నమస్తే!
నేను వ్రాసిన ఈ కథ “ఇచుటలోని ఆనందం” జనవరి 2019 “ఉషోదయ వెలుగు” పత్రికలో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన.
—————————————————————————————————————————–
రాత్రి ఆలస్యంగా నిద్రపోయినా, పొద్దున లేచేసరికి ఏడు గంటలయ్యింది. అలా నిద్ర కళ్ళతోనే నడుస్తూ వచ్చి డైనింగ్ టేబుల్ వైపు చూచి ఉలిక్కిపడ్డాను. టేబుల్ మీద పెద్ద సైజు పుల్లారెడ్డి స్వీట్ల ప్యాకెట్టు దర్శనమిచ్చింది. రారమ్మంటూ ఊరిస్తూ.. ఓహో అప్పుడే మొదలైందన్నమాట, పండుగ రోజుల్లో మా ఇంటిపై జరిగే తియ్యని దాడి. కేలండర్ లో చూద్దునుగా నిన్న ‘ధన త్రయోదసి’ అని ఉంది. అదన్నమాట సంగతి. ఆ స్వీట్లు మా ఇంటి ఎదురు ఫ్లాట్ లో ఉండే మార్వాడీల అమ్మాయి డాలి’ తెచ్చి ఇచ్చుంటుంది. అనుకుని బ్రష్ చేసుకోవడానికి వెళ్ళాడు..
నా శ్రీమతి ఇచ్చిన కాఫీ తాగుతూ పేపర్ చూస్తున్నాను. అయినా మనసు పేపర్లోని వార్తల మీదకు పోవడం లేదు. నోరంతా చేదుగా ఉంది. మనసు మాత్రం టేబిల్ మీద ఉన్న స్వీట్ల ప్యాకెట్ మీద ఉంది. ఎప్పుడు స్వీట్లను నా కంట పడకుండా దాచేసే నా శ్రీమతి రేణుక పండుగల హడావిడిలో పడి మర్చిపోయినందుకు తనని తిట్టాలా వద్దా అని ఆలోచిస్తుండగానే మా ఇంటి నుంచి మూడో ప్లాట్ ఉంటున్న హిందీ వాళ్ళ పిల్లాడు ‘కైలాష్’ ఒక చేత్తో పాయసం గ్లాసు, మరో చేత్తో స్వీట్ల ప్యాకెట్టు సవ్యసాచిలా పట్టుకుని వచ్చి “అంకుల్ ఆజ్ కా దిన్ బాయ్ దూజ్ (భగినీ హస్త భోజనం) ఫెస్టివల్ మమ్మీ మీకు ఇవ్వమంది అంటూ తెలుగు హిందీ కలగలిపిమాటాడుతూ నా చేతుల్లో స్వీట్ ప్యాకెట్ పెట్టి, టేబిల్ మీద పాయసం గాసు పెట్టి వచ్చినంత వేగంగా బాణంలా దూసుకెళ్ళిపోయాడు .
