చిరంజీవే నా మొగుడు

సాయంత్రం కాఫీలు తాగటం అయిందా మిత్రాస్. పొద్దున్నుంచి ఆఫీస్ పనుల్లో అలసట చెంది గూటికి చేరుకుంటున్నారా. కాలచక్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తిప్పి, బుజ్జమ్మ అనే అమ్మాయి నెల్లూరు ట్రంకు రోడ్డు సెంటర్లో ఉన్న న్యూ టాకీసు ( కొత్త హాలు) సినిమా హాల్లో టికెట్ల క్యూలో మిమ్మల్ని ఇప్పుడు నిలబెడుతుంది.💐💐
“చిరంజీవే నా మొగుడు” కథ ఎలాంటి సందేశాలు ఇవ్వదు. హాయిగా నవ్వించి, నెల్లూరు వీధుల్లో మిమ్మల్ని కాసేపు తిప్పుతుంది. “పాలపిట్ట” దీపావళి కథల ప్రత్యేక సంచిక -2023 లో ప్రచురితమైన నా కథ “చిరంజీవే నా మొగుడు” చదవండి. 🌹🌹 అభినందనలు, congratulations అని కామెంట్స్ వద్దు. కథని చదివి మీ అభిప్రాయం తెలుపండి. మీ చిన్ననాటి ఫాంటసీ మొగుడు/పెళ్ళాం గురించి సరదాగా చెప్పండి❤️🌹
శ్రీ గుడిపాటి వెంకట్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో🙏🌹

ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఇంటికి అమ్మిడిగా ఉండే “విజయమహల్” సినిమా హాల్లో తొలి తూరి నేను, పక్కింటి సౌదమ్మ కొడుకు శ్యామయ్య కలిసి “పట్నం వొచ్చిన పతివ్రతలు” సినిమా చూసిన కాడ్నించి నాకు చిరంజీవి అంటే నాకు చానా ఇష్టం, ప్రేమ కలిగినాయి. అబ్బా.. ఆ పెద్ద కళ్ళు, రింగుల జులపాల జుట్టు, ఆ నవ్వులు చిందించే ముఖం, ఆ రంగురంగుల ప్యాంటు , చొక్కాలు. చిరంజీవి ఎంత బాగుండాడని. తొలి తూరి చూసిన సినిమాలోనే ప్రేమలో పడిపోయాను. చిరంజీవి సినిమా బాగాలేదని ఎవురైనా అంటే వోళ్ళని చంపేయాలన్నంత కోపం వస్తాది నాకు.
పొద్దన బళ్ళో అసెంబ్లీ టైంలో ఏసుకున్న గొడవ మధ్యాన్నం అన్నాల వేళకి చిలికి చిలికి గాలివాన అయింది. ఎన్.టి. రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ముసలివాళ్ళు అయిపోయారు. వాళ్ళ తర్వాత వొచ్చిన కృష్ణ, శోభన్ బాబులకు డాన్సు చేయడం రాదు. వాళ్ళిద్దరికన్నాచిన్నవాడు, వాళ్ళ కన్నా అందగాడు, మంచి స్టెప్పులతో డాన్సులు వేసే చిరంజీవే గొప్ప అని నేను, సురేఖ, జ్యోతి, గీత గదమాయించేతలికి, మాతో పోటీ పడలేక, రామారావు అభిమాన సంఘం గ్రూప్లో మిగిలిన సుబ్బలక్ష్మి, కామాక్షి మోకానికి గంటు పెట్టుకోని, మా కాడ్నించి ఎడంగాపోయి కానగ చెట్టు కింద కూర్చున్నారు అన్నం తినేదానికి. నాగేశ్వర రావు అభిమాన సంఘంలో మీనాక్షి ఒక్కటే మిగిలింది. ఆ ఎమ్మి ఒక్కటే ఒంటిమిట్ట రామలింగం లాగా అశోక చెట్టు కింద కూచునింది మమ్మల్ని జూస్తా గొణుక్కుంటా. క్లాసులో మిగిలిన అందరూ చిరంజీవి అభిమాన సంఘంలో చేరేశారు. ఇరవై మందిమి వేపచెట్టు కింద రౌండుగా కూచోని అన్నాలు తినేదానికి క్యారేజీలు ఇప్పినాము.
