అందమే ఆనందం

నా ఊపిరి గాలికి ఊయలలూగుతూ ఉంటే నీ ముంగురులు..అవునండీ.. అతివ కురులు గాలికి అలల్లా ఊయలలూగుతుంటే మురిసిపోని రస హృదయం ఉంటుందా..? మరి ఆ కురుల సోయగాల గురించి, వాటి సంరక్షణ గురించి ఈ నెల మన సాహూ లో తెలుసుకుందామా.
తొలకర్లు పడి చాలారోజులు అయిపోయింది. ఇక పూర్తీ వర్షాకాలం వచ్చేసింది. వేడిగా ఉన్న ఎండాకాలపు సెగల నుంచి కాస్త చల్లదనం, చిరుజల్లులు వాతావరణంలోకి ప్రవేశించాయి. ప్రతిరోజూ కాకపోయినా అడపా దడపా వర్షాలు పడుతూనే ఉన్నాయి. మన శరీరం కూడా ఈ వాతావరణంలో మార్పులకు అనుగుణంగా అనుకూలనాలను ఏర్పరచుకోవడానికి సిద్ధం అవుతుంది. మరి మనం ఎంతగానో ప్రేమించే మన శరీరం కోసం మన మనసుని కూడా సిద్ధం చేసుకోవాలి కదా.
మరి ఈ నెల కురుల సంరక్షణ కోసం అతి సులభతరం అయిన కొన్ని చిట్కాలు తెలుసుకుందాం.

