ఒక బాలనాగమ్మ..నలుగురు మాయల పకీర్లు

ఈ నెల [అక్టోబర్ 2021 ] విశాలాక్షి మాసపత్రికలో ప్రచురితం అయిన నా కథ “ఒక బాలనాగమ్మ -నలుగురు మాయల పకీర్లు”. శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో. మిత్రులకు దసరా శుభాకాంక్షలతో..దసరా కథ..🌹🌹🙏🙏
కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ..🌹🌹🙏🙏

బడి బయట ఉండుండి తప్పేట్లు గొట్టే శబ్దం వస్తా ఉండాది.
” పది రోజులు సెలవులిచ్చినారు కదా అని వీధుల్లో పడి బలాదూరుగా తిరగబాకండి. ఇంటికాడనే ఉండి సుమతి శతకాలు, వేమన పద్యాలు కంఠతా పట్టండి. సెలవులు అయినంక శతకాల పోటీ పెడతాను నేను ” చెప్పుకుంటా పోతా ఉంది కృపావతమ్మ టీచర్.
” తిరిగే కాళ్ళు, తిట్టే నోరు ఆగవు ” అనే సామెత మాదిరిగా ఇక మా కాళ్ళు నిలిస్తే కదా. పుస్తకాలన్నీ సంచిలో పెట్టేసుకొని భుజానికి తగిలించుకొని రెడీగా ఉండాం నేను, సునీత, హిమబిందు,రాధ.
గెంట కొట్టికొట్టకముందే యెద్దలరేవు బ్రిడ్జి కాడికి లగెత్తుకుంటా పోయినం. ఆడ బ్రిడ్జి కి అమ్మిడిగా ఉన్న పెద్ద గుడిసెలో చిట్టెమ్మ సారాయి అంగడికాడ నలుగురు పులివేషగాళ్ళు సారాయి లోటాల్లో పోసుకుని తాగతా ఉండారు.తప్పెట్ల శబ్దానికి అప్పటికే ఆడ చానా మంది పిలకాయలు చేరిఉండారు గుడిసె పక్క పెద్ద మంట వేసి ఉండారు. తప్పెట కొట్టే వాళ్ళు, వాళ్ల చేతుల్లో ఉన్న తప్పెట్లను మంటమీదకి పెట్టి సాపు చేసుకుంటా ఉండారు.
గుడిసె బైట నిలబడి లోపలకి తొంగి చూస్తా ఉండాం మేము వొళ్ళు బయటకు ఎప్పుడొస్తారా అని. దసరా నవరాత్రులు మొదలై అప్పటికే రెండు రోజులైంది. పులి వేషగాళ్ళు బైటకి వచ్చారు. వొళ్ళు నలుగురు పులులమాదిరి ఎగరతా ముందుకి పోతా ఉంటే వాళ్ళ ఎనక తప్పెట గొట్టే వొళ్ళు, వాళ్ళ ఎనకమాల మేము పిలకాయలం పోతా ఉన్నాం. వొళ్ళు బాలాజీనగర్, ఏసీ నగర్ అంతా తిరుక్కోని మళ్ళా వెనక్కి వొచ్చి మా విజయమహల్ సెంటర్ కాడకి వొచ్చారు. వాళ్ళతో బాటే నేను, సునీత, హిమబిందు, రాధ , శ్రీనివాసులు, మహేంద్ర సింగు, రమేషు అందరం తిరగతా ఉన్నాం. మా సెంటర్ కాడ నాలుగు రోడ్ల నడిమధ్యలో పులివేషగాళ్ళు పులులమాదిరి ఆడసాగారు.