ఇకన మా జట్టులో చిరంజీవి సినిమాలు, పాటల గురించి తప్ప ఇంకే యాక్టరు సినిమాల గురించి ఎవురు మాట్లాడగూడదని అందురం తీర్మానం జేసుకున్నాం. అది ఇష్టం లేనోళ్ళు జట్టు నించి బయటికి ఎల్లిపోవచ్చు అని సురేఖ అందరికి చెప్పింది. ఆ ఎమ్మి చిరంజీవి అభిమాన సంఘం లీడర్. నేను, గీత కార్యదర్శులమి. మిగతా వారంతా కార్యకర్తలు. అప్పటికప్పుడు ఈ ఎన్నికలు జరిగాయి మా మధ్య అన్నాలు తింటూనే.
“అయినా ఛాలెంజ్ సినిమాలో ‘ఇందువదన కుందరదన’ పాటకి చిరంజీవి డాన్సు ఏసినట్లు ఇంకెవురు ఎయిలేరు” అన్నాది సురేఖ మునక్కాయ నవలతా
” అవునుమె, వాల్ పోస్టర్లలో చూస్తా ఉంటేనే మనకి కూడా డాన్సు చేయాలనిపిస్తా ఉండాది ” అనింది జ్యోతి మొకం ఎలిగిపోయేటట్లు. ఇక చూస్కో.. నాకు ఎప్పుడెప్పుడు “ఛాలెంజ్ “సినిమా చూస్తామా అని ఆతృతగా ఉండాది. ఆ సినిమా “రాధామాధవ” హాల్లో వొచ్చిండాదంట. సాయింకాలం ఎట్టయినా నాయిన్ని కాకా బట్టి ఆ సినిమాకు పోవాలనుకున్నా.
ఇంటిలోకి పోతానే “రా మీ బుజ్జి. నీ కోసరమే చూస్తా ఉండాను. నీకు హైద్రాబాదు నుంచి గౌను, మాక్సీలు, గాజులు తెచ్చాను ” అని నవ్వతా కామేశ్వరక్క ఎదురొచ్చింది.
“ఐ..! హైద్రాబాదు నించి కామేశ్వరక్క, కుమారు బావ వొచ్చారు. ఎతకబోయిన తీగ కాలికితగినట్లు వీళ్ళు సమయానికి నెల్లూరికి వొచ్చారు. ఇకన సినిమాకి పంపీమని నాయన్ని అడగబల్లేదు. అక్కా వాళ్ళతో పోవచ్చు” సంతోషాన్ని ఆపుకోలేక కామేశ్వరక్కను గెట్టిగా కావలించుకున్నాను.
“చెప్పవే బుజ్జీ .. రాత్రికిఏ సినిమాకు పోదాం” అనింది కామేశ్వరక్క నా యవ్వారం తెలిసినదానిమాదిరిగా. కుమారు బావ నోరు తెరిచేలోగానే “ఛాలెంజ్ ” సినిమాకి పోదామక్కా. చిరంజీవి డాన్సులు భలే చేసాడంట. విజయశాంతి, సుహాసిని, సిల్కు స్మిత అందరూ ఉండారు ఆ సినిమాలో. మా ఫ్రెండ్స్ చానా మంది సినిమాని చూసేసారు. వాళ్ళు ముందర చూశామని ఎచ్చులు పోతా ఉండారు. నేను కూడా తొందరగా చూడాలి చిరంజీవి సినిమాని” ” గబగబా జడ ఇప్పుకుంటా అన్నాను.
“మె.. బుజ్జి.. పోయిన తూరి గూడా చిరంజీవి సినిమా ‘గూండా’కే కదా మనం పోయింది. . మీ పిచ్చమ్మ పిన్నమ్మ వాళ్ళు ‘శ్రీవారికి ప్రేమలేఖ’ పోదామని ఇందుకూరుపేట నుంచి వస్తే ఏడ్చి గీ పెట్టి ‘గూండా’ సినిమాకి తీసకపోతివి. ఇప్పుడు ‘శ్రీవారికి ప్రేమలేఖ’ సినిమా కనకమహల్ల్లో ఉండాది. దానికి పోదాం మీ.”
