డ్రైవరో నారాయణో హరి

నమస్తే! నేను వ్రాసిన ఈ కథ “డ్రైవరో నారాయణో హరి”  నవంబర్ 2019 “హ్యూమర్ టూన్స్” పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన.

—————————————————————————————————————————–

ఓర్నాయనో” గావుకేక పెట్టి కుర్చీ లోంచి ఇరగదీసుకుని కింద పడిపోయాడు పుల్లారావు. నేలమీదపడి దొర్లుతూ తిరిగి తిరిగి ఆగిపోయిన బొంగరంలా చేష్టలుడిగి, ఉలుకు పలుకు లేకుండా చచ్చిన శవం మాదిరి బిగుసుకుపోయాడు.

పుల్లారావు అరచిన అరుపుకి భూ కోపం వచ్చినట్లుగా ఆఫీసంతా దద్దరిల్లి పోయి పనిచేసుకుంటున్న వారంతా బెంబేలెత్తిపోయి, పుల్లారావు చుట్టూ చేరారు. పుల్లారావుకు ఏమైందో ఎవరికీ అంతు పట్టలేదు.. మళ్లీ ఓసారి ‘ఓర్నాయనో’ అని అరచి నక్క బిగువుపట్టినట్లు కాళ్లు చేతులు కొట్టుకో సాగాడు. ఎవరో తాళాల గుత్తిని పుల్లారావు చేతిలో పెట్టారు. దానిని అతను విసిరి కొట్టడంతో అది వెళ్లి వాళ్ళ బాస్ బట్టతలకి టపీమని కొట్టుకొని బాస్ తలమీద క్షణాల్లో బొప్పికట్టింది. ఇక బాస్ ఉగ్రనర సింహం అయినాడు.
పుల్లారావుకేదో వింత జబ్బు పట్టుకుంది అనే వార్త క్షణాల్లో ఆఫీస్ లోని సెక్షన్ లన్నింటికీ దావానలంలా పాకింది. కాస్త ఇంగిత జ్ఞానం ఎక్కువ ఉన్న పుల్లారావు స్నేహితుడు, పక్క సెక్షన్ లో పనిచేసే సెంటు బుడ్డి శంకరనారాయణ క్షణంలో వెయ్యోవంతు బ్రెయిన్లో ఫ్లాష్ వెలిగింది. వెంటనే సెల్ ఆన్ చేసి 108 వాహనానికి కాల్ చేసాడు అర్జెంట్ గా రమ్మని.

పుల్లారావు అమీర్ పేట లోని ఓ ప్రైవేట్ ఆఫీసులో చిరుద్యోగి. యూసఫ్ గూడ లోని అతని ఇంటి నుంచి రోజూ ఆఫీసుకి స్కూటర్లు వెళ్ళేవాడు. ఆ రోజు ఆఫీసుకు వచ్చిన అరగంట అరగంటలోనే గావుకేక పెట్టి పడిపోయాడు. 108 వాహనం వాగి వాగి గొంతు రాసిపోయిన వసపిట్టలా కిర్ కిర్ మని అరుచుకుంటూ ఆఫీస్ ముందు ఆగింది. ఇద్దరు బకాసురు లాంటి వ్యక్తులు వాహనం నుంచి దిగి స్ట్రెచర్ పట్టుకొని పేషంట్ ఎక్కడ అని యమకింకరుల్లా అరవగానే పుల్లారావు చుట్టూ చేరిన వాళ్ళు పక్కకి జరిగారు. గిలగిలా కొట్టుకుంటున్న పుల్లారావు కాళ్లు చేతులను పట్టుకొని వంకాయల బస్తాను విసిరేసినట్లు అంబులెన్స్ లోనికి విసిరేశారు. వారిద్దరు.

