దేవత అయిన రెడ్డమ్మ

వీధుల్లో తోపుడు బండ్లమీద, పండ్ల అంగళ్ళల్లో చూసి తృప్తి పడడమే కానీ ఆపిల్ పండు కొనుక్కుని తినే ఆర్ధిక స్తోమత నా చిన్నప్పుడు మాకు లేదు. ఆపిల్ పండు తినాలనేది నా తీరని ఆశ అప్పుడు. అయితే ఓ జనవరి ఫస్ట్ రోజు ఏం జరిగింది,ఆపిల్ పండు తినాలనే నా కోరిక తీరిందా, లేదా అనేది ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో వచ్చిన ” దేవత అయిన రెడ్డెమ్మ” కథలో. సంపాదకులు శ్రీ కోసూరు రత్నం, శ్రీ ఈతకోట సుబ్బారావు గార్లకు ధన్యవాదాలతో.
ఈ కథా సంఘటనలు నెల్లూరులో మా విజయమహల్ సెంటర్లో మా ఇంటి పక్కన ఉన్న కాంతమ్మ అత్తా అనే వాళ్ళ ఇంటిలో జరిగాయి. వాళ్ళ కొడుకులు చంద్ర శేఖర్, సాయి గార్లతో చిన్నప్పుడు నేను ఆడుకునేదాన్ని. కొన్ని రోజులకు వాళ్ళు ఆ ఇల్లు అమ్మేసి, బాలాజినగర్లో ఇల్లు కొనుక్కుని వెళ్లిపోయారు. అయితే అత్యంత విషాదం ఏమిటంటే నా చిన్ననాటి జ్ఞాపకాల్లో నన్ను ఆదరించిన కాంతమ్మ అత్త తన 86 ఏళ్ళ వయస్సులో
పోయిన నెల, [డిసెంబర్లో ] చనిపోయారు. వారి కొడుకులు, మా చిన్ననాటి స్నేహితులు చంద్రశేఖర్, సాయి గార్లకు, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. కాంతమ్మ అత్తకి కన్నీటి నివాళులతో..

