ఆరోగ్య యోగం..అందరికీ అందాల్సిన ఫలం – సంపాదకీయం 4

విమల సాహితీ నాలుగో వారం విజయవంతంగా మీ ముందుకు విందు భోజనం తెచ్చిపెట్టింది. ఆస్వాదించడమే మీ వంతు..

హక్కుల గురించి మాట్లాడేటప్పుడు బాధ్యతలను విస్మరించకూడదు అని మన రాజ్యాంగం చెపుతోంది. అందరూ ఆరోగ్యం కలిగి ఉండడం మన హక్కు అనుకుంటే, ఆరోగ్యం ని పొందడం కోసం మన వంతుగా మనం ఎంత బాధ్యతతో వ్యవహరిస్తున్నాం అనేది ఎవరికి వారు వేసుకోవాల్సిన ప్రశ్న.
పక్క వారిని పలకరించడానికి కూడా సమయం లేని బిజీ లైఫ్. ఉరుకుల పరుగుల ఉద్యోగాలు. ఏ చోట ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా, అనుక్షణము అరచేతిలో సెల్ ఉండాల్సిందే. పనికి రానిసమాచారం, వీడియోలుతో చెత్త బుట్టలుగా మారిన మెదళ్ళు. ఒక బుర్ర నుంచి మరో బుర్రకు ఈ చెత్తను వ్యాప్తి చేయడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. మూడేళ్ళ పసిబిడ్డకు కూడా అన్నం తినిపించాలంటే చేతిలో సెల్ ఫోన్ ఇచ్చి, కదిలే బొమ్మలు చూపుతూ తినిపిస్తున్నారు నేటి తల్లులు. ఎదిగే బిడ్డలకు ఇది వ్యసనంగా మారి, ఎన్ని ప్రమాదాలను తెచ్చిపెడుతుందో తెలియడం లేదు.
ఇక ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనపరులే. ఇద్దరికీ ఆఫీసులో ఎడతెగని పని. ఇంటికొస్తే పని చేసుకునే ఓపిక ఉండదు. ఆర్డర్ చేస్తే స్విగ్గీ,జొమాటో వాళ్ళు రెడీగా ఇంటిముందుకొచ్చి కోరిన ఫుడ్ ఇచ్చిపోతారు. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా పిజ్జా, బర్గర్, నానా రకాలైన జంక్ ఫుడ్లకి అలవాటు పడిపోయారు. ఇంటి నిండా ఆధునిక సౌకర్యాలతో కూడిన ఎలక్ట్రానిక్ యంత్రాలు. కింద కూర్చుని పప్పు రుబ్బే పనిలేదు. బట్టలు చేతులతో ఉతికి జాడించే అవసరంలేదు. అన్ని పనులు యంత్రాలు చేస్తున్నాయి. పక్క వీధిలో ఉన్న అంగడికి పోవాలన్నా స్కూటీనో, స్కూటరో వాడుతారు తప్ప నాలుగు అడుగులు వేయాలంటే బద్ధకం. ఏ పని చేయని ఫలితం ఊబకాయం. చిన్న అనారోగ్యానికి కూడా కార్పొరేట్ ఆసుపత్రుకి పోవడం. అక్కడ ఫీజులు, అనవసరపు ఆరోగ్యపరీక్షలకు వేలు, లక్షల్లో డబ్బు ఖర్చు. పోనీ అంత ఖర్చు పెడితే, ఆరోగ్యంగా ఇంటికొస్తామనే భరోసా లేదు ఈ రోజుల్లో. ఇన్ని అనర్ధాలకు కారణం ఆరోగ్యం పట్ల శ్రద్ద, కనీస అవగాహన లేకపోవడం.
చిన్న చిన్న అనారోగ్యాలకు డాక్టర్ దగ్గరకు పోకుండా ఇంటిదగ్గరే స్వస్థతను చేకూర్చే దివ్య ఔషధం మనకి ఉంది. అదే యోగా. ప్రాచీన కాలంలోనే పతంజలి మానవ ఆరోగ్యంలో యోగాసనాల పాత్ర గురించి “యోగ శాస్త్రం “అనే గ్రంథం రాశారు. పైసా ఖర్చు లేకుండా, ఇంటిదగ్గరే యోగాసనాలు వేయడం ద్వారా గొప్ప ఆరోగ్యాన్ని అందరూ సొంతం చేసుకోవచ్చు అనేది ఆ గ్రంథ మూల సారాంశం.
ఆరోగ్యం అంటే ఒక్క శారీరకమైనదే కాదు. మానసికం కూడా. శరీరం, మనసు రెండు ఉల్లాసంగా ఉన్నప్పుడే ఏ వ్యక్తి అయినా సంపూర్ణ ఆరోగ్యవంతుడు కాగలడు.శారీరక ఆరోగ్యానికి యోగాసనాలు ఎంత ముఖ్యమో, మానసిక ఆరోగ్యానికి మెడిటేషన్ అంతే ముఖ్యం. మనసులో సుడులు తిరిగే ఆలోచనలను అదుపుచేస్తూ, శ్వాస మీద ధ్యాసను మళ్లించడమే ధ్యానం. పన్నెండు రకాల ఆసనాలు కలిపి సూర్యనమస్కారాలు, ప్రాణాయామం, శరీరంలోని ప్రతి ఒక్క కణానికి ఉత్తేజం కలుగజేసే కొన్ని యోగాసనాలు [భుజంగాసనం, త్రికోణాసనం, పవన ముఖ్తాసనం, శీర్షాసనం, ఛత్రాసనం మొదలైనవి] మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతులను చేస్తాయి. జీవితంలో వారు ఆసుపత్రి మెట్లు ఎక్కాల్సిన అవసరం ఉండదు అనడం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు.
ఆరోగ్య ఫలాలు అందరికీ అందించాలని 2014 సెప్టెంబర్ 27న భారత ప్రధాని నరేంద్రమోడీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21 న జరుపుకొనుట గురించి ప్రతిపాదన చేసారు. ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 దేశాల ప్రతినిధులు మద్దతు ఇచ్చారు.
యోగ అనేది ఏ ఒక్క మతానికో, కులానికో సంబంధించినది కాదు. ధ్యానం అనేది ఏ దైవ ప్రార్ధన కాదు. మన శరీరం, మనసులను మన అదుపులో ఉంచుకునే దివ్యామృతం. ఈ నెల 21 వ తేదీ “అంతర్జాతీయ యోగా దినోత్సవం” సందర్భంగా మా “విమల సాహితీ ” పాఠకులందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు.


రోహిణి వంజారి
సంపాదకీయం

Leave a Comment