ఆస్పత్రిలో పేషంట్స్ లేక ఈగలు తోలుకుంటున్న డాక్టర్ ఐరావతా నికి చాలా రోజుల తర్వాత 108 వాహనం పుల్లారావుని తీసుకు రావడంతో సంక్రాంతి పండగ వచ్చినంత సంబరపడిపోయి అసలు ఏమైందో తెలుసుకోకుండానే అరడజను టెస్టులు అర్జెంటుగా రాసేశాడు.
పుల్లారావు కూడా వచ్చిన సెంటు బుడ్డి శంకర నారాయణ దగ్గరుండి పుల్లారావుకు టెస్టులన్నీ చేయించాడు. అన్నీ పూర్తయ్యాక ఒంట్లో రక్తమంతా ఆవిరై పోయినంత నీరసంగా వచ్చి డాక్టర్ ఎదురుగా కూర్చున్నాడు పుల్లారావు.

ఇప్పుడు చెప్పవయ్యా నీ బాధ ఏంటి?” అన్నాడు డాక్టర్ ఐరా పతం. ఇల్లు కాలిపోయిన తర్వాత బూడిద మీద పన్నీరు చల్లినట్లు. కడుపు నొప్పి నొప్పి. విపరీతమైన కడుపు నొప్పి, పొట్ట బిగుసుకు పోయింది” అన్నాడు పుల్లారావు పొట్ట పట్టుకొని.

అంతే స్టెతస్కోపు అయినా పెటి చూడకుండా నెల సామాన్ల అంత పొడవు ఉన్న మందుల పట్టీని (బ్రహ్మదేవుడికి కూడా అర్థం కాని భాషలో) రాసి ఇచ్చాడు. ఆసుపత్రి పక్కనే ఉన్న మెడికల్ షాపులో చీటీ చూపించి మందులు అన్ని కవర్లో వేయించుకొచ్చాడు శంకర్రావు. టెస్టులు మందులతో కలిపి పదిహేను వేల బిల్లు చూసి కళ్ళు బైర్లుకమ్మి శంకర్రావు మీద పడ్డాడు పుల్లారావు.

స్నేహితుడు శంకరరావు సాయంతో ఇంటికి చేరిన పుల్లారావు ప్యాంట్ విప్పి లుంగి కట్టుకుని సోఫాలో వాలిపోయాడు. ఏమైందో ఏమో అరగంటలో మందు లేమీ మింగకుండానే కడుపు నొప్పి మాయం అయిపోయింది. తెల్లారి హుషారుగా లేచి రోజు కంటే ముందుగా ఆఫీస్ చేరుకున్న పుల్లారావు మళ్లీ అరగంటలోనే పడిపోయాడు. ఇక ఆ రోజు కూడా ఆఫీసులో ఉండలేక పోయాడు పుల్లారావు. ఇలా వారం రోజులు సాగింది. అలోపతి లాభం లేదని హోమియోపతి, యునానీ. అన్ని వైద్యాలకు పుల్లారావు కడుపునొప్పి లొంగలేదు.

పుల్లారావుకు వచ్చే ప్రమోషన్ కు ఓర్వలేక ఎవరో చేతబడి చేయించి ఉంటారని చెప్పి పక్క సెక్షన్లో ఉండే పానకాలరావు పుల్లారావుని భూతవైద్యుడు భూతాల సేతుపతి దగ్గరకు తీసుకు వెళ్ళాడు. భూతాల సేతుపతి పుల్లారావును ముగ్గు మధ్యలో కూర్చో బెట్టి మంత్రాలు చదివి మంచి నీళ్లు చిలకరించి నిమ్మకాయలు జేబులో పెట్టుకోమని చెప్పి ఎలుగుబంటి ఎంటికల (జుట్టు)తో పేనిన తాడుతో తాయత్తుకట్టి పుల్లారావు చేతికి కట్టాడు.

అయినా సరే గగుణం కనిపించలేదు పుల్లారావుకి . ఆఫీసులో అందరూ పుల్లారావుకేదో అంతుపట్టని మాయరోగం వచ్చిందని గుహ గుసలు పోసాగారు. దిగులుతో పుల్లారావు సగం చచ్చిన పాములా వెయ్యి లంకణాలు చేసినట్లైపోయాడు.