అమ్మ మాట ఇనకుండా అక్కని బతిమాలాను. ” అమ్మా..బుజ్జి చెప్పిన సినిమాకు పోకపోతే ఇకన నా ఒప్ప పీకుతోంది ఈ అమ్మి” అని నవ్వతా కుమారు బావ చాయ చూసింది. ఇక్కడ ఆయన పప్పులు ఏవి ఉడకవని తెలిసి నిలువు గుడ్లేసుకోని “అట్నే” అంటా తలూపినాడు.
***
రెండో ఆటకి రైలు కట్ట అమ్మిడి ఉన్న ‘కృష్ణ, కళ్యాణి, కావేరి’ మూడు మూడు హాళ్ళల్లో కావేరి హాలుకి రెండు రిక్షాల్లో పోయినాము అందురుము. ‘ఇందువదన కుందరదన’ పాటలో చిరంజీవి డాన్సు చూస్తుంటే లేచి పరిగెత్తుకుంటా చిరంజీవి దగ్గరకు పోవాలనిపించింది నాకు. చిరంజీవి పక్కన విజయశాంతి డాన్సు చేస్తా ఉంటే నాకు చానా కుళ్ళు, అసూయ పుట్టినాయి ఆమె మీద. చిరంజీవి పక్కన నేను డాన్సు ఏస్తా ఉన్నట్లు ఊహించుకుంటా ఉండాను. బడిలో ఇక పదిరోజులు ‘ఛాలంజ్’ సినిమా గురించి, పాటల గురించే మా మాటలు.
ముడ్నెల్ల పరీక్షలు మొదలైనాయి. ఆ టైంలోనే చిరంజీవి ‘నాగు’ సినిమా సుందర్ డీలక్సు హల్లో వొచ్చిండాది. ఎప్పుడెప్పుడు పరీక్షలు అయిపోతాయా, ఎప్పుడెప్పుడు ‘నాగు’ సినిమాకు పోదామా అని చూస్తా ఉండాం మేమంతా. పది రోజులు నత్తతో పోటీ పెట్టుకున్నట్లు అతి భారంగా గడిచాయి. సోషల్ పరీక్ష అయిపోయింది. మూడునెలల బడి సెలవలు పది రోజులు. కానీ అప్పుటికే సుందర్ డీలక్సులో ‘నాగు’ సినిమా మారిపోయి వేరే సినిమా ఆడతావుండాది . ‘నాగు’ సినిమా మణీ టాకీసుకు పోయిందట. ఆ సినిమా హాలు ఇంటికి చానా దూరం. చిరంజీవి సినిమా చూసేద్దెట్టా అని దిగులు జాస్తి అయినాది నాకు. చిరంజీవి సినిమా చూసేదానికి లేకుండా అడ్డమొచ్చిన పరీక్షలను బాగా తిట్టుకున్నా.
సురేఖ, జ్యోతి కూడా దిగులు పడినారు ఆ సినిమా చూడలేదని. అందరం కలిసి మధ్యాన్నం మూడు గంటలప్పుడు అమ్మను బతిమాలి, రంగనాయకుల పేట మొదుట్లో ‘వినాయక మహల్’ పక్కన ఉన్న ఖాళీ తావులో వొచ్చున్న ‘జెమినీ సర్కస్’ చూసేదానికి పోయినాము. ఫ్రెండ్సు అందరమూ గ్యాలరీలో బల్లపీటల మీద కూర్చున్నాం.పులులు, సింహాలు, తళుకుల గుడ్డలేసుకున్న అమ్మాయిలు, గ్లోబులో స్కూటర్లో అడ్డంగా తిరిగిన మనిషి, ఏనుగులు, కోతులు, జోకర్ మాటలు..ఉహు..ఏమి చూస్తున్నా నా బుర్ర మాత్రం ‘నాగు’ సినిమా మీదే ఉండాది. సర్కస్ సాయంత్రం ఆరు గంటలకు అయిపోయింది. చూసినంత సేపు చూసి బైటకు రాంగానే మళ్ళీ ‘నాగు సినిమా చూడలేదని గావనానికి తెచ్చుకున్నాం అందరము. కాళ్ళీడ్చుకుంట దిగాలుగా సుబేదారు పేట తట్టుకు వచ్చి, ఆడనుంచి తిక్కన టెలిఫోన్ భవనం మీదుగా వొచ్చి, రైలుకట్ట దాటి ఎవురింటి దారి వాళ్ళం పట్టినాం.
