RAM…. Online Magazine లో ప్రచురితమైన కథ “గిఫ్ట్” తప్పకుండా చదవండి. మీ అనుభవాలు ఇక్కడ కామెంట్స్ లో తెలుపండి. మహిళా దినోత్సవ శభాకాంక్షలు. Sudhama Avr సర్ కి కృతజ్ఞతలు




మార్చి నెల. సాయంత్రం నాలుగయింది. పొద్దునంతా కాచిన ఎండ అలిసిపోయి, మెత్తబడి కాస్త తెరిపి ఇచ్చింది. ఇంటికి అర్ధకిలోమీటర్ దూరంలో ఉన్న వాకర్స్ పార్కు కి బయలుదేరాడు జగదీష్. అతను వెళ్ళేసరికే బెంచి మీద కూర్చుని ఎదురుచూస్తూ ఉన్నాడు మహేశ్వర్. బ్యాంకు లో పని చేసి ఇటీవలే రిటైర్ అయినారు. ఇద్దరూ మంచి స్నేహితులు. పని చేసినంత కాలం ఒక్కచోట స్థిమితంగా కాళ్ళు నిలవని ఉరుకులుపరుగుల బతుకు పోరాటం. జీవితంలోని ఎన్నో వసంతాలు, శిశిరాలు చూసినవారు. మధ్యవయసు శిఖరాగ్రం ఎక్కేసి, ఇప్పుడు పడమటి సంధ్య వైపు చూపులు సారిస్తూ ఉన్నారు. “రారా జగదీష్. ఈ రోజు వాకింగ్ త్వరగా ముగించుకుని, షాపింగ్ చేయాలి. అందుకు నువ్వు సాయం చేయాలి” మహేశ్వర్ ముఖంలో ఉత్సాహం. “ఏమిటోయ్ అంత ఉల్లాసంగా ఉన్నావు. ఇప్పుడు షాపింగ్ దేనికి?” జగదీష్
“మీ చెల్లెమ్మకి చీర కొనాలి” మహేశ్వర్.
“దగ్గరలో పండగలు ఏమి లేవే..!” జగదీష్ సందేహం.
“అంతకంటే ముఖ్యమైంది ఉంది” మహేశ్వర్ మాటకి తలూపుతూ, “నాకు తెలిసిపోయిందిలే. చెల్లెమ్మ పుట్టిన రోజు ఉంది కదా” చీకట్లోకి సరదాగా ఓ రాయి విసిరినట్లు, తన అంచనా తప్పదనే నమ్మకంతో చూసాడు జగదీష్. “లేదోయ్ జగ్గూ. నువ్వు పప్పులో కాలేశావు. పుట్టిన రోజు, పెళ్ళి రోజు, వీటన్నింటికన్నా అతిముఖ్యమైనది ఉంది” మహేశ్వర్ అన్నాడు.
అబ్బా..నీ సస్పెన్సు తో నన్నుచంపుతున్నావు. ఆ ముఖ్యమైన రోజు ఏమిటో నువ్వే చెప్పరా మహి..!”మురిపం ఎక్కువైనప్పుడు జగ్గూ, మహి అని పిలుచుకోవడం వాళ్ళకు సరదా. “మీ చెల్లెమ్మకే కాదు జగ్గూ, మహిళామణులు అందరికీ పండగే. ఈ నెల 8 వ తేదీ “అంతర్జాతీయ మహిళా దినోత్సవం” ఉంది కదా. అందుకోసం మీ చెల్లికి గిఫ్ట్ గా చీర కొనాలి. అందుకే ఈ రోజు నడక వద్దు. ఏకంగా షాపింగ్ కి వెళ్ళిపోదాము” అన్నాడు మహేశ్వర్ బెంచి పైనుండి లేస్తూ.
