చిన్నప్పుడు నేను తిన్న మొలగొలుకుల బియ్యపు అన్నం ఇప్పుడు నా చేత నెల్లూరు కథలు (విజయ మహల్ సెంటర్ కథలు) రాయించింది అంటారు ప్రముఖ సాహితీవేత్తలు, సాహితీ విమర్శకులు Chandrasekhar Boddapti శ్రీ చంద్రశేఖర్ బొడ్డపాటి గారు. గుంటూరు నుంచి వెలువడే పత్రిక “రేపటి కోసం” ఈనాటి సంచికలో ఇంకా విజయ మహల్ సెంటర్ కథలు గురించి వారు ఏమన్నారో చదవండి. చంద్రశేఖర్ బొడ్డపాటి గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు.


ఎద ఊసుల ఊయలలు…’
బొడ్డపాటి చంద్రశేఖర్
ఆంగ్లో పన్యాసకులు
99511 31566
ఈ గాలీ ఈ నేలా…ఈ ఊరు సెలయేరు..నను గన్న
నా వాళ్ళు…నా కళ్ళ లొగిళ్ళు…అన్న సిరివెన్నెల మాటలు మనం పుట్టి పెరిగిన ప్రదేశంతో మన అనుబంధాన్ని, మమేకత్వాన్ని, ప్రేమను చెప్పటం లేదూ…!
మనం పుట్టిన ఊరు, నడయాడిన వీధులు, చూసిన మనుషులు, పరిచయస్తులు, చదివిన స్కూలు, చిన్ననాటి స్నేహితులు, ఉపాధ్యాయులు—
ఇలా ఎన్నోన్నో.. ఎందరెందరో ! మన చిన్ననాటి మధురస్మృతులు మనసుపొరల్లో *ఘనీకృతమవుతాయి.*
మన ఆలోచనాశీతలపవన తాకిడికి అవి ద్రవించి, ఆ ఆనందం జలపాతమై మనల్ని చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.అదిగో, రోహిణి వంజారి…
నిక్షిప్తాల సంగమమే ఈవిజయ మహల్ సెంటర్…
తను, తన ఊహలు, ఆలోచనలు పెరుగుతూ, ఎలా పరిణతి చెందాయో చెప్పే ఆమె మనసుల ఊసులే ఈ పుస్తకం !
రండి… వాటిని మనమూ పంచుకుందాం…ఆ ఊసుల ఊయల్లో ఊగుతూ మన జ్ఞాపకాల
దొంతరులను కదిలిద్దాం… రండి..!
**నెల్లూరు నడిబొడ్డులో విజయమహల్ సెంటర్ నాలుగురోడ్ల కూడలిలో ఉన్న ఇంటికి కొందరు
మహిళలు నీళ్లు పట్టుకునేందుకు వచ్చేవారు. నీళ్లు తీసుకువెళుతూ కొన్ని కబుర్లు ఆ ఇంటి ఇల్లాలికి ఇచ్చి వెళ్ళేవారు.అప్పుడు చిన్నపిల్లగా ఉన్న ఆవిడ కూతురు వాటిని ఎంతో ఆసక్తితో వింటూఉండేది.భవిషత్తులో తాను అక్షర
సృజనశీలి నవుతానని,అవన్నీ కథలవుతాయనీ
ఊహ, ఆలోచనా శక్తి, లేని వయసు. ఆనాటి ఆ చిన్నపిల్లే..ఈ పుస్తకములోని బుజ్జమ్మ.. ఆమె ఈ పుస్తక రచయిత్రి శ్రీమతి రోహిణి వంజారి.
ఈ శ్రవణాసక్తత ,కుతూహలం ఆమెకు ఆ ప్రాంతపు మాండలికం, యాస, వ్యవహారికభాష మీద పట్టు నిచ్చాయి.ఓ సహజత్వానిచ్చాయి.ఆమె
పలుకులకు నెల్లూరు మొలకొ( గో )లుకుల పదును
నిచ్చాయి.అవి ఎంతో అలవోకగా ఆమెకథనంలోకి ఒదిగిపోయి.హాయిగా సాగే, ఆహ్లాదమైన శైలిగా రూపుదిద్దుకున్నాయి.ఇదే రచయిత్రి రోహిణి బలం.
