నమస్తే. ప్రింట్ పత్రికలు ఒక్కొక్కటీ మాయమౌతున్నఈ గడ్డు పరిస్థితుల్లో పాఠకులకు మంచి సాహిత్యం అందించాలనే సుదృక్పధంతో ప్రముఖ కథ, నవలా రచయిత శ్రీ ఇందు రమణ గారు “సాహో” సాహితీ పత్రికను ప్రారంభించారు. ఈ తరుణంలో పత్రికా నిర్వహణ గొప్ప సాహసమే అనుకోవాలి. ముందుగా శ్రీ ఇందు రమణ గారికి హృదయపూర్వక అభినందనలు. సాహో పత్రిక అంచెలంచెలుగా ఎదుగుతూ, సాహితీ లోకంలో మేటి పత్రికగా నిలవాలని కోరుకుంటున్నాను. సాహూ పత్రిక కోసం నేను సైతం “అందమే ఆనందం” శీర్షికను నిర్వహించడం నాకో గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ ఇందు రమణ గారికి ధన్యవాదాలు. ఈ శీర్షికలో అందరికి ఆహ్లాదం కలిగించి, తేలికగా ఆచరించగలిగే అందం, ఆరోగ్యం కి సంబంధించిన చిన్న చిన్న చిట్కాలను ప్రతినెలా మీకు అందిస్తాను. సాహో విజయంలో అందరు పాలుపంచుకోవాలని నా ప్రగాఢ వాంఛ.????????????????
“అందమే ఆనందం. ఆనందమే జీవిత మకరందం ” అన్నారు ఓ కవి. “మడిసన్నాక కూసింత కళా పోషణ ఉండాలి. లేకుంటే మనిషికి, గొడ్డుకి తేడా ఉండదు” అన్నారు ఇంకో సినీ రచయిత. ఎందరు కవులు తమ కావ్యాలలో వర్ణించినా, ఎందరు కథకులు తమ కథానాయక సౌందర్యాన్ని పువ్వులతో, నవ్వులతో, రంగులతో పోల్చి మురిసిపోయినా “అందం ” అజరామరం. మనిషి జీవితంతో విడదీయరాని బంధం వేసుకున్న కమ్మటి అనుభూతి.
మరి అందం అంటే ఇక్కడ బాహ్య సౌందర్యం అనుకుంటే పొరపాటే. అందానికి నిర్వచనం చెప్పాలంటే “బాహ్య, అంతః సౌందర్యాల మేలు కలయికే సౌందర్యం. పుట్టుకతో వచ్చిన శరీరం తో పాటు, పుట్టిన నాటినుండి మెదడు, బుద్ధి,మనసు, హృదయం నిరంతరం ఎదుగుతూ ఉంటాయి . మంచి ఆహరం, వ్యాయామం, యోగ , సౌందర్య పోషణకు అనేకానేక చిట్కాలు కలిసి శారీరక సౌందర్యానికి కాంతినిస్తే, ధ్యానం, జ్ఞానం, సజ్జన సాంగత్యం, పుస్తక పఠనం, సత్ కార్య నిర్వహణ, సేవా నిరతి మనో వికాసానికి, అంతఃసౌందర్యానికి దోహదం చేస్తాయి.
ఈ “అందమే ఆనందం” శీర్షిక బాహ్య, అంతఃసౌందర్యల మేలు కలయికతో సాగుతుంది. రోజు వారి హడావిడి జీవితంతో ప్రతిఒక్కరు ఒక్క అర్ధగంట తమకోసం తాము జీవిస్తే ఆ కాస్త సమయం మనల్ని రోజంతా ఉల్లాసంగా, ఉత్సహంగా గడపడానికి గొప్ప ఔషధంలా పనిచేస్తుంది. అలా జీవించడానికి అవసరమయ్యే సలహాలు, చిట్కాలు, చిన్న చిన్న సమస్యలకు బాంబేలెత్తి పోకుండా తేలికైన పరిష్కారాలు మీకు ” ఈ అందమే ఆనందం ఇస్తుంది “. నెల నెల ఓ చక్కని చిట్కా. పాటిస్తే ఇక అందం, ఆనందం మీ సొంతం. ఇది “సాహో” పాఠకులకు మాత్రమే అందే వరం.
” ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ది బెస్ట్ ఇంప్రెషన్ ” అన్నారు. ఓ వ్యక్తిని చూసినప్పుడు ముందుగా వారి ముఖాన్ని చూస్తాం. వెంటనే మన మనసులో వారి పట్ల ఓ భావం ఏర్పడిపోతుంది. పరిచయం పెరిగాకనే వారి మనసు తెలిసేది. మనిషి ఏ రంగులో ఉన్నా ముఖం జిడ్డుగా, కాంతి విహీనంగా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి. ఈ నెల మొదటి ఆనందంలో ముఖాన్ని కాంతివంతం చేసే ఓ చిక్కని చిట్కా మీకోసం.
ముఖంలో జీవకళ ఉట్టిపడాలంటే సరైన నిద్ర ఉండాలి. పొద్దున్న లేస్తూనే కాఫీ, టీల కంటే ముందుగా శరీరానికి తగినంత మంచి నీరు త్రాగాల్సిఉంటుంది.
చిన్న కప్పులో రెండు చెంచాల సెనగ పిండి, చిటికెడు పసుపు, పచ్చి పాలు కలిపి ముఖానికి, మెడకి దట్టమైన పొరల పూసుకోవాలి. పావు గంట ఇంటిపనులు చేసుకోవచ్చు. ఈ సమయంలో పాలు చర్మంలోకి ఇంకిపోయి చర్మపు తేమను కాపాడతాయి. పసుపు యాంటీసెప్టిక్ గా పనిచేసి ముఖంలోని అదనపు వాపుని అరికడుతుంది. సెనగ పిండి చర్మాన్ని గట్టిగా పట్టుకుని, పేస్ లిఫ్ట్ ఏజెంట్గా పనిచేసి చర్మం పైన ముడుతలను అరికట్టి, మనకు ఉన్న వయసు కన్నా పదేళ్లు చిన్నగా కనిపించేలా చేస్తుంది.
పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో మెల్లగా ముఖాన్ని కడిగేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. వారానికి రెండుసార్లయినా ఈ ఖర్చు లేని, తేలికైన చిట్కాతో ముఖాన్ని మెరిపించి నలుగురిలో మీరు “సాహో” అనిపించుకోవచ్చు.
మరిఇంకెందుకు ఆలస్యం. మీ అందమే నా ఆనందం. వచ్చే నెల మరో అద్భుతమైన చిట్కాతో మీ.. వంజారి రోహిణి.