ఆరోగ్యమే ఆనందం -2

ఆరోగ్యమే ఆనందం పార్ట్ 2. జూన్ నెల సాహూ మాసపత్రికలో. మీ అందరికోసం..🙏🌹

శబ్ద, కాంతి, వాయువేగాలను మించిన వేగంతో పయనించే సాధనము ఏమిటో మీరు చెప్పగలరా..? ఇంకేముందండి అది మన మనసే. మనసు పయనించడానికి ఏ మాధ్యమం అవసరం లేదు. క్షణంలో వెయ్యోవంతు కాలంలో కోరుకున్నచోటికి చేరుకోగలదు. అట్లని మనసు స్థిరంగా ఉంటుంది అనుకోవడం పొరపాటే. మహా చంచలమైనది మనసు. మరి మనసుకు కళ్లెం వేసి ఓ చోట నిలపాలంటే దానికి నిరంతర సాధన కావాలి.
పోయిన నెల యోగ, ధ్యానంలో ప్రాథమిక సాధన అయిన “పద్మాసనం” గురించి తెలుసుకున్నాం కదా. ఈ నెల “వజ్రాసనం” గురించి తెలుసుకుందాం. పద్మాసనం సరిగా వేయలేని వాళ్ళకు ఈ వజ్రాసనం వజ్రసమానమైన దేహాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.
వజ్రాసనం వేయు విధానం: యోగ మాట్ లేదా దళసరిగా మడతలు వేసిన దుప్పటిమీద
మోకాళ్ళను నెమ్మదిగా మడిచి పాదాలను చాపి కూర్చోవాలి. రెండు కాళ్ళను దగ్గరగా చేర్చాలి. చేతులను మోకాళ్ళ దగ్గర ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉంచి మెల్లగా ఊపిరి పీలుస్తూ, వదులుతూ ఉండాలి. వజ్రాసనంలో కూర్చున్నప్పుడు చక్కగా కళ్ళు మూసుకోవచ్చు. పద్మాసనం కంటే చాల తేలికగా వజ్రాసనం వేయవచ్చు మరియు ఎక్కువ సమయం అంటే కనీసం ఐదు నిముషాలైనా మనం వజ్రాసనంలో చాల సులభంగా కూర్చోగలుగుతాం. దేహానికి ఎక్కువ శ్రమ లేదు కాబట్టి మనసును స్వాధీనంలోకి తెచ్చుకోవడానికి ఈ వజ్రాసనం చాల ఉపయుక్తమైనది. మనోదృష్టిని మనకు ఇష్టమైన అంశం [దైవ ప్రార్ధన, నచ్చిన సంఘటనలు, నచ్చిన వ్యక్తులు, ఇష్టమైన పూలు, మనం చూసిన ప్రకృతి రమణీయమైన దృశ్యం] ఇలా ఏదో ఒక అంశంమీద మనసును నిలిపే ప్రయత్నం చేస్తుంటే, సాధన చేసేకొద్ది మనసు మన ఆధీనంలోకి వచ్చి, మరికొంత కాలానికి మనసును ధ్యానం మీదకు మళ్లించవచ్చు.
వజ్రాసనం వల్ల ఉపయోగాలు:

1. భోజనం చేసిన అర్ధగంట తర్వాత వజ్రాసనం వేస్తే జీర్ణశక్తి వృద్ధి చెందుతుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నవారికి ఈ ఆసనం చాల ఉపయోగకరం.

 1. మోకాళ్ళు చాల దృడంగా తయారవుతాయి.
 2. దేహ గ్రంథులన్నీ చాల చురుకుగా పనిచేస్తాయి.
 3. వజ్రాసనం క్రమం తప్పకుండా వేస్తుండడం వల్ల వెన్నుముక నిటారుగా, దృడంగా రూపుదిద్దుకుంటుంది.
 4. గర్భం తో ఉన్నవారు వజ్రాసనం క్రమంగా యేయడంవల్ల సుఖప్రసవం జరుగుతుంది.
  మరి ఎంతో తేలికైన వజ్రాసనం రోజు ఓ ఐదు నిముషాలు సాధన చేయడం వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసుకున్నాం కదా. ఇంకెందుకు ఆలస్యం వజ్రాసనం వేసాద్దాం. ఆరోగ్యాన్ని పొందేద్దాం. ఆనందాన్ని ఒడిసి పట్టేద్దాం.
  బోనస్ గా రెండు వంటింటి చిట్కాలు:
 5. వేసవిలో నిమ్మకాయల వాడకం ఎక్కువ కదా. మరి నిమ్మకాయలను ప్లాస్టిక్ కవర్లో వేసి గాలిసోకకుండా ఫ్రిడ్జిలో పెడితే చాల రోజులు నిల్వ ఉంటాయి.
 6. సాంబార్, రసం చేసుకునేప్పుడు చింతపండు అప్పటికప్పుడు రసం తీయాలంటే కష్టం కదా. అందుకని వంట చేసే ఓ అర్ధగంట ముందు కావలసిన పరిమాణంలో చింతపండుని గోరువెచ్చని నీటిలో వేసి నానపెడితే చింతపండు రసం చాల తేలికగా తీసుకోవచ్చు.
  వచ్చే నెల సాహో లో మరో మంచి ఆసనంతో కలుద్దాం. అంతవరకూ సెలవు అండి.

Leave a Comment