చీకటి దీపాలు

నేటినిజం పత్రికలో నా కవిత “చీకటిదీపాలు”. బైంసా దేవదాసుగారికి ధన్యవాదాలతో ..

ఒకరికి మోదం
మరొకరికి ఖేదం
వెలుగుతున్న దీపాలు ఆర్పితేనే
ఒకరికి మన:శాంతి
ఇంకా చీకటిలోనే బతకడం ఇష్టం వారికి
ప్రేమను ఆశించడం మూర్కత్వం అయిపోతోందిప్పుడు
పెంచుకునే కుక్కపాటి విలువ చేయకపోయే సాటిమనిషి
కాలకూట విషంకన్నా చేదని షీర్ కుర్మాని
టోపీ గడ్డాలను చీదరించుకునే ద్వేషం ఒకరికి నరనరాల్లో
ఆత్మస్తుతి పరనిందా జీవన విధానమైంది మరొకరిలో
ఆడపిల్ల ఇష్టం మీద ముసుగు వేయడం
మతాధికార దురహంకారం ఎల్లెడలా..
బొట్లు గడ్డాలు ఆనవాలే పట్టలేని
శవాల గుట్టల్లో, సామూహిక దహనంలో
ఊపిరిల్లోకి దూరిన రాక్షసి దురాగతం
ఇంకా మరపుకి రానేలేదు
తలచుకున్నపుడల్లా ఉలికిపాటు ఇంకా తగ్గనేలేదు
అయినా మాకు ద్వేషమే ఇష్టం
పరనిందే పరమాన్నం మాకు
మేము మనుషులను చూడలేము
మతాలనే మా ఊపిరుల్లో నింపుకుని శ్వాసించేవాళ్ళం
ఇంకొకళ్ళ నీడపొడని కూడా మేము భరించలేము
చెట్టుని అలంకరిస్తాం, పుట్టకి పూజ చేస్తాం
నెలవంక కోసం మొరలెత్తుకుని చూస్తాం
మనిషి కనపడితే మాత్రం మనవాడా కాదా అని
గుచ్చిగుచ్చి చూస్తాం, శల్య పరీక్షలు చేస్తాం
కాదని తెలిసాక ద్వేషపు లావాని వెదజల్లుతాం
ఇలాంటప్పుడు
ఏ పండగ వస్తేనేం స్వార్ధాన్ని వీడలేనప్పుడు
ప్రేమని పంచలేనప్పుడు
మానవత్వపు పల్లకి బోయీలమై మంచిని మోస్తూ
మనిషిమనిషికి చేసే ప్రేమ పందేరమే అసలైన పండుగ
అని ఎప్పటికీ తెలుసుకోలేము
చీకటి దీపాలం మేము

Leave a Comment