నమస్తే. శ్రీమతి కల్వకుంట కవిత గారి సంపాదకత్వంలో ప్రతిష్టాత్మకంగా వెలువడుతున్న తెలంగాణ జాగృతి తెలుగు సాహిత్య పక్షపత్రిక “తంగేడు” మార్చి 01-15, 2021 మహిళా దినోత్సవ ప్రత్యేక సంచిక లో నా కథ “చెల్లె ” ప్రచురితం అవడం చాలా ఆనందం. శ్రీమతి కల్వకుంట కవిత గారికి, అసోసియేట్ ఎడిటర్ డా|| కాంచనపల్లి గో.రా. గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులందరికీ ముందస్తు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. కథ చదివి మీ అమూల్యమైన అభిప్రాయము తెలుపుతారుగా..


సుల్తాన్పూర్ బస్టాప్ నిర్మానుష్యంగా ఉండే. అర్థగంట నుంచి చూస్తున్న ఒక్క బస్సు కూడా వస్తలేదు. అసలే అమాస పోయి మూడు రోజులే అయింది. చుట్టూ చిమ్మ చీకటి. మాటి మాటికీ వాచీ చూసుకుంటున్న. టైం తొమ్మిదైంది. అప్పటికి ప్రమీల చెప్తనే ఉంది ” ఉపేంద్రా… ఇంత చీకటి పడ్డాక ఊరికి ఒక్కదానివే ఎట్లా పోతావే. ఈ రాత్రికి హాస్టల్లోనే ఉండు. పొద్దునే వస్తానని మీ ఆయనకు ఫోన్ చేసి చెప్పు అంది”.
ఈ రోజు సుల్తాన్ పూర్ బి.ఎడ్. కాలేజీలో ఆఖరి రోజు. ఫేర్ వెల్ ఫంక్షన్. సాయంత్రం ఐదు గంటలకు ప్రోగ్రాం మొదలైంది. మధ్యలో నేను వచ్చేద్దాం అనుకుంటే ప్రోగ్రాం చివరలో నేను పాట పడాల్సి ఉండే. పోనీ హాస్టల్ లో ఉందాం అనుకుంటే ఇంటికి రాలేదని మా ఆయన చేసే లొల్లి కంటే, అమ్మ ఇంకా రాలేదని నిద్రపోకుండా ఎదురు చూసే నా చిన్నారి పోరి, పోరడు గురించే నా రంధి అంతా. వాళ్ళ బాబు అన్నం పెడితే వాళ్ళు మంచిగా తినరు. అదే నా బాధ. అందుకే ఎంత లేట్ అయినా ఊరికి వెళ్ళి పోవాలని బస్టాపుకి వచ్చా.
నాకూడా ఉన్న మా క్లాస్ అబ్బాయిలు ఇద్దరు సిద్ధిపేట బస్సు రాగానే వెళ్లిపోయారు. ఇక బస్టాపులో ఒంటరిగా నేను మిగిలాను. బస్టాపు పక్కన ఉన్న స్తంభం మీద లైట్ వెలగాలా వద్దా అని పరేషాన్ అవుతున్నట్టు ఉండుండి ఆరిపోయి వెలగతా ఉంది. ఫంక్షన్ కోసం చేతులకు పెట్టుకున్న మైదాకు లైట్ వెలుతురు పడ్డప్పుడల్లా ఎర్రెర్రగా మెరుస్తా ఉంది. తొందరగా రాని బస్సు ను అప్పటికి వంద సార్లు తిట్టుకుంటా చీకట్లో బిత్తర బిత్తరగా నిలబడుకోని ఉన్నా.
ఏడనుంచో రెండు కుక్కలు అరుచుకుంటా వస్తున్నాయి . ఎవరైనా వస్తారేమో అని చూసిన. మనిషి జాడ లేకుండె కానీ, నేను ఒక్కదాన్నే ఉండడం వాటికి వింతగా ఉందేమో మీద మీదకి వస్తన్నయ్ . వంగి రాయి తీసుకుని ” చే చే పో ” అంటే దూరంగా పొయినై. చీకట్లో మిణుగురు పురుగులు స్తంభం మీది లైటుతో పోటీపడి మెరుస్తా, ఆరిపోతా ఉండగా బస్సు హారన్ వినపడింది నాకు. పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది.