**బుజ్జమ్మ అనే పాప తన చుట్టూ ఉన్న ప్రపంచం, దానిలో మనుషులను,వారి జీవితాలను చూస్తూ వాటినే ఇతివృత్తాలుగా చేసుకున్న కథలే ఈ పుస్తకంలో ఉన్నవి . ప్రతి పాత్ర జీవితం నుండి వచ్చినదే.
*వొజ్రం ఇలువ అనే బాల్య స్మృతి బుజ్జి తన తండ్రి అయ్యవారికి ఫీజుగా ఇవ్వమనిచ్చిన పావలాను మురికి కాలువలో పారేసుకుంటుంది. బుజ్జి తన తండ్రి ఏమంటాడోనని భయడుతుంది. దాన్ని రోహిణి చక్కగా చూపించారు.
స్కూలు కి వెళ్లకుండా వెనక్కువచ్చిన బుజ్జిని తండ్రి ఏమైందో తెలుసుకుని, కూతుర్ని వెంటబెట్టుకుని ఆ మురికి కాలువ దగ్గరకు వెళ్లి, దానిలో చేయి పెట్టి వెతికి,ఆ పావలాను దక్కించుకున్నాడు.
“నువ్వు కష్టపడి సంపాయించిన డబ్బు సామే అది.
యాడికి పోదు. వొజ్రం ఇలువ మాదిరి ఇలువైంది. ”
ఈ మురికి కాలువ వెతుకులాట మొత్తాన్ని చూసిన చెలమయ్య అన్న మాటలు.
అప్పుడు బుజ్జి ఏమనుకుందో చూడండి..
“ అయ్యో, నాయన నా కోసం ఎంత కష్టపడతా
ఉన్నాడో అని…అది మెదలు నేను ఇంకెప్పుడూ డబ్బులు అజాగ్రత్తగా పారేసుకోలేదు . ”
**సినిమాలు, సినిమా యాక్టర్లంటే జనాలకు ప్రత్యేకించి విద్యార్థులకుండే పిచ్చి ఎలా ఉంటుందో చెప్పే కథ.. చిరంజీవే నా మొగుడు…ఎన్. టి. రామారావు, అక్కినేని పెద్దవాళ్ళు అయిపోయారని తరువాత వచ్చిన కృష్ణ,శోభన్ బాబులకు డాన్సు చేయడం రాదని, మంచి స్టెప్పులతో డాన్సు లు వేసే చిరంజీవే గొప్ప అనే బుజ్జెమ్మ, ఆమె స్నేహితుల మధ్య వాదన. అతని పక్కన నటించిన రాధిక రాధ, సుహాసినిలంటే అసూయ ! ఎందుకు ?
.. అతని పక్కన నటించినందువల్ల. స్నేహితులతో జరిగిన వాగ్వివాదంలో..చిరంజీవిని పెళ్లిచేసుకుంటావా, ఏమిటి అన్న ప్రశ్నకు అవును
అనేస్తుంది బుజ్జమ్మ. అదీ ఆ వయసులో ఉండే ఆరాధన. అందరిలో ఉండే ఈ వ్యామోహన్ని బుజ్జి పాత్ర ద్వారా చెప్పించారు రోహిణి వంజారి.
మనమూ బుజ్జమ్మలమే కదూ ఇటువంటి విషయాల్లో.!
** కర్పూర దీపం.. అన్న ఒక్క కథను విశ్లేషిస్తాను.
“ దీపావళి పండగ అయి రెండు దినాలే అయింది. ఇలా ముందర కాల్చిపారేసిన లక్ష్మీ బాంబులు, తాటాకు టపాసులు, చిచ్చు బుడ్లు, రాకెట్
టపాసాల కాయితాలు గాల్లోకి ఇంతెత్తున లెగిసి
డాన్స్ ఆడతా ఉండాయి. ‘’
“నాలుగు దినాలనుంచి మునిసిపాలిటీ వొళ్ళు సమ్మె జెస్తా ఉండారు. ఈదులు చిమ్మే వొళ్లు రాలేదు. ”
కథావరణం చక్కగా ఏర్పరచి, పాఠకులను కథా జగత్తులోనికి రోహిణి ఎలా తీసుకువెళుతున్నారో
గమనించండి ! మునిసిపాలిటీ సమ్మె, ఎంతగా మనలను ఇబ్బంది పెట్టి, మనసును ఎంతగా ఆస్థిమితం చేస్తుందో చెప్పే కథ…కర్పూరదీపం…
“ నరసమ్మ సన్నగా, పొడుగ్గా, గెడకర్రలా ఉంటాది. చింపిరి జుట్టు. అతుకులేసి కుట్టుకున్న పాత పచ్చరంగు చీర…ఎలిక తోక మాదిరి ఏలాడతా ఉన్న పొట్టిజడ…బొడ్లో దోపుకున్న ఒక్కా కు…
చిల్లర డబ్బుల తిత్తి…వొక్కా నవలతా నోరు
…పళ్ళు ఎర్రగా ఔపడతాఉంటాయి..ఒక చేతిలో
పెద్ద బొక్కెన, ఇంకో చేతిలో రెండు ఇనపరేకులు ”
ఇది బహిరంగశౌచాలను శుభ్రం చేసే నరసమ్మ ఆహార్యం.
