తట్టుడీ మీకు తీయబడును

ఆరవ తరగతిలో తొలిసారి బడిలో చేరిన తొలిరోజు “యేసయ్య” గురించి తెలుసుకున్న బుజ్జమ్మ చెప్పిన కథ “తట్టుడీ మీకు టీయబడును”, ఈ నెల [డిసెంబర్] విశాలాక్షి మాసపత్రికలో. శ్రీ కోసూరి రత్నం సర్, శ్రీ ఈతకోట సుబ్బారావు సార్లకి ధన్యవాదాలతో. మిత్రులకు ముందస్తు “క్రిస్మస్” పండుగ శుభాకాంక్షలతో..🎄🎄🙏🙏

 "ఆగండి మీ" పెద్దగా ఉరుము ఉరిమినట్లు ఇనబడిన అరుపుకి ముందుకేయబోయిన నా అడుగు ఎనక్కి పడింది. అసెంబ్లీ హాలు ముందర బిత్తరపోయి నిలబడుకోనున్నాం నేను, రజియా, హిమబిందు.
" మీరు గుడి కాడికి పోయేటప్పుడు చెప్పులు బైట ఒదిలి, భక్తిగా చేతులు జోడించి వెళతారు కదా. అట్నే ఈడ అసెంబ్లీ హాలులోకి కూడా భక్తిగా రావాలి " చేతిలో పేము బెత్తం ఆడిస్తూ చంద్ర లీలమ్మ టీచర్ మాట పూర్తీ కాకముందే అందరం చెప్పులు బైట ఒదిలి బిక్కు బిక్కు మంటా అసెంబ్లీ హాలులోకి పోయి వరుసలో కూర్చున్నాం. 
 ఎండాకాలం సెలవలు అయినాక కొత్త బడిలో ఆరో తరగతిలో చేరిన మొదటి రోజు. మొగపిలకాయలకు రైలు కట్ట అవతల మూడు హాళ్ళ [కృష్ణ, కావేరి, కళ్యాణి] పక్కన ఉన్న వి.ఆర్. హైస్కూల్. ఆడ పిలకాయలకు సుబేదారుపేటలో కబాడిపాలెంని అనుకుని ఉన్న ఏ.బి .యం గర్ల్స్ హైస్కూల్. ఈ రెండింటిలోనే ఎక్కువ మంది చేరింది. 
 అప్పుటిదాకా యూనిఫామ్ అంటేనే తెలియకపాయ నాకు. ఇప్పుడు పసుపు పచ్చ జాకిట్టు, ఆకుపచ్చ పావడా. రెండు జాడలు అల్లి నల్ల రిబ్బన్తో ఎత్తికట్టుకొని భలే తమాషాగా అనిపించింది నాకు. అసెంబ్లీ అంతా ఆరో తరగతి నుంచి పదో తరగతి దాకా ఆడ పిలకాయలం అందరం వరుసలలో కూర్చొని ఉన్నాం. పసుపు పచ్చ జాకిట్టు, ఆకుపచ్చ పావడాతో ఉన్న అందరినీ చూస్తావుంటే అసెంబ్లీ హాలు అంతా బంతి పూలు, చామంతి పూలు, పున్నాగ పూలు, తంగేడు పూలు రాసులుగా పోసి ఆకుపచ్చటి కొమ్మలతో సహా నిండిపోయినట్లు ఒక అద్భుతమైన పూలతోట ని చూస్తున్నట్లు అబ్బా.. వర్ణించడానికి మాటలు రానంత సుందరంగా ఉండాది అసెంబ్లీ హాలు.
  టీచర్లు కూడా అందరూ వచ్చి అసెంబ్లీ హాలులో కుడి పక్క వేసి ఉన్న కుర్చీలలో కూర్చున్నారు. హాలెనక పక్క ఉండే చానా పెద్ద జాగాలో ఉన్న చింత, వేప, కానుగ చెట్ల నుంచి వీచే గాలి చల్లగా మమ్మలిని తాకి పలకరిస్తా ఉండాది.
