ఉనికి

తెలుగు సొగసు ఆన్లైన్ పత్రిక “ప్రేమికుల దినోత్సవం” ప్రత్యేక సంచిక లో ప్రచురితమైన నా కవిత “ఉనికి” ❤❤

ఆమెకెపుడు నేను గుడ్ మార్నింగ్ చెప్పలేదు
తన అడుగుల సవ్వడే నాకు హిందోళరాగం
తననెప్పుడూ ఖరీదైన హోటల్కి తీసుకెళ్లలేదు
తనువండిన వంటలో ఏడో రుచినేదో కలిపేది
ఆ మధురమైన రుచి నాకు ఇంకెక్కడా దొరకలేదు
బహుశా ఆ రుచి పేరు అనురాగమేమో
తనకెప్పుడు నేను గులాబీలు ఇవ్వలేదు
తన నవ్వులతోనే ఇల్లంతా రంగులద్దుకునేవి
సాయంకాలమైతే చాలు తనచూపుల్ని
గుమ్మంలోనే వేలాడదీసేది
నన్ను చూడగానే తన కళ్లల్లో మెరుపులు
వాటితోనే రాత్రంతా వెలుగులు నింపేది
తనెప్పుడు నాకు ‘ఐ లవ్ యు’ అని చెప్పలేదు
నేను లేకుండా తన ఉనికి లేదంటుంది
తను లేకుండా నాకు బతుకు లేదంటాను
మేము ఇద్దరం ఆలూమగలం
మా ప్రేమ భాష మౌనం..

Leave a Comment