ఇంటిముందర కొస్తానే సందుగోడ తట్టు చూసి నా కళ్ళకు నేను నమ్మలేక పోయినాను. సందుగోడ లోపలిపక్క నాటిన రెండు పొడుగాటి కొయ్య గుంజలకు ‘నాగు’ సినిమా కటౌట్ కట్టి ఉండాది. ఎరుపురంగు తళుకుల చొక్కా, నల్లగా దగ దగలాడే ప్యాంటుతో స్టయిలుగా చిరంజీవి, పక్కనే బులుగు రంగు తళుకుల గౌనులో రాధా బొమ్మలు మెరిసిపోతా ఉండాయి. ‘ఇది కల, నిజమా’ అనుకోని చేతిమీద గిల్లుకున్నాను. నొప్పి పుట్టి “అబ్బా” అనుకోని ఒక్కఊపులో ఇంట్లోకి లాగెత్తినా హుషారుగా.
శ్రీనివాస మహల్ వాళ్ళు నాయన ని అడిగి అక్కడ కటౌట్ పెట్టిపోయారట. ‘నాగు’ సినిమాకు మేము ఎప్పుడైనా పోవచ్చు అని ఫ్రీ పాస్ కూడా ఇచ్చారట. ఇంట్లోకి పోతానే నాయన చెప్పినాడు. నేను ఎగిరి గంతేసినాను. అంతకు మించిన అదృష్టం ఏముండాది నాకు ఇక అని మురిసిపోయినాను. ఇక చూస్కో. సెలవలు పది రోజుల్లో ఆరు రోజులు, ఆరు సార్లు నాగు సినిమా చూసినాను . రెండు తూర్లు సురేఖ, గీతలకి గూడా ఫ్రీ పాసు ఇచ్చాను, వోళ్ళు గూడా ‘నాగు’ సినిమా చూసేదానికి. శ్రీనివాసమహల్ వాళ్ళు కటౌట్ పెట్టారని తెలిసి, ఆ హాలుకి ఏదాళంగా ఉండే న్యూ టాకీసు వాళ్ళు, అదేలే కొత్తహాలు వోళ్ళు గూడా సినిమా కటౌట్ పెట్టుకుంటామని నాయన్ని బతిమాలితే నాయిన సరే అన్నాడు. సందు తట్టు శ్రీనివాసమహల్ వాళ్ళ కటౌట్ పక్కనే కొత్తహాలు వాళ్ళ కటౌట్ పెట్టారు. వాళ్ళు కూడా ఫ్రీ పాసులు ఇచ్చారు. రెండు సినిమా హాళ్ల కటౌట్లు మా సందు తట్టు పెట్టేతలికి ఇక మేము సినిమాలు అన్నీ ఫ్రీ పాసుతోనే చూడొచ్చు అని స్వర్గమే దిగి నా కళ్ళముందుకు వచ్చినట్లు సంబరపడ్డాను నేను.
ఇక వరస పెట్టి ‘రుస్తుం, చట్టంతో పోరాటం, దొంగ, జ్వాలా, పులి’ వొచ్చిన చిరంజీవి సినిమానల్లా ఫ్రీ పాసులతో చూసేసినాను. చిరంజీవి మీద ప్రాణం పెరిగిపోతా ఉండాది. చిరంజీవితో కలిసి డాన్సులు వేసే రాధా, రాధికా, సుహాసిని, మాధవి, విజయశాంతి అంటే కోపం కూడా పెరిగిపోతా ఉండాది. చిరంజీవితో కలిసి నటించే వాళ్ళ అదృష్టానికి అసూయతో కుళ్ళుకుంటా ఉండాను. చిరంజీవి మూడు సినిమాలు, ఆరు పాటలతో రెండేళ్లు చిరంజీవి డాన్సుల్లో వేసే స్టెప్పుల కంటే వేగంగా గడిచిపోయినాయి.
