కటిక నిజం

నమస్తే ఫ్రెండ్స్, అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. కష్టాలు ఇప్పటివి కాదు. ప్రతి ఏడాది నేల తల్లిని కన్నతల్లిగా దుక్కి దున్నడం మొదలు పంట చేతికి వచ్చేవరకు కంటిమీద కునుకు లేకుండా కష్టపడతాడు రైతు. పంట చేతికి వచ్చేలోపు ఎన్నోన్నో కష్టాలు, నష్టాలు చవిచూసినా నేలతల్లిని మాత్రం వదిలివేయడు. అటువంటి రైతుల కోసం చట్టాలలో ఎన్నెన్నో మార్పులు వస్తున్నాయి. వాటివల్ల రైతులకు ఎలాంటి లాభాలు ఉన్నాయో సరిగా చెప్పలేము. కానీ ఓ సగటు మధ్యతరగతి రైతు ఎంతో ఆశతో, ఎన్నో కోరికలతో తనపంటను వేసి, ఎన్ని వెతలకు గురౌతాడో ప్రత్యక్షముగా గమనించిన తర్వాత నేను ఈ కథ “కటిక నిజం” రాయడం జరిగింది. ఈ కథను “సృజనప్రియ” మాసపత్రిక జనవరి 2021 పత్రికలో ప్రచురించారు. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా..

గెనిమ్మీద ముందు సత్యం నడుస్తుంటే అతని వెనుకనే పాలేరు రమణయ్య నడుస్తా ఉన్నాడు. “రమణయ్య.. ఈ తూరి రెండెకరాలకూ వరిపంట ఏద్దాం.” అన్నాడు సత్యం తన కయ్యలను చూసుకుంటా నడుస్తూ..
“అట్నే సామీ. తొలకర్లు కూడా పడినాయి కదా.. ఇక తొందరగా దుక్కి దున్నడం మొదలుపెట్టేద్దాం. ఇప్పటికే కల్లు శాంతమ్మ వోళ్లు, నజీరు బాషా వోళ్లు కయ్య దున్నతా ఉండారు” అన్నాడు రమణయ్య గెనిమ్మీద అడ్డంగా పడిఉన్న కర్రతుమ్మ ముళ్ళ కంపను తీసి పక్కికి ఏస్తా..
” నువ్వు రేపు పొద్దనే ఫస్ట్ బస్సు కి నెల్లూరు కి వొచ్చేయ్. ఇద్దరం సంతపేటకి పోయి సామానులు తీసుకుందాం. నేను ఎల్లుండి వేకువజామునే ఊరికి వొచ్చేస్తా” బస్సు ఎక్కతా అన్నాడు సత్యం.
” కండక్టర్ సైదులు ” రైట్ రైట్ ” అంటా బస్సు డోర్ మీద ఒక్క దెబ్బ కొట్టాడు. ” సత్యం సామే..
సంచి ఈడ్నే మరిచిపోయావు. ఇదుగో అంటా రమణయ్య బస్సు కిటికీలో నుంచి సత్యానికి సంచిని అందించాడు. సంచిలో ఉన్న చింత చిగురు, మామిడి పిందెలను తృప్తిగా చూసుకున్నాడు సత్యం. బస్సు ముందుకు కదిలింది.
ఆ రోజు పొద్దునే ఊరికి బయలుదేరారు సత్యం, ఆదెమ్మ. బస్సు దిగి నడుచుకుంట పోతున్నారు ఇద్దరు. ఆదెమ్మ చేతి సంచి లో కదంబం పూలు, సాంబ్రాణి కడ్డీలు, కర్పూరం బిళ్ళలు ఉన్నాయి. వాళ్ళు గెనం మీద నడుస్తావుంటే కల్లంలో కట్టెల పొయ్యి మీద ఉడుకుతున్న బెల్లం కుడుముల వాసన కమ్మగా వాళ్ళ ముక్కులకు సోకింది.