ఇక లాభం లేదని పుల్లారావు భార్య పర్వతం ఊర్లో ఉన్న వాళ్ళ బామ్మ వెంకాయమ్మ తో వాట్సాప్ వీడియో కాల్ చేసి పుల్లారావు ని మాట్లాడమంది. పుల్లారావుని వీడియో కాల్ చూస్తూనే అతని బామ్మ, “ఒరే పుల్లిగా! పులిలా ఉండేవాడివి ఇలా పిల్లిలా అయిపోయావేంట్రా? ఏ మాయదారి దిష్టి తగిలిందో నీకు! అయినా ఒరే నీ పెళ్ళాం పర్వతం ఫోన్ చేసి చెప్పేదాకా నాకు తెలియకపాయనే. ఊర్లో బామ్మ ఉన్న సంగతి మీరు మర్చిపోయారటరా? నేను ఇంకా చావలేదు కదరా! మీ తాత కాకర్ల వారి కండ్రిగ లో పెద్ద ఆయుర్వేద వైద్యులుగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన ఇప్పుడు లేకపోయినా ఆయన రాసిన గ్రంథాలు ఇంకా నా దగ్గర ఉన్నాయి, వైద్యం చెప్తాను. విని ఏడువు. అరకిలో పిప్పళ్ళు, పావుకిలో మిరియాలు వేయించి దంచి, పొడిచేసి వాటిని మర్రిచెట్టు ఊడలను పొడిచేసి పావుకిలో కలిపి మరిగించి చిక్కటి ద్రవంగా మరాక దానికి అరతులం ఆముదం కలిపి ఐదు రోజులు పుచ్చుకున్నాంటే నీ కడుపు నొప్పి మటుమాయం అవుతుంది” అన్నది.

పుల్లారావు బైరాగిలా నవ్వి “బామ్మా ! అయినా పదిహేను వేలు పోసి చేయించు కున్న అలోపతి వైద్యానికే తగ్గలేదు. ఈ పిప్పళ్ళు, మర్రి ఊడలకు తగ్గు తుందా? అసలు సిటీలో ఇవన్నీ ఎక్కడేడుస్తాయో.. నీ చాదస్తం కానీ”అన్నాడు.

“ఒరే అక్కుపక్షీ! సిటీలో అవి దొరక్కపోయినా ఆయుర్వేద ఆస్పత్రు లుంటాయి. అక్కడకు తగలడు. వాళ్ళు పిప్పళ్ళు, మర్రి ఊడలు అన్ని ఇస్తారు. లేకుంటే ఆ డాక్టర్ కి చెప్పి నేను చెప్పిన వైద్యం (మందు) చేయించుకోరా కుంకన్నా మళ్ళా వీడియో కాల్ చేస్తా. ఇప్పటికుంటానురా పెట్టేయండి ఫోన్” అంది బామ్మ.

సరే, ఇప్పటివరకు వరకు తగ్గని కడుపు నొప్పి బామ్మ చెప్పిన ఆయుర్వేద వైద్యంతో తగ్గుతుందేమో అని ఆఖరి ఆశగా నెట్లో ఆయుర్వేద వైద్య శాలకోసం వెతగ్గా, వెతగ్గా, బోరబండ చివరి గల్లీలో ‘భిక్ష’ ఆయుర్వేదిక్ సెంటర్ కనబడింది. వెంటనే వివరాలు కనుక్కుని ఆస్పత్రిలో అపా యింట్ మెంట్ తీసుకున్నారు పుల్లారావు.

ఆరోజు పొద్దున్న ఆస్పత్రికి వెళ్లామనుకున్నారు. పుల్లారావు, పర్వతం. ఏమండీ, షేరాటోలో వెళ్లామా?” అంది పర్వతం. “లేదే, మీ నాయన కొనిచ్చిన బెంజికార్లో వెళదాం” అన్నాడు. పుల్లారావు బెల్టు పెట్టుకుంటు. ఈ వెటకారాలకేం తక్కువ లేదు. చాల్లెండి, ఇక బయలుదేరుదాం” అని ఇద్దరూ ఇంటినుంచి గల్లి మొదట్లో కొచ్చి నిలబడ్డారు షేర్ ఆటో కోసం.