అంతవరకు నిగ్రహంగా ఉన్న నా మనస్సు ఆ స్వీట్ల ప్యాకెట్ చూసే సరికి మెల్లగా నిగ్రహం సడలసాగింది. టేబిల్ పైన ప్యాకెట్ ఉంచేసి స్నానానికి వెళ్ళిపోయాను. స్నానాల గదిలో “వెన్నల రోజు ఇది పున్నమిరోజు అమావాస్యనాడు వచ్చే పండుగ రోజు కూనిరాగం తీసుకుంటూ మైసూర్ సాండిల్ సబ్బు నురగ పరిమళాలు వెదజల్లుతూ ఉంటే ఓ అరగంట పాటు స్నానం కానిచ్చి ఇవతలకు వచ్చాను. తల తుడుచుకుంటూ హాల్లోకి వచ్చి టేబిల్ మీద ఓ చూపు చూసి ఉలిక్కి పడ్డాను. టేబిల్ మొత్తం స్వీట్ ప్యాకెట్లతో నిండిపోయి ఉంది. అప్పటికీ నా శ్రీమతి కూడా యధాశక్తి మా పాప చేత చుట్టుప్రక్కల ఫ్లాట్ల వాళ్ళకి స్వీట్ ప్యాకెట్స్ పంపిస్తోంది. ఇన్ని ప్యాకెట్లు ఇచ్చి పుచ్చుకున్నా ఇంకా కొన్ని టేబుల్ మీద మిగిలిపోయి ఉన్నాయి. పుల్లారెడ్డి మిఠాయిలు, ఆత్రేయపురం నుంచి వచ్చిన నేతిపూత పూతరేకులు, బెంగాలీ రసగుల్లాలు, రకరకాలూ మిఠాయిలు ఉరిస్తున్నాయి. ఇక తమాయించుకోలేక రసగుల్లా స్వీట్స్ ఉన్న బాటిల్ తీసి స్పూన్లు ఓ రసగుల్లా తీసి నోట్లో వేసుకో బోయాను.
అంతలోనే.. వెనుక నుంచి చేతికి షాక్ కొట్టినట్టు అయి ఉలిక్కి పడి రసగుల్లా బాటిల్ లో వేసేసి మూత పెట్టేసాను. దసరా పండుగ నాడు ఇలాగే టేబిల్ మీద ఉన్న స్వీట్లు నోరూరిస్తే ఓ ‘మలయ్ కాజా’ని శ్రీమతి చూడకుండా దొంగచాటుగా నోట్లో వేసుకోవటం, గంటలోగా షుగర్ స్థాయి నాలుగువందలు హెచ్చటం, రెండు రోజులు ఆసుపత్రిలో ఉండి ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకుంటూ గడపడం , ఆ తర్వాత రోజు నుంచీ కాఫీ బదులు కాకరకాయ రసాన్ని పొద్దునే సేవించాల్సి రావటం అంతా సీరియల్ ఎపిసోడ్లు గుర్తుకు వచ్చి ముఖం తిప్పేసుకుని శ్రీమతి పెట్టిన ఇడ్లీలను కిక్కురుమనకుండా తినేసి ఆఫీస్ కి బయలుదేరాను.
పని హడావిడిలో స్వీట్ల గోల మరచిపోయాను. ప్రక్క రోజు సెలవు కావటంతో సాయంత్రం ఆరుగంటల దాక పని ఉండింది. ఓ అరగంట క్యాంటీన్ కి వెళ్ళి షుగర్ లెస్ కాఫీ తాగి ఫ్రెష్ అయి వచ్చేసరికి ఆఫీసులో నా టేబిల్ కూడా స్వీట్ల ప్యాకెట్లతో నిండిపోయి ఉంది. ఓ మోస్తరి ఆఫీసర్ కదా నేను లంచం పుచ్చుకోను కాబట్టి స్వీట్స్ ఇచ్చి అయినా పని చేయించుకోవాలని అనుకునేవారు కొందరు, నిజమైన అభిమానంతో ఇచ్చిన వారు కొందరు వెరసి వీళ్ళంతా నాకు ప్రియమైన శత్రువులు (స్వీట్లు ఇచ్చారు కాబట్టి).
ఒక విషాదకరమైన నవ్వు నా ముఖంలో తారాడింది. ఎందుకంటే” అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో ఏదో ఉన్నట్లు” అని ఇన్ని స్వీట్స్ ఉన్న ఒక్కటి తినడానికి లేదు. నా శరీరమే ఓ పెద్ద స్వీట్ ఫ్యాక్టరీ అయిపోయింది గా, అదేనండీ నా డయాబెటిస్ అస్వస్థత ,[ డిజార్డర్ ] (చక్కెర వ్యాధి). ఓ రెండు ప్యాకెట్లు అటెండర్ రాముని పిలిచి ఇచ్చాను. మిగిలినవి బ్యాగులో వేసుకుని ఇంటికి బయలుదేరాను. చీకట్లు కమ్ముకుంటున్నాయి. చలి కూడా పులిలా జనాలని ఇళ్ళలోకి తరిమేస్తోంది.
