అభిమతం

నమస్తే!

నేను వ్రాసిన ఈ కథ “అభిమతం” నవ తెలంగాణ ఆదివారం అనుబంధం పుస్తకం “సోపతి” లో 12-04-2020 తేదీన ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన.

————————————————————————————————————-

చరవాణి వసపిట్టలా మోగడంతో బద్దకంగా పక్కమీదనుంచే బల్లమీద ఉన్న చరవాణి ని అందుకుని ” హలో ” అన్నాడు రషీద్ మత్తుగా ఆవలిస్తూ. ” హలో రషీద్ భాయ్, మన సార్ వాళ్ళు సంగారెడ్డిలో ఉన్నారట” అన్నాడు డేవిడ్.

 నిద్రమత్తు ఇంకా వదలని రషీద్ ” డేవిడ్ భయ్యా, ఏ సార్ గురించి నువ్వు చెప్పేది.” అన్నాడు కాస్త అసహనంగా. ఏంటి రషీద్ నువ్వింకా నిద్రలేవలేదా? నేను చెప్పేది మన మూర్తి సార్ గురించి ” అన్నాడు డేవిడ్. ఆ మాటతో నిద్రమత్తు ఎగిరిపోయింది రషీద్ కి. ” ఏందీ భయ్యా నువ్వు చెప్పేది నిజమా? నీకు ఎలా తెలుసు వాళ్ళు అక్కడ ఉన్నారని ” ఆతృతగా అడిగాడు రషీద్. ” నువ్వు రెడీ అయి టీ బంకు దగ్గరికి కి రా ఇపుడు. అన్ని వివరాలు నీకు చెప్తాను ” అంటూ చరవాణి కట్టేసాడు డేవిడ్.

రషీద్ టీ బంకు దగ్గరికి వెళ్లేసరికి డేవిడ్ టీ కాస్తున్నాడు. బాగా మరగకాచిన పాలలో టీ పొడితో పాటు కాస్త యాలకుల పొడి, వెనిల్లా సుగంధ ద్రావకం నాలుగు చుక్కలు కలపడంతో ఆ సువాసన నాలుగు వీధులకు వ్యాపిస్తుంది. డేవిడ్ కాచే టీ కోసం ఎక్కడెక్కడినుంచో జనాలు వచ్చేవారు. చుట్టూ జనాలు టీ కోసం వేచి ఉన్నా, రషీద్ ని చూస్తూనే డేవిడ్ టీ కాచే పనిని అతని భార్య రాధమ్మ కి అప్పచెప్పి బయటకు వచ్చాడు. ఇద్దరు బంకు వారగా వేసిఉన్న బల్ల మీద కూర్చున్నారు.

“ఆ డేవిడ్ భయ్యా, ఇపుడు చెప్పు మూర్తి సార్ వాళ్ళు అక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలుసు. పాపం వాళ్ళు అక్కడ ఎలా ఉన్నారో, ఏమి అవస్థలు పడుతున్నారో” యెంతో ఆవేదన నిండిన స్వరంతో అన్నాడు రషీద్. ” మన మూర్తి సార్ ఆప్త మిత్రుడు దయానంద్ సార్ కి తప్పకుండ మూర్తి సార్ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలిసిఉంటుందని చాల సార్లు బతిమిలాడితే వాళ్ళు సంగారెడ్డి ఊర్లో ఉన్నారని,, మూర్తి సార్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు దయానంద్ సార్” అన్నాడు డేవిడ్.

మరి ఇపుడు మనం ఏం చేద్దాం డేవిడ్ భయ్యా? ఓ సారి ఆ ఊరికి వెళ్లి మూర్తిసార్, అఖిలమ్మ, పిల్లలు ఎలా ఉన్నారో చూసొద్దామా” అన్నాడు రషీద్. సరిగ్గా నా మనసులోమాటే నువ్వు చెప్పావు రషీద్ అన్నాడు డేవిడ్. ” అవును డేవిడ్ భయ్యా, మనం ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాం అంటే అది మూర్తి సార్ చలవే కదా. అందరికి సహాయం చేసే ఎముక లేని చేయి మూర్తి సారుది. అటువంటి మంచి మనిషికి రావాల్సిన కష్టం కాదు ఇది. రేపు రాత్రికే హైద్రాబాద్ కి టికెట్స్ రిజర్వు చేయిస్తాను నేను. సార్ ను చూసేదాకా నాకు ఇక నిద్రపట్టదు” అన్నాడు రషీద్ తన షాపుకు బయలుదేరుతూ.