ఆమెను చూడగానే పోతున్న ప్రాణం
వచ్చినట్లయింది అందరికి..
“నువ్వు రాబాకు బుజ్జమ్మ, నేను దొడ్డి ఎత్తేదాకా.. ‘’
అంటూ పనిలోకి వెళ్ళింది నరసమ్మ.
“ ఆ కంపుతో నాకు వాంతి వచ్చింది నట్లయింది.
పాపం నరసమ్మ రోజూ అందరి ఇళ్లల్లో గబ్బు ఎలా భరిస్తుందో….! ” బుజ్జమ్మ మనసులో చెలరేగే
భావాలు … అవును.. మనలోనూ ఒకప్పుడు రేగినవి కాదా !
ముసురు పట్టి వారంరోజులుగా కుండపోతగా కురుస్తున్న వర్షం…నరసమ్మ జాడ లేనేలేదు…
దొడ్డి నరకంగా ఉంది…కొందరు పెద్దలు నరసమ్మ
గుడిసె దగ్గరకు వెళ్లారు…నరసమ్మ ను పిలిచారు.. ఎన్ని కేకలు పెట్టినా రాలేదు…తలుపు తోసుకుని లోపలకు వెళ్లిన వాళ్ళు అదిరిపడ్డారు.. వానలకి తాటిదూలం ఆమె తల మీద పడినట్టు ఉండాది.. తలమీద నించి మొకం మీదకు నెత్తురు కారి, ఎండిపోయి , ముద్దకట్టి ఉంది…. శాశ్వతంగా నిద్రపోతూ…!
ఇక్కడ రోహిణి వంజారి ఆమెను, ఆమె చేసిన సేవను కన్నతల్లి తన పిల్లలకు చేసే సేవతో పోలుస్తూ…
“మరి ఈ నరసమ్మ తల్లి !.. ఊరిలో అందరిని కన్నబిడ్డలుగా భావించి అందరి మలమూత్రాలు ఎత్తి పోసింది. కన్నతల్లిని మించిన ఈ తల్లి చేసిన
సేవకు విలువ ఎలా కట్టగలం !
ఆ తల్లి ఋణం ఎలా తీర్చుకోగలం…?
కథకు ముక్తాయింపుగా రచయిత్రి ఎంత గొప్ప వాక్యాలను రాసిందో చూడండి..!
“ ఆ క్షణం ఆ పూరి గుడిసెలో కులం, పరువు,
మతం, అంతస్తు , హోదాలనుమానవత్వం జయించింది. అందరూ చేతులెత్తి నరసమ్మ
నిర్జీవదేహానికి వందనం చేసారు. నరసమ్మ అంతిమ యాత్రలో ప్రతిఒక్కరు చేయి కలిపారు.”
** షిర్ ఖుర్మా అనే కథ ప్రేమాభిమానానికి కులమతాలు లేవని చాటుతుంది. ఈ విజయ మహల్ సెంటర్ పుస్తకంలో రోహిణి చెప్పిన ఊసులు ఆమె బాల్యపు పరిమళాలను, తీపి, చెడు జ్ఞాపకాలను,ఆ ప్రాంతపు సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, నాటి జీవితాన్ని దృశ్యాలుగా మన మనోయవనికలపై పరుస్తుంది.. కథలన్నీ ఏకబిగిన చదివించే గుణం ఉంది.
రోహిణి వంజారి పరిశీలనాశక్తికి అభినందనలు