” నే చెప్పాలే.. రమణయ్య వాళ్ళు అప్పుడే కుడుములు ఉడకేస్తా ఉన్నారు. పద పద. మనదే ఆలస్యం ” అంటా సన్నటి గెనెమ మీద పరిగెత్తినట్లు నడిచాడు సత్యం అలవాటు అయిన విద్యలాగా.
” అన్నిటికీ తొందరే ఈయనకు ” మురిపెంగా విసుక్కుంటూ ఎత్తుగా ఉన్న గెనిమ్మీద పడకుండా జాగ్రత్తగా నడస్తా వచ్చింది ఆదెమ్మ.
వాళ్ళు వచ్చేటప్పటికే ఉడకపెట్టిన కుడుములను ఈత చాప మీద పోసి నెరిపి ఆరబెడతా ఉండారు రమణయ్య, వెంకటమ్మ. చుట్టు పక్కల కయ్యల వాళ్ళు, పశువులు మేపే పిలకాయలు వచ్చి చేరారు.
అప్పటికే అక్కడ ఉన్న వేపచెట్టు కింద బంక మట్టితో వినాయకుడి బొమ్మ చేసిపెట్టాడు పెంచలయ్య. చిన్న కండ్రిగ నుంచి సుబ్బరాయ శాస్త్రి కూడా వచ్చాడు. ఆయన వినాయకుడికి పూజ చేస్తే, సత్యం, ఆదెమ్మలు టెంకాయలు కొట్టారు. కుడుములు నైవేద్యం పెట్టి అందరికి పంచారు. నాలుగైదు కుడుములను కయ్య వైపు చూపించి కళ్ళు మూసుకుని కాసేపు మొక్కి కుడుములను కయ్యలోకి విసిరాడు సత్యం. ఆదెమ్మ అక్కడ ఉన్న పిలకాయలకు కుడుములు పంచింది.
ఆ రోజునుంచి పొలం పనులు మొదలు పెట్టారు సత్యం, రమణయ్యలు. ఆ క్షణం మొదలు కయ్యలను కన్న బిడ్డలను కాచినట్లు చూసుకోసాగాడు సత్యం. మరి అన్నం పెట్టే తల్లి కయ్య. అప్పులు తీర్చే అండ కయ్య. ఆశల విత్తనాలు చల్లితే కలలను పండించే పంట కయ్య. తన సర్వస్వము ఈ పొలాలే.
ఊర్లో ఇల్లు, ఆస్తి విషయంలో దాయాదులతో చిన్న మాట తేడా వచ్చి మాట మాట పెరిగి అనుబంధాల కన్న ఆస్తులే మిన్న అని భావించిన దాయాదులకు ఇల్లు, వాకిలి, గొడ్డు గోదాం వదిలి పెట్టి తాను కట్టు బట్టలతో ఊరువిడిచి నెల్లూరు చేరాడు సత్యం ఆదెమ్మ చేయి పట్టుకుని. కానీ నేలతల్లికి దూరమయ్యానని అతను కలత పడని రోజు లేదు.
నెల్లూరు లో చిన్న బాడుగ ఇంట్లో ఉండి అష్టకష్టాలు పడుతూ కాలికి బలపం కట్టుకుని తిరిగితే ఓ కాలేజీలో అటెండర్ గా ఉద్యోగం వచ్చింది సత్యంకి. అతితక్కువ జీతం. జీవితావసరాలకు చాలదు. తిండి తిని తినక రెండేళ్ళు కష్టపడి కూడబెట్టిన సొమ్ముతోఊర్లో రెండెకరాల పొలం కొన్నాడు సత్యం. పొలం రమణయ్య ను చూడమని తాను ఉద్యోగానికి పోయేవాడు.
