ధనాత్మకం

జీవితంలో మనిషికి ధనాత్మకంగా ఉండాల్సింది ఏమిటి ?. ఈ రోజు “విశాలాంధ్ర” ఆదివారం అనుబంధం లో నా కథ “ధనాత్మకం” ప్రచురితం అయింది. విశాలాంధ్ర సంపాదకులకు ధన్యవాదాలతో. మీరు కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా..

మిన్ను విరిగి మీద పడినా నాకేం కాదు. ధీమా అనేది నా రక్తంలోనే ఉంది. ఇటాంటివి ఎన్ని చూడలేదు నేను. ఈ మధుసూధన్ రావు అంటే ఎవరైనా, ఏదైనా గడగడలాడాల్సిందే.
అయినా దేవి ఎందుకు అంత కంగారు పడుతుంది. చిన్న దగ్గు, జలుబుకే ఏదో ప్రాణం మీదకు వచ్చినట్లు భయపడుతుంది ఏంటి..? నేను ఏమైనా వీధుల్లో నేల మీద నడిచే నేలబారు మనిషినా? కారులో ఆఫీస్ కి వెళతాను. ఏసీ రూమ్ లో కూర్చుని పనిచేస్తాను. నా దగ్గరకు ఎవరైనా రావాలంటే ఆఫీసులో ముందుగా వాళ్ళు ఎంతమంది సెక్షన్ ఆఫీసర్లను దాటుకుని రావాలని. కారులోనే ఇంటికి వస్తాను. అరికాళ్ళు ఎప్పుడైనా నేల మీద పెట్టి ఎరుగుదునా నేను. నాకెందుకు భయం. రాత్రి నుంచి కాస్త దగ్గు, జలుబు పట్టుకుంది. దానికే దేవి అంత కుదేలైపోతోంది. టీవీ లో వచ్చే ఆ చెత్త వార్తలు చూడద్దని చెప్పాలి దేవికి.
అయినా ఇదేమిటి మూడు రోజులైనా ఈ దగ్గు, జలుబు వదలనంటున్నాయి. ఆఫీసులో నేను ఎవరిని కలవలేదే..! కాస్త ఒంట్లో నీరసంగా కూడా ఉంది. అయినా దేవి చెప్పినట్లు ఓ సారి రక్త పరీక్ష చేయించుకుంటే పోయేదేముంది. దేవి తృప్తి కోసం అయినా చేయించుకుంటా. అయినా పరీక్ష కోసం నేను హాస్పిటల్ కి పోవడం ఏమిటి. నేను చిటికేస్తే పది మంది డాక్టర్లు నా ఇంటికే వచ్చి పరీక్ష చేస్తారు.
ఫోన్ చేసిన అర్ధ గంటకే డాక్టర్ కుమార్ ఇంటికి వచ్చి బ్లడ్ శాంపిల్ తీసుకువెళ్ళాడు. ఇరవై నాలుగు గంటల్లో అసలు విషయం తేలిపోతుంది. అయినా ఈ టీవీ చానెల్స్ వాళ్ళకి ఇంకేం వార్తలు దొరకవా. ఎప్పుడూ చావు కబుర్లేనా. అవన్నీ చూసి తాను భయపడి, నాకు పిరికి మందు నూరిపోస్తుంది దేవి.
అయినా ఇంకెంత సేపు. రెండు గంటలు. బ్లడ్ సాంపిల్స్ నిన్ననే కదా డాక్టర్ తీసుకువెళ్ళింది. నేను ఎప్పుడూ పాజిటివ్ గానే ఆలోచిస్తాను. మెసేజ్ గంట మ్రోగింది. నిమ్మళంగా ఫోన్ చేతులోకి తీసుకున్న. అయ్యో. ఇదేంటి..! నాకు పాజిటివ్ అని వచ్చింది. కచ్చితంగా హాస్పిటల్ లో జాయిన్ అవ్వాలని మెసేజ్ పెట్టాడు డాక్టర్. థర్మామీటర్ తీసి నాలుక కింద పెట్టుకున్న. టెంపరేచర్ 101 ఉంది. హా .. ఈ డాక్టర్లంతా బెదరగొడతారు. ఓ పారాసెటమాల్ వేసుకుని పడుకుంటే పొద్దునకి తగ్గిపోతుంది జ్వరం.