రైలు సికింద్రాబాద్ స్టేషన్లో ఆగగానే రైలునుంచి దిగేసారు డేవిడ్,రషీద్ లు. స్టేషన్ బయటకు వచ్చి పఠాన్ చెరువు వైపు వెళ్లే సిటీ బస్సు ఎక్కారు. ఇద్దరు హైదరాబాద్ కి రావడం అదే ప్రధమం. ఊరికి వచ్చే ముందే దయానంద్ సార్ దగ్గరకు వెళ్లి హైదరాబాద్ లో ఎక్కడ దిగాలి. అక్కడనుంచి సంగారెడ్డి కి వెళ్లాలంటే ఏ బస్సు ఎక్కాలి అన్ని వివరాలు తెలుసుకున్నారు. సిటీ బస్సు లో కూర్చుని సిటీ జనాలని, ఎడతెగని ట్రాఫిక్ జాంని, మధ్య మధ్యలో కనిపించే ఫ్లైఓవర్ వంతెనలని, రంగు రంగుల అగ్గిపెట్టెల్లా కనిపిస్తూ, వేగంగా వంపులు తిరుగుతూ వెళ్లే పాములాగా ఉన్న మెట్రో రైలును బస్సు కిటికీ లోంచి విచిత్రంగా చూడసాగారు. ఎక్కడో చిన్న టౌన్ లో ఉన్న వారిద్దరికీ హైదరాబాద్ మహానగరం ఏదో కొత్త లోకంలాగా ఉంది. బస్సు పఠాన్ చెరువు చేరేసరికి సమయం ఏడుంబావు దాటింది. అక్కడ నుంచి మెదక్ జిల్లాలో ఉన్న సంగారెడ్డి వెళ్లాలంటే ఇంకో ముప్పావు గంట పడుతుందట. ఎందుకైనా మంచిదని డేవిడ్ మూర్తి సారు కు ఫోన్ చేసాడు తాము వస్తున్నట్టు. చాల సంతోషంగా రమ్మని చెప్పాడు మూర్తి.

బస్సు పఠాన్ చెరువు దాటి ఇస్నాపూర్లోకి ప్రవేశించింది. కాస్త సిటీ సందడి తగ్గి రోడ్డుకి ఇరుపక్కలా పచ్చటి పంట పొలాలు, పెద్ద పెద్ద చెట్లతో పరిసరాలు హరితభరితంగా ఉన్నాయి. చల్లటి గాలి పలకరిస్తూ సేద తీరుస్తుంటే మనసుకు హాయిగా ఉంది ఇద్దరికి. బస్సు ముందుకు వెళుతుంటే వాళ్ళ ఆలోచనలు వెనక్కు మళ్ళాయి.

సరిగ్గా రెండేళ్ల క్రితం తను సొంతంగా బట్టల కొట్టు పెట్టుకోవాలని బ్యాంకు లోన్ కోసం ప్రయత్నిస్తూ ఆ వివరాలు తనకి సరిగా తెలియకపోడం, లోన్ కోసం బ్యాంకు వాళ్లకు అర్జీ ఎలాపెట్టుకోవాలి అని మూర్తి సార్ దగ్గరికి వెళ్లి సాయం అడిగాడు రషీద్. వెంటనే రషీద్ ని బ్యాంకు కి తీసుకువెళ్లి, మేనేజర్ తో మాట్లాడడం, తన లోన్ కోసం ఆయన చాలాసార్లు బ్యాంకు చుట్టూ తిరగడంతో పాటూ లోన్ మంజూరు అవడంకోసం బ్యాంకు వాళ్ళకి షూరిటీ గా తన ఇంటి డాకుమెంట్స్ ఇచ్చారు మూర్తి. లోన్ మంజూరు కావడం ఆలస్యం అయి, అనుకున్న సమయానికి బట్టల కొట్టు ప్రారంభించలేకపోతున్నానే అని దిగులు పడుతుంటే పెద్ద మొత్తంలో తనకి ఆర్ధిక సాయం చేసి తాము అనుకున్న రోజే కొట్టు ప్రారంభించేలా సాయపడ్డ సహృదయుడు మూర్తి సార్.