ఇంతలోనే చీకటిని చీల్చుకుంటూ అతివేగంగా వచ్చిన ఓ కారు సిద్ధిపేట వైపు దూసుకు వెళ్ళింది. కారులో నుంచి పెద్ద పెద్దగా అరుపులు, కేకలు వినిపిస్తా ఉండే. కారు లోని వాళ్ళు నన్ను చూసినారేమో అని భయం వేసింది నాకు. ఐదు నిముషాలకు తాబేలుకు నీరసం వేసి నడవలేక నడిచినట్టు మెల్ల వచ్చి ఆగింది బస్సు. కండక్టర్ బస్సు డోర్ తెరిచి అలవాటుగా పటాన్చెరు అని అరిచి నేను ఒక్కదాన్ని ఉండడంతో అరవడం ఆపేసాడు.
ఒక్క ఉదుటన బస్సు లోకి గెంతినట్టు ఎక్కిన. గుప్పున ముక్కు పుటాలకు తాకింది గుడుంబా వాసన. బస్సు లోకి తొంగి చూసిన నేను. డ్రైవర్, కండక్టర్ మరో ఇద్దరు మగవాళ్ళు తప్ప బస్సు లో ఇంకెవరు లేరు. ఒక్కక్షణం బస్సు దిగేద్దామనుకున్నాను. అప్పటికే టైం తొమ్మిది ముప్పావు అయింది. ఇంకో బస్సు ఎప్పటికి వస్తుందో ఏమో. ఎటూ తేల్చుకోలేక ఏదైతే అదైతదని బస్సు లోపలికి పోయి డ్రైవర్ సీట్ కి వెనుక రెండు సీట్ల అవతల కూర్చున్న. ఇక ఎవరు ఎక్కరని కండక్టర్ బస్సు డోర్ విసురుగా లాగి గట్టిగా మూసిండు.
బస్సు మరీ పాతది లాగా ఉంది. సీట్లన్నీ చినిగిపోయి పీచు బైటకు వచ్చి ఉండే. కండక్టర్ రైట్ రైట్ అనగానే కాసేపు ముందుకు,వెనక్కు ఊగి తర్వాత కదిలింది బస్సు మెల్లగా. పది నిముషాలకి సంగారెడ్డి ఊరు బస్టాండ్ బయటే ఆగింది బస్సు. రెండు చేతుల్లో ఉన్న బరువైన సంచులతో దిగిపోయిండు ఒకతను. చీకట్లో గల్లీ చివర ఓ షట్టర్ దగ్గర చిన్న లైట్ తప్ప ఇంకేమి కనిపిస్తా లేదు నాకు. ఇక బస్సు లో డ్రైవర్, కండక్టర్ కాక ఇంకో అతను సీట్లో ఒరిగిపోయి నిద్రలో ఉన్నడో , మత్తులో ఉన్నాడో తెలుస్తలేదు నాకు. డ్రైవర్ సీట్ పైన చిన్న లైట్ తప్ప బస్సు లో లైట్లు కట్టేసాడు కండక్టర్. గుడుంబా వాసన ఎవరి దగ్గర నుంచి వస్తోందో సమజైతలేదు నాకు.. ముక్కుకు రుమాలు అడ్డం పెట్టుకున్నాను. తెరిచిన కిటికీ లోనుంచి రివ్వున గాలి ముఖానికి కొడుతోంది. కిటికీ డోర్ సగంపైనా మూసిన. అయినా గాలి విసురు తగ్గుతలేదు.
త్వరగా ఇంటికి వెళ్ళాలి అనుకున్నాను. బస్సు మాత్రం నిండు చూలాలు అడుగులో అడుగు వేస్తున్నట్టు కదులుతోంది. కండక్టర్ లైట్ వేసి నా దగ్గరకి వచ్చి టికెట్ కొట్టాడు. అప్పుడు చూసాను కండక్టర్ ముఖంలోకి కాస్త పరీక్షగా. బుర్ర మీసాలు, గుబురు గడ్డం తో బుగ్గ మీద లోతైన గాటుతో చూడ్డానికి కండక్టర్ లా కాక బందిపోటు దొంగ లా అనిపించాడు. బస్సు కంది చౌరస్తాలో ఆగింది. నిద్రలో ఉన్న అతన్ని కండక్టర్ తట్టి లేపిండు. అతను ఉలిక్కి పడి లేచి మళ్ళా సీట్ మీదకు ఒరిగిపోయాడు. గుడుంబా తాగింది అతనని అర్ధమైంది నాకు.
