క్రింది కవిత “ఎన్ని ఉగాదులొస్తేనేంప్రజా శక్తి స్నేహ వీక్లీ లో 31-03-2019 న ప్రచురితమైంది. చదివి మీ అభిప్రాయాలూ తెలుప ప్రార్ధన.

—————————————————————————————————————————

ఎన్ని ఉగాదులొస్తేనేం
కాంక్రీటు కీకారణ్యంలో భూతద్దమేసినా
కానరాని పచ్చదనం కాలుష్యం
కోరల కింద సమాధి అవుతుంటే
మూగబోయింది కోకిలమ్మ కంఠస్వరం…
ఎన్ని ఉగాదులొస్తేనేం…
నీరులేక, నారులేక, మడులులేక
నెర్రలు బారిన నేలలో కరువు దేవత
కరాళ నృత్యం మాడుతుంటే
పురుగుల కోసం తెచ్చిన మందే
రైతన్న గొంతులో గరళంలా దిగి
అచేతన అవస్థను అందిస్తుంటే….
ఎన్ని ఉగాదులొస్తేనేం…
కట్నమో, ప్రేమో, కామమో
పైశాచికత్వమో మొగుడో , ప్రియుడో , అనామకుడో
కని పెంచిన తండ్రో
ఎవరైతేనేం,ఇంటి మహాలక్ష్మి అంటూనే
కుత్తుక తెగ నరికినపుడు…
ఎన్ని ఉగాదులొస్తేనేం …
ఎన్నిసార్లు ఎన్నికలొస్తేనేం
అధికారం కోసం కులమతాల కార్చిచ్చును
రగిల్చి ఆ దహనంలో చచ్చిపడుతున్న
శవాల గుట్టలపై విలయతాండవం చేసే
విషనాగులు లాంటి నాయకులు
ఉన్నంతకాలం…
ఎన్ని ఉగాదులోలొస్తేనేం …

నా కళ్ళ ముందు జరిగిన కొన్ని సంఘటనలకు, నాకు కన్నీళ్ళు తెప్పించిన వాస్తవ ఘటనలకు మనసు చలించి ఆ అనుభవాలను కథలుగా రాయడం ప్రారంభించాను. ప్రముఖ పత్రికల్లో యాభై కథలదాకా ప్రచురితం అయినాయి. . నవ్య వీక్లీ, విశాలాక్షి, వైశానక ప్రభ పత్రికలు నిర్వహించిన కథల పోటీలో బహుమతులు కూడా పొందాను.
guest
0 Comments
Inline Feedbacks
View all comments