ఏడవ తరగతి సంవత్సర పరీక్షలు అయిపోనాయి. ఎనిమిదో తరగతికి వొచ్చినాము. ” పెద్ద దానివి అవతావుండావు. ఇకన సినిమాలు తగ్గిచ్చి చదువు మీద శ్రద్ధ పెట్టు” అంటా అమ్మ గట్టిగా గదమాయించింది.
ఆ..అమ్మ మాట ఎవరింటారని. చిరంజీవి సినిమా వస్తే అమ్మని ఎట్టా కాకా పట్టాలా అని ఆలోచిస్తా ఉండాను. ఇంటికి ఎదాళంగా ‘నాయిరు’టీ బంకు పక్కనే ఉండే బూచోడు తాత చిల్లరంగట్లో సినిమా పాటల పుస్తకాలు తెచ్చి పెట్టాడు. చిరంజీవి సినిమా పాటల పుస్తకాలన్నీ కొనేసాను. బడి పుస్తకాల పేజీల మధ్యలో పాటల పుస్తకాలు పెట్టేసాను. ఎంత బట్టీ పట్టినా ఎక్కాలు రావడంలేదు కానీ, చిరంజీవి సినిమాల్లో పాటలు మాత్రం కంఠతా వచ్చేసాయి. నిద్దర్లో లేపి అడిగినా ‘దొంగ దొంగ..ముద్దుల దొంగ..దోచాడే బుగ్గ..కోశాడే మొగ్గ, కాష్మోరా కౌగిలిస్తే ఏం చేస్తావో, కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ..కొండెక్కి చూసింది చందమామ, అందగెత్తె అటకేమో వందనాలు, హా..ఆటకొచ్చి ఊగినోళ్ళ తందనాలు..’ మొత్తం పాటలు గుక్కతిప్పుకోకండా పాడేదానికి నోటికి వొచ్చేసాయి.
మొదటి యూనిట్ టెస్టు పరీక్షలు అయిపోయినాయి. ‘పసివాడి ప్రాణం’ అర్చన ఏ.సి. లో వచ్చి అప్పుడే రెండు రోజులైంది. అంతకు ముందు ఆ తావులో రంగమహలు, శేష మహలు అని రెండు హాళ్ళు ఉండేవి. అవి పడగొట్టి ‘ అర్చన’ హాలుని మోడరన్ గా కట్టినారు. అది అక్కడ కనీసం నెల రోజులు ఆడితే కానీ శ్రీనివాస మహల్ కి రాదు. ఈ లోగానే సినిమా చూడాలి. అమ్మని అడిగితే “రవ్వంత అగుమే.. ఆ సినిమా శ్రీనివాస మహలుకు వస్తుంది. అప్పుడు ఫ్రీ పాసుతో పోదువుగానీలే” అనింది. అయినా సరే అర్చన హాల్లోనే ఆ సినిమా చూడాలి. ఎట్టా అని అలోచించి , రెండు రోజులు అమ్మకి పప్పు రుబ్బిచ్చి, వంటలో సాయం చేసి, నాయనకి అల్మారాలో గుడ్డలు సర్ది, చినిగిపోయిన పడకుర్చీని దబ్బనం తో కుట్టిచ్చి, రకరకాలుగా వాళ్ళిద్దరినీ కాకా పడితే ఆదివారం సినిమాకి పోయేదానికి ఒప్పుకున్నారు.
ఇంక రెండు రోజులు సినిమాకి ఎప్పుడు పోవాలి, ఏ రంగు పావడ, జాకెట్టు ఏసుకోవాలి, సినిమాలో ఇంటర్వెల్లో తినిదానికి ఏం కొనుక్కోవాలి ఇవే మాటలు క్లాసులో. ఆదివారం సినిమాకి పోయేదానికి పన్నెండు మందిమి రెడీగా ఉండాము. మ్యాట్నీఆటకి పోవాలని అందరం అనుకునేసాం. రెండు రోజులు నిద్దర పట్టలేదు నాకు.
