కంచె

నమస్తే!

నేను వ్రాసిన ఈ కథ “కంచె” ఆంధ్ర జ్యోతి వారి “నవ్య” వీక్లీ లో 19-02-2020 తేదీన ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన.

———————————————————————————————————————-

తొమ్మిదో తరగతి గదిలోకి ప్రవేశించిన రాగిణి టీచర్ వెళుతూనే తన చేతిలో ఉన్న చార్టుని తీసి బ్లాక్ బోర్డుకు పైన ఉన్న మేకుకు తగిలించింది. పిల్లలందరూ లేచి ఆమెకు విష్ చేసారు.

చార్టు వంక ఆశ్చర్యంగా, ఒకింత వింతగా,మరికొంత సందేహంగా చూస్తున్న స్టూడెంట్స్ వంక చూసి ” అందరు కూర్చోండి. చార్టు లో ఉన్న చిత్రాలు మీకు ఆసక్తి కలిగిస్తున్నాయి కదూ. ఇది ఐదో చాప్టర్ ” మానవ ప్రత్యుత్పత్తి “. ఈ చాఫ్టర్లో మొత్తం ఆరు పాఠాలు ఉన్నాయి. రెండు రోజులకు ఒక పాఠం చొప్పున పూర్తీ చెయ్యాలి. తర్వాత నుంచి ఆరు నెలల పరీక్షలకు రివిజన్ ఉంటుంది.” అంటూ పిల్లలందరిని ఒకసారి కలయ చూసింది రాగిణి టీచర్. చార్టు వంక, రాగిణి టీచర్ వంక మార్చి మార్చి ఆసక్తిగా చూడసాగారు పిల్లలంతా ఆ పాఠం టీచర్ ఎలా చెప్తారో అని.

ఊరిలో ఓ మోస్తరు పేరు మోసిన ప్రైవేట్ ఉన్నత పాఠశాల అది. రాగిణి అక్కడ సైన్స్ టీచర్ గా చేరి మూడు నెలలు గడిచాయి. బాల, బాలికలు ఉండే ఆ పాఠశాలలో చేరిన అతి తక్కువ రోజులలోనే తన బోధనా నైపుణ్యం,వాక్చాతుర్యంతో పాటు పిల్లలను సొంత బిడ్డల లాగా దగ్గరకు తీయటంతో అనతికాలంలోనే మంచి టీచర్ గా పేరు తెచ్చుకుంది రాగిణి. మిగతా టీచర్ల క్లాసులు సరిగా విన్నా లేకున్నా రాగిణి టీచర్ క్లాస్ అంటే మాత్రం పిల్లలు చెవి కోసుకునేవారు. ఇది మిగతా టీచర్లకు కాస్త కంటగింపుగా ఉండేది.

తొమ్మిదో తరగతి పిల్లలు. ఎదిగి, ఎదగని వయసు పిల్లలు. అప్పుడే పూర్వ కౌమారదశలోకి అడుగుపెడుతున్నవారు. ” ద్వితీయ లైంగిక వృద్ధి, ఋతు చక్రం, హార్మోనులు వంటి సున్నితమైన అంశాలు పాఠాలుగా చెప్పడం అనేది టీచర్లకు కత్తిమీద సాము లాంటిది. పాఠం మొదలు పెట్టి పెట్టకముందే పిల్లలలో బోలెడన్ని సందేహాలు. క్లాసులో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు అడిగిన సందేహాలకు సమాధానాలు చెప్తూనే ఎంతో చాకచక్యముగా, పిల్లల మనసులో ఎటువంటి వికారాలు తలెత్తకుండా పాఠం అర్ధం అయ్యేలా చెప్తోంది రాగిణి టీచర్. బెల్ మ్రోగిన కదలకుండా మంత్రముగ్దుల్లా వినసాగారు పిల్లలు. సోషల్ సార్ మాధవ్ క్లాసులోకి వచ్చి ” రాగిణి గారు, పిల్లలకు పాఠం చెప్పే అవకాశం మాకు ఇవ్వండి” అనడంతో రాగిణి టీచర్ తో పాటు అందరు పాఠం నుంచి బైటకు వచ్చారు. నవ్వుతూ మాధవ్ సార్ కి సారీ చెప్పి స్టాఫ్ రూమ్ లోకి వెళ్ళింది రాగిణి టీచర్ .