  మూడో గంట కొట్టగానే అసెంబ్లీ హాలు మొత్తం సూది కింద పడితే వినబడేంత నిశ్శబ్దం అయిపోయింది. అప్పుడు బడి హెడ్ మిస్సెస్ ఎలిజిబెత్ టీచర్ పెద్ద కళ్ళద్దాలతో ఒచ్చి కొంచెం ఎత్తుగా ఉన్న స్టేజి పక్కన ఉన్న పెద్ద కుర్చీలో కూర్చునింది ఠీవిగా. అప్పటికే మేము చానా మంది టీచర్ల పేర్లను పెద్ద అక్కా వోళ్ళని అడిగి తెల్సుకొని ఉండాము. సుశీలమ్మ టీచర్ చానా చార్టులు పట్టుకుని ఒచ్చి టేబుల్ మీద పెట్టిందఅటెండర్ దేవదానం అన్న ఒచ్చి ప్యానల్ బోర్డుని అసెంబ్లీ హాలు లో పెట్టివెళ్ళాడు. 
 ఇదంతా చానా కొత్తగా ఉండాది మాకు. ఏం చేస్తారో అని ఆతురతగా ఎదురుచూస్తా ఉండాము. ప్యానల్ బోర్డు మీద ఒక్కొక్క చార్టుని పెడుతూ, మధ్యలో అవసరం అయిన రంగు రంగుల బొమ్మలను అతికిస్తూ, యేసుప్రభువు లోకాన్ని ఎలా సృష్టించాడు, ఎన్ని రోజులలో సృష్టించాడు. ఆది కాండంలో ఈడెన్ గార్డెన్ లో ఆడం, అతని పక్కటెముక నుంచి హవ్వ[ఈవ్] ఎలా, ఎందుకు సృష్టించబడ్డారు, వారు సాతాను మాయలో ఎలా పడ్డారు[ట్రీ ఆఫ్ ట్రీ లైఫ్] నిషేదించిన ఫలాలను ఎలా తిన్నారు, తర్వాత జరిగిన మార్పులు, అబ్రహం వంశ వృక్షం తరాల గురించి బొమ్మలతో సహా వివరిస్తుంటే మేము నోళ్లు వెళ్ళబెట్టి, కనుగుడ్లప్పగించి చూస్తా ఉండిపోయినాం. 
 బడిలో మొదటి రోజు కాబట్టి ఒక ముక్కాలు గెంటసేపు చకచకా బొమ్మలు మారుస్తా వివరంగా చెప్పింది సుశీలమ్మ టీచర్. చార్టులు మడిచి ఆఫీస్ రూములోకి తీసకపోయినాడు దేవదానం అన్న. వెంటనే బడి ఆఫీసులో గుమస్తా శామ్యూల్ సారు ఒచ్చి గిలక తప్పెట చేతిలోకి తీసుకుని వాయిస్తా "తరతరాలలో..యుగయుగాలలో..జగజగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు. నరునికి రూపం లేనపుడు, సృష్టికి పునాది లేనపుడు ఆయన మనకి దేవుడు దేవుడు యేసే దేవుడు" పాడతా ఉంటే, ఓ పక్కన పి.టి. టీచర్ చంద్రలీలమ్మ చప్పట్లు కొడతా పిలకాయలను కూడా కొట్టమని స్టేజి మీద నించి సైగలు చేస్తా ఉండాది. ఇక అందరం చప్పట్లు కొట్టేదానికి మళ్ళినాము.
     అప్పుటిదాకా నాకు సాయి బాబా, వెంకటేశ్వర స్వామి, మహాలక్షమ్మ, శివుడు దేవుళ్ళు తెలుసు. అప్పుడప్పుడు బాలాజీనగర్ మసీద్ నుంచి " అల్లా.." అంటా వినిపించే నమాజు, మా కరిముల్లా బాబాయ్ చెప్పే మసీద్ కథలు విని అల్లా దేవుడి గురించి తెలుసు. కానీ ఇంత వరకు నాకు తెలియని దైవం యేసయ్య బెత్లెహాం గ్రామం కాడ పశువుల పాకలో మరియమ్మకు పుట్టాడని, విశ్వాసం తో స్తుతిస్తే రక్షిస్తాడని తెలిసి చాల సంతోషం వేసింది. ఆ దినం మొదులుకోని ప్రతి రోజు బైబిలు వాక్యాలను కూడా తరగతి పాఠాలంత శ్రద్దగా ఇంటా ఉండాను. 