జనవరి ఫస్టు వొచ్చేదానికి ఇంక వారం ఉండాది. బోర్డు మీద “సమితులు -సంబంధాలు” లెక్క స్టెప్పులు ఏస్తా ఉండాది లీలమ్మ టీచర్. లెక్కలంటే ఉండే వొనుక్కి తోడు కిటికీలో నుంచి వొచ్చే గాలికి ఇంకొంచెం ఒణుకు పుడతా ఉండాది నాకు. ఇంటి గంట ఎప్పుడు కొడతారా అని ఎదురు చూస్తా ఉండాను.
గెంట శబ్దం ఇనపడగానే పుస్తకాల బుట్టలు చేతికి తీసుకోని లాగెత్తినం నేను, గీత. బడి గేటుకు అమ్మిడి గా ఉండే చర్చిని దాటుకుని బసోటా హోటల్ కాడికి రాంగానే నా కాళ్ళు అడుగు ముందుకు పడలేదు. బసోటా హోటల్ కాడినుంచి, సుబేదారు పేట మెదరిళ్ళ వెంబడి వరసగా తోపుడు బండ్లు పెట్టుండారు. ఆ బండ్ల చాయ చూడంగానే నా కళ్ళు పెద్దవైనాయి. బండ్ల మీద నాకు చానా చానా ఇష్టమైన అపిలిపండ్లు ఎర్రగా, గుండ్రంగా నోరూరిస్తా ఉండాయి. బండి పై నుంచి దారాలతో గుత్తులు గుత్తులు గా అపిలిపండ్లను వేలాడగట్టి ఉండారు.
“ఏంది మీ..! అట్టా నిలబడిపోయినావు ” రెండు జాడలు ముందుకు ఏసుకుంటా అనింది గీత.
” అపిలిపండ్లు మీ. చూడు..! ఎంత బాగుండాయో..! ” వాటిల్ని చూస్తా ఉంటే ఎర్రటి వొజ్రాలను చూసినట్లు నా కళ్ళు మెరస్తా ఉండాయి.
” అయితే ఏంది. ఎప్పుడూ తినలేదా నువ్వు. మా నాయన వారానికోతూరి తలాఒకటి తెస్తాడు మాకు. మీ నాయన కొనక్కరాడ..?” జంబాలు పోతా తల ఉపతా అనింది ఆ అమ్మి.
” మా నాయన కూడా మాకు తెస్తాడులే. ఈడ వరసగా బళ్ళ మీద చూస్తా ఉంటే తమాషాగా ఉండాది” ఆ అమ్మి ముందు ఎచ్చులు పొయినా నేను.
వీధుల్లో తోపుడు బండ్ల మీద, ఇంగిలీషు పుస్తకంలో ఆపిల్ పండు బొమ్మలు చూడడమే కానీ వోటిని ఎప్పుడు తినింది ల్యా. వోటి రేటు జాస్తి అని నాయన ఎప్పుడూ కొనక్కరాల. ఏవి సులభంగా దొరకవో వోటి మీదనే కదా మనకి ఎక్కువ ఆశ. ఎప్పుడో నేను నాలుగో తరగతి చదివేటప్పుడు మద్రాస్ రామన్న అని మా బంధువులాయన మద్రాసు నుంచి నెల్లూరుకు వచ్చినప్పుడు మా ఇంటికి రెండు అపిలిపండ్లు తెచ్చినాడు. అందరికీ పందేరం చేసేటప్పటికి నా వొంతుకి ఒక చిన్న ముక్క వొచ్చింది. అదే మొదట నేను అపిలిపండు తినడం. అన్ని పండ్ల కంటే అందంగా ఎర్రగా, బుర్రగా మంచి వాసనతో ఉండే ఆపిల్ పండు అంటే నాకు చానా ఇష్టం. ఒక్క తూరి అయినా ఒక పండు అంతా తినాలని అప్పటినించి కోరిక నాకు.
టెలిఫోన్ ఎక్స్చేంజి భవనం, బృందావనం వీధి, ఇందిరా భవనం దెగ్గర రైలు కట్ట వెంబడి ఉన్న తావుల్లో బళ్ళు పెట్టివుండారు. అన్నిటినీ చూసుకుంటా రైలు కట్ట దాటినము నేను,గీత. ఆ అమ్మి విజయమహల్ సైడునుంచి వాళ్ళ ఇంటికి పోతానని ఆంధ్రసభ ఉండే సందులోకి పోయింది. నేను ఇంటికాడికి వస్తానే పుస్తకాల బుట్ట మంచం కిందికి ఇసురుగా జరిపి ” ఆమ్మోవ్..నాయన ఏడి ” అంటా పెద్దగా అరిచా.
” ఏంది మీ..! నాయన మీద అంతా ప్రేమ పుట్టకవొచ్చింది నీకు. ఈగో బాలన్న తెచ్చాడు” అంటా ఉప్పు, కారం జల్లిన రేక్కాయల పొట్లం నా చేతిలో పెట్టింది.
రాజుని చూసొచ్చిన కళ్ళతో మొగుడ్ని చూస్తే నెత్తి మీద మొత్తబుద్దయ్యిందట. ఆపిలి పండు తినాలని కోరికతో ఉన్న నాకు రేక్కాయల్ని చూడగానే కోపం వొచ్చింది.
