టినుంచి

శాంతమ్మ లోటలో పోసిచ్చిన తాటికల్లు

నే తొలిసారి రుచి చూసిన సురాపానం..

మాతమ్మ వంతెన పైనుంచి దూకి

అన్నతో కలిసి జలకాలాడిన చెరువు

నే మొదటగా ఈత నేర్చిన తామర పూల కొలను..

కయ్య కయ్యా తిరిగి ఏరుకున్న పరిగ మోపులు

శెట్టి అంగట్లో కమ్మరకట్టు కోసం

నే సంపాదించుకున్న తొలి కాసులు..

వేసవి వచ్చిందంటే బడికి సెలవలు

గడ్డి వాములెక్కి ప్రకృతి ఒడిలో నేర్చుకునే ఆటల పాఠాలు

ఇప్పుడు చెమట చుక్కల మధ్య

గబుక్కున గుర్తొచ్చిన బంగారపు జ్ఞాపకాలు

రోహిణి వంజారి ..

9000594630