డేవిడ్ ఆలోచిస్తూ తను టీ బంకు పెట్టుకోవడానికి కాస్త జాగా ఇమ్మని ఎవరిని బతిమిలాడిన నిరాకరించడంతో, తను మూర్తి సారుకి తన సమస్య గురించి చెప్పిన వెంటనే తన హోటల్ పక్కనే ఉన్న జాగాలో టీ అంగడి పెట్టుకోమని చెప్పి చిటికలో తన సమస్య ను తీర్చిన మహా మనిషి మూర్తి సారు.

ఆలోచిస్తున్న ఇద్దరి కళ్ళలో ఒకేసారి నీళ్లు తిరిగాయి. మూర్తి అంటే కావలి లో తెలియనివాళ్ళు ఉండరు. ప్రింటింగ్ ప్రెస్, హోటల్ పెట్టి పదిమందికి ఉపాధి కల్పించాడు. అడిగిన వాళ్లకు లేదు అనకుండా సహాయం చేసేవాడు. ఎవరికి కష్టం వచ్చిన నేను ఉన్నాను అంటూ వెళ్లి ఆదుకునే వాడు.
కాలం మనుషులను తోలుబొమ్మలను చేసి ఆడిస్తుంది కదా. కాలం చేసిన గారడీ ఆటలో చేసే వ్యాపారాలలో నష్టం వచ్చి అప్పులపాలై నిలవనీడ కూడా లేని పరిస్థితి వచ్చింది మూర్తి కి. పూలు అమ్మిన తావున కట్టెలు అమ్మలేక ఎవరికి చెప్పకుండా భార్య, పిల్లలను తీసుకుని కట్టుబట్టలతో ఊరు విడిచి వెళ్ళిపోయాడు మూర్తి.

బస్సు హారన్ పెద్దగా వినపడడంతో ఆలోచనలనుంచి బయటకు వచ్చారు రషీద్,డేవిడ్ లు. ఇంకాసేపట్లో మూర్తి సారు ని చూడబోతున్నాం అని ఇద్దరు చాల ఉద్వేగానికి లోనౌతున్నారు.
షేర్ ఆటో దిగి, అడ్రస్ కాగితం పట్టుకుని చుట్టూచూస్తున్న వాళ్లకు చాల పాత సైకిల్ ను నడిపించుకుంటూ మూర్తి సార్ ఎదురు వచ్చాడు. బాగా బీద,బిక్కి జనాలు ఉన్న ప్రాంతంలా కనిపిస్తోంది అక్కడ. మూర్తి ని చూస్తూనే ఒక్కసారిగా ఇద్దరు వెళ్లి అతన్నిఆలింగనం చేసుకున్నారు. మూర్తి కూడా వాళ్ళను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నాడు. ముగ్గురి కళ్ళు కన్నీటి సంద్రాలు అయినాయి.

మూర్తి తేరుకుని ” రషీద్,డేవిడ్ రండి అదిగో ఆ కనిపించేదే మన ఇల్లు. నాలుగు వాటాల ఇంటిలో మనది చివరిది” అంటూ ఇంటివైపు దారితీసాడు. ఇద్దరు అతన్ని అనుసరించారు. లోపలకు వస్తూనే ” అఖిలమ్మ, బాగున్నావా ? పిల్లలు ఎలా ఉన్నారు.” ఇద్దరు ఒకేసారి అన్నారు రషీద్,డేవిడ్ లు.
” బాగున్నాం బాబు. చాల సంతోషం నాయన, మమ్మల్ని చూడడానికి మీరు వచ్చారు. కూర్చోండి. చిటికలో కాఫీ తెస్తాను అంటూ వంట ఇంటిలోకి వెళ్ళింది మూర్తి భార్య అఖిల. రెండు గదుల పాత ఇల్లు అది. ఓ చిన్న వంట ఇల్లు. చెరగని ఇస్త్రీ బట్టలలో, ఎప్పుడు చిరునవ్వుతో కనిపించే మూర్తి సారు ముఖంలో ఏదో కోల్పోయినట్టు కళ తప్పి ఉంది. ఒంటినిండా నగలతో మహాలక్ష్మి లా ఉండే అఖిలమ్మ సాదాసీదా నూలు చీరలో, మెడలో పసుపుతాడుతో కనిపించింది వాళ్లకు.వాళ్ళను ఆ స్థితి లో చూసేసరికి ఇద్దరికి గుండె తరుక్కుపోయినట్టు అయింది. “

సార్ ఎలా ఉండేవారు. ఎలా అయిపోయారు. మాతో ఒక్క మాట చెప్పివున్న మాకు తోచిన సాయం చేసావాళ్ళం కదా మూర్తి సార్. మేముఈ రోజు మా భార్య, పిల్లలతో సంతోషంగా ఉన్నామంటే మీరే కారణం సార్. అటువంటిది మీకు కష్టం వస్తే మేము ఉన్నామనే సంగతి మీరు మరిచిపోతే ఎలా సార్” అన్నాడు డేవిడ్.