ఏంటి రాగిణి గారు ఆ ” హార్మోనులు, ఋతుచక్రం లాంటి చెత్త పాఠాలు పిల్లలకు చెప్తున్నారా ? పోయిన సంవత్సరం వరకు ఆ చాప్టర్ ను తొమ్మిది, పది క్లాస్ స్టూడెంట్స్ కి చెప్పవద్దని బాన్ చేసారు. మళ్ళీ ఏం ముంచుకొచ్చిందని ఇపుడు ఆ పాఠాలను టెస్ట్ బుక్స్ లో ముద్రించడం, పిల్లలకు చెప్పమనడం, దానికి తోడు ఇపుడు ఎయిడ్స్ క్లాసులట. ఎందుకండీ ఇవన్నీ పిల్లలకు. ఒక పక్క సోషల్ మీడియాలో, సెల్ ఫోన్ లలో చెత్త వీడియోలు చూస్తూ పిల్లలు చెడిపోతుంటే, అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ పాఠాలు ఒకటి, తగుదునమ్మా అంటూ స్టూడెంట్స్ కి మీరు ఆ పాఠాలు చెప్పడం అవసరమా చెప్పండి ” అంటూ రాగిణి ని ప్రశ్నించాడు తెలుగు సార్ నరసింహారావు. “తప్పనిసరిగా ఇప్పుడు చెప్పితీరవలసిన పాఠాలు సార్ అవి. పిల్లలకు పసివయసులోనే లైంగిక విజ్ఞానం గురించి  అవగాహన ఉంటే, తమపై జరిగే లైంగిక దాడిని తెలుసుకుని ఎదుర్కోగలరు. అందుకే తొమ్మిదో తరగతిలోనే ఈ చాఫ్టర్లు ప్రవేశపెట్టారు.” అంది రాగిణి టీచర్.

నిజమేనంటూ ఆమెకు వంత పాడారు అక్కడే ఉన్న అరుణ టీచర్, మార్టిన్ సార్. స్కూల్ కరెస్పాండంట్ పిల్లలకు గణితం బోధించే ” నాగభూషణ్ ” సార్ అక్కడికి రావడంతో వారి చర్చ ముగిసింది. ఆరు నెలల పరీక్షల రివిజన్ టైం టేబుల్ సెట్ చేయమని పని పురమాయించాడు “నాగభూషణ్ ” సార్ రాగిణి టీచర్ కి. సోమవారం తొమ్మిదో తరగతి క్లాసుకు వెళ్లిన రాగిణి టీచర్ స్టూడెంట్స్ అందరిని పరికించి చూసింది. పాఠం మొదలుపెట్టే ముందు స్టూడెంట్స్ అందరు ఉన్నారా, లేదా అని చూడడం, ఓ ఐదు నిమిషాలు పర్యావరణం, కాలుష్యం, పరిశుభ్రత, దేశ భక్తి, ఇలా ఏదో ఒక అంశం గురించి స్టూడెంట్స్ తో చర్చించి తర్వాత పాఠంలోకి వెళ్లడం రాగిణి టీచర్ కి అలవాటు. ఆ రోజు అమ్మాయిలలో ఇద్దరు స్కూల్ కు రాలేదు. రెండో బెంచిలో ” సువిధ” ఒకటే ఉంది. ” లోహిత, వాసంతి ” రాలేదు. అబ్బాయిలలో కూడా ముగ్గురు గైరు హాజరు అయినారు. “పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి. స్కూల్ మానకండి అంటూ ఆ రోజు పాఠం మొదలెట్టింది ఆమె.

రెండు రోజుల తర్వాత క్లాస్ కి వచ్చిన వాసంతి, లంఖణం చేసినట్టు తగ్గిపోయి ఏదో కోల్పోయినట్టు, ఎందుకో బెదిరి పోయినట్టు అనిపించింది రాగిణి కి. ఆ విషయం అడిగితే తనకి జ్వరం వచ్చిందని చెప్పింది వాసంతి. నాలుగు రోజుల తర్వాత సువిధ కూడా స్కూలుకి రాలేదు. వరుసగా మూడురోజులు స్కూలు కి రాకపోవడంతో వాసంతి, పరిమళ లను తీసుకుని సువిధ వాళ్ళ ఇంటికి వెళ్ళింది రాగిణి సాయంత్రం స్కూలు అయినాక.

సువిధకి జ్వరం వచ్చింది అని చెప్పింది వాళ్ళ అమ్మ. గదిలో మంచానికి బల్లిలా అంటుకు పోయి ఉంది సువిధ. రాగిణి టీచర్ ని చూడగానే దుఃఖం పొంగుకొచ్చి ఆమెను అల్లుకుని పోయి ఏడవసాగింది సువిధ. ” అయ్యో సువిధ, ఏంటమ్మా ఇది. నీకు మాములు జ్వరమే కదా. ఏం కాదులే. డాక్టర్లు ఇచ్చిన మందులు వేసుకుని, మంచి ఆహారం తీసుకో. త్వరగా కోలుకుంటావు.” అంటూ ఆమెకు ధైర్యం చెప్పి, వాళ్ళ అమ్మకు కొన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది రాగిణి టీచర్.

ఎందుకో ఈ మధ్య క్లాసులో అమ్మాయిలు పరధ్యానంగా, నిరాసక్తంగా ఉండడం, తమలో తాము గుస గుసగా ఏదో విషయం గురించి చర్చించుకుంటూ ఎందుకో మధనపడుతూ ఉండడం గమనించింది రాగిణి టీచర్. తొమ్మిదో తరగతిలో మొత్తం ఇరవై మంది ఆడ పిల్లలు ఉన్నారు. తరచుగా ఎవరో ఒకరు స్కూలు కి ఆబ్సెంట్ అవుతున్నారు. పదొవ తరగతి అమ్మాయిలు కూడా తరచూ స్కూల్ కి ఆబ్సెంట్ అవడం గమనించింది రాగిణి. ఆ రోజు సాయంత్రం స్కూల్ అయిపోయాక తొమ్మిదో తరగతి అమ్మాయిలను అందరిని క్లాస్ లోనే ఉండమని చెప్పింది రాగిణి. ఆమె మనసులో ఎన్నో సందేహాలు, అనుమానాలు వేరు పురుగు తొలిచినట్టు ఆమె మనసును ఆలోచనలు తొలిచేస్తున్నాయి. ఎందుకు అమ్మాయిలలో చురుకుదనం తగ్గిపోయింది. తరచూ జ్వరాలు ఎందుకు వస్తున్నాయి వాళ్లకు.

సాయంత్రం స్కూలు వదిలాక స్టూడెంట్స్ అందరు వెళ్లిపోయారు. నైన్త్ క్లాసు అమ్మాయిలు మాత్రం స్కూల్లోనే ఉండిపోయారు. రాగిణి టీచర్ వాళ్ళ క్లాసు కు వచ్చింది. ” ఎవరు వెళ్లిపోలేదు కదూ? ఇపుడు చెప్పండి ఎందుకు ఈ మధ్య మీరంతా క్లాసు లో పరధ్యానం గా ఉంటున్నారు. చదువు మీద శ్రద్ద తగ్గుతోంది.” రాగిణి అడిగిన ప్రశ్నలకు బదులుగా అందరు తలదించుకుని కూర్చున్నారు. ” చెప్పండి పరిమళ, పరీక్షలు దగ్గర పడుతుంటే మీరు ఇలా ఉంటే ఎలా? మిమ్మలను మీ క్లాసు లోని అబ్బాయిలు ఏమైనా అన్నారా? పోయిన వారం నేను చెప్పిన “ఋతు చక్రం ” లాంటి పాఠాలు విని భయపడ్డారా? టీచర్లు కానీ సార్ లు కానీ మీతో దురుసుగా ప్రవర్తించారా? ” రాగిణి ఎన్ని ప్రశ్నలు వేసిన వాళ్ళు ఉలుకు, పలుకు లేనట్టు ఉండిపోయారు. ఆ పసి మనసులలో ఏం ఉందొ తెలియని రాగిణి ఎంతో అనునయంగా ” నన్ను మీ అమ్మలా భావించి మీ మనసులో ఉండేది నాకు చెప్పండి” అంటుండగానే వాసంతి చేతులతో ముఖాన్ని కప్పుకుని పెద్ద పెట్టున రోదించింది.