తప్పెట్లజోరు మారుమ్రోగింది. ఆ పులివేషగాళ్ళ ఆట చూస్తా ఉంటే మాకు చీకటి పడింది కూడా తెలియలేదు. సెంటర్లో మా ఇంటికి యదాళంగా ఉన్న సోడాల రావమ్మా అంగట్లో నుంచి నాలుగు గోలి సోడాలు తెచ్చి పులివేషగాళ్లకు ఇచ్చారు. వొళ్ళు బొటనవేలితో గోలీని కొట్టి సోడాని తాగారు. అపట సోడా సీసాలను గురిచూసి గాలిలోకి విసిరారు. ఏడ అవి మా తలకాయలకు తగలతాయని మేము భయపడి దూరంగా పరిగెత్తినం. సోడా సీసాలు ఒకదానికొకటి తగిలి పెద్దగా శబ్దం చేస్తా పగిలినాయి. పులివేషగాళ్ళు నవ్వుకుంటా చుట్టూ మూగిన జనాలకాడికి, అంగళ్ల కాడికి వొచ్చి డబ్బులు దండుకోసాగారు. సాయంత్రం ఇంట్లో బొమ్మల కొలువు పెట్టాలి, బడి అయిపోగానే బిన్నా ఇంటికి వొచ్చాయమన్న సంగతి అప్పుటికికాని గుర్తుకు రాలేదు నాకు. చీకటి పడతా ఉండాదని రాధ, సునీత వొళ్ళు ఇంటికి వెళ్లిపోయారు. అమ్మ చేతిలో దెబ్బలు ఎలాగూ తప్పవు ఈ రోజు అనుకుంటా, బొమ్మల కొలువులో పార్కు కట్టేదానికి ఇసక తెమ్మన్న సంగతి గుర్తుకు వొచ్చి మా ఇంటికి నాలుగిళ్ళ అవతల ఉన్న కామాక్షమ్మ కట్టెల దొడ్డి ముందర పోసి ఉన్న పెద్ద ఇసక కుప్ప కాడికి పోయి ఆడ మందుల అంగడి లో కూర్చుని ఉన్న కృష్ణని అడిగి ప్లాస్టిక్ కవర్ తీసుకున్న. ఆ కవర్ నిండా ఇసక వేసుకుని ఇంటి కాడికి పోయినా.
నన్ను చూస్తానే ” వీధిలో రాచకార్యాలు ఇప్పటికి అయినాయి మీ నీక” అంటా తిట్ల దండకం ఎత్తుకున్నాది అమ్మ
“ఇసక కోసం పోయినాను మా ” అన్నాను బింకంగా మూతి పెట్టి
” నువ్వు పులేషాల వెనక తిరగతా ఉండావని రిక్షా చెంచురాముడు చెప్పినాడు లే మీ. రేపటాల నుంచి వీధుల్లో తిరిగినావంటే కాళ్ళు విరుగుతాయి నీకు. ముఖం కడుక్కుని రాపో. బొమ్మల కొలువు పెడదాం ” అనింది అమ్మ పెద్ద బల్ల మీద తెల్ల పంచెలు పరచి దానిమీద బొమ్మలు వరుసగా పేర్చాము అమ్మ, నేను. ఆవులేల్లుండి నుంచి సాయంత్రం పూట పేరంటానికి అందరిని పిలస్తామని అమ్మ చెప్పింది. అన్నాలు తిని అందరం పడుకున్నాం.
అమ్మ తిడద్దని సెలవు రోజుల్లో కూడా ఇంటికాడనే ఉండాలంటే ఎలా. అరికాళ్ళు దురద పుడతా ఉండాయి వీధిలోకి పొమ్మని. ఇంటికాడనే ఉంటే దసరా వేషాలు చూసేదెట్టా..!
ఇడ్లి నాస్తా తిన్నాను. అమ్మ వంటింట్లో మణుగుబూలు చేస్తా ఉండాది. మెల్లగా పిల్లి మాదిరిగా వీధి వాకిలి చెక్క తలుపు తీసాను.