ఎప్పుడూ లేనిది ఈ రోజేంటి దేవి ఇచ్చిన ఇడ్లి నములుతుంటే థర్మకోల్ ముక్కలా చప్పగా ఉంది. పల్లీల చట్నీ కూడా మైనం ముద్దలా ఉంది. నోరంతా చేదుగా ఉంది . అంటే నా నాలిక రుచిని కోల్పోయిందా కొంపదీసి. అంటే..అంటే.. డాక్టర్ రిపోర్ట్స్ నిజమేనా. దేవికి తెలిస్తే ఇక ఎంత రాద్ధాంతం చేస్తుందో పిచ్చి మొహం. ఒక్క ఇడ్లి కూడా తీనలేక పోయాను. లేచి వాష్ బేసిన్ దగ్గరకి వెళ్ళేలోగానే భళ్ళున వాంతి అయింది. నిలబడ్డచోటే నీరసంగా కూలబడిపోయాను.
ఫోన్ చేస్తే కుమార్ డాక్టర్ హాస్పిటల్ లో బెడ్స్ ఖాళీ లేవు అన్నాడు. దేవి ఏడుస్తూ ఇంకో పెద్ద పేరున్న హాస్పిటల్ కి ఫోన్ చేసింది. ఒక గంట తర్వాత సైరన్ చేసుకుంటూ యముడి వాహనంలా అంబులెన్స్ వచ్చి మా పోర్టికోలో ఆగింది. నాకెందుకో కాస్త మగతగా ఉంది. మొదటి సారి రుణాత్మకమైన ఆలోచనొకటి నా మనసులోకి ప్రవేశించింది. దేవిని అంబులెన్సులోకి అనుమతించలేదు వాళ్ళు . శ్వాస మందగిస్తోంది నాకు. మెల్లగా కనురెప్పలు మూత పడుతున్నాయి.
హాస్పిటల్ లో 14 రోజులు ఉండాలిట ఐసీయూ క్వారంటైన్లో. నాలుగు రోజులు గడిచాయి. నేను ఎక్కడ ఉన్నానో కూడా తెలియనంత మగతగా ఉంది నాకు. ఐసీయూ లోకి వచ్చేది డాక్టర్లో, నర్సులో, ఇంకెవరైనానో తెలియడం లేదు. అందరు తల నుంచి పాదాలదాకా కప్పుతూ ఉన్న స్పెషల్ సూట్, మాస్క్ వేసుకుని అంతరీక్షవాసుల్లాగా ఉన్నారు. ఎవరు ఎవరితో మాట్లాడడం లేదు. ఓ అంతరీక్షవాసి వచ్చి నా పల్స్ చూసి, సెలైన్ బాటిల్ కొత్తది మార్చి పోయారు. చుట్టూ చూసాను. ఐసీయూలో పది బెడ్ల దాక ఉన్నాయి. పది మందిమి ఉన్నట్లున్నాం. కొందరు వెంటిలేటర్ మీద ఉన్నారు. కొందరు మాస్క్ తో కనపడ్డారు. రూంలో అంత మంది ఉన్నా మాకు ఒకరితో ఒకరికి మాటలు లేవు.
పగలేదో, రాత్రి ఏదో తేడా తెలియడం లేదు నాకు. ఎవరో వచ్చి ఏదో జ్యూస్ లాంటి ద్రవపదార్థం నాకు తాగించి వెళ్ళారు. ఏం రుచి తెలియలేదు. నా చుట్టూ ఉన్న చాల మందికి ఆహరం కూడా సెలైన్ ద్వారానే. ఎప్పుడూ బిజినెస్ టూర్లు, వ్యాపార లావాదేవీలలో క్షణం తీరిక లేకుండా ఉండే నాకు ఐసీయూ లోని ఈ నిశ్శబ్డంని భరించడం మహానరకంగా ఉంది నాకు. కాసేపు కళ్ళు మూసుకున్నాను.
హటాత్తుగా నా పక్క నుంచి ఏదో ములుగు వినిపించింది. మెల్లగా కళ్ళు తెరిచి, తల పక్కకి తిప్పి చూసాను. నా పక్క బెడ్ మీద ఉన్నతను పెద్దగా మూలుగుతున్నాడు. అతని ఛాతీ ఎగిరెగిరిపడుతోంది. సహాయం కోసమని కాబోలు నా వంక చేయి చాపుతున్నట్లున్నాడు. లేద్దామని ప్రత్నించాను. నీరసం వల్ల ఏమో గబ్బుక్కున లేవలేకపోయాను. అతని మూలుగులు ఎక్కువ అయినాయి. నోట్లోనించి గురగురమని శబ్దం వస్తోంది. ఐసీయూ లో సహాయకులు ఎవరు ఉన్నట్లు లేరు. మిగతా బెడ్ల మీద వాళ్ళు కొందరు చూస్తున్నారు. మరి కొందరు మగతలో మరోలోకంలో ఉన్నట్లు ఉన్నారు. నా బెడ్ కి పక్కన ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అత్యవసరమై డాక్టర్ ని పిలవడానికి అమర్చిన స్విచ్ కోసం చేయిచాపి తడమసాగాను. కాస్త ప్రయత్నం తర్వాత స్విచ్ చేతికి తగిలింది. వెంటనే అలారం స్విచ్ ని నొక్కాను.
