నెల్లూరులో రైలుకట్టకి తూరుప్పక్క విజయమహల్ సెంటర్ లో బుజ్జమ్మ అనే చిన్న అమ్మాయి ఉండేది. ఆ పిల్లకి ఇడ్లీలో కొబ్బరి చట్నీ నంజుకుని తినాలని కోరిక. వాళ్ళమ్మ ఎప్పుడూ మిరప్పొడి వేసేది. ఆ ఇంట్లో కొబ్బరి చట్నీ చేసుకునే స్థోమత లేదు. మరి ఆ పిల్ల కొబ్బరి చట్నీ తినాలన్న కోరిక తీరిందా లేదా. తెలియాలంటే “అంతర్వాహిని” కథల సంపుటిలోని నా కథ “సైన్సు రికార్డు” చదవాల్సిందే. మీ అభిప్రాయం తెలపాల్సిందే
“ఇదిగో.. బుజ్జి..నేను గుడికాడికి పొయ్యొస్తా. వీధిలోకి పందులు పట్టేటోళ్లు వొచ్చివుండారని రంతుల్లా చెప్పాడు. చెక్క తలుపు గొళ్ళెం సరిగా లేదు. తలుపేసి రాయి అడ్డం పెట్టు” అంటా నాయిన రైలుగేటు అవతల ఉండే సాయిబాబా గుడి కాడికి పోయినాడు.
రవంసేపటికే నాయిన అన్నత పని అయింది. చెక్క తలుపు తోసుకుని రెండుపందులు జెట్ వేగంతో దూసుకొని దేవుడింట్లోకి పోయినాయి. సందులో దండెం మీద గుడ్డలు ఆరేస్తున్న అమ్మ పందులను చూసి అదిరిపడి దుడ్డుకర్ర ఎత్తుకుని దేవుడింట్లోకి పరిగెత్తింది వాటిల్ని అదిలించేదానికి. అమ్మ చేతిలో దుడ్డుకర్ర చూసి పందులు రెండు బెదిరిపోయి మళ్ళా అదే జెట్ వేగంతో పక్క గొందిలోకి పరిగెత్తాయి.
చెక్కతలుపుకి రాయి అడ్డంగా పెట్టలేదని అమ్మ నామీద కారాలు, మిరియాలు నురతా ఉండాది. వీధిలో ఉండుండి “గుర్రు గుర్రు “మని పంది అరుపు ఇనపడతా ఉండాది. పాపం ఓ పందిని పట్టి కాళ్ళు, చేతులు కట్టేసి తోపుడు బండి మీద ఏసీ ఉండారు పందులు పట్టేవాళ్ళు. రోజు పొద్దన లేస్తానే స్నానం చేసి గాంధీబొమ్మ దెగ్గర ఉన్న సాయిబాబా గుడికి పోయేది నాయిన అలవాటు. బేస్తవారం సాయంత్రం మాత్రం నేను, అమ్మ, శకుంతల అక్క, శమంతకమణి పిన్నమ్మ, చిన్నక్క అందరం పోతాము.
మూడిడ్లీ తట్టలో పెట్టి మిరప్పొడేసిచ్చి సందు తట్టుకుపోయింది అమ్మ. మిరప్పొడిని చూస్తానే నీరసమొచ్చింది నాకు. “మా.. ఎప్పుడు జూసినా ఈ మిరప్పొడేనా..కొబ్బిరి చట్నీ చెయ్యచ్చు కదా” అంటా తట్టని దూరంగా నెట్టేసి, కోపంగా సందు తట్టుకు పోయినా.
ఆడ దోరగా ఏయించిన పొట్టు మినపప్పు , నూనెలో ఏయించిన ఎండుమిరపకాయలు, పెద్ద ఇంగువ పలుకు, నానబెట్టిన చింతపండు రోట్లో ఏసి దంచతా ఉండాది అమ్మ. మినువుల చింతపండు పచ్చడి వాసన కమ్మగా ముక్కులకు తగిలింది.
“అబ్బా..రాత్రికి వేడి వేడి అన్నంలో మినుముల పచ్చడి, ఇంత నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే ఉంటాది నా సామిరంగా..” ఇడ్లిలోకి చట్నీ లేదన్న కోపం ఎగిరిపోయింది నాకు. పంచలోకి వచ్చి ఇడ్లి తట్ట తీసుకుని మిరప్పొడిలో గుంట చేసి ఒక మిల్లిగరిట నూనె ఏసుకున్న.
“రోజు కొబ్బిరి చట్నీ యాడ్నించొస్తదిమే మనకు. టెంకాయ మూడు రూపాయలు. సంపాయించేవాళ్ళకి తెలస్తది కష్టం. గమ్మున తిను” అంటా మినుముల పచ్చడిని రాచ్చిప్పలోకి ఎత్తి వంటింట్లో పెట్టి, అదలా బదలా మళ్ళా సందు తట్టుకి పరిగెత్తింది సందులోకి. అప్పటికే కోతులు జామచెట్టు ఎక్కి కొమ్మలు ఇరిచేసాయి. నాలుగు జామకాయలను కూడా తెంపి నోట్లో కుక్కుకున్నాయి. కోతులను కర్రతో తరిమి అమ్మ ఇంట్లోకి వొచ్చింది. మధ్యాన్నం అన్నంలోకి కూడా మినుముల చింతపండు పచ్చడి కలుపుకుని డబ్బాలో పెట్టుకున్నా. బడికి పోతున్న అని చెప్పి వాకిట్లోకి వచ్చా.
“బుజ్జమ్మా.. సందేళ గుడికాడికి పోదాము. బడి వొదిలిన పాట పెత్తనాలు చేయకుండా ఇంటికి వొచ్చాయి. ప్రైవేటుకు రేపు పోవచ్చులే” అనింది అమ్మ చెక్క తలుపు మూస్తా.
“అట్నే మా” అంటా సెంటర్లోకి పోయిన. రాంమూర్తి నగర్ నుంచి వొచ్చే హేమమాలిని, భారతి, విజయ పుస్తకాల బుట్టలు పట్టుకుని జడలు ఊపుకుంటా ఒచ్చారు. అందరం రైలు గేటు దాటి సుబేదారుపేట సైడుకి నడస్తా ఉండాం బడికి పోయేదానికి.
విజయలక్ష్మి టీచర్ తెలుగు చెప్తాది మాకు. ఇంకా మొదటి యూనిట్ పరీక్ష కూడా కాలