దుఃఖపు వాగు మా నాయన

ఈ నెల “రైతు వాణి” మాస పత్రికలో నా కవిత “దుఃఖపు వాగు మా నాయన“. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలుపకోరుతూ..

కయ్య చివర గెనిమగట్టున
వేపచెట్టు కింద యానాదన్న పిసికిన బంకమట్టితో
నువ్వు ప్రతి ఏడాది స్వయంభులా వెలుస్తుంటే
విగ్నవినాయకుడవని టెంకాయకొట్టి నీకు
తొలిమొక్కు తీర్చిన నాయన కళ్ళల్లో ఆశలు
కల్లంలో పిడేటి కొట్టి రాల్చే ధాన్యపు రాశులతో
పోటీపడుతున్నాయి..

ఏ రాత్రి ఏ వరదముంచుకొస్తుందో , ఏ పక్షులొచ్చి పంట
తినేస్తాయో అని పొలం మధ్య మంచె మీద
రెప్పకొట్టకుండా ఉండేలు తిప్పుకుంటూ
నిద్ర కాచిన నాయన కళ్ళలో కలలు
పంట చేతికొస్తే కప్పించే చుట్టింటి పెంకులను
చూసి మురిసిపోయే అమ్మ నవ్వులతో
పోటీపడుతున్నాయి..

ప్రతి ఏడాది అమ్మ పసుపు తాడు కట్టుకుని
తీసి ఇచ్చే తాళిబొట్టును తాకట్టు పెట్టి
పంట ఖర్చులకు పైకం తెచ్చే నాయన ఆశలన్నీ
వరదపోతకో, కరువుచేతకో, చీడపీడల చితిమంటలకో
పంటంతా ఎండిపోయినా, ఆశ చావని విక్రమార్కుడిలా
నాగలిని భుజాన వేసుకుంటూనే ఉన్నాడు..

ఈ రోజు పంట పండినా దాని మీద నీకు హక్కు లేదంటూ
ఏలినోళ్ళ చీలికలు, దళారుల దందాలు
పెంచుకున్న ఆశలమీద అగ్నివర్షం కురిపిస్తే
నెత్తుటి శిలలా మిగిలిన మా నాయన
కళ్ళల్లో నుంచి వరదలా ఉబికే కన్నీరు
దుఖఃపు వాగులో శోకపు మడుగులను కడుతూనే ఉంది..

Leave a Comment