” కాలం కలిసిరానప్పుడు ఎటువంటివారికైనా కష్టాలు తప్పవు. కాలమే అన్నిటికి సమాధానం చెప్పుతుంది. ఊర్లో అందరు ఎలా ఉన్నారు. రషీద్ , రజియా బేటి ఏం చుదువుతోంది ఇప్పుడు” అన్నాడు మూర్తి. వాళ్ళు మాటలలో ఉండగానే వేడివేడిగా ఉప్మా చేసి ముగ్గురికి ఇచ్చింది అఖిల. ఉప్మా తిని ” నేను ఇక్కడ ఓ ప్రింటింగ్ ప్రెస్ లో చేరాను. కాస్త అర్జెంటు పని ఉంది. చూసుకుని వస్తాను. తీరికగా మాట్లాడుకుందాం. ఈలోగా మీరు కాస్త విశ్రాంతి తీసుకోండి. అఖిల ఈ రోజు కాస్త స్పెషల్ వంటకాలు చేయాలి నువ్వు. మన బిడ్డలు వచ్చారుగా” అంటూ బయటకు వెళ్ళాడు మూర్తి.

మూర్తి ఇంటికొచ్చేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది. ఇంట్లోకి వస్తూనే ” అఖిల…ఏరి రషీద్,డేవిడ్ లు. ఇంట్లో తోచలేదని బయటకు వెళ్ళారా ? ” దిగాలుగా కూర్చుని ఉన్న అఖిలను చూస్తూ అడిగాడు మూర్తి. ” వాళ్ళు వెళ్లిపోయారు అండి” అంది అఖిల చీర చెంగు తో కళ్ళు ఒత్తుకుంటూ. ” అదేంటి అఖిల.. వాళ్ళు భోజనం అయినా చేసారా లేదా? నేను వచ్చేస్తాను అన్నాను కదా. నీవు ఏమైనా అన్నావా వాళ్ళను?” సంశయం ధ్వనించే గొంతుకతో అడిగాడు మూర్తి. ” లేదండి , మీరు వెళ్ళాక వాళ్ళు కాసేపు బయటకు వెళ్లి వస్తాం అని చెప్పి వెళ్లి ఇంతకు ముందరే ఇంటికి వచ్చి వెళ్లిపోయారు. వచ్చేటప్పుడు ఇదిగో ఈ సామాను అంతా తెచ్చి ఇక్కడ పెట్టారు. సార్ వచ్చేస్తారు, భోజనం చేసి వెళ్లుదురు అంటే, హైదరాబాద్ లో అర్జెంటు పని ఉంది. మరోసారి తప్పకుండ వస్తాం అని వెళ్లిపోయారు అండి” అంది అఖిల.

అప్పుడు గమనించాడు మూర్తి ఆ గదిలో వారగా ఓ బియ్యం బస్తా, రెండు నెలలకు సరిపడే పప్పులు, చింతపండు లాంటి పచారీ సామానులు, కూరగాయలు పెట్టిఉన్నాయి. మరో పక్క బాగా ఖరీదైన రెండు నీల్ కమల్ కుర్చీలు, కంప్యూటర్, ప్రింటర్ లాంటివి పెట్టుకునేందుకు వీలైన చక్కటి టేబుల్ ఉన్నాయి. వాటిని చూడగానే మూర్తి కి అర్ధం అయింది వాళ్ళు ఎందుకు వెళ్లిపోయారో. తను ఇంట్లో ఉంటే వాళ్ళు తెచ్చిన ఈ సామాను అంతా ఎక్కడ వద్దు అంటానోఅని , తను రాక ముందే వాళ్ళు వెళ్లి పోయారు. తమపై వాళ్లకు ఉన్న అభిమానానికి మూర్తి కళ్ళు చెమ్మగిల్లాయి. వాళ్ళు ఎంతో అభిమానంతో తమ కోసం తెచ్చిన వాటిని తాను ఎలా కాదనగలడు.