ఆదివారం పొద్దన ఐదు గంటలకే మెలకువొచ్చేసింది. ‘ఇంకా తెలవారదేమి..ఈ చీకటి విడిపోదేమి’ అనే పాటలో మాదిరిగా, వెలుతురింకా రాలేదని చీకటిని తిట్టుకుంటా లేచాను. అప్పటికే అమ్మ లేచేసి ఉండాది. పొలం కాడికి అన్నం ఎత్తుకుపోవాలని నాయన కోసం వంట చేస్తా ఉంది. గోపాల్ పళ్ళపొడితో పళ్ళు సుబ్బరంగా తోముకొని, స్నానం చేసేసి మెరూన్ రంగు పావడా, జాకెట్టు వేసుకుని రెడీ అయిపొయాను.
నాయన నన్ను చూసి నవ్వతా “బుజ్జా .. !చదువుకోవడానికి ఒక్క దినం కూడా ఈ మాదిరి లేచింది లే నువ్వు. సినిమా అనేతలికి ఇంత చీకట్లోనే లేచేసినావే. ఇదిగో సినిమా టిక్కెట్టుకి, హాల్లో పాపకారు కొనుక్కునేదానికి” అంటా పదిరూపాయలు నా చేతిలో పెట్టి, అన్నం క్యారేజి, యూరియా సంచులు తీసుకొని పొగడదొరువు కండ్రిగకు పోయినాడు.
“మ్యాట్నీ కి పోయేదానికి ఇప్పటినుంచే రెడీ అయి ఏం చేస్తావు మీ. కాసేపు పుస్తకం తీసి చదువుకోగూడదా” అంటా అమ్మ జడ ఇప్పింది. ” మో..ఈ రోజు జడ నేనే ఏసుకుంటా అని కొయ్య బీరువాకి ఉన్న అద్దం కాడికి పరిగెత్తి పోయినా. జుట్టు దువ్వుకొని జడేసుకోకుండా “సుగుణా ఫ్యాన్సీ స్టోర్” లో కొన్న ఎర్రరంగు తళుకులు కుట్టిండే మెరును రంగు రబ్బర్ బ్యాండు వేసుకుని జుట్టుని వదిలేసా. రెండు పక్క పిన్నీసులు కూడా జుట్టుకి పెట్టుకున్నా. ” దొరసాని మాదిరిగా కొత్తగా ఉండాది బుజ్జి ఈ రోజు” అంటా వొచ్చింది కాక్క.
అమ్మ పోసిచ్చిన రవ్వ దోశలు తినేసి, ఇంట్లోకి, బయటకి తిరగతా ఉండాను కాలుగాలిన పిల్లిమాదిరిగా. గోడ గడియారం తట్టు తేప తేప కి చూస్తా ఉంటే మనుబోలు నుంచి వొచ్చిన మా కాక్క సినిమా హాల్లో తినమని తపిల రొట్టెలు, నిప్పట్లు పొట్లం కట్టి ఇచ్చింది. హాలు దగ్గిర పాపకారు, సోమాసాలు కొనుక్కుంటాం కదా కాక్క” అంటా అయిష్టంగానే పొట్లం తీసుకున్నాను. గెంట పది కొట్టింది అలారం. సురేఖ, గీత రెడీ అయి ఇంటికొచ్చారు. ఇంకో పది నిమిషాలకి జ్యోతి, హేమమాలిని వొచ్చారు. ఆదివారం, అందునా చిరంజీవి సినిమా. ముందుగా పోకపోతే టిక్కెట్లు దొరకవని, అమ్మకి చెప్పేసి అందరం రైలు కట్ట దాటి, బృందావనం కాడ కవిత వాళ్ళ ఇంటికి పోయి కవిత, సుధామణి వాళ్ళని కూడా తీసుకుని, కనకమహల్ సెంటర్ తట్టు నుంచి ‘అర్చన’ హాలు కాడికి పోయినాము.