మళ్ళీ కండక్టర్ గట్టిగా అరిచి లేపేసరికి తూలుతూ లేచి రెండడుగులు వేసి డోర్ దగ్గర మళ్ళా పడిపోఇండు. అతన్ని పట్టి లేపి డోర్ తీసి కిందకు గోకర కాయల బస్తాని విసిరినట్టు బయటకు నెట్టి బస్సు దిగి అతన్ని గల్లీపక్కగా వదిలి వచ్చి బస్సు ఎక్కిండు కండక్టర్.
” ఛీ ఛీ, ఎదవా గలీజు నాయాలు.. మస్తుగా తాగిండు అన్నా. ఇంటికి పోకుండా ఆడనే పడిపోఇండు అని ఇంకేదో బూతు మాట అని గబ్బుక్కున నా వంక చూసి గతుక్కుమన్నాడు కండక్టర్. బస్సులో ఇపుడు డ్రైవర్, కండక్టర్, నేను. మేము ముగ్గురమే. పటాన్చెరువు చేరనికి ఇంకా ముప్పావు గంట పట్టవచ్చేమో ఈ చీకట్లో. బస్సు ముందుకు కదిలింది. నా ఆలోచనలు వెనక్కి కదిలినై .
పెళ్ళి అయి, ఇద్దరు పిల్లలైనాక కూడా ఇపుడీ చదువెందుకు, ఊర్లు కానీ ఏలాలా అంటూ అత్తమ్మ, మా ఆయన రోజుకోసారి లొల్లి చేసినా వినకుండా పట్టు వదలని విక్రమార్కుడిలా బి.ఎడ్ ఎంట్రన్స్ ఐదు సార్లు రాసినా. ఈ సారి మంచి రాంక్ వచ్చి సుల్తాన్పూర్లో సీట్ వచ్చింది. చదువంతా అయిపోయింది. ఇంకో వారంలో పరీక్షలు.
కిటికీలో నుంచి పేడబుర్ర పురుగు అనుకుంట విసురుగా వచ్చి నా కంట్లో కొట్టడంతో ఆలోచనలు ఎగిరిపోయాయి. విపరీతంగా కన్ను నొస్తుంది , మండుతుంది . ఒంటి కన్ను నుంచే నీళ్ళు కారిపోతా ఉన్నయి. చున్నీ అంచు నోట్లో పెట్టుకుని ఊది కన్ను మీద పెట్టుకున్నాను. ఏడుపు వస్తుండే నాకు. కండక్టర్ ఏదో చెప్తుంటే డ్రైవర్ వెనక్కి వెనక్కి తిరిగి నా వంక చూస్తుండే. ఒంటి కన్ను తెరిచి చూస్తున్నాను భయంగా వాళ్ళ వంక. డ్రైవర్ కూడా కండక్టరుకి ఏ మాత్రం తీసిపోకుండా గుబురు గడ్డం, ఎర్రటి కళ్లతో భయం గొలిపేలా రౌడీ లెక్క ఉండే. నా మనసులో పరేషాను మొదలైంది.
ఐదు నిముషాలు గడవంగనే బస్సు ఒక్క కుదుపుతో ఆగింది. ఇంకా ఇస్నాపూర్ కూడా రాలే. ఇక్కడ బస్సెందుకు ఆపారు అనుకున్న క్షణమే నా మనసు ఆగమాగం అయింది. చుట్టూ చిమ్మ చీకటి. నా వంటిమీద ఎక్కువ బంగారం లేకపోయినా మెడలో ఉన్న పుస్తెల తాడు, చేతుల్లో ఉన్న రెండు గాజులు బంగారువే. ముక్కు పుడక కోసం, కాలి పట్టీల కోసం హత్యలు జరిగిన ముచ్చట్లు చాల విని ఉండే నేను. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కుమ్మకై నా నగలు లాగేసుకుని ఆపైన నన్ను ఏమైనా చేస్తే…