పక్కన అతను ఇప్పుడు ఎగిరెగిరి పడటం లేదు. గురక కూడా లేదు. మళ్ళా నిశ్శబ్డం ఆవరించింది అక్కడ. ఐదు నిముషాలకు ఐసీయూలోకి ఇద్దరు వచ్చారు. బహుశా డాక్టర్, నర్సు అయి ఉంటారేమో. నేను చేయి చాపి పక్క బెడ్ అతన్ని చూపించాను. వాళ్ళు అతన్ని పరీక్షించారు. అప్పటికే ఆలస్యం అయింది.
పైన తిరుగుతున్నఫ్యాన్ ని చూస్తూ ఉన్నాను. ఫ్యాన్ రెక్కలు గిరగిరా తిరుగుతున్నాయి. నా ఆలోచనలు కూడా ఫ్యాన్ రెక్కలతో పోటీపడి తిరుగుతున్నాయి. పక్క బెడ్ మీద అతను నా కళ్ళ ముందే ఆఖరి ఊపిరి వదిలేసాడు. అతని డెడ్ బాడీని ఇంటికి కూడా పంపలేదట. హాస్పిటల్ నుంచి నేరుగా బరియల్ గ్రౌండ్ కి. ఇంట్లో వాళ్ళకి చివరిచూపుకి కూడా అనుమతి లేదట.
జీవితం క్షణ భంగురం అంటే ఏంటో తెలిసింది నాకు ఆ క్షణంలో. బ్రతుకు తీపి అంటే కూడా మొదటిసారి తెలిసింది నాకు తొలిగా. ఈ రోజు అతను పోయాడు. రేపు నా వంతు వస్తే..?
నేనుండేది గొప్ప కార్పొరేట్ హాస్పిటల్లో. లక్షల్లో మెడికల్ ఫీజు కట్టే స్తొమత ఉంది నాకు. కానీ ఇప్పుడు లక్షలు, కోట్లు ఈ మహమ్మారి నుంచి నా ఊపిరులను రక్షయించగలుగుతాయా.. ? కులం, మతం, పేద, ధనిక తేడా లేకుండా అందరి ఊపిరుల్లోకి ఎంత చొచ్చుకుని పోతోంది ఈ రక్కసి.
పాపం దేవి పిచ్చిది. నా కోసం ఎంత బెంగ పెట్టుకుందో. ఎన్ని మొక్కులు మొక్కుతోందో, ఎన్ని పూజలు చేస్తోందో. నన్ను ఎంతగా నమ్మిందో. అంతగా నటించాను నేను తన ముందర. శ్రీరామ చంద్రుడిననుకుంటోంది నన్ను. నా చీకటి లీలలు దానికేం తెలుసు. దేవి..చీమకు కూడా హాని తలపెట్టే తలంపు లేనిది. కానీ నేనో..! నేను ఉన్నతంగా ఎదగడానికి ఎంతమందిని కిందికి తోసేసానో. నా స్వార్ధానికి ఎంతమందిని బలిచేసానో! నా తెంపరితనంతో ఎందరి వేదనకు కారకుడైనానో. ఎంత మంది నిస్సహాయంగా ఆత్మహత్య చేసుకునేందుకు పురికొల్పానో. ఎంత మంది మనస్సులో కన్నీటి మడులు కట్టుకోవడానికి హేతువైనానో. నా దగ్గర పనిచేయించుకోవడానికి వచ్చినవాళ్ళను జలగ రక్తం పీల్చినట్లు పట్టి పీడించాను. నిస్సహాయస్థితిలో వాళ్ళు ఏడుస్తుంటే నేను రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకున్నట్లు పైశాచికంగా నవ్వుకున్నాను.
డాక్టరో, నర్సో ఎవరో వచ్చి నా పల్సు చూసి, నోట్లో ఏదో మందు వేసి వెళ్ళారు. ఈ రోజు ఇలా బెడ్ మీద పడి ఉన్నాను. రేపటికి నా పరిస్థితి ఎలా ఉంటుందో..! నేను పొతే నా కోసం ఒక్క కన్నీటి బొట్టు రాల్చేవాళ్ళు అయినా ఉన్నారా..? నాకే జవాబు తెలియని ప్రశ్న నన్ను నేను వేసుకున్నాను తొలిసారిగా.