హాలు దగ్గర ఇసకేస్తే రాలనంత మంది జనం ఉండారు. మ్యాట్నీ అట రెండు గంటలకు మొదలవుతుంది. పదకండు గంటలకే హాలు బయట వరకు రెండువరసల్లో జనం నిలబడుకోనుండారు.క్యూ లైను చాంతాడంత పొడవుగా టికెట్ కౌంటర్ కాడి నించి, వీధిలోదాకా ఉండాది. అంత మందిని చూసేతలికి అసలు టిక్కట్లు దొరకతాయో లేదో అని భయము వేసింది మాకు.
హేమమాలిని, సుధామణి, కవిత క్యూ లో నిలబడలేము అని ఆ జనాల మధ్యలోనే సైకిళ్ళు పెట్టే కాడ కూర్చునేసారు. సురేఖ, గీత, నేను క్యూ లో నిలబడుకున్నాం. ఒక మనిషికి ఒక టికెట్టే ఇస్తున్నారట. మా ముగ్గరకి మూడు టిక్కట్లు వస్తాయి. వాళ్ళని పిలుద్దామంటే దూరంగా కూర్చొనుండారు. మిగతా ఫ్రెండులు వచ్చి వెనక వరసలో నిలబడుకోనుండారు. వీళ్ళ ముగ్గరకి టిక్కెట్లు ఎట్ట తీయాలో అర్ధం కాలేదు మాకు.
క్యూ లో నిలబడి నిలబడి కాళ్ళు నొప్పులు పుడతా ఉండాయి. ఒక పక్క ఎండకి తలకాయ మాడిపోతా ఉండాది. ఇంకో పక్క జనాల అరుపులు, చెమట. ముందోళ్లు ఎనక్కి, యనకోళ్ళు ముందుకి తోస్తా ఇగ్గూ మగ్గూ జేస్తా ఉండారు. ఇంకాసేపు నిలబడితే కళ్ళుతిరిగేటట్టు అనిపిస్తా ఉండాది నాకు. అంతసేపు అవస్థ పడతా నిలబడుకొనుంటే , ఒంటిగంటకు టికెట్ కౌంటర్ తెరిచారు. జనం తోసుకుంటా, తొక్కుకుంటా కౌంటర్ కాడికి పరిగిస్తున్నారు. నేను, నా ఎనక సురేఖ, జ్యోతి వరసగా నిలబడుకోనుండాము. జనాలు తోసుకుంటా వొచ్చేతలికి, మేము కౌంటర్ కాడికి చేరాము.
టికెట్ కౌంటర్ లో చేయి పెట్టి “రెండు టిక్కట్లు “అన్నాను. లోపల ఉండే ఆయన ఒక టికెట్ ఇచ్చి, మిగతా డబ్బులు ఇచ్చేసాడు. ఇంకో టికెట్ ఎట్ట సంపాదించాలి..? క్షణాల్లో ఒక ఆలోచన వొచ్చింది నాకు. టికెట్ కౌంటర్ లో వుండే ఆయనకి మా ముఖం సరిగా అవపడ్డంలేదు. ముఖాలు చూసేంత సందుకూడా ఆయనకి లేదు. నేను గబగబా నా కుడి చేతిలో ఉండే ఎర్ర గాజులు తీసేసి, మొండి చేయి కౌంటర్లోకి పెట్టి, గొంతు మార్చి ” అన్నా..ఓ టికెట్” అని డబ్బులు ఇచ్చాను. ఇందాక గాజుల చేయి, ఇప్పుడు గాజులు లేని చేయి వేరే వాళ్ళు అనుకుని అతను టికెట్ ఇచ్చేసాడు నాకు. అమ్మయ్య రెండు టిక్కట్లు సంపాదించాను అని ఆనందంతో గంతేసి, సురేఖ, గీతకి కూడా గొంతు మార్చి అడగమని ఉపాయం చెప్పాను. వాళ్ళు గూడా నేను చెప్పినట్లు చేసి టిక్కట్లు ఇచ్చే ఆయన్ని ఏమార్చిఎట్టనో టిక్కట్లు సంపాదించారు. టిక్కట్లు దొరికిన విజయ గర్వంతో హాల్లోకి పోయి కూర్చున్నాం.