“నీ మాటలు భలే విచిత్రంగా ఉన్నాయి మహేశ్వర్. ఇదేమైనా ఇంటి పండుగనా లేక మన సంప్రదాయ తెలుగు పండుగనా కొత్త బట్టలు వేసుకోవడానికి” అయినా ఇంట్లో ఆడవారి కోసం నువ్వు షాపింగ్ చేయడం ఏంటి? సిల్లీగా అన్నట్లు ఉన్నాయి జగదీష్ చూపులు. “నువ్వన్నట్లు ఇది సాంప్రదాయిక తెలుగువారి పండుగ కాకపోవచ్చు. విదేశాల నుంచి దిగుమతి అయిన వాలెంటైన్స్ డే, హాలోవీన్, థాంక్స్ గివింగ్ డే లాంటిదే కావచ్చు ఈ ఉమెన్స్ డే. కానీ ఎన్నో ఏళ్ళ నుంచి మనదేశంలో కూడా మహిళా దినోత్సవం జరుపుతున్నారు కదా” మహేశ్వర్ అనగానే, “హా..ఉమెన్స్ డే అంటే ఏదో బయట ఆఫీసులలో మహిళలు ఏవో కొన్ని పోటీలు జరుపుకుని, గవర్నమెంట్, ప్రైవేట్ సంస్థల చేత బహుమతులు, సన్మానాలు జరిపించుకుంటారు. తామేదో పెద్ద విజయాలు సాధించినట్లు ఫోజులు కొడతారు. అంతే కదా. దానికి ప్రత్యేకంగా నువ్వు చెల్లెమ్మ కోసం షాపింగ్ చేయడం నవ్వులాటగా ఉంది” ఎగతాళిగా అన్నాడు జగదీష్ .
“నీకు నవ్వులాటగా ఎందుకుందో నాకు తెలియదు కానీ జగ్గూ. ఈ విషయంలో నీది పొరపాటు ఆలోచన. మీ చెల్లెమ్మనే తీసుకో. తాను కూడా బ్యాంకు ఉద్యోగి. నాతో సమానంగా కాదు, నాకంటే ఎక్కువ క్యాడర్ లో ఆఫీసర్. నాకంటే ఎక్కువ శాలరీ తీసుకుంటుంది. ఇంకా ఐదేళ్ళ సర్వీస్ ఉంది తనకు. అయినా తను ఏనాడు నన్ను చిన్నచూపు చూడలేదు. క్షణం తీరిక లేకుండా అంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, తను ఏనాడు నన్ను, పిల్లలను నిర్లక్ష్యం చేయలేదు. మా ఇంటిల్లిపాది అవసరాలన్నీ తనకి మాత్రమే తెలుసు. ఎవరికి ఏం కావాలో అన్ని సమయానికి అమర్చిపెడుతుంది. ఒక్కరోజు తను ఇంట్లో లేకుంటే నాకు దిక్కు తోచదు. అటు బ్యాంకులో అనితర సాధ్యమైన సేవలు అందిస్తూ ఈయేటి ఉత్తమ ఆఫీసర్ గా మహిళా దినోత్సవం రోజు తను అవార్డు అందుకోబోతోంది. జాబ్ లో ఉన్నప్పుడు నేను తనని సరిగా పట్టించుకోలేదు. ఇప్పుడైనా తనకి కాస్త విశ్రాంతి ఇవ్వాలి. ఇంటిపనుల్లో తనకి సాయం చేయాలి. అక్కడ మహిళా దినోత్సవ సభలో వందల, వేల మంది సమక్షంలో గవర్నర్ చేతుల మీదుగా తను అవార్డు అందుకోబోతుంటే, తనకోసం గొప్పగా ఏమి చేయలేని నేను కనీసం తనకి ఓ చీర అయినా కొనిపెట్టడం నాకు చాల ఆనందం కలిగిస్తుంది.
పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వబన్లేదు .చేసిన కూర కమ్మగా ఉందనో, కట్టుకున్న చీర బాగుందనో మెచ్చుకుంటే సంతోషపడిపోతారు మగువలు. కొండంత ప్రేమ చూపిస్తారు. చిన్న చిన్న ఆనందాలే కదా జగ్గూ జీవితాన్ని వెలిగించేది. ఆలోచించి చూడు” జగదీష్ భుజం తడుతూ అన్నాడు మహేశ్వర్. ఇక ఎదురుమాట చెప్పలేకపోయాడు జగదీష్ మౌనంగా పార్కు బయటకు నడిచారు. అటుగా వెళుతున్న ఆటోని పిలిచి, ఎక్కి కూర్చున్నారు.
షాపింగ్ మాల్ కి వెళ్ళి చాల చీరలు చూసి, జగదీష్ సాయం తీసుకుని, చివరకి తన భార్య వసుధ కోసం చిలకాకు పచ్చ, ఎరుపు రంగు అంచుల పట్టుచీర, నీలం రంగు చీరకు గులాబీ రంగు అంచులు ఉన్న లెనిన్ కాటన్ చీర కొన్నాడు మహేశ్వర్. బిల్లు కట్టేసి ఆటోలో పార్కు దాకా వచ్చి దిగేసారు. చీరలు పెట్టిన బ్యాగుని తీసుకుని, ఆ చీరలు చూసి భార్య వసుధ కళ్ళల్లో కనపడే మెరుపులు, తనపై కురిపించే ప్రేమను తల్చుకుంటూ ఉత్సాహంగా అటువైపు నడక ప్రారంభించాడు మహేశ్వర్.