” అయ్యో, వాసంతి ఏమైందమ్మా? ” అంటూ వాసంతిని దగ్గరకు తీసుకుని తల నిమురుతూ ” చెప్పమ్మా ? ఎందుకు ఏడుస్తున్నావ్? ” అంది రాగిణి. అప్పుడు నోరు తెరిచింది పరిమళ. “టీచర్, మన స్కూలు కరెస్పాండంట్ ” నాగభూషణ్ ” సార్ వాసంతి తో చెడ్డగా ప్రవర్తించారు.” అంది. ఆ మాట వింటూనే శరాఘాతం తగిలినట్టు వణికిపోసాగింది వాసంతి. రాగిణి కూడా ఎప్పుడు కలలో కూడా ఊహించని దారుణాన్ని గురించి విన్నట్టు ఖిన్నురాలు అయింది. ” ఎప్పుడు జరిగింది తల్లి ఈ దారుణం. మంచిగా కనిపిస్తున్న మేకవన్నె పులినా ఈ నాగభూషణం సార్. అసలు ఏం జరిగిందో చెప్పండి నాకు?”. అంది రాగిణి.

” టీచర్ రోజు సాయంత్రం స్కూలు అయిపోయాక ‘నాగభూషణ్’ సార్ మ్యాథ్స్ ప్రైవేట్ క్లాసు తీసుకుంటారు. ఒక రోజు అబ్బాయిలకు, ఒక రోజు అమ్మాయిలకు క్లాసు తీసుకుంటారు. ఈ మధ్య వాళ్ళ ఇంటిదగ్గర ఎవరు లేరు అక్కడ క్లాసు తీసుకుంటానని రమ్మన్నారు. క్లాసు అయిపోయినాక అమ్మాయిలను అందరిని పంపించి ఇద్దరిని ఉండమనేవారు. ” అంటూ చెప్పడం ఆపింది పరిమళ.

” చెప్పు పరిమళ, తర్వాత ఏం జరిగింది ” ఆత్రుత గా అడిగింది రాగిణి. అప్పుడు వాసంతి కళ్ళనీళ్లు తుడుచుకుని ” టీచర్ ఆ రోజు సార్ ఉండమన్నారని నేను, పరిమళ అక్కడే ఉన్నాం. అప్పుడు సార్ నన్ను వాళ్ళ వంట ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో నుంచి వాటర్ బాటిల్ తెచ్చి ఇవ్వమన్నారు. నేను వాటర్ బాటిల్ తేవడానికి వంట ఇంట్లోకి వెళ్ళాను. పరిమళ ఇంటి బయట వరండాలో ఉంది. నేను ఫ్రిడ్జ్ తెరచి బాటిల్ తీస్తుండగా, హఠాత్తుగా సార్ వెనుక నుంచి నన్ను గట్టిగ పట్టుకున్నారు. నేను భయంతో సార్ నుంచి తప్పించుకోవాలని పెనుగులాడేకొద్దీ మరింతగా పట్టుకుని ” వాసంతి నువ్వు చాల అందంగా ఉంటావు. నా కోరిక తీర్చు. నీకు టెన్త్ క్లాసులో స్కూలు ఫస్ట్ వచ్చేలా చేస్తాను.” అంటూ ఇంకా చెప్పలేని మాటలు మాట్లాడారు టీచర్. నేను గట్టిగా అరచి సార్ ను వదిలించుకొని పరుగెత్తపోయాను. అప్పుడే పరిమళ నా అరుపు విని లోపలకు వచ్చింది. అప్పుడు సార్ ” ఈ రోజుకు వెళ్లిపోండి. ఈ విషయం ఎవరికైన చెప్పారంటే మీ గురించి చెడుగా ప్రచారం చేయిస్తాను. మీ ఇంట్లో వాళ్ళను కొట్టిస్తాను.” అంటూ మమ్మలను బెదిరించారు టీచర్”. అంటూ వాపోయింది వాసంతి. “

వారము తర్వాత” సువిధ”ను కూడా అలాగే ” తనకి లొంగిపోక పొతే మా ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా లో పెట్టి చెడుగా ప్రచారం చేస్తానని బెదిరించాడు టీచర్. ఆ రోజు సరిగ్గా ఆ సమయానికి వాళ్ళంటికి ఎవరో రావడంతో సువిధ తప్పించుకుంది టీచర్. సార్ అంటేనే మాకు భయం వేస్తోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయం తో స్కూలుకి రాలేక పోతున్నాం టీచర్” అంటూ దాదాపు అమ్మాయిలందరూ కన్నీటితో రాగిణి హృదయాన్ని కరిగించారు.