ఆ ఆలోచన రాగానే వెన్నులో వణుకు మొదలైంది నాకు. గొంతు తడారిపోతుంటే లేని ధైర్యాన్ని ముఖమ్మీద ప్రదర్శిస్తూ బస్సు ఎందుకు ఆపారని కండక్టర్ని అడిగిన . ” టైరు పంక్చర్ అయింది ” అని విసుగ్గా చెప్పి కిందకు దిగిండు కండక్టర్. అతని వెనుకే డ్రైవర్ దిగిండు. ‘మూలిగే నక్క మీద తాటి పండు పడ్డట్టు’ అయింది నా పరిస్థితి. నిజంగా టైర్ ఫంచర్ అయిందో లేక వీళ్ళు అలా నాటకం ఆడుతున్నరో ఏమో అనిపించింది. ఎప్పుడు చాల ధైర్యంగా ఉండే నాకు మొదటిసారి భయం అంటే ఏంటో తెలిసింది. సెల్ ఛార్జింగ్ అయిపోయింది. వాటర్ బాటిల్ లో నీళ్ళు కూడాలేకుండె.దప్పిక ,భయం మూకుమ్మడిగా నా మీద దాడికొచ్చినై. వీళ్ళు నిజంగా దుర్మార్గులు అయితే ఇప్పుడు నేనేం చేయాలి సమజైతలేకుండే నాకు . చుట్టూ చిమ్మ చీకటి. డోర్ లాగినా. రాలేదు. వాళ్ళు గట్టిగా డోర్ వేసిపోయినట్లు ఉన్నారు. చీకట్లో వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు కనిపిస్తా లేదు. ‘ యాదగిరి నరసింహ స్వామి నన్ను వీళ్ళ బారినుంచి కాపాడు తండ్రి. అమ్మా పోచమ్మ తల్లి … ఈ సారి నీకు మంచిగా బోనాలు పెడతాను. ఈ గండం గట్టెకించు’.
గుర్తొచ్చిన దేవుళ్ళకంతా మొక్కతా ఉన్న. పది నిముషాల తర్వాత డ్రైవర్, కండక్టర్ బస్సు ఎక్కిన్రు . టైర్ మార్చినారేమో ఇప్పటిదాకా. బస్సు కదిలింది. కానీ నా భయం మాత్రం వదలలేదు. కన్ను మంట ఇంకా తగ్గలేదు. ఇది మెయిన్ రోడ్ కదా పోలీసులు తిరుగుతారని బస్సు ను దారి మళ్లించి ఇంకెక్కడికైనా తీసుకుపోతారేమో అని ఆలోచిస్తా బిక్కు బిక్కు మంటు చూస్తూ ఉండగానే బస్సు పటాన్చెరు బస్టాండ్ లో కి వచ్చిఆగింది.
బతుకు జీవుడా అనుకుంటా బ్యాగ్ భుజానికి తగిలించుకుని సీట్ లో నుంచి లేచి డోర్ తీయబోయినా దిగేదానికి. వెనుక నుంచి ” చెల్లె ” అన్న మాట బిగ్గరగా వినపడి వెనక్కు తిరిగి శిలా ప్రతిమలా నిలబడ్డాను నేను. డ్రైవర్ నన్ను చూసి “ఏంది చెల్లె గీ టైంల ఏడికి పోతున్నావ్ . ఇంత రాత్రి ఒక్క దానివి ఎందుకు వచ్చినవు చెల్లె” అని కండక్టర్ వైపు తిరిగి ” ఇదిగో యాదగిరి.. చెల్లె ఒక్కటే ఉంది. బస్టాండ్ ముంగడ షేర్ ఆటో సాయిలు ఉంటాడు. చెల్లె ను తీస్కపోయి ఆటో ఎక్కించు. చెల్లెను ఆటోలో తోలుకపోయి వాళ్ళ ఇంటి దగ్గర భద్రంగా వదలమని నా మాటగా చెప్పు. తేడా వస్తే ఈ డ్రైవర్ నర్సింగు మనిషిగాడని చెప్పు” అన్నాడు.
అంతే… అతని మాటలు విన్న నాకు అప్పటిదాకా ఒక కంటి నుంచి వచ్చిన నీరు రెండో కంటికి కూడా చేరి చెంపల మీదినుంచి ధారగా కారసాగింది. మనిషి బాహ్య రూపం చూసి వీళ్ళు మంచి వారు,వీళ్ళు చెడ్డ వారు అని ఎవరిని అంచనా వేయకూడదని, పురుషులందు పుణ్య పురుషులు వేరని ఆ క్షణం అనిపించింది వాళ్ళ మాటలు విన్న నాకు. అప్రయత్నంగా వారిద్దరికీ చేతులు జోడించి మొక్కిన నేను.