సెలవు రోజులు, శని ఆదివారాలు కయ్యలోనే సత్యం మకాం. పొలంలో ఓ మూలన జానెడు తావులో చిన్న గది కట్టించి, నీళ్ళ కోసం మోటారు పంపు సెట్టును ఆ గదిలోనే బిగించారు. చుట్టు గుబురు చెట్లు, చిమ్మ చీకటి ఉన్నాకూడా భయమన్నది లేకుండా రాత్రిళ్ళు ఆ గదిలోనే ఒంటరిగా పడుకునే వాడు సత్యం పొలం తల్లి ఒడిలో నాకేం బెంగ అనుకుంటూ. సెలవు రోజుల్లో రమణయ్య తో కలసి తాను కూడా పొలంలో చెమట చిందించేవాడు సత్యం. ప్రతి యేడు ఏదో ఓ కష్టం, ఓ నష్టం ఏదో ఓ రూపంలో వచ్చి పలకరించేది. అయినా పొలం తల్లిని వదులుకోలేదు అతను.
పొలం మధ్యలో ఉన్న మంచె మీద నిలబడి కొంగలు పొలంమీదకు రాకుండా ఒడిసెల రాయిని వేగంగా తిప్పతా ఉన్నాడు రమణయ్య. ఆ ఒడిసెల రాయి కన్నా వేగంగా ముందుకు సాగుతోంది కాలం.
ఆ రోజు కయ్యలోకి దిగతానే సత్యం ముఖం వాడిపోయింది బూడిద తెగులు సోకిన వరికంకులను చూస్తానే. బాధతో గుండె పట్టేసినట్లు అయింది అతనికి.
” మొన్న నువ్వు వొచ్చినప్పుడు కూడా కంకులు బాగా వెన్ను పట్టి మెరస్తా ఉన్నాయి కదా . ఇంతలోనే ఈ తెగులు సోకింది. మిగతా కయ్యల్లో కూడా ఈ తెగులు సోకిందట సత్యం సామే” విచారంగా చెప్పాడు రమణయ్య.
పైరు మీద, వరి కంకులమీద నల్లటి మచ్చలు వచ్చి గింజ రాల్చేసే శిలీంధ్రపు బూజు తెగులు అది. గాలిలో తేమ శాతాన్ని అనుసరించి ఒక మొక్క నుంచి మరో మొక్కకు వ్యాపిస్తుంది. పక్క పొలంలో తెగులు ఉంటే అది సోకకుండా ఆపడం చాల కష్టం. జాగ్రత్త పడక ముందే నష్టం జరిగిపోయింది. వెంటనే శిలీంధ్రపు నాశక మందు పైరు మీద చల్లాలి. లేకుంటే ఒక్క గింజ నిలవదు.
కాళ్ళు, చేతులు ఆడలేదు సత్యానికి. ఉన్న సొమ్మంతా ఇప్పటికే నారేతకు, నేల సారం కోసం యూరియా, దుక్కి పిండి చల్లడానికి అయిపోయింది. ఇప్పుడు డబ్బులకోసం ఏం చెయ్యాలి. ఆలోచిస్తా బస్సు ఎక్కాడు సత్యం.
కంచంలో ఉన్న అన్నాన్ని తినకుండా వేళ్ళతో జరుపుతూ పరధాన్యంలో ఉన్న భర్తను చూడగానే, కళ తప్పిన అతని ముఖంలోనే పొలంలోని పైరు పరిస్థితి ఎలా ఉందో గ్రహించింది ఆదెమ్మ.
” ఏమయ్యా.. తినకుండా అట్టా అన్నం గెలకతా ఉన్నావు. కోతకొచ్చిన కంకులు బాగానే ఉన్నాయి కదా ” భర్త మనసు తెలిసి అడిగింది ఆదెమ్మ సందేహంగా చూస్తా.
” బూడిద తెగులు ఈ తూరి మన దుంప తెంచింది ఆదెమ్మ”.
కళ్ళల్లో నీళ్ళు కంచంలో పడతా ఉన్నాయి సత్యానికి. మౌనంగా దేవుడింట్లోకి వెళ్ళింది ఆదెమ్మ. పది నిముషాల్లో బయటికి వచ్చి సత్యం చేతిలో ఓ కాగితం పొట్లం పెట్టింది ఆమె. ప్రశ్నార్థకంగా ఆదెమ్మ ముఖంలోకి చూసిన సత్యానికి ఆమె మేడలో అప్పుడే పూసిన పసుపుతో పచ్చగా వ్రేలాడుతున్న మంగళ సూత్రం తాడు అతని ప్రశ్నకి సమాధానం చెప్పింది.