” అయ్యో,స్కూలు లో ఇంత ఘోరం జరుగుతుంటే తెలుసుకోలేక పోయాను. మీరు ఈ విషయాన్నీ నాకు చెప్పకుండా పొరపాటు చేసారు తల్లి. స్కూలు లో విద్యార్థులకు విద్యా, బుద్దులు నేర్పించి సన్మార్గంలో పెట్టవలసిన గురువే దుర్మార్గుడుగా పిల్లలను వేధించడం క్షమించరాని నేరం” అంది రాగిణి ఆవేశంగా. ” టీచర్, పోయిన సంవత్సరం టెన్త్ క్లాసు అక్క ‘మానస’ ఉరివేసుకుని చనిపోయింది తనకి రాంక్ రాలేదని కాదు. నాగభూషణ్ సార్ ఆమెని ” ఆపై చెప్పలేక తలవంచుకుంది తరుణి. ” అయ్యో, ఇంత దారుణం జరిగిందా? ఈ విషయం ఎవరికీ తెలియదా ?” అంది రాగిణి. ” ఆ తర్వాత ఏం జరిగిందో ఎవరికీ తెలీదు టీచర్. వాళ్ళ ఫామిలీ అంతా వేరే ఊరు వెళ్లి పోయారు. మొన్నటి వరకు మాకు తెలీదు టీచర్. వాసంతి విషయం మేము మాట్లాడుకుంటుంటే, ఎవరికీ చెప్పవద్దని మా అన్న సునీల్ నాకు చెప్పాడు టీచర్ ఇలా జరిగింది. నీవు స్కూలు లో జాగ్రత్తగా ఉండు అని చెప్పాడు టీచర్.”అంది తరుణి.

అయ్యో, ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఇంకా ఆ దుర్మార్గుడికి భయపడితే, ఇంకా వాడు ఎంత నీచానికి ఒడిగడతాడో, ఇక వాడి ఆటలు సాగనీయకూడదు. వాడికి భయపడి ఇంత కాలం మీరంతా ఎంత మానసిక వేదనను అనుభవించారో తల్చుకుంటేనే నా రక్తం మరిగిపోతోంది. నయవంచకుడిని, కీచకుడి లాంటి దుర్మార్గుడిని మోసంతోనే
గెలవాలి. మనమంతా కలసి ఓ చక్కటి పధకం వేసి ఆ కీచక మృగం ‘నాగభూషణ్ ‘ కి బుద్ధి చెపుదాం” అంది రాగిణి టీచర్.

ఆ తర్వాత రోజు క్లాసు లోని మగ పిల్లలను కూడా కూర్చోబెట్టి ‘నాగభూషణ్ ‘ సార్ చేసిన దుర్మార్గాన్ని వాళ్ళకి వివరించింది. “చూడండి, ఈ రోజు మీ క్లాసు అమ్మాయిలకు ఇలా జరిగింది. మనం ఏమి తెలియనట్టు ఉపేక్షిస్తే రేపు మీ అక్కకో,చెల్లికో ఇలాంటి ప్రమాదం జరగవచ్చు. అప్పుడు కూడా మీరుఊరుకుంటారా? ” అని వారిని ప్రశ్నించింది. రాగిణి టీచర్ చెప్పిన విషయం వినగానే కొందరు అబ్బాయిలు నాగభూషణ్ సార్ మీద కోపంతో రగిలిపోయారు. కొందరు భయంగా, మరికొందరు విస్మయంగా స్పందించారు. పద్నాలుగు ఏళ్ళ తొలి కౌమార దశ లో ఉన్న ఆ పిల్లలకు రాగిణి టీచర్ చెప్పే పాఠాలే కాదు, క్లాసులో ఉన్న ఆడపిల్లలతో తాము ఎలా ప్రవర్తించాలో, ఇతర విషయాల పట్ల మనసు పోకుండా, చదువు మీద మనసును ఎలా లగ్నం చేయాలో అన్ని విషయాలు ఆమె దగ్గర నేర్చుకున్న వాళ్ళు ‘నాగభూషణ్ ‘ సార్ ఆడే మృగాట ను కట్టించడానికి రాగిణి టీచర్ కి తమ సహకారం అందిస్తాం అని మాట ఇచ్చారు. తమ పధకం అమలు చేసే సమయం కోసం ఎదురు చూడసాగారు.