భోజనం చేయమని అఖిల పిలవడంతో ” వాళ్ళ అభిమానంతోనే కడుపు నిండిపోయింది అఖిల” అంటూ ముఖం, కాళ్ళు కడుక్కుని వచ్చి దేవుడి పటాల దగ్గర ఉన్న కుంకం తీసి బొట్టు పెట్టుకుని చేతులు జోడించి దణ్ణం పెట్టుకుంటుండగా గమనించాడు అక్కడ రోజు ఉండే లలితా సహస్ర నామాల పుస్తకం కాకుండా ఏవో కొత్త పుస్తకాలు ఉన్నాయి. ఓ పుస్తకం ముఖ చిత్రంలో సిలువ గుర్తు ఉంది. కల్వరి టెంపుల్ అని పుస్తకం పేరు చూసాడు.

” అఖిలా… ఈ పుస్తకం ఎక్కడిది? ” అన్నాడు మూర్తి సాలోచనగా. ” ఓ ఆ పుస్తకాలు రెండు డేవిడ్ వాళ్ళు మీకిమ్మని ఇచ్చివెళ్లారు అండి. ఇస్తూ ఇస్తూ ” అఖిలమ్మ… ఈ పుస్తకాలను ఒకసారి సారును చూడమనండి. చదవడం ఇష్టం లేకపోతే చూసి, ఎక్కడైనా చర్చ్ లో ఇచ్చివేయమన్నాడండి. అవి కూడా దేవుడి పుస్తకాలే కదా అని అక్కడ పెట్టాను” అంది అఖిల.

“అవును అఖిల” అని ఓ సారి పుస్తకాన్ని కళ్ళకద్దుకుని వరుసగా పేజీలు తిప్పుతుంటే ఏదో బరువుగా చేతికి తగిలింది. మరల పేజీ తిప్పగానే పెళ పెళ లాడే కొత్త రెండు వేల రూపాయలు కనిపించాయి. అమితాశ్చర్యంగా వాటిని లెక్కపెట్టాడు. మొత్తం పదివేల రూపాయలు. వెంటనే రెండో పుస్తకం పేజీలు కూడా తిప్పాడు. అది ఉర్దూ భాషలో ఉంది. బహుశా అది నమాజ్ కి సంబంధించిన పుస్తకం అయి ఉంటుంది. తాను ఊహించినట్టుగానే ఆ పుస్తకంలో కూడా పదివేల రూపాయలు ఉన్నాయి. వాటిని చూడగానే మూర్తికి కన్నీళ్లు ఆగలేదు.

” అఖిల” అంటూ పిలిచాడు. వంటింట్లో ఉన్న అఖిల మూర్తి ని చూసి “అయ్యో, ఏమిటండి ఆ కన్నీరు. ఆ డబ్బులు ఎక్కడివండీ” అంది కంగారు పడుతూ. అఖిల…రషీద్, డేవిడ్ లను మన బిడ్డలుగానే చూసాం కదా, ఎప్పుడో వాళ్ళకి మనం చేసిన చిన్న సహాయం లను గుర్తు పెట్టుకుని, ఈ రోజు మనం కష్టాలలో ఉన్నాం అని మనకు ఈ డబ్బులు ఈ దేవుడి పుస్తకాలలో పెట్టి నీ దగ్గర ఇచ్చారు. వాళ్ళది ఏ మతం అయితేనేమి, కష్టాలలో ఉన్న మనకు సాయం చేయాలనే వాళ్ళ అభిమతం చాల గొప్పది కదా. మన పాపా కాలేజీ ఫీజు కి డబ్బులు యెట్లా చెయ్యాలా అని నేను అనుకుంటే ఆ భగవంతుడు వీరిద్దరి రూపంలో మనకు డబ్బులు అందేలా చేసాడు” అన్నాడు మూర్తి మెరిసే కళ్ళతో. “నిజమే కదండీ..మతమేదైనా మనుషులొక్కటే, మానవత్వమొక్కటే, దైవత్వమొక్కటే” అంటూ మూర్తిని చూస్తుండిపోయింది అఖిల.

1 thought on “అభిమతం”

  1. సహజ రచయిత్రి సహజ రచనలు
    సమాజానికి పరిశుద్ధ చైతన్యాలు
    అభినందనలు

    Reply

Leave a Comment