వీధిలోకి పోగానే సునీత ఎదురైంది నాకు. ఇద్దరం కలసి రైలు కట్ట దాటి రామచంద్రారెడ్డి ఆసుపత్రి వీధిలోకి పోతా ఉండాము. అంతలోనే మా కంటి ముందు ఒక్కసారిగా మెరుపులు మెరిసినాయి. మాకు యదాళంగా చెయ్యెత్తున మనిషి ఔపడ్డాడు. నిండు బులుగు రంగులో మెరస్తా ఉండే గౌను ఏసుకొని ఉండాడు. పాత సినిమాల్లో రాజనాల ఏసుకునే మాదిరిది. కాళ్ళకి అతుక్కుపోయి ఉండే బులుగు రంగు ప్యాంటు, నడుంకి బంగారు రంగులో మెరిసే బెల్టు, అరికాళ్ళకి కూడా బంగారు రంగులో మెరిసే బూట్లు ఏసుకొని ఉండాడు. మెడలో తెల్లటి ముత్యాల పూసల దండలు, ముఖానికి తెల్లగా సున్నం మాదిరి రంగు పులుముకొని, బుగ్గలకి, పెదాలకి ఎరుపు రంగు ఏసుకొని ఉండాడు. సన్నగా మెలితిరిగి నోటికి రెండువైపులా వేలాడుతున్న నల్లటి మీసాలు చానా తమాషాగా ఉండాయి. ఇంత పొడుకున ఉన్న పీసు గడ్డం, జులపాల జుట్టుతో మనిషి చూడడానికి గమ్మత్తుగా, విచిత్రంగా అనిపించాడు మాకు. నలుపు, తెలుపు మచ్చలు ఉన్న కుక్క పిల్లని మెడకు తాడుకట్టేసి ఎడం చేతిలో పట్టుకొని ఉండాడు.
మమ్మల్ని చూస్తానే ” ఒసే బాల నాగమ్మ.. ఈ మాయల ఫకీర్ సంగతి నీకు తెలియదే..! నా మాట వింటావా లేదా.. లేకుంటే నిన్ను మాయం చేసేస్తా..”అంటా సినిమాలో విలను నాగభూషణం మాదిరిగా పకపకా నవ్వతా నా చేతిని పట్టుకున్నాడు.
” కెవ్వు” మని ఒక్క అరుపు అరిచాను. భయంతో వణకతా చేయి వెనక్కి లాక్కుంటా ఉండాను. సునీత దూరంగా లగెత్తింది.
“మీ బుజ్జమ్మా.. నా కళ్ళల్లోకి చూడు. నేను ఎవురో గవనానికి రావడంలేదా నీకా” అన్నాడు అతను నా చేయి వదలకుండానే.
కాస్త దడ తగ్గింది నాకు. తల పైకి ఎత్తి అతని కళ్ళల్లోకి తేరిపారగా చూసాను. అంతే నా పెదాల నవ్వు పువ్వులు జల జలా రాలాయి. అతను మా సెంటర్ లో తండాలు వ్యాపారం చేసే కరీమ్ సాయిబు. రోజు సాయంత్రం అయింది మొదలుకొని మా ఇంట్లో బాడుగకు ఉండే కరీముల్లా రిక్షా అంగడికాడికి వొచ్చి రిక్షావోల్ల కాడ తండలు డబ్బులు దండుకుంటుంటాడు.
” నువ్వు కరీమ్ సాయిబు కదా ” అన్నాను.
” అవును మీ. ఎట్టా ఉండాది నా మాయల ఫకీర్ వేషం ” అన్నాడు. సునీత మా అమ్మిడికి వచ్చేసింది. కరీం సాయిబుని ఆ వేషంలో చూసేతలికి మాకు నవ్వు ఆగలేదు. చానాసేపు నవ్వి నవ్వి కళ్ళలో నీళ్ళు వొచ్చినాయి మాకు. నవ్వు ఆపుకుని
” చానా బాగుండాది ఈ వేషం. మరి ఈ కుక్క పిల్ల ఎందుకు ” అన్నాను.
” మాయల ఫకీరు బాలనాగమ్మని కుక్కపిల్లని చేసి తన వెంట తిప్పుకుంటాడు కదా. ఆ కథ తెలీదా నీకా ” అన్నాడు.
” ఆ..ఆ.. మా కాక్క చెప్పింది గవనానికి వచ్చింది లే. ఐతే ఈ కుక్కపిల్ల బాలనాగమ్మ నా ” అన్నాను. మళ్ళా పకపకా నవ్వతా.
” అవును మీ. మరి నా దసరా వేషానికి డబ్బులు ఈరా ” అన్నాడు.