మౌనంగా ఆ పొట్లం తీసుకుని తాకట్టు కోసం వెళ్ళాడు సత్యం. బంగారు కుదువ వ్యాపారి బాలయ్య అంతకు ముందు లాగే దండను తూకం వేసి పది వేలు సత్యం చేతిలో పెట్టాడు. అదలా బదలా పురుగు మందుల అంగడికి వెళ్ళి బూజు తెగులు నాశిని మందుల సీసాలు కొని అట్నుంచి అటే ఆత్మకూరు బస్టాండ్ కి వెళ్ళాడు సత్యం.
బూజు తెగులు మందు నీళ్లల్లో కలిపి పంట మీద పిచికారీ చేసేదాకా మనసు మనసులో లేదు సత్యానికి. నాలుగు రోజుల్లో బూడిద మచ్చలు పోయి మళ్ళా తేటంగా పగటి పూట పచ్చటి మిణుగురుల్లా మెరవసాగింది కయ్యలో పంట. కళ తప్పిన సత్యం కళ్ళల్లో కూడా మళ్ళా మెరుపులు కనిపించాయి ఆదెమ్మకు.
పశువుల చేత దుక్కి దున్నించిన దగ్గర నుంచి నారేత వేసి కలుపు తీసి, ఎరువులు వేసి ఇప్పుడు బూడిద తెగులు నుంచి కాపాడి పంటని పసిబిడ్డలా చూసుకున్నాడు సత్యం. అతను ఓ చిన్న రైతు. అతని ఆశలన్నీ ఆ పంట మీదనే.
పంట ఏపుగా ఎదిగి కోతకు సిద్ధంగా ఉంది. చుట్టూ పక్కల కయ్యల వాళ్ళు కోతలు మొదలు పెట్టేసారు, ఆలస్యం అయితే దక్షిణం గాలులు వీచి పంట గింజ రాలిపోతుందని రమణయ్య గోల పెట్టసాగాడు.
కాళ్ళ, వేళ్ళబడి బతిమిలాడగా కాలేజీలో పరీక్షలు అని అతి కష్టం మీద నాలుగు రోజుల సెలవు ఇచ్చాడు ప్రిన్సిపాల్ సదాశివం. సాయంత్రం ఇంటికి వచ్చి సంచిలో ఓ జత గుడ్డలు పెట్టుకుని ఊరికి బయలుదేరాడు సత్యం వరికోతలకు పోతున్నానని. పొద్దునే పొమ్మని ఆదెమ్మ బతిమిలాడినా ఇనకుండా.
రాత్రి పొద్దు పోయిన దాక కయ్యలోనే తిరుగడుతా ఉన్నారు సత్యం, రమణయ్య. తూరుపక్క ఆకాశంలో ఉండిండి మెరుపులు కనిపిస్తా ఉండాయి . వాటిని చూసినప్పుడల్లా గుండె జల్లుమంటోంది సత్యానికి. వరికోతలయ్యే దాక ఏ ఆపదా రానీయవద్దని దేవుడికి మొక్కతానే ఉన్నాడు సత్యం.
“పొద్దునే కోతలకు రమ్మని కూలి వాళ్లకు చెప్పావు కదా రమణా ” అన్నాడు సత్యం ఆదుర్దగా..
” ఏడు మంది ఆడోల్లు, ముగ్గురు మొగోళ్ళు వస్తామని చెప్పినారు” అన్నాడు రమణయ్య.
“సరే అయితే, ఇక ఇంటికి పోయి పడుకో రమణా నువ్వు, పొద్దన్నే కయ్య కాడికి వొచ్చేయి” అంటూ పంపు సెట్టు రూంలో ఉండే టార్చ్ లైట్ రమణయ్య చేతికి ఇచ్చాడు అతను. కాసేపటికి గెనాల మీద టార్చ్ లైట్ వెలుగు దూరం అయింది సత్యానికి. ఆదెమ్మ పొట్లం కట్టిచ్చిన తపిల రొట్టెలు రెండు తిని ఈతాకు చాప మీద నడుం వాల్చాడు సత్యం.