” ఛీ..ఇవి నాకొద్దు పోమ్మా” అంటా పొట్లంని మంచం మీదకి ఇసిరేసినా.
అప్పుడే నాయన ఇంట్లోకి వొచ్చాడు. “ఏంది బుజ్జమ్మ..! ఎవురి మీద నీ కోపం” అంటా
” నాయనా..నాకు ఆపిలి పండు కొనీవా” గారాలు పోతా అడిగా నులకమంచం మీద కూర్చున్న నాయన వొళ్ళో కూర్చుంటా.
“ఇప్పుడు వోటి రేటు చానా జాస్తిగా ఉంటాది. జనవరి ఫస్టు అయిపోని. అప్పుడు కొంచెం సలీసు అయితే కొనుక్కుందాం లే బుజ్జమ్మ. ఊరి కాడ్నించి తెచ్చిన మామిడి కాయలు, సపోటా కాయలు బియ్యంలో మాగేసి ఉండాయి కదా. అవి తిను” అంటా నన్ను పక్కన కూర్చోబెట్టి స్నానానికి పోయినాడు.
ఇహన నాకొచ్చిన కోపాన్ని ఎవురిమింద చూపించాలో తెలీక ముఖం మీద గంటు పెట్టుకొని ఈదిలోకి లగెత్తినా. మా ఇంటికి రెండిండ్ల అవతల ఉన్న కాంతమ్మ వాళ్ళ ఇంటి కాడికి పోయినా. ఆమె కొడుకులు శేఖర్, సాయి లతో బారాకట్ట, దొంగా పోలీసు ఆటలు ఆడుకోవొచ్చని. కాంతమ్మవొళ్ళు మిద్ది మీద గుడిసె ఇంట్లో ఉంటారు. మిద్ది కింద ఉన్న పెద్ద ఇంట్లో శకుంతలమ్మ, కృష్ణ రెడ్డి వొళ్ళు బాడుగకు ఉండారు. యెనక సందులో ఉన్న రెండు రూముల చిన్న ఇంటిని కూడా కాంతమ్మ వొళ్ళు రవణమ్మ అక్కోళ్ళకి బాడుగకు ఇచ్చివుండారు.
గేటుకి లోపలి తట్టు గట్టిగా గొళ్ళెం వేసి ఉండాది. లోపలకి ఎట్ట పోదామా అనుకుంటా ఉండాను. ఇంటి లోపల గేటు పక్కనే పెద్ద నందివర్ధనం చెట్టు ఉండాది. దాని కొమ్మలన్నీ వీధిలోకి వొచ్చి ఉండాయి. ఒక ఐడియా వొచ్చి నందివర్ధనం చెట్టు కొమ్మలు గట్టిగా పట్టుకొని కోతి మాదిరిగా ఎగిరి ప్రహరీ గోడ మీదకి ఎక్కి గబాల్న లోపలి తట్టుకి దూకిన.
“ఎవురు అదే ” అంటా పెద్ద గొంతుతో అరిచింది శకుంతల రెడ్డెమ్మ. గోడ దూకినానని తిడద్దని ఒణుకు పుట్టింది నాకు.
” అకా.. గేటుకి గొళ్ళెం వేసి వుండాది. నేను కాంతమ్మ అత్త పిల్లకాయల తో ఆడుకునేదానికి వొచ్చినా” అన్నా చెట్టు కొమ్మ గీచుకుని నెత్తురు కారుతున్న మోచేతిని తుడుచుకుంటా.
” భలే దానివి మీ నువ్వా. కాంతమ్మ వొళ్ళు లేరు. కుడితి పాలెం పోయినారు. ఇటు రా” అంటా చేయి పట్టుకొని ఇంట్లోకి తీసకపోయింది.
వరసగా ఆరు రూములు. అన్ని రూములు చానా నీటుగా ఉండాయి. నేరుగా వొంటింట్లోకి తీసుకపోయి ఫ్రిడ్జ్ లో నించి నీళ్ల సీసా తీసి తాగమని ఇచ్చింది నాకు. అదే తొలి తూరి నేను ఫ్రిడ్జిని చూడడం. వాళ్ళ ఇంట్లో గ్యాస్ పోయి కూడా ఉంది. మా ఇంట్లో ఉండేది పొట్టు పొయ్యి. గొట్టంతో పొగ ఊదతా, దగ్గతా వంట చేసే అమ్మ గుర్తుకు వొచ్చింది నాకు. జిల్లుగా ఉండే నీళ్ళని గటగట సగం సీసా నీళ్ళు తాగేసినా.
“నెత్తురు వస్తా ఉంది మోచేయి కడుక్కోపో పంచలో” అనింది. పంచలో ముళ్ళ గోరింట చెట్టు దగ్గరఉన్న పాదిలో దోక్కుపోయిన మోచేతిని కడుక్కున్నా.
“ఇదిగో రెడ్డా.. ఈ పిల్ల బుజ్జమ్మ..ఆదెమ్మ కూతురు. నాకు ఫ్రెండ్ ” నవారు మంచం మీద కూర్చొని పేపర్ చదవతా ఉన్న వాళ్ళ ఇంటాయన కృష్ణ రెడ్డి కి చూపించింది.
అంత పెద్ద ఆమె నన్ను ఫ్రెండ్ అనేతలికి సిగ్గుపడతా నిలబడుకున్న.
ఆయన నవ్వతా నా చాయ చూసి ” ఎన్నో క్లాస్ చదవతా ఉండావు” అన్నాడు.
“ఆరో తరగతి ” అని చెప్పేలోగానే శకుంతల రెడ్డెమ్మ తట్టలో మణుగుపూలు తెచ్చి