” మా నాయనని అడిగి రేపు తెచ్చి ఇస్తాలే ” అని నవ్వుకుండా బృందావనం పక్కకి లగెత్తినాము నేను, సునీత. బృందావనంలో ఇద్దరు ఆంజనేయస్వామి వేషగాళ్ళు కనపడినారు. బృందావనంలో ఉండే మా ఫ్రెండ్ కవిత వాళ్ళ ఇంటికి పోయినాం నేను, సునీత. కాసేపు వాళ్ళ ఇంట్లో తొక్కుడు బిళ్ళ అట ఆడుకున్నాం. కవిత వాళ్ళ అమ్మ మాకు చెరో రెండు నిప్పట్లు [అరిసెలు] ఇచ్చింది తినమని. నిప్పట్లు తిని కడుపు నిండా నీళ్ళు తాగినాం. ఒంటిగంట అయినా ఇక మాకు ఆకలి తెలియలేదు.
కవిత వాళ్ళ ఇంటికాడ నుంచి కనకమహల్ సెంటర్ కాడ ఉన్న బాబు ఐస్ క్రీం అంగడి దాక పోయినాం. అక్కడ సీత రాముడు, ఇంకో ఆంజనేయస్వామి వేషగాళ్ళు మాకు ఔపడినారు. ఆడ నుంచి ట్రంక్ రోడ్ సెంటర్ దాటుకుని గాంధీ బొమ్మ కాడికి వొచ్చినాము. ఆడ కోఆపరేటివ్ బ్యాంకు తావులో గోడకి వారగా నిలిపి ఉండే ఆటో రిక్షా సెంటర్లో నిన్నటి పులివేషగాళ్ళు మళ్ళా తప్పెట్లకి అనుగుణంగా ఆడతా ఉండారు. అరగంట సేపు ఆడనే ఉండి పులివేషాలా ఆట చూసి సాయిబాబా గుడి పక్క నించి ఇంటికాడికి లగెత్తినము. ఆ తర్వాతి రోజు సరస్వతి దేవి పూజ. పొద్దునే నిద్రలేపేసింది అమ్మ. తలకు స్నానం చేయించింది నాకు.
తెల్లటి చీరలో శాంతి దూతలా, చేతిలో వీణ పట్టుకుని నమ్మి విశ్వాసం ఉంచి కృషి, సాధన చేసిన వారికి నేను ఎప్పుడూ జ్ఞాన సంపదను అందిస్తూనే ఉంటాను అన్నట్లు చల్లని చూపులు చూసే సరస్వతి దేవి విగ్రహానికి పూజ చేసి టెంకాయ కొట్టి, పొంగలి నైవేద్యం పెట్టింది అమ్మ. ఇంట్లో అందరం భక్తిగా సరస్వతి అమ్మవారికి దణ్ణం పెట్టుకున్నాం.
ఆ రోజు నాస్తా చేయలేదు అమ్మ. బెల్లం పొంగలి తిని, నాయన దగ్గర గారాలు , అమ్మ దగ్గర తిట్లు కూడా తిని ఇంటినుంచి బయట పడి రాంమూర్తి నగర్లో ఉండే సురేఖ వాళ్ళ ఇంటికాడికి పోయినాను.
అప్పటికే ఆడ సునీత, రాధ వొచ్చి ఉండారు. విజయదశమికి ఇంక రెండు రోజులే ఉండాది. ఆ తర్వాత సెలవలు అయిపోయి బడి తెరుస్తారు. దసరా వేషాలు కూడా ఉండవు. ఈ మూడు రోజుల్లోనే అన్ని వేషాలు చూసేయాలని వీధుల్లో పడ్డాం మేము. రాంమూర్తి నగర్ చివరన ఉండే సుబ్బారావు ఆసుపత్రి వీధిలో జోకర్ మాదిరిగా పొడుగు టోపీ పెట్టుకుని, విచ్చిత్రమైన రంగురంగుల గుడ్డలు కట్టుకుని ఒకాయన మాకు ఔపడినాడు. ఆయన కాడ కూడా నలుపు, తెలుపు మచ్చల కుక్కపిల్ల ఉండాది. మమ్మల్ని చూస్తానే అతను ” ఒసేయ్..బాలనాగమ్మ..నిన్ను పట్టుకు పోతా ” అంటా పెద్దగా అరస్తా వొచ్చినాడు.