టైం టేబుల్ సెట్టింగ్ మార్చిన పేపర్స్ తీసుకుని రాగిణి టీచర్ ‘నాగభూషణ్ ‘ సార్ గదిలో కి వెళుతూ బెల్ కొట్టబోయినది. అంతలోనే నాగభూషణ్ సారే తలుపు తీసుకొని వేగంగా బయటకు వచ్చి రాగిణి టీచర్ ని చూసుకోకుండా గుద్దుకున్నాడు. పొరపాటు సార్ ది అయినా రాగిణి తడబడుతూ” సారీ సార్, పొరపాటున చూసుకోకుండా” అనే లోపే ” ఇట్స్ ఓకే, నో ప్రాబ్లెమ్, క్యారీ ఆన్ ” అంటూ రాగిణి టీచర్ ని గదిలోకి పిలిచాడు. సిగ్గు పడుతూ తను తెచ్చిన పేపర్స్ సార్ కి ఇచ్చింది రాగిణి. “ఓకే రాగిణి గారు. రేపటి నుంచి ఈ టైం టేబుల్ అమలు చేద్దాం ” అన్నాడు నాగభూషణ్ సార్. రాగిణి గది నుండి బయటకు వెళ్ళగానే ‘ ఎప్పుడు సీరియస్ గా, కాస్త రిజర్వేడ్ గా ఉండే రాగిణి ఈ రోజు నా పొరపాటుకు తను సారీ చెప్పింది, నవ్వుతూ మాట్లాడింది ఏంటి ఈ శుభపరిణామం. అయినా దీని గురించి ఇంత ఆలోచన ఏంటి. అప్సరస లాగా ఉండే రాగిణి తనను చూసి నవ్విందంటే నేను తనకి నచ్చినట్టే కదా. ఎలా తనని ముగ్గులోకి దింపాలా అని ” అని తనదైన కపటపు ఆలోచనలు చేయసాగాడు నాగభూషణ్ సార్.

ఆ రోజు సాయంత్రం అబ్బాయిలకు ప్రైవేట్ క్లాసు లేదని చెప్పి ఇంటికెళ్లిపోయాడు నాగభూషణ్ సార్. మనసు నిండా రాగిణి గురించిన తలపులు. ఎలా తనని దారిలోకి తెచ్చుకోవాలి, తనకి ఏం ఆశ చూపాలి, ఎప్పుడు తన కౌగిటిలో ఆమెను బంధించాలి అని ఆలోచించసాగాడు అతను.

వారం రోజులు గడిచాయి. ఆ రోజు గులాబీ రంగు అంచు ఉన్న ఆకు పచ్చ ఇకత్ చీరలో దేవకన్య లా మెరిసిపోతున్న రాగిణి టీచర్ ని చూడగానే గుండె లయ తప్పింది నాగభూషణ్ సార్ కి. తనని చూడగానే ఆమె విష్ చేసి నవ్విన నవ్వు మన్మథ బాణం లా సూటిగా అతని గుండెలో గుచ్చుకుంది. ” ఏంటి రాగిణి గారు ఈ రోజు మీరు స్పెషల్ గా కనిపిస్తున్నారు ” తన రూంలోకి వచ్చిన రాగిణిని తినేసేలా చూస్తూ అన్నాడు నాగభూషణ్ సార్.

” ఈ రోజు నా పుట్టిన రోజు సార్” అంది రాగిణి సమ్మోహనంగా నవ్వుతూ.
” ఓహ్, వాటె ప్లెషర్. హ్యాపీ బర్త్ డే టూ యూ రాగిణి మేడం” అంటూ కరచాలనం చేసి
” అయితే మీ బర్త్ డే కి మాకు పార్టీ లేదా ” అన్నాడు గోముగా ఆమెను చూస్తూ.
” మిమ్మలను పార్టీకి పిలవడానికే వచ్చాను సార్ ” అంది రాగిణి మందహాసంతో
” విత్ ప్లెషర్. తప్పకుండా వస్తాను మేడం ” అన్నాడు నాగభూషణ్ సార్ రాగిణి ని కోరికతో చూస్తూ.