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.
guest
23 Comments
Inline Feedbacks
View all comments
Veeranjaneyulu Somepalli
Veeranjaneyulu Somepalli
March 3, 2021 11:51 am

చాలా ఆర్ద్రత గా రాసారు అండి..
నిజమే మనిషి బాహ్యనికి అంతరానికి సంబంధం ఉండదు..
మనుషుల్లో మానవత్వం ఇంకా మిగిలి ఉంది అనడానికి నిర్వచనం గా
వాస్తవానికి దగ్గరగా సహజ శైలిలో సహజమైన భాషలో రాసారు కవయిత్రి గారు
అభినందనలు అండి
అందరూ ఊహించుకున్నట్టు
రాసి ఉంటే
లక్ష కథల్లో ఒకటి అయ్యేది
కానీ మానవతా దృక్పదంతో రాసి
లక్షల్లో ఒకటి గా నిలిపావు ..
చాలా బాగారాసావు ..మా

Veeranjaneyulu Somepalli
Veeranjaneyulu Somepalli
March 4, 2021 10:39 am

thq very much andi

Perwala Srinivasa Murthy
Perwala Srinivasa Murthy
March 4, 2021 6:05 am

Good Best Wishes amma

ఉమ్మెత్తల
ఉమ్మెత్తల
March 4, 2021 7:24 am

కథ చక్కని ఉపమానాలతో ,ముగింపు తో సాగింది.భాషాపరంగా చూస్తే కొంత వ్యవహారికం…మరికొంత విభిన్న ప్రాంతాల మాండలిక మిశ్రమంగా లేకుంటే కథనం మంచిపట్టు చీరనలంకరించుకున్నట్లుండేది.
ముగింపు రసార్ద్రతను సంతరించుకుంది.
రచయిత్రి సహజ చిత్రణతో సాగించిన చెల్లి కథ ఒక రసరమ్య భావగీతిక.

Naga Rajesh
Naga Rajesh
March 4, 2021 10:32 am

Congratulations all the best

hanuravuri
hanuravuri
March 4, 2021 1:23 pm

కథ చాలా చాలా బాగుంది రోహిణిగారు…………ఆయా క్యారెక్టర్స్ గురించి ఇంకా రాసి ఉంటే బాగుండు…….ఇంకాసేపు చదివే కంటెంట్ ఉంటే బాగుండు అని అనిపించిందండి కథ చదివాక. మీ రచనాశైలి కంటిన్యూస్‌గా చదివించేలా ఉంది………చివరలో కంటతడి పెట్టేలా చేసింది. బాగుంది రోహిణిగారు.

RAMESH
RAMESH
March 6, 2021 10:56 am

కాకథ నీ మీ కథ బాగుంది కథావస్తువు భద్రతకు సంబంధించింది కానీ సాధికారత గురించి ఉంటె

Golla Sreenu
Golla Sreenu
March 9, 2021 4:34 am

Nice title and excellent story madam

Bhaskara Chary Bolloju
Bhaskara Chary Bolloju
March 11, 2021 6:57 am

వాస్తవానికి చాలా దగ్గర లో వుంది చాలా బాగుంది

Meenakshi srinivas
Meenakshi srinivas
March 13, 2021 5:14 pm

కథ చాలా వాస్తవంగా ఉంది. ముగింపు బాగుంది. నిజమే చాలా నాగరీకులు గా కనబడే అనాగరికులు ఉండచ్చు, రౌడీల్లా కనబడే మంచివాళ్ళు ఉండచ్చు.
పైపై వేషం చూసి అపార్ధం చేసుకోకూడదు అన్న ముగింపు బాగుంది. అభినందనలు 🙏🙏

నండూరి సుందరీ నాగమణి
నండూరి సుందరీ నాగమణి
March 14, 2021 5:02 am

చాలా చాలా బాగుంది చెల్లాయ్! అభినందనలు.

Mounika Yalamarthi
Mounika Yalamarthi
April 2, 2021 4:23 am

Don’t judge a book by it’s cover ani chala baga chepparu…we need more and more stories from you..The story was too good..