 1. ఈ చిరుజల్లుల వాతావరణం మన చర్మం, జుట్టు మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఏ మాత్రం అశ్రద్ధ చేసిన తలలో చుండ్రు, పొట్టు, దురదలు, మురికి, దుర్వాసన పెరిగే కాలం ఇది. తలను ఎప్పుడూ పొడిగా ఉంచుకోవడం శ్రేయస్కరం. వానకు తడిసినా, తలంటు స్నానం చేసినా వెంటనే వేరే పని పెట్టుకోకుండా తడి పూర్తిగా ఆరేవరకు తలను తుడుచుకోవాలి.
 1. తలలో తడి నిలిచి ఉంటే అది చెమటతో కలిసి దుర్వాసన రావచ్చు. చుండ్రు వచ్చే అవకాశం ఉంది. లేదా ఉన్న చుండ్రు అధికం అవుతుంది. కనుక జుట్టును ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి. వారంలో కనీసం రెండు సార్లు అయినా తలస్నానం చేయాలి. తల దువ్వుకోవడానికి ఉపయోగించే దువ్వెనలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తడి తల మీద దువ్వకూడదు. చిక్కు తీసేటప్పుడు తప్ప మిగతా సమయంలో పెద్ద పళ్ళ దువ్వెన వాడకూడదు. అలా వాడితే జుట్టు పాయల మధ్య దూరం పెరిగి జుట్టు పలుచన అవుతుంది.
 2. పెరుగు, నిమ్మ రసం బాగా కలిపి తలకు, జుట్టుకు పట్టించి ఓ గంట తర్వాత తలస్నానం చేయాలి. తరచూ ఇలా చేస్తూవుంటే చుండ్రు చక్కగా కంట్రోల్ అవుతుంది. ఇక తలమీద చుండ్రు రాదు. తల నుంచి పొట్టు రాలదు.
 3. వీలైన వారు తలస్నానానికి షాంపూ బదులు, కుంకుడుకాయ పొడి, సీకాయ పొడి వాడడం చాల మంచిది. సూపర్ మార్కెట్ లలో ఇప్పుడు కుంకుడు కాయల పొడి లభిస్తోంది. అవి వాడేంత సమయం మాకు లేదు అనుకుంటే రసాయనాలు తక్కువ, మంచి కండీషనర్ ఉన్న షాంపూ ని నేరుగా తలకి రుద్దకుండా, కొద్దిగా షాంపూని వాటర్ మగ్ లోకి తీసుకుని కొన్ని నీళ్ళు కలిపి బాగా గిలకొడితే నురుగు వస్తుంది. ఆ నురుగును జుట్టుకు పట్టించు జుట్టు కుదుళ్ళ దగ్గర సున్నితంగా మర్దన చేసుకోవాలి. గోర్లతో గట్టిగా రుద్దితే జుట్టు కుదుళ్ళు బలహీనం అయి వెంట్రుకలు రాలిపోయే ప్రమాదం ఉంది. కుంకుడు కాయపొడిలో కూడా గోరువెచ్చని నీళ్ళు కలిపి సున్నితంగా తలకి పట్టించి సున్నితంగా మర్దన చేసుకోవాలి.
 4. రాత్రి ఓ రెండు టేబుల్ స్పూన్ల మెంతులు నానబెడితే పొద్దునకి మెత్తగా అవుతాయి. ఆ మెంతులను మిక్సీ లో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి. ఆ మెంతి పేస్ట్ కి కాస్త పెరుగు కలిపి తలకి పట్టించి గంట తర్వాత కడిగేసుకుంటే మీ జుట్టు పట్టు కుచ్చులా మృదువుగా మెరిసిపోతుంది అంటే నమ్మి తీరాల్సిందే. మెంతులు, పెరుగు రెండు సహజసిద్ధం అయిన కండిషనర్లు. పోషకాల గనులు. మెంతులవల్ల చుండ్రు కూడా నశిస్తుంది.
 5. అలోవెరా ఆకుల గుజ్జు కూడా కురులకు అద్భుతమైన కండిషనర్ గా పనిచేస్తుంది. అలోవెరా ఆకుల నుంచి తీసిన మృదువైన గుజ్జును మిక్సీ లో గ్రైండ్ చేసి, ఆ గుజ్జుకి పెరుగు కలిపి తలకు, జుట్టుకు పట్టించి కాసేపు తర్వాత తలస్నానం చేయాలి. అలోవెరా జుట్టుకి మెరుపులు అద్దుతుంది.
 6. తలవెంట్రుకలు రాలిపోకుండా చేసే మరో అద్భుత ప్రకృతి సిద్దమయిన సహజ వనరు మన ఇంటి పెరడులోనే ఉంది. అదేనండి మందార చెట్టు. మందార లేదా దాసాని చెట్టు ఆకులు, పూలు రెండింటిలో జుట్టుకి శక్తిని, మెరుపుని ఇచ్చే పోషకాలు ఉన్నాయి. మందార ఆకులు, పూలను మెత్తగా రుబ్బి తలకు పట్టించి ఓ గంట తర్వాత కడిగేసుకుంటే జుట్టు తుమ్మెద రెక్క అంత మృదువుగా మారుతుంది. మందార పూల గుజ్జు జుట్టు పొడవుగా పెరగడానికి కూడా దోహదం చేస్తుంది.
 7. ఇక కొబ్బరి నూనె, ఆలివ్ నూనె, బాదం నూనె, జొజోబా ఆయిల్, ఇలా మనకి దొరికే ఏదో ఒక నూనెతో తలను మర్దన చేసుకుని వారానికి కనీసం రెండుసార్లయినా తలస్నానం చేస్తుంటే తలలో పేరుకున్న మురికి, చెమట పొక్కులు, దుమ్ము ఇతరత్రా మలినాలు తొలిగిపోయి ఏ కాలం లో అయినా సరే మీ జుట్టు పట్టు కుచ్చులా మారుతుంది.
 8. చర్మానికి, జుట్టుకి పోషణను ఇచ్చే ఆహారం తప్పనిసరిగా తినాలి. విటమిన్ ఈ ఎక్కువగా ఉండే బాదం పప్పులు, ఆకుకూరలు, క్యారెట్, బొప్పాయి లాంటివి తరచుగా మన డైట్ లో చేర్చుకోవాలి. పెరుగు తప్పనిసరిగా తీసుకోవాలి. తగినన్ని మంచి నీళ్ళు తాగాలి. లేకుంటే డీహైడ్రేషన్ వాళ్ళ చర్మం తో పాటు జుట్టు కూడా ఎండిపోయి పేలవంగా అయిపోతుంది.
  పైన చెప్పిన చిట్కాలు సురక్షితమైనవి. ఎటువంటి రసాయనాలు వాడకుండా సహజ సిద్ధంగా లభించే ఈ వనరులతో మనం మన జుట్టుని సంరక్షించుకోవచ్చు. అప్పుడు మీ జుట్టుని చూసిన వారు ” సిగలో అవి విరులో ” అంటూ పాట పాడేస్తారు. వచ్చే నెల మరో మంచి అందమైన చిట్కాలతో మీ ముందుకు వస్తుంది సాహో అందమే ఆనందం

Leave a Comment