 బడిలో చేరిన వారానికే కొత్త భయం పుట్టించారు మాకు పెద్ద తరగతుల అక్కలు. బడిలో బూట్ల మిస్సమ్మ అనే దెయ్యం ఉండాదంట. సాయంత్రం, రాత్రి పూట ఎనిమిదో తరగతి మిద్దె మీద ఉన్న చెక్క మెట్ల మీద పెద్ద శబ్దం చేసుకుంటా నడుచుకుంటా పోతుందంట. ఆ మాట ఇనగానే గుండెల్లో దడ పుట్టింది నాకు. ఎందుకంటే ఒంటేలు పోసుకోవడానికి ఆ చెక్క మెట్లు దిగి అవతలకి పోతేనే మాకు ఒంటేలు పోసుకునే తావు ఉండేది. 
 సాయంత్రం ఇంటి గంట కొట్టినాక బడి ముందు ఉన్న ఖాళీ స్థలంలో పిలకాయలను వరుసలలో నిలబెడతా ఉండాది చంద్రలీలమ్మ టీచర్. సుశీలమ్మ టీచర్ బడి కాంపౌండ్ లోనే ఉన్న వాళ్ళ ఇంటి కాడ ఉండాది అప్పుడు. రూతమ్మ టీచర్ ఉండుకొని "మీ ఇట్రా" అంటా నన్ను పిలిచి " సుశీలమ్మ టీచర్ వాళ్ళ ఇంటి కాడికి పోయి డ్రమ్స్, గిలక తప్పెట, డంబెల్స్  తీసకరాపోండి నువ్వు, అరుణ జ్యోతి " అనింది. 
 నేను, అరుణ జ్యోతి లగెత్తుకుంటా పోయి సుశీలమ్మ టీచర్ వాళ్ళ ఇంటి ముందర నిలబడుకోని తలుపు తట్టబోయాం. తలుపుకి లోపల గొళ్ళెం పెట్టినట్లు లేదు మేము పట్టుకోగానే తలుపు మెల్లగా తెరుచుకుంది. హల్లో ఏదాలంగా ఉండే గోడకి పెద్ద ఫ్రేమ్ తో ఉన్న పటం ఏలాడగట్టి ఉండాది. ఆ పటంలో పెద్ద భవంతి ముందర తలుపు తడుతూ యేసు ప్రభువు నిలబడుకోని ఉన్నట్లు ఉంది. అది చూడగానే ఇక నా బుర్రలో బోలెడు సందేహాలు మొదలైనాయి. మా అలికిడి విని సుశీలమ్మ టీచర్ తలుపుకాడికి వొచ్చి మమ్మలిని చూసింది.
  "డ్రమ్స్, డంబెల్స్ మిమ్మలను అడిగి తీసుకరమ్మని రూతమ్మ టీచర్ మమ్మలిని పంపించింది" అన్నా నేను. నా కళ్ళు మాత్రం పటం వంకే ఉన్నాయి.
  " ఆ మూల ఉన్నాయి తీసకపోండి" అనింది సుశీలమ్మ టీచర్. డ్రమ్స్ రెండు చేతుల్లో పట్టుకుని పటం చాయ చూస్తా " టీచర్.. ఆ పటంలో యేసుప్రభువు అట్టా భవంతి ముందర నిలబడుకోని ఉండాడు ఎందుకని" ఏమి తెలియని అమాయకమైన నా ప్రశ్నకు సుశీలమ్మ టీచర్ ఉండుకోని "చానా మంచి ప్రశ్న అడిగినావమ్మా నువ్వు. దీనికి సమాధానం రేపు అసెంబ్లీలో చెప్తాను మీకు" అనింది వంటింటి లోపలకు పోతా.
