దిగులు వర్ణం

రంగులు చాల ఉన్నాయి ప్రకృతిలో. ఈ దిగులు వర్ణం ఏమంటుందో చూడండి. “బహుళ త్రైమాసిక పత్రిక” లో ప్రచురితం అయిన నా కవిత “దిగులు వర్ణం”. జ్వలిత మేడం గారికి ధన్యవాదాలతో.. ” దిగులు వర్ణం” చదివి మీ దానికి మీరు ఏం చెప్తారో అడుగుతోంది.

ఆరంజ్ రంగంటే ప్రాణమప్పుడు
వెన్నులో వణుకిప్పుడు ప్రాణంతీస్తుందని
కాషాయపు విద్వేషాన్ని పులిమేశారు దానికి

గులాబీ పసుపు రంగుల్లో ఎంత అందముందని
చూడడానికే భయమిప్పుడు
పార్టీల అడ్డు తెరని దించారు వాటిమీద

ఎంత వింతైనవర్ణమని నలుపు
దానికీ అంటగట్టారు విషాదపు మరక
చీకట్లో ఉంటేనే కదా వెలుగుకి విలువ

ప్రకృతి అంతా రంగులమయం
మనిషి ప్రవృత్తిలోనే ఉంది అవకరపు గాయం
కుతంత్రాలతో నిండి చూపున్న గుడ్డితనం

ద్వేషపు రంగులను వెదజెల్లే మాయలోకం
కూర్చున్న కొమ్మను నరుక్కునే చాపల్యం
కోల్పోయిన మనుగడకోసం తీరని శోకం

మతపురాళ్ళు అడ్డు పెట్టి కట్టిన గోడలు
మనసులను దూరం చేసే విచ్చు కత్తులు
చాతుర్వర్ణ్యం మాయ సృష్టం అంటూనే
నిచ్చన మెట్ల ఆధిక్యం కోసం వర్ణయుద్ధం

మేఘం ఇచ్చిన రాగం వర్షపు జల్లులు
పులకించిన నింగి నెలకు వంచిన కానుక
సప్తవర్ణ చాపం ఇంద్రధనుస్సు

మనుషుల మనోవర్ణాలకు భయపడి
ఏ రంగుకు ఏ అవకరాన్ని అంటగడతారోనని
కనపడాలంటేనే భయపడి
దిగులుమేఘన్ని కప్పుకుందిప్పుడు

Leave a Comment