‘కాశ్మీరు లోయలో కన్యా కుమారిలో ఓ చందమామ’ నిద్దరల్లో గూడా ఆ పాటే కలవరింత. విజయశాంతిని తల్చుకుంటే మాత్రం కోపం, అసూయా. నెల రోజుల తర్వాత పసివాడి ప్రాణం సినిమా శ్రీనివాస మహల్లోకి వచ్చింది. ఇక రోజు నాకు పండగే. ఆ సినిమాకి ఫ్రీ పాసుతో చానా తూర్లు పోయినాను.
నాలుగో పీరియడ్ గంట కొట్టగానే అన్నం డబ్బాలు తీసుకొని అందరం ఏపచెట్టు కింద కూర్చున్నాం. పసివాడి ప్రాణంలో చిరంజీవి యాక్టింగ్ గురించి, పాటల గురించి ఎంత చెప్పుకున్న మాకు తనివి తీరడం లేదు.
“చిరంజీవి అంటే నాకు ప్రాణం ” అనింది సురేఖ.
“ప్రాణం అంటే ఏంది మీ. చిరంజీవిని పెళ్లి చేసుకుంటావా” నవ్వతా అడిగింది జ్యోతి.
“అబ్బే..అట్టా కాదు మీ. చిరంజీవి అంటే చాల ఇష్టం. అయన ఫ్యాన్ నేను” అనింది సురేఖ సిగ్గుపడతా.
“ఏమీ..జ్యోతి నువ్వు గానీ చిరంజీవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా” అనింది గీత.
“చిరంజీవి అంటే నాకు చాల ఇష్టం. కానీ ఆయన నాకు అన్నతో సమానం” అనింది జ్యోతి భక్తిగా కళ్ళు మూసుకుంటా.
“మీరాపండి మీ. చిరంజీవిని నేను పెళ్లి చేసుకుంటాను. చిరంజీవి అంటే నాకు ప్రాణంతో సమానం. చానా ఇష్టం. మీరెవురు నాకు పోటీకి రాడానికి లేదు ” అన్నాను బింకంగా.
” చిరంజీవికి పెళ్లి అయిపోయింది తెలుసా మీ నీకు. వాళ్ళ భార్య పేరు సురేఖ ” అనింది హేమమాలిని
సురేఖ కాస్త గర్వంగా నావైపు చూసింది.
“అయితే ఏంటంట..ఎంత మంది దేవుళ్ళకి ఇద్దరు భార్యలు లేరు. నేను కూడా పెద్దైనాక మద్రాసుకి పోయి, నన్ను కూడా పెళ్లి చేసుకోమని చిరంజీవిని బతిమాలుకుంటానులే” బుంగమూతి పెట్టాను.
“మీ అటు చూడండి. పేము బెత్తం పట్టుకోని రూతమ్మ టీచర్ మన చాయకి వస్తా ఉండాది. చిరంజీవి మాటల్లోబడి లోపలి గంట కొట్టింది కూడా ఇనకుండా మనమీడ యవ్వారాలు జేస్తా ఉన్నాం, రూతమ్మ టీచర్ చేతికి గాని చిక్కినామంటే మనకందరికీ ఈడ్నే పేము బెత్తంతో పెళ్ళిచేస్తుంది” అనింది సుధామణి వణకతా.
దూరంనుంచి రూతమ్మ టీచర్ రొప్పతా,రోజుతా మా తట్టుకు వస్తా ఉండాది, అదలా బదలా గెడ కర్రంత పొడుగున్న బెత్తం ఊపుకుంటా. లెక్కల పీరియడ్ లో పన్నెండో ఎక్కం ఒప్పజెప్పించుకుంటానని రూతమ్మ టీచర్ అనడం గావనానికొచ్చింది. పైప్రాణాలు పైనే పోయినాయి మాకు. అంతే. తుపాకీ శబ్దానికి చెట్టు మీది పక్షులు ఎగిరిపోయినట్లు, చెట్టు కింద ఉన్న మేము ఎనక్కి చూడకుండా క్లాసులోకి లగెత్తినాము.
“మీ పాసుగాల..ఆగండీమె” అంటా మా ఎనకే లగెత్తుకొస్తా ఉండాది రూతమ్మ టీచర్ కర్ర ఊపుకుంటా.