పైరు కోతలపని అయిపోయింది. వరి కుప్పల నూర్పిడి కూడా సజావుగా జరిగిపోయింది. ఈ సారి మార్కెట్ లో ధాన్యానికి మంచి ధర పలికింది. అన్నానికి నాలుగు బస్తాల వడ్లు బొట్టలో దాచి ఉంచుకుని మిగతా ధాన్యం బస్తాలన్నీ అమ్మేశాడు సత్యం.
పిలగాడి కి సైకిల్ కొనిచ్చాడు. పాపకు నాలుగు మంచి గౌనులు కొన్నాడు. ఆదెమ్మ దండ తాకట్టు నుంచి విడిపించాడు. సంక్రాతి పండగ రోజు ఆదెమ్మ చేసిన మెత్తటి బెల్లపు అరిశెను కొరికాడు సత్యం. నాలుకకు తియ్యగా తగిలింది అరిశె ముక్క. కమ్మటి కల కంటున్నాడు సత్యం.
మధ్య రాత్రి ఉరుములకు ఉలిక్కి పడి లేచాడు సత్యం. టప టప నీటి బొట్లు రాలాయి అతని తల మీద రేకుల చిల్లుల నుంచి. గబా గబా గది బయటకు వచ్చాడు. అప్పటికే కుండపోత వాన . కమ్మటి కల చెదిరిపోయింది సత్యానికి. కటిక నిజం కళ్ళ ముందర కన్నీటి వ్యధను మిగిల్చింది.
గెనెమ గట్ల మీద చీకట్లో, వానలో పరిగెత్తి వస్తా ఉన్నాడు రమణయ్య. ఆ వానలో పొలం గట్టు మీద కూలబడిపోయాడు సత్యం తల బాదుకుంటూ..
కళ్ళ ముందు ఎదిగిన కన్న బిడ్డ నీళ్ళల్లో కొట్టుకు పోతుంటే కాపాడుకోలేక విలవిలలాడే తండ్రే అయినాడు సత్యం.
పొద్దునకి పంట మొత్తం నీళ్లలో నానిపోయింది. నాలుగురోజులు ఎడతెరిపిలేని వాన సత్యం ఆశల మీద అగ్ని వర్షాన్ని కురిపిస్తూనే ఉంది.
” నాయన..స్కూల్కి నడిచి పోవాలంటే చాల దూరం. కాళ్ళు నొప్పి పుడుతున్నాయి. సైకిల్ కొను నాన్న” కొడుకు మాటలు చెవిలో జోరుమంటున్నాయి.
” నాన్న.. రెండు గౌనులతోనే బడికి పోతున్నానని నా స్నేహితురాళ్ళు నవ్వుతున్నారు. నాకు కొత్త గుడ్డలు కొనీ నాన్న”.
కూతురి ఆశ ఇప్పుడు అడియాస అవుతోంది. కుదవకు పోయిన దండ కోసం ఆదెమ్మ మెడ ఎదురు చూస్తోంది. తీసుకున్న అప్పు నాకు సంబంధం లేదు అంటూ చక్రవడ్డీకి దగ్గరవుతోంది.
ఆదెమ్మ సూత్రం తాడు ఇచ్చి చేసిన త్యాగం నీటిపాలైంది. బాధపడుతున్న సత్యానికి అనిపించింది.” ఆదెమ్మ లాంటి ఎంత మంది అమ్మల త్యాగాలు ఈ నీటిలో కన్నీళ్ళుగా కరిగిపోయాయో” అని..
బతుకు మీద ఆశ, నిరాశలతో కొట్టుమిట్టాడుతున్న సత్యం లాంటి సన్నకారు రైతులందరి కథ ఇదేనేమో. కాదు కాదు ఇది ఎందరో రైతుల కన్నీటి వ్యధ.

Leave a Comment