రోజు రోజు కి రాగిణి మీద కోరిక ఎక్కువ అవుతోంది నాగభూషణ్ సార్ కి. పిట్టను పంజరం లో ఎలా బంధించాలి. ఆ తర్వాత తన భాహువులలో ఎలా బంధించాలి. కళ్ళ ముందు
రంభ లాంటి అందగత్తె తిరుగుతున్నా ఏమి చేయలేక పోతున్నాను. ఈ రోజు ఎట్లైనా పార్టీ అయిపోయి అందరు వెళ్ళిపోయాక తన కోరికను బయట పెట్టాలి. అవసరం అయితే బలవంతంగా అయినా తనని అనుభవించాలి’ అని తన కీచక పన్నాగాన్ని ఆ రోజు అమలు చేయాలనుకున్నాడు నాగభూషణం.

సాయంత్రం కాస్త లేటుగా రాగిణి వాళ్ళ ఇంటికి బయలుదేరాడు నాగభూషణ్ సార్. అప్పుడైతే పార్టీ తొందరగా ముగుస్తుంది. అందరు వెళ్లిపోతారు. తర్వాత తను రాగిణి తో, ఊహించుకుంటేనే ఒళ్ళు నూట ఎనిమిది డిగ్రీ ల జ్వరంలా వేడెక్కి పోతోంది. తను రాగిణి బర్త్ డే గిఫ్ట్ గా కొన్న డైమండ్ రింగ్ ని అందంగా ప్యాక్ చేయించి తీసుకెళ్లాడు. కాలింగ్ బెల్ నొక్కగానే అతనికోసమే ఎదురు చూస్తున్నట్టు వెంటనే తలుపు తీసి చిరునవ్వుతో నాగభూషణ్ సార్ ని ఆహ్వానించింది రాగిణి. బర్త్ డే స్పెషల్ అలంకరణలో మెరిసిపోతోంది రాగిణి. హాల్ లో కి వచ్చి చుట్టూ పరికించి ” రాగిణి మేడం ఏంటి? పార్టీ ఇంకా మొదలవలేదా, నేనే ముందు వచ్చేనా? అతిధులు ఎవరు కనపడడం లేదు ఏంటి ? ప్రశ్నల వర్షం కురిపించాడు. మనసులో మాత్రం ఎవరు లేనందుకు తెగ సంతోషపడుతూ.

” లేదు సార్ నా పుట్టిన రోజు కు మీరు ఒక్కరే అతిధి”. అంది రాగిణి అతన్ని టేబుల్ దగ్గరికి తీసుకు వెళ్లి.
అక్కడ టేబుల్ మీద కేక్ కట్ చేయడానికి రెడీగా ఉంది. తనకు పట్టిన అదృష్టానికి లోలోన మురిసిపోతూ “థాంక్స్ రాగిణి. ఇదిగో నీ బర్త్ డే కి నేను అందించే కానుక ” అంటూ నాటకీయంగా రాగిణి చేతిలో గిఫ్ట్ ప్యాక్ పెట్టాడు అతను. థాంక్స్ సార్. మీ కోసమే ఎదురు చూస్తున్నాను. కేక్ కట్ చేస్తాను అంటూ కేక్ మీద ఉన్న కాండిల్స్ ని ఊదేసి కేక్ కట్ చేసి ఓ ముక్కని నాగభూషణ్ సార్ నోటికి అందించింది రాగిణి.

ఇంత త్వరగా రాగిణి తన వలలో పడుతుందని ఊహించని అతను, తనని ఒకడినే పిలవడం వెనుక తనపై ఆమెకు ఇష్టం ఉందని , ఇక ఉపేక్షిస్తే పిట్ట వల లో నుంచి జారిపోతుందని తన మనసులోని కోరికని రాగిణి ముందు బయట పెట్టాడు. ” రాగిణి నీవు అప్సరస లా ఉంటావు. స్కూలు లో జాయిన్ అయిన రోజే నీవు అంటే నాకు ఇష్టం కలిగింది. నువ్వు ఉ అంటే నీకు స్వర్గసుఖాలు చూపిస్తాను. నా కోరికను కాదనకు” అన్నాడుఅతను.

ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నట్టు రాగిణి సిగ్గు పడుతూ ” మీరు అడిగితే నేను కాదంటానా” అనడం తోనే ఆమెను గట్టిగా హత్తుకున్నాడు నాగభూషణ్ సార్. అతన్ని నెట్టి వేస్తూ ” కాస్త లాగండి సార్. మీ కోరిక తీర్చాలంటే నేను అడిగిన ప్రశ్న లకు మీరు జవాబులు చెప్పాలి. అప్పుడే ఈ రాగిణి మీ కౌగిట్లో బంధీ అవుతుంది. అవుతుంది” అన్నది రాగిణి.