అతన్ని చూడంగానే నేను గుర్తుపట్టేసాను. ఇక నవ్వు ఆగలేదు మాకు. అతను మా రిక్షా చెంచురామయ్య. ” అరే చెంచురామయ్య..నువ్వు కూడా మాయల ఫకీరు వేషం వేసావా ” అన్నాను.
” నన్ను కనిపెట్టేశావా బుజ్జమ్మా..” అన్నాడు చెంచురామయ్య పళ్ళన్నీ బయట పెట్టి నవ్వతా.
” అది సరే. ఈ కుక్కపిల్ల యాడిది నీకు. మొన్న కరీమ్ సాయిబు కాడ కూడా ఈ మాదిరి కుక్క పిల్లనే చూసినాము మేము” అన్నాను.
ఆ మాదిరి కాదు బుజ్జమ్మా..అదే కుక్కపిల్ల ఇది. మా ఇళ్ళ కాడ “వనమ్మ ” అని ఉండాది. ఆమెది ఈ కుక్కపిల్ల. ఆయక్కని బతిమాలి ఈ కుక్కపిల్లని ఈ రోజుకి ౩౦ రూపాయలకు బాడుగకు తెచ్చుకున్నాను” అన్నాడు.
” ఏందే..! కుక్కపిల్లని బాడుగకు తెచ్చుకున్నావా ” అందరం ఒకే తూరి ఆడిగినాము చెంచురామయ్యని ముక్కు మీద వేలేసికుంటా
” అవును బుజ్జమ్మా. మన విజయమహల్ రైలు గేటుకి ఇవతల, అవతల పక్క కలిపి నలుగురు మాయలఫకీరు వేషాలు వేసినారు. బాలనాగమ్మకోసం కుక్క పిల్ల మాత్రం ఎక్కడ ఎతికినా దొరకలేదు. వీధి కుక్కలు ఒక్క గంట కూడా మా కాడ ఉండకండా తప్పించుకుపోయినాయి. దాంతో నలుగురం వొంతులు వేసుకుని వనక్కని అడిగి రోజుకొకరం ఈ కుక్కపిల్లని తెచ్చుకున్నాం. సాయంత్రం లోగా దండిగా డబ్బులు దండుకోవాలి ” అంటా కుక్కపిల్లని లాక్కొని గబగబా పోయినాడు”
అదన్నమాట సంగతి. ఒక బాలనాగమ్మని నలుగురు మాయల పకీర్లు వీధుల్లో తిప్పతా ఉండారు. విజయదశమి లోగా మిగిలిన ఇద్దరు మాయల పకీర్లను కూడా చూసేయాలి అని నవ్వుకుంటా మేము అన్నాలు తినేదానికి ఇళ్ళ దారి పట్టినాము.

2 thoughts on “ఒక బాలనాగమ్మ..నలుగురు మాయల పకీర్లు”

  1. నెల్లూరు అంతా తిప్పి చూపించావు రోహిణి. మన చిన్ననాటి జ్ఞాపకాలు దసరా వేషాలు అవీ గుర్తుకొచ్చాయి. నిజంగానే నెల్లూరు అంతా తిరిగినట్టు ఉంది. చాలా బాగుంది రోహిణి.

    Reply
  2. రోహిణి గారు దసరా పండుగ అంతా భలే గడుపుతున్నారు పిల్లలు.. వారి ఊరికే ఉత్సాహం ముందు అన్ని బలాదూర్.. ఆ పగటి వేషగాళ్ళు పిల్లల కేరింతలు ఆ పులి వేషాగాళ్ల విన్యాసాలు కళ్ళకు కట్టినట్లు రక్తి కలిగింది.. మాండలిక భాష లో ఉత్సాహంగా ఇప్పటికిప్పుడు వీధుల్లో జరుగుతున్నట్లు గా భలే విసదీకరించారు.. చాలా చాలా బాగుంది మీ కథ కథనమ్..
    మీకు నా అభినందనలు

    Reply

Leave a Comment