ఇటు వైపు అడుగులు భారంగా పడుతున్నాయి జగదీష్ కి. మనసులో ఏదో చెప్పలేని అలజడి. మెల్లగా మొదలై, తుఫానులా కమ్ముకుంటోంది గుండెల్లో తెలియని అశాంతి. ఒంట్లోని శక్తి అంతా ఉడిగిపోయినట్లు అడుగులో అడుగు వేస్తున్నాడు. హఠాత్తుగా తన భార్య ‘అవని’ గుర్తుకు వచ్చింది. తమ పెళ్ళై ముప్పై వసంతాలు గడిచిపోయినా, ఇంతవరకు ఏనాడు తనకి ఒక్కటంటే ఒక్క చీర కొని ఎరగడు. పుట్టింటివాళ్ళు ఇచ్చినవో, బంధువుల పెళ్ళిళ్ళలో పెట్టిన చీరలో కట్టుకుంటుంది. తనకోసం చీరలు కొనమని నోరుతెరచి ఒక్కసారి కూడా అడగలేదు. చీర సంగతి అటుంచితే పది రూపాయలు పెట్టి ఇంత మల్లెపూల దండ అయినా కొనివ్వలేదు తను. పైగా ప్రతి పనికి వంకలు పెట్టడం, ఛీత్కారాలు, చీదరింపులు. ‘ఉద్యోగం పురుష లక్షణం, వంట, ఇంటిపని, పడక గది ఇవి మూడే ఆడదానికి’ అని మగాడిననే అహం భావంతో తనని నిర్లక్ష్యం చేసాడు. అయినా తను ఏనాడు ఎదురుచెప్పలేదు. “అవని” అని పేరు
పెట్టుకున్నందుకేమో, భూదేవంత సహనంగా సంసారాన్ని తీర్చి దిద్దుకుంది. చిన్నప్పటి నుంచి పిల్లల చదువులు కూడా తను పట్టించుకోలేదు. ఫీజులు కట్టడమే తన వంతు. వాళ్ళ చదువులు, మంచి, చెడులు అన్నీ తనే చూసుకుంది. బిడ్డలను ప్రయోజకులను చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా, ఇల్లు, అత్తమామలు, పిల్లలు, తనని చూసుకోవడానికి తన కెరీర్ వదులుకుంది. మా అందరి సంతోషమే తన ఆనందం అనుకుంది.
అంత త్యాగం చేసినా తనకి నేను ఇచ్చింది ఏమిటి? చిరాకు, కోపం. నిర్లక్ష్యం. చనువు ఇస్తే ఎక్కడ నెత్తికి ఎక్కుతుందో అనే పిచ్చి భ్రమలో ఇంతకాలం తను మగ్గిపోయాడు.
జగదీష్ మనసులో అంతర్మధనం. ఒక్కొక్కటిగా తొలగిపోతున్న అహపు పొరలు. ఈ రోజు మహేశ్వర్ , తను కలవకుంటే, జీవితాంతం తను అశాంతితోనే గడిపేవాడు. ఆప్త మిత్రుడు మహేశ్వర్ కి మనసులోనే కృతఙ్ఞతలు తెలుపుకున్నాడు. చౌరస్తా దగ్గరకు రాగానే “తాజా తాజా మల్లెపూల దండాలు బిడ్డా. పొద్దుగాల తెంపి, ఇప్పుడే కట్టిన. మస్తు వాసనతో గుప్పు గుప్పు మంటూండే. మూర ముప్పై రూపాయలే, సలీసు బిడ్డా. ఓ మూర తీస్కపోరాదు..! ఇంటిఆడది ఖుషీ అయితది.” మంచి బేరం అయివుంటుందని ముసలవ్వ కళ్ళల్లో ఆశ తనని చూడగానే. మొదటిసారిగా తన చేతుల్లో మల్లెపూలు చూసి, ‘అవని’ ఏమంటుందో అని ఊహించుకుంటూ, తేలికైన మనసుతో ఉక్కిరిబిక్కిరి అవుతూ ముందుకు కదిలాడు జగదీష్ అవ్వ దగ్గర పూలు కొనడానికి.
రోహిణి వంజారి
9000593630