కార్మిక నగర్ దగ్గర పడగానే నా కారు వేగం తగ్గింది. అక్కడి రేకుల షెడ్డు ఇళ్ళు, పై కప్పుగా మందపాటి ప్లాస్టిక్ కవర్లు కప్పి ఉంటాయి. నగరంలో చెత్తను సేకరించి శుద్ధి చేసే కార్మికుల వాళ్ళు, ఆటో డ్రైవర్లు ఎక్కువగా నివసిస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో ఆడవాళ్ళు రోడ్డు మీదనే ఇళ్ళ ముందర చేరి మాట్లాడుకుంటూ ఉంటారు. చిన్నపిల్లలు పనికిరాని టైర్లు, చెత్తలో దొరికిన వస్తువులతో ఆడుకుంటుంటారు. పెద్దవాళ్ళు (ముసలి) ఓ మూలకి చేరబడి దీనంగా దిక్కులు చూస్తూ ఉంటారు. అన్నీ ఇళ్ళలోను లేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటుంది. ఇళ్ళతో పాటు అక్కడ పిల్లల ఒంటిలో కూడా లేమి కనిపిస్తూ అందరూ బక్కచిక్కి ఉంటారు.
రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు అక్కడ జీవితాలు గమనిస్తూ వెళ్ళటం నాకో అలవాటు అయింది. ఇంట్లో డబుల్ కాట్ మీద రగ్గు కప్పుకుని వెచ్చగా పడుకునే నాకు అక్కడ రేకుల షెడ్డు ఇంటి ముందు చీరని భుజం నిండా కప్పుకుని కూర్చున్న ఓ ముసలావిడ చలికి ఒణుకుతున్నట్టు కనిపించింది. ఎందుకో ఆ రోజు ఆ దృశ్యం నా మనస్సును కలిచి వేసింది. చటుక్కున ఓ ఆలోచన వచ్చింది. వెనుక సీట్లో ఉన్న నా లెదర్ కోటు తీసుకుని, కారు డోరు మూసి లాక్ చేసాను. మళ్ళా గుర్తొచ్చినట్లు లాక్ తీసి ఫ్రంట్ సీట్లో స్వీట్లు ఉన్న బ్యాగుని తీసుకుని డోర్ మూసేసి లాక్ చేసి ఆ రేకుల ఇంటి ముందు కూర్చుని ఉన్న పెద్దావిడ దగ్గరకు వెళ్ళాను.
బాగా మాసిన చీర కట్టుకుని అస్థిపంజరానికి చర్మం అతికించినట్లు ఎముకల గూడులా ఉన్న ఆమెను చూసి మనస్సు ద్రవించి పోయింది నాకు. బహుశ చనిపోయిన నా తల్లి వయస్సు ఉండవచ్చు ఆమెకి. దగ్గరకు పోయి ఆమె ముందు కూర్చుని “అమ్మ చలిగా ఉందా! ఇదిగో ఈ కోటు తొడుక్కో అని ఇచ్చాను. ఆమె కళ్ళల్లో ఏదో సంశయంతో కూడిన వెలుగు. అనుమానంగా చూస్తునే కోటు తీసుకుని నీ పేరు ఏంది బిడ్డా అంది” నా పేరు మూర్తి అని చెప్పి బ్యాగులోంచి ఓ పెద్ద స్వీటు ప్యాకెట్టు తీసి “అమ్మా ఈ రోజు పండుగ కదా! ఈ స్వీట్ తిను అని ప్యాకెట్టు లోనించి ఓ స్వీటు తీసి ఆమె నోటికందించాను. ఆవిడ గబగబా స్వీటుని తినేసింది. ఈ స్వీట్లన్నీ నీకే అమ్మా తీసుకో అని ప్యాకెట్ ఆమె చేతికిచ్చాను.