తినమని ఇచ్చింది. ఒక పక్క ఆకలిగా ఉన్నా మొహమాటానికి రెండు మణుగుపూలు నోట్లో వేసుకున్న. కారకరమని నమిలితే ఎక్కడ శబ్దం వొస్తదో అని భయపడతా.
సుద్ద ముక్కతో బారకట్ట గీసి ఆడుకుందాం అనింది ఆమె. భయపడుతూనే ఆడి రెండు ఆటలు నేను గెలిచినా. చప్పట్లు కొడతా “భలే తెలివి గలదానిని మీ నువ్వా. రోజు మా ఇంటికి రా. ఆడుకుందాం అనింది. నవ్వు వొచ్చింది నాకు. ఇంక ఇంటికి పోతా అని వొచ్చేసాను.
నానబెట్టిన కుంకుడుకాయలు, మెంతులు, దాసానాకు యేసి రుబ్బి, ఆ నురుగుతో తలకి పోసింది అమ్మ నాకు. యానిఫారం గుడ్డలు కాకండా మిగిలిన నాలుగు గౌనులను ఒకటికి పదిసార్లు చూసుకుని ఎర్ర రంగు మీద పచ్చపూలున్న బుంగ రెట్టల గౌను వేసుకున్న. ఆ రోజు జనవరి ఫస్టు. బడి సెలవు. జనవరి ఫస్టు అంటేనే ఆపిలుపండ్లు, గ్రీటింగ్ కార్డుల పండగ అయిపాయ.
అమ్మ మూర్కళి[బియ్యం పిండి, మజ్జిగ తో చేసిన ఉప్మా] తట్టలో యేసి ఇచ్చింది. నూనెలో దోరగా కాలిన ఉప్మా మాడు చానా ఇష్టం నాకు. ఐదు నిముషాల్లో తినేసి వీధిలోకి పరిగెత్తినా.
మా విజయమహల్ సెంటర్ నాలుగు రోడ్ల కూడలిలో నాలుగు పక్కలా తోపుడు బండ్లలో అపిలి పండ్లు గుత్తులు గుత్తులుగా కట్టివుండారు. కొనుక్కొని తినక పోయినా చానా సేపు వోటిల్ని కళ్ళతో చూసి తృప్తి పడినా.
కాసేపు తాలేసరికి పిలకాయలమంతా సెంటర్లో చేరినాము ఆడుకునేదానికి. రాధిక ఉండుకొని “మా ఇంట్లో డజను అపిలి పండ్లు, పూలమాలలు ఉన్నాయి ఇప్పుడు. మా నాయనకి తెచ్చి ఇచ్చారు” అంటా జంబాలు చెప్పుకుంటా ఉండాది. వాళ్ళ నాయన బ్యాంకు ఆఫీసర్.
ఆపిలుపండ్లు మా ఇంట్లో అన్ని ఉండాయి, ఇన్ని ఉండాయి అని ఇక అందరు ఎచ్చులు చెప్పుకుంటా ఉండారు. నాకు వాళ్ళ మీద, మా నాయన మీద ఒకే తూరి కోపం వొచ్చింది. మా నాయన కూడా పెద్ద ఆఫీసర్ అయివుంటే మాకు కూడా ఎవురైనా ఆపిలుపండ్లు తెచ్చిచ్చేవారు కదా. ఇక నాకు అక్కడ ఉండాలనిపించాలా. మూతి ముడుచుకుని లగెత్తుకుంటా ఇంట్లోకి పోయినా.
గంట పడకండు అయింది. వాకిట్లో నుంచి పోస్ట్ అని కేక వినపడి ఒక్క దూకులో వాకిట్లోకి వొచ్చిన. “బుజ్జమ్మ..ఇదిగో మీకు గ్రీటింగ్ కార్డు వొచ్చింది” అంటా రోజా రంగు కవర్ నా చేతికి ఇచ్చాడు పోస్టుమాన్ జనార్ధనన్న. గ్రీటింగ్ కార్డు చూడగానే చెప్పలేనంత కుశాల అయింది నాకు.
బెంగుళూరు నుంచి మా పెద్దమ్మ కూతురు స్వర్ణక్క మాకు గ్రీటింగ్ కార్డు పంపింది. నాయన వొచ్చినాక చూస్తాంలే అనింది అమ్మ. కానీ కవర్ చింపి చూసేదాకా ఆగలేక నేను, మోహనన్న కవర్ చింపి చూసాం. రంగు రంగుల రోజా పూల గుత్తి బొమ్మ, హ్యాపీ న్యూ ఇయర్ అనే ఇంగిలీషు పదాలు మెరస్తా ఉండాయి గ్రీటింగ్ కార్డు మీద. కార్డు కింద మా పేర్లన్నీ రాసింది స్వర్ణక్క.
కార్డుని వంద సార్లు తడిమి తడిమి చూసుకున్న. మాకు గ్రీటింగ్ కార్డులు వొచ్చాయి అని ఫ్రెండ్స్ దగ్గర దర్జాగా చెప్పుకోవచ్చు. ఇక పొద్దున ఉన్న కోపం అంతా ఎగిరిపోయింది. హుషారుగా అందరికీ గ్రీటింగ్ కార్డు గురించి చెప్పాలని, ముందు శేఖరు, సాయిలకి చెప్పాలని కాంతమ్మత్తా వాళ్ళ ఇంటి కాడికి లాగెత్తినా.