మళ్ళీ ఆలోచనలు దారాల్లా నా మనసులో చిక్కుముడులు వేసుకుంటున్నాయి. దేవి అమాయకంగా నన్ను నమ్మింది బలిపశువులాగా. నేను చేసిన తప్పులన్నీ తనకి తెలిస్తే నన్ను ద్వేషిస్తుందేమో దేవి. ఆ ఊహే భరించలేకుండా ఉన్నాను . నేను చేసిన పాపాలన్నీ ఇప్పుడు మహమ్మారిలా మారి నా ఉసురు తీస్తాయా..? అయినా పాప పుణ్యాలతో ఏం పని ఈ మహమ్మారికి. ఎక్కడ ఊపిరులుంటే అక్కడికి చొచ్చుకొని పోవడమేగా. నాకు బ్రతకాలని ఉంది. నేను చేసిన పాపాలన్నిటికీ నిష్కృతి కలిగించుకోవాలని ఉంది. పశ్చాత్తాపం కన్నా మించిన నిష్కృతి ఏముంది..?
పూజ, ప్రార్ధన అంటే దేవుడి విగ్రహం ముందు కూర్చుని పూలు వేయడం, కోరికలు తీర్చమని మొక్కడం కాదు అనుకుంటాను. నా తప్పిదాలన్నిటినీ మన్నించి కరుణిస్తావనే నమ్మకమే పూజ అనుకుంటే.. భగవంతుడా.. నేను ఇప్పుడు నీకు పూజ చేస్తున్నాను. ఎప్పుడు చేతులెత్తి నీకు మొక్కని నేను ఇప్పుడు నీ పట్ల అంతులేని విశ్వాసంతో ఉన్నాను. నన్ను మన్నించు. రక్షించు. ఒక్క అవకాశం ఇవ్వు నాకు. మగతగా ఉంది . నా కనురెప్పలు మెల్లగా మూత పడుతున్నాయి.
“మధుసూదన్ రావు గారికి మెడికల్ రిపోర్టులో నెగటివ్ వచ్చింది. హి ఈజ్ సో లక్కీ. రెండు రోజుల్లో వారిని డిశ్చార్జ్ చేసేద్దాం. కొన్ని రోజులు ఇంటి దగ్గర ఐసోలేషన్లో ఉంటే సరిపోతుంది”. డాక్టర్ మాటలు లీలగా వినిపిస్తున్నాయి నాకు.
ఏ దేవుడు నా మొర ఆలకించాడో. చేసిన పాపం చెపితే పోతుందంటారు. ఇంటికి వెళ్ళగానే నేను చేసిన తప్పులన్నీ చెప్పి దేవిని క్షమాపణ అడుగుతాను. తనకి భూదేవి కంటే ఎక్కువ సహనం ఉంది. నా తప్పులన్నీ మన్నించి నన్ను అక్కున చేర్చుకుంటుంది.
నేను ఇప్పుడు స్వేచ్ఛగా ఊపిరులూదుతున్నాను. ఎందరు నిరుపేదలు ఈ మహమ్మారి బారిన పడి, సరైన వైద్యం అందక భాదపడుతున్నారో. ఎందరి ఊపిరులు ఆగిపోతున్నాయో. పది తరాలు కూర్చుని తిన్నా తరిగిపోని సంపద నాకు ఉంది. నా పాప ప్రక్షాళనలో తొలి అడుగుగా కరోనా సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను. నా మనసు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది.

2 thoughts on “ధనాత్మకం”

  1. మనిషికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడే దేవుడు గుర్తుకొచ్చి పశ్చతాపం మొదలు. ఆత్మ పరిశీలన మొదలు. దాంతో దారికోస్తాడు. కథ బావుంది మేడం. అభినందనలు

    Reply
  2. Concept looks like old. but the narration, in first person , is beautiful. There was one or two dis orders in KUBUSAM story. Here \the writer didn’t waste any word or thought. Congrats.

    Reply

Leave a Comment