అప్పటికే కూల్ డ్రింక్ లో కలిసిన కాస్త విస్కీ నాగభూషణ్ సార్ కడుపులో నుంచి నరాలలోకి పాకడంతో రాగిణి పొందుకోసం అర్రులు చాచుతూ ” ఏంటి రాగిణి ఇంకా ఆలస్యం. ఏం అడగాలో అడుగు అన్నాడు ” ముద్దగా ” అది పోయిన ఏడాది మన స్కూల్ స్టూడెంట్ ‘ మానస’ ఎందుకు ఉరివేసుకుని చనిపోయింది ? తలా ఓ రకంగా అనుకుంటున్నారు,అసలు ఏం జరిగింది. నాకు చెప్పండి ” అంది రాగిణి నాగభూషణ్ సార్ కి కూల్ డ్రింక్ గ్లాస్ అందిస్తూ. అబ్బా, రాగిణి ఆ విషయం ఇపుడు ఎందుకు. మంచి సమయాన్ని మాటలతో సరిపెడుతున్నావ్. అయినా నీవు అడిగావని చెప్తున్నా, మానస చాల అందంగా ఉంటుంది. తన మీద మోజు పడ్డాను. కోరిక తీర్చమన్నాను. తను ఒప్పుకోలేదు. ప్రైవేట్ క్లాస్ అప్పుడు ఇంటికి పిలిపించి బలవంతంగా తనని అనుభవించాను. శీలం , గీలం అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. వారం తర్వాత ఉరివేసుకుని చనిపోయింది. సూసైడ్ నోట్ లో నా పేరు రాసింది. అయినా నేను నామీద కేసు రాకుండా తప్పించుకున్నానులే.” తలకెక్కిన మత్తు ఓ పక్క, రాగిణి అందం ఓ పక్క అతన్ని చిత్తు చేస్తే విచక్షణను కోల్పోయిన నాగభూషణ్ తానే మానస చావుకు కారణం అని త న నోటితో తానే చెప్పేసాడు.

హఠాత్తుగా రూమ్ మొత్తం మిరుమిట్లుగొలిపే వెలుగుతో నిండి పోయింది. ఫ్లాష్ లైట్స్ తో మీడియా వాళ్ళు, పోలీస్ ఇన్స్పెక్టర్, స్కూల్ స్టూడెంట్స్, వాళ్ళ పేరెంట్స్ ఒకరివెనుక ఒకరు రూంలోకి దూసుకుని వచ్చారు. కంటిలో పడిన కాంతిని భరించలేక చేయి కళ్ళకు అడ్డం పెట్టుకుంటూ ” రాగిణి, ఏంటి ఈ మోసం” అన్నాడు నాగభూషణ్ .

” మోసం చేసింది రాగిణి మేడం కాదు మిస్టర్ నాగభూషణ్, మోసంతో ఇంటికి రప్పించి అమాయకురాలైన మానసను అత్యాచారం చేసి ఆమె ఆత్మహత్యకు కారణమైన నువ్వు, మానస చావుకు కారణం అయినాననే నిజాన్ని నీ నోటితోనే చెప్పించాలని మేమంతా కలసి ఈ నాటకం ఆడాము. రాగిణి గారు నీ చేత నిజం చెప్పించడానికి ఎంతో సాహసం చేసారు. వంచనతో అప్పుడు తప్పించుకున్నా ఇప్పుడు ఇక చట్టం నుంచి నువ్వు తప్పించుకోలేవు.” అన్నాడు ఇన్స్పెక్టర్ రఘురాం. చేసిన నేరం బయటపడి తల దించుకున్నాడు నాగభూషణ్.

రాగిణి మాట్లాడుతూ ” స్కూల్లో విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పుతూ, వాళ్ళని కంచె లాగా రక్షించవలసిన గురువే ‘ కంచే చేనును మేసినట్టు’ కీచకుడిలాగా విద్యార్థుల మాన, ప్రాణాలతో ఆడుకుంటే ఇక వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంటుంది. ముల్లును ముల్లుతోనే తీయాలి. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, మోసాన్ని మోసంతోనే జయించాలి. నీ దుర్మార్గపు మృగతృష్ణ కు మరో మానస బలి కాకూడదు నాగభూషణ్” అంది ఆవేశంగా.

Leave a Comment