నాలుగైదు ఆటలు ఆగకుండా రేసుగుర్రాల్లా దూసుకెళ్ళిన తరు వాత ఆరో ఆటోవాడు వీళ్లనిచూసి ఆపాడు ఆటోని..ఆటోలో ఉన్న ఇద్దరు మగాళ్ళు డ్రైవర్ కి చెరోవైపు కూర్చున్నారు. పర్వతం ఆటో ఎక్కడానికి అవస్థ పడుతుంటే ఆటోలో ఉన్న ఆమె దిగి పర్వతాన్ని ఎక్కనిచ్చింది. ఆనక పుల్లారావు ఎక్కిన, తర్వాత ఆటోలో అంతకు ముందే ఉన్న ఆమె టీచర్లా ఉంది. పిల్లల పరీక్ష పేపరు కాబోలు ఒడిలో పెట్టుకుని కూర్చుంది. అయినా బండి ముందుకు కదల్లేదు.

ఇంకెందుకు ఆలస్యం? పోనీండి ఆటో” అన్నాడు పుల్లారావు అసహనంగా. వెనక సీట్లో ముగ్గురే ఉన్నారు. నాకు గిట్టుబాటు అవదు. ఇంకోళ్లని ఎక్కనీ” అన్నాడు కుర్ర ఆటో డ్రైవర్, ఈలోగా దారిన పోయే జనాలని చూస్తూ “బోరబండ బోరబండ బోర ఇండ” అని వింత రిథమ్ అరుస్తున్నాడు. ఐదు నిమిషాల తర్వాత చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సెల్ లో మాట్లాడుతూ ఓ జీన్స్, ప్యాంటు వేసుకున్న పిల్ల ఎక్కడికని చెప్పకుం డా పర్వతాన్ని నెట్టి ఆటోలో కూర్చుంది. ముగురు ఆడంగుల మధ్యలో కూర్చున్న పుల్లా రావు అప్పడం నలిగినట్లు నలిగిపోసాగాడు.

ఇక ఆటోడ్రైవర్ హుషారుగా ఆటోని ముందుకు ఉరికించాడు. ఆటో యూసఫ్గూడ బస్తీ దాటి చెక్ పోస్ట్ దగ్గర రాగానే “ఓర్నాయనో నొప్పి ” అని గావుకేక పెట్టాడు పుల్లారావు. పొడుగు గడ్డం దాదాపు మొత్తం గుండు మధ్య నడినెత్తిన మాత్రం కోడిపుంజుకు ఎర్ర కిరీటం ఉన్నట్లు నలుసంత జుట్టులో ఎర్ర రుమాలు మెడకు చుట్టుకొని జర్దాకిళ్ళీ నములుతూ మధ్య మధ్యన రోడ్డు మీదకు తుపుక్కున ఊస్తూ ఆటో డ్రైవర్ స్టీరింగ్ సౌండ్ మాదిరి హిందీ పాటలు పెట్టాడు ఆటోలో, పాపం పుల్లారావు అరిచిన అరుపు ఆ పాటలో కలిసి పోయింది. ఏదో స్కూల్ రావడంతో టీచరమ్మ ఆటోని ఆపమని దిగేసింది.

ఇక ఆటోని వాయువేగంతో ఎదురొస్తున్న వాహ నాలను కూడా లెక్కచేయకుండా ముందుకు దూసుకు పోతున్నాడు కుర్ర ఆటోవాలా ఆటో నగర్ వచ్చేసరికి రోడ్డు నాగుపాము తిరిగినట్లు మలుపులతో ఎత్తు తగ్గులు (పిల్లలు) రోడ్డులో తిరుపతి కొండను తలపిస్తోంది. జీన్స్ ప్యాంట్ పిల్ల చెవిలో ఇయర్ఫోన్స్ తో ఈ లోకంలో లేనట్టు ఉంది. అప్పుడే టేప్ లో “యే దునియా బనా దూంగా తేరీ చాహత్ మే” అనే పాట మొద లైంది. పుల్లారావు “ఆటోని కాస్త ఆపు” అని అరిచాడు. ఆటోవాలా ఎప్పుడో పాటలో హీరో రాహుల్ రాయ్ లో కి పరకాయ ప్రవేశం చేసి హీరోయిన్ అనూ అగర్వాల్ డ్యూయెట్ పాడేసు కుంటున్నాడు పుల్లారావు కేకలని పట్టించు కోకుండా.