గేటు తీసి సందులోకి పోదామనుకునేలోగా వాకిట్లోనించి శకుంతల రెడ్డమ్మ ” మీ..బుజ్జమ్మా..ఏడకి మీ అంత తొందరగా లగిస్తా ఉండావా..? ” అనింది.
” అబ్బా.. గ్రీటింగ్ కార్డు గురించి సాయి వాళ్ళకి చెప్పాలని పోతుంటే రెడ్డమ్మ ఇప్పుడు పిలిచింది రా నాయన ” అనుకుంటా ” అకా.. కాంతమ్మ వాళ్ళ ఇంటి కాడి నించి ఇస్తరాకులు కొనక్క రమ్మన్నది అమ్మ. గబాల్న పోవాలి” అన్నా ఎట్టా అయినా తప్పించుకోవాలని.
” ఓ తూరి ఇంట్లోకి రా మీ..” అనింది లోపలికిపోతా. ఇంక పోకుంటే బాగుండదని ఆమె ఎనకమాల ఇంట్లోకి పోయినా. వాళ్ళ కూతురు ఉషక్క టేప్ రికార్డర్ లో ప్రేమాభిషేకం సినిమా పాటలు ఇంటా ఉండాది. రా బుజ్జమ్మా.. అనింది నన్ను చూసి. ఉషక్క పక్కన కూర్చున్న మొహమాటంగా. ఐదు నిముషాలు అయింది. నాకు చానా చిరాకు పుట్టింది. ఇక ఉషక్కకి చెప్పి ఇంటి బయటకి వొచ్చినా.
“ఉండు బుజ్జమ్మా.. అంటా లోపలి రూములో నించి వొచ్చి ఎర్రగా నిగనిగలాడతా ఉన్న ఫుట్బాల్ అంత సైజు ఉన్న అపిలి పండుని నా చేతిలో పెట్టి “ఇది తిను బుజ్జమ్మ అనింది”శకుంతల రెడ్డమ్మ. అంత వరకు కల్లో కూడా అనుకోలేదు నేను అపిలి పండుని నా చేత్తో పట్టుకుంటానని. అంత పెద్ద అపిలి పండుని నా చేతితో పట్టుకోవడం అదే మొదటి తూరి. ఓ పక్క పరమానందంగా ఉన్నా ఇంటికి ఎత్తక పొతే అమ్మ తిడతాదని “వొద్దు అకా. అమ్మ అరుస్తుంది” అన్నాను పండు ఇచ్చేద్దామని చేయి ముందుకు చాపాను.
” మీ అమ్మకి నేను చెప్తాలే బుజ్జమ్మా. ఇంద ఇది కూడా తీసుకో అంటా ఇంకో అపిలిపండు ఇంకో చేతిలో పెట్టింది. నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి. ఆ సమయంలో శకుంతల రెడ్డెమ్మ దేవతలా కనపడింది నా కంటికి. రెండు చేతుల్లో రెండు ఆపిలుపండ్లు పట్టుకుని ఇంటికి లాగెత్తినా అమ్మకి చెప్పాలని.

13 thoughts on “దేవత అయిన రెడ్డమ్మ”

  1. Beautiful story. Rohini garu champion in exploring emotions. Explain in minute details of feelings. Virtually, can see Nellore while reading her stories and feel the sweetness of Nellore accent of Telugu words. Very nice and enjoy every sentence of the stories.
    Thank you very much Rohini garu.
    My poor vocabulary is not enough to express my happiness in reading your stories.

    1. వంజారి రోహిణి

      thank you very much sir. Always I need your blessings and encouragement.

  2. Sreelakshmi upadrashta

    Very nice narration Rohini garu👍. Jeevitam lo vastavalaku aksharala tho Rupam echaru👌. Sagatu madhya taragathi manobhavalanu chakkaga rasaru. Congratulations. 👏👏👏❤.

    1. వంజారి రోహిణి

      చాలా చాలా ధన్యవాదాలు మేడం గారు 🙏🙏

  3. కొమ్ముల వెంకట సూర్యనారాయణ

    నెల్లూరు యాసలో చిన్ననాటి జ్ఞాపకాలు చాలా చక్కగా రాసావమ్మా, అభినందనలు

    1. వంజారి రోహిణి

      చాలా చాలా ధన్యవాదాలు సర్ 🙏🙏

Comments are closed.