ఆమె కళ్ళల్లో దీపావళి కాకరవత్తుల మెరపులు కనిపించాయి నాకు. “బిడ్డా…నువ్వు ఎవరోకాని పెద్దింటి బిడ్డవు లెక్క ఉన్నావు. నా తానకొచ్చి ఎవరూ బువ్వ తిన్నావా అని అడిగేవోళ్ళు లేరు. నా కోడలు ఎప్పుడో అంత కూడు ముందేసి పోతుందంతే. ఈ పొదు నువ్వు వొచ్చి మిఠాయి తినిపించావు నాకు. నేను మిఠాయి తిని ఎన్ని ఏళ్ళయిందో బిడ్డా నువ్వు చల్లగా ఉండాలి. ఆ పోచమ్మ తల్లి నిన్ను సల్లగా చూసుద్ది” అన్నది పెద్దావిడ. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.
ఇంతలో మా మాటలకు ఆ చుట్టు ప్రక్కల ఆడుకుంటున్న పిల్లలు నా దగ్గరికి వచ్చారు. అందరూ చిరుగుల చొక్కాలు వేసుకుని దీనంగా కనిపించారు. బ్యాగులో ఉన్న మిగతా ఐదారు స్వీట్ల ప్యాకెట్లు వాళ్ళకిచ్చేసాను. వాళ్ళంతా ఆనందంగా స్వీట్లు తింటుంటే ఇన్ని రోజులు కలగని ఆనందం ఆ రోజు నాకు కలిగింది. వాళ్ళంతా స్వీట్లు తింటుంటే నా నోరు, మనస్సు తృప్తి అనే తియ్యదనంతో నిండిపోయింది ఎంతో డబ్బు పెట్టి స్వీట్లు కొని పండుగలప్పుడు మనం తిని, తినక ప్రక్కింటి, ఎదురింటి వాళ్ళకు పంచటం (అంతా డబ్బున్న వాళ్ళే) లేదంటే మురగబెట్టి పారేయటం, ఇంకా చెప్పాలంటే తిందామన్న తినలేని షుగర్, అజీర్తి రోగాలతో తినాలని తాపత్రయపడి తినటం అవి అరక్క డైజీన్ మాత్రలో, ఇన్సులిన్ ఇంజక్షనో మళ్ళీ తీసుకురావాల్సి రావటం, పిల్లలు బాగా తినేసి వయస్సును మించిన బరువు పెరిగి ఒబిసిటీ ప్రాబ్లమ్ ని కొని తెచ్చుకోవటం..! కానీ అక్కడ పూటగడవటానికి కష్టపడే కార్మికనగర్ వాసుల్లో కనీసం రెండుపూటల మంచి భోజనం కరువైన వాళ్ళకు స్వీట్లు కొనే స్తోమత ఎక్కడుంటుంది.
ఆ పెద్దావిడకు వెళ్ళి వస్తానని చెప్పి, స్వీట్లు ఆనందంగా తింటున్న పిల్లల వైపు తృప్తిగా చూస్తూ కారులోకి వచ్చి కూర్చున్నాను. ఇక నుంచి పండుగలప్పుడు మా ఇంట్లో జరిగే ఈ తియ్యటి దాడిని ఎలా ఎదుర్కోవాలనే విషయం నాకు బోధపడింది. ఇంట్లో ఉన్న స్వీట్లని కూడా తెచ్చి అందరికీ పంచేయాలని నిర్ణయించుకున్నాను. ఆ రోజు ఒకరికి ఇచ్చుటలో ఉండే ఆనందం అంటే ఏమిటో నాకు తెలిసి వచ్చింది. ఇచ్చుటలో ఉండే తియ్యటి ఆనందాన్ని ఆ రోజు సంపూర్ణంగా అనుభవించాను నేను.