అందమె ఆనందం

“సాహో” మాసపత్రికలో జూన్ నెల “అందమే ఆనందం” తో మీ ముందుకు.

“అందానికి అందానివై, ఏనాటికి నా దానవై నా ముందర నిలిచిన దాన నా దాన” దిగ్విజయంగా మొదలైన మన “సాహూ ” పత్రిక తిరుగులేని సాహితి ఉద్యానవనంగా విలసిల్లాలని, ముందుగా సాహూకి అభినందనలు తెలియచేసుకుంటూ..
మన అందాల శీర్షిక రెండో సంచికలోకి అడుగిడింది. ప్రపంచంలో అత్యంత అందమైన వారు ఎవరు అంటే ముందుగా “మదర్ థెరెసా ” పేరు చెప్తాను నేను. హృదయపు లోతుల్లో ఉండే స్వచ్ఛత, ఆనందం అందంగా పరిణమించి ముఖం మీద ప్రతిబింబిస్తుంది. అందుకే ముఖానికి పైన ఎన్ని పూతలు పూసినా ఉపయోగం లేదు. అంతఃసౌందర్యం లేకుండా దేహ సౌందర్యం రాణించదు. మరి అంతఃసౌఅందర్యానికి ముఖం పై చిరునవ్వు. కల్మషం లేని మనసు ఉన్నప్పుడే ముఖం కళకళలాడుతుంది. దానికోసం ఇతరుల పట్ల జాలి, దయ, కరుణ కలిగి ఉండాలండి. పసిపాపలా నవ్వగలగాలి. దానితో పాటు మరికొన్ని చిన్న చిన్న చిట్కాలు మిమ్మలను అందాల రాణులు, రాజులను చేస్తాయి.
ఇప్పుడు వేసవి కాలం కదా. చర్మం ఆరోగ్యానికి మరింత పోషణ అవసరం. కరోనా వైరస్ మనల్ని ఇంటినుంచి కదలకుండా కట్టడి చేసిన, ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరమైనప్పుడు మాస్క్ తో పాటు ముఖాన్ని, జుట్టును కూడా ఎండ పడకుండా కవర్ చేసుకుంటే మంచిది. గొడుగు వాడితే చాల బెటర్. ఇంట్లో ఉన్నా, బయట తిరిగినా వేసవిలో చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు పోతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు మంచి నీరు కనీసం రోజుకి మూడు లీటర్ల పైన తాగితే చాల మంచిది. వీలైనవారు గ్లూకోస్ వాటర్, కొబ్బరి నీళ్ళు తాగినా చాల మంచిది. శరీరం డీహైడ్రేషన్ కి గురికాకుండా శక్తిని ఇస్తాయి ఈ రెండు పానీయాలు. పానకం చేసి దేవుడికి నైవేద్యంగా పెడుతుంటాం. మిరియాలు, ఏలకులు, మెత్తని పొడి చేసి బెల్లం, నీటితో కలిపి చేసే పానకం వేసవి తాపాన్ని తీర్చి, శరీరానికి చలువనిస్తుంది. వేసవిలో తరుచుగా ఈ పానకం తీసుకోవడం చాల మంచిది ఆరోగ్యానికి. అలాగే వేసవిలో విరివిగా దొరికే పుచ్చకాయ, కీరా, కిరిణి[దోస పండు] లాంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. అన్నిటికన్నా మజ్జిగ దివ్య ఔషధం. వెన్న తీసిన పల్చటి మజ్జిగ రోజుకు నాలుగైదు గ్లాసులు తాగినా పర్వాలేదు. ఉపయోగకరమైన బాక్టీరియా, విటమిన్ B 12 పుష్కలంగా మజ్జిగలో ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాల మంచిది.
ఇక ముఖానికి సంబంధించి చాల జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వేసవి కాలంలో. చల్లని నీటితో ముఖాన్ని తరచుగా కడుక్కుంటూ ఉండాలి.
40 డిగ్రీల దాక ఉష్ణోగ్రత ఉన్న ఈ నడి వేసవిలో ఎండలో తిరిగినా, తిరగకపోయినా ముఖ చర్మం కమిలి పోయి ఉంటుంది. అలాంటప్పుడు ఈ చిన్న చిట్కాలు పాటించండి.
1.బయట నుంచి ఇంటికి రాగానే చల్లని మజ్జిగ ఓ చిన్న కప్పులో తీసుకుని కాటన్ బాల్ లేదా శుభ్రమైన ఓ చిన్న బట్టని మజ్జిగలో ముంచి మెల్లగా ముఖం, మెడ చుట్టూ ఓ ఐదు నిముషాలు మసాజ్ చేయాలి. మజ్జిగలో అధికంగా ఉండే లాక్టిక్ ఆసిడ్, పైరువిక్ యాసిడ్లు ముఖచర్మం లోకి ఇంకిపోయి సహజ సిద్దమైన అస్ట్రింజెంట్లు గా పని చేసి చర్మం మీదికి రక్తప్రసరణను క్రమబద్దం చేస్తుంది. చర్మ రంద్రాలు మురికి తొలిగి శుభ్రం అవుతాయి . చల్లటి ఆ అనుభూతి చర్మాన్ని తాకి గొప్ప సాంత్వన ఇస్తుంది.

  1. టమోటోలు విరివిగా దొరికే కాలం ఇది. చిన్న టొమాటోని కోసి ఆ అర్ధ భాగం పైన పంచదార[చక్కర] అద్ది ఆ టమాటో ముక్కని ముఖం, మెడ మీద సున్నితంగా రుద్దాలి. మొత్తం పంచదార కరిగిపోయేలా రుద్ది ఓ ఐదు నిముషాలు అలాగే వదిలేయాలి. టమాటో రసం, చక్కర చర్మంలోకి ఇంకి అవి సహజసిద్ధం అయిన స్క్రబ్ లాగా చర్మాన్ని శుద్ధి చేసి, మురికిని, చెమట పొక్కులను తొలగించి ముఖానికి మెరుపులు అద్దుతాయి.
    మరి ఎటువంటి రసాయనాలు లేని ఈ సహజ వనరులతో ఆరోగ్యాన్ని, అందాన్ని మీ సొంతం చేసుకుంటే ఇంత ఎండల్లో కూడా “వెన్నల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, మే నెల్లో ఎండ హాయ్ ” అని మీరు పాడుకోవచ్చు. మరి మీదే ఆలస్యం ఇక. వచ్చే నెల్లో మరిన్ని మంచి చిట్కాలతో కలుద్దాం.

Leave a Comment