“అబ్బా కొంచెం ఓర్చుకోండి, ఆసుపత్రి దగ్గర కొచ్చేస్తోందిగా” అంది పర్వతం. ఇక నొప్పిని ఓర్చుకోలేక పుల్లారావు “ఆపరా ఆపరా ఆపరా” అంటూ పెదరాయుడు సినిమాలో రజినీకాంత్ లా అరిచి, ఆనక బిగు సుకుపోయాడు. అప్పుడే సరిగ్గా ఆటో కార్మిక నగర్ మధ్య గల్లీలో వచ్చి పెద్ద గుంతలో పడి ఒక్క ఎగురు ఎగిరింది. ఆ కుదుపుకి ఆటోతో పాటు పుల్లారావు కూడా ఒక్క ఎగిరి ఆటో టాప్ కి కొట్టుకోవడం, వేసుకున్న (ఫ్యాంట్) బెల్టు ఊడి, ప్యాంటు కిందకి జారడం, ప్రక్కనున్న జీన్స్ ప్యాంటు పిల్ల కెవ్వుమని అరవడం క్షణాల్లో జరిగిపోయాయి. జీన్స్ పిల్ల ఆటో దిగేసి పరి గెత్తింది. కంగారుగా ప్యాంటు పైకి లాక్కొని బెల్టు పెట్టుకోబోతున్న వాడల్లా ఒక్క క్షణం ఆగాడు పుల్లారావు.

అప్పటిదాకా వేధించే కడుపు నొప్పి బెల్టు ఊడిపోవడంతో మటుమాయం అయ్యింది. అంటే సరిగ్గా నెల క్రితం తాను పదేళ్లుగా వాడు తున్న పాతబెల్ట్ పాడైపోయిందని క్రొత్త బెల్టు కొనుక్కున్నాడు. ఆరోజు కొత్త బెల్ట్ వేసుకుని ఆఫీస్ కి వెళ్లడం, కడుపునొప్పి మొదలవడం జరిగింది. మళ్లీ ఇంటికి వచ్చాక నొప్పి తగ్గి పోయేది. అంటే ఇంతకాలం తన కడుపు నొప్పికి కారణం ఈ టైటు బెల్టా? ఎంత మంది డాక్టర్ల చుట్టూ తిరిగి ఎన్ని వైద్యాలు చేయించినా తగ్గని నొప్పి ఈ రోజు ఈ ఆటోడ్రైవర్ డ్రైవింగ్ పుణ్యమా అని తగ్గిపోతుంది.

ఆలోచిస్తున్న పుల్లారావుకు కడుపు నొప్పి తగ్గిందన్న ఆనందంలో హుషారు ఎక్కువై హుర్రే అనుకుని ‘యురేఖా’ అని అరిచి మళ్ళా ఒక్క ఎగురు ఎగిరాడు. అసలే ఆటో ముందుచక్రాలు మోకాలు లోతు గుంతలో పడడంతో, ఆటోని పైకి లేపడానికి ప్రయత్నిస్తున్న ఆటోవాలా మీద ఆటోలోనించి దబ్బుమని గుంతలో ఉన్న డ్రైవర్ మీద పడ్డాడు పుల్లారావు. “చచ్చానురా దేవుడో” అని ఇద్దరి నోటి నుంచి ఒకేసారి అరుపు వెలు వడింది. ఇద్దరు అరిచిన అరుపుకి అంతరిక్షంలో అష్టగ్రహకూటమి ఏర్పడినంత శబ్దమై ఆ చుట్టు పక్కల ఉన్నవాళ్లంతా గుంత చుట్టూ చేరారు. పుల్లారావు ఆటోవాలా మీద పడడం పడడంతో ఇద్దరికీ నడుములు విరిగాయి.

Leave a Comment