   అసెంబ్లీ మొదలవగానే సుశీలమ్మ టీచర్ బైబిల్ తెరిచి " అడుగుడీ మీకివ్వబడును, వెదకుడీ మీకు దొరకబడును. తట్టుడీ మీకు తీయబడును" అనే వాక్యాన్ని చదివి మనకు ఏ సందేహం ఒచ్చినా, ఎటువంటి ఆపద ఒచ్చినా ప్రభువును అడిగితే ఆయన మనలను సమాధాన పరచి రక్షణ ఇస్తాడు. మనసనే మన ఇంటి ముందర ఆయన నిలబడి ఉంటాడు. ఆయనను మన మనసులోకి ఆహ్వానిస్తే ఇక మనకు ఆనందకరమైన జీవితం లభిస్తుంది" చెప్పుకుంటా పోతుండాది సుశీలమ్మ టీచర్. నిన్నటి నా సందేహానికి సమాధానం దొరికినాది.
 సాయంత్రం ఇంటి గంట కొట్టినాక పిలకాయలు అందరూ వెళ్లిపోయారు. ఒక్క మా ఆరోతరగతి వాళ్ళం తప్ప. "యూనిట్ పరీక్షలు దగ్గరికి వస్తా ఉండాయి. సిలబస్ తొందరగా పూర్తి చేయాలనీ మాకు సోషల్ స్టడీస్ చెప్పే శకుంతలమ్మ టీచర్ మమ్మలిని ఇంకో అర్ధగంట ఉండమన్నాది. 
 " బొంబాయి వస్త్ర పరిశ్రమకి ప్రసిద్ధి. ఛోటా నాగాపూర్ తోళ్ళ పరిశ్రమలకి ప్రసిద్ధి. కాశ్మీర్, ఊటీ, సిమ్లాలలో ఆపిల్ పండ్ల చెట్లు ఎక్కువ" భూగోళ శాస్త్రం చెప్తా ఉండాది శకుంతలమ్మ టీచర్. నాకు అర్జెంట్గా ఒంటేలు వస్తా ఉండాయి. ఏం చేయాలో తోచడం లేదు. 
    టీచర్ పాఠం చెప్పడం ఆపి ఆపంగానే పిలకాయలంతా సంచులు తీసుకుని లగెత్తుకుంటా కుడి పక్కనుంచి మిద్దె దిగి వెళ్లిపోయారు. " మీ శిల్ప, మీ సురేఖ ఆగండి మీ .నాకు అర్జంటుగా ఒంటేలు వస్తా ఉండాయి. చెక్క మెట్ల మీద నించి పోవడానికి ఎవురైనా తోడు రాండి మీ" పిలస్తా ఉన్నా ఆగకుంటా వెళ్లిపోయారు వాళ్ళు. చానా కోపం వొచ్చింది నాకు వాళ్ళమీద. ఒంటేలు పోసుకోక పొతే ప్రాణం పోయేటట్లు ఉండాది నాకు. ఊడుకుమోతు తనంగా చెక్కమెట్ల వైపు పోతా ఉన్నాను.
 అప్పటికే టైం అయిదు ముక్కాలు కావడంతో చీకట్లు సైతానులాగా కమ్ముకుంటున్నాయి. బూట్ల మిస్సమ్మ దెయ్యం గుర్తుకు వచ్చి ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని "యేసయ్యా..ఈ సైతాను నుంచి నన్ను కాపాడు" అనుకుంటా చెక్కమెట్లు దిగుతున్న. ఆ నిశ్శబ్డంలో నా అడుగులు నాకే పెద్దగా ఇనబడ్తా చెక్క మెట్లమీద ప్రతిధ్వనిస్తూ ఉండాయి. సగం మెట్లు దిగినా అంతలో హఠాత్తుగా ఊరుములా
 " మీ చీకట్లో ఒక్కదానివి ఏడకి పోతాఉండావు" అని ఇనబడింది.

పైప్రాణాలు పైనే పోయి వొనకతా ఎనక్కి చూసినా. ఆడ మా హెడ్ మిస్సెస్ ఎలిజబెత్ టీచర్ బూట్లు టక టకలాడిస్తా చెక్క మెట్లు దిగి వస్తా ఉండాది. అప్పుటికి కాస్త దైర్యం వొచ్చింది నాకు.
“ఓ ..ఓ..ఒంటేలుకి టీచర్” అన్నాను. ఒణుకు ఇంకా తగ్గలా నాకు.
“సరే పా. రోజూ సందేళ పిలకాయలు బడిలో వొస్తువులు ఏమైనా మర్చిపోయారా, లాకుంటే ఎవురైనా తరగతి గదిలో ఉన్నారా చూడడానికే అర్ధగంట టైం అయిపోతా ఉంది నాకు. ఇక అర్ధ గంట వాకింగు చేసి పదో క్లాస్ పిలకాయలకి ట్యూషన్ చెప్పేదానికి పోవాలి” అంటా మెట్లు దిగి నేను ఒంటేలు పోసుకొని ఒచ్చేదాకా ఆడనే ఉండింది టీచర్. సంచి భుజానికి తగిలిచ్చుకొని ” గుడ్ ఈవెనింగ్ టీచర్” అని చెప్పి ఎనక్కి తిరిగి చూడకుండా “బతుకు జీవుడా” అనుకుంటా ఇంటికి లాగెత్తినా.
బూట్ల మిస్సమ్మ దెయ్యం రహాస్యం ఆ రోజు నాకు తెలిసిపోయిది. పాపం మా ఎలిజబెత్ టీచర్ బూట్లు వేసుకుని సాయంత్రం పూట చెక్కమెట్లు దిగతారని తెలియక అందరు ఆమెని దెయ్యం అనుకున్నారు.రేపు బడిలో బూట్ల మిస్సమ్మ దెయ్యం రహస్యం అందరికీ చెప్పేయాలి అనుకున్నా. అప్పుటి నుంచి నాకు దెయ్యం అంటే ఉండే భయము పోయింది. ఇంటికొచ్చి అమ్మకి చెప్తే నవ్వి “మెట్లు దిగతా నువ్వు యేసుప్రభువు ని ప్రార్దించావు కదా ఆయనే నీ భయము పోగొట్టాడు” అని ఈ తూరి ఆదివారం కోడూరు బీచి కాడ ఉన్న వేలాంగణి మాత చర్చిలో ఫాదర్ కాడికి పోయి చక్కెర ఇచ్చివస్తాంలే అనింది . నాయన ఉండుకొని “నిజమే మరి. రకరకాల పూలు, పండ్లు, జీవరాసుల మాదిరిగానే రూపాలు, పేర్లు వేరైనా దేవుడు ఒకడే. దైవత్వం ఒకటే. ప్రేమ ఒకేటే. రక్షణ ఒకటే ” అన్నాడు పెద్ద తత్వవేత్తలా.
బడిలో రోజులు మూడు వాక్యాలు, ఆరు పాటలతో పరుగులు తీస్తా మూడు నెలలు మూడు నిముషాల్లా ఎనక్కి పరుగెత్తినాయి.
అక్టోబర్ నెల వొచ్చేసింది. ఇంక రెండు నెల్ల తర్వాత వొచ్చే క్రిస్మస్ పండుగ కోసం ఇప్పుటి నుంచే క్రీస్తు జననం, దేవదూతల స్తుతి, పశువుల కాపర్ల ప్రార్ధనలు అన్ని డ్రామా లాగా ప్రాక్టీస్ చేయిస్తా ఉండాది చంద్రలీలమ్మ టీచర్ మా చేత.
” చప్పాట్లను కోట్టి ఓ పిల్లలారా..బేత్లెహేము తోట్టి వీక్షింపరారా.. సుశీలుని బాల సౌందర్యములు..వెలింగెడు చాల మనోహరముల్.. వీక్షించుచున్నారు పై దూతలను..క్రిందన్ గొల్లవారు స్తుతించెదరు”. అప్పటికే వందసార్లు ఆ పాటని మా చేత ప్రాక్టీస్ చేయించారు చంద్రలీలమ్మ టీచర్, తులసమ్మ టీచర్.
నిద్ర పోతున్నా కూడా ” చప్పాట్లను కోట్టి ఓ పిల్లలారా” పాట నా చెవుల్లో మారుమ్రోగతా ఉండాది. బాల యేసు జన్మదినం డిసెంబర్ 25 రోజు కోసం ఎదురు చూస్తా ఉండాను నేను.

1 thought on “తట్టుడీ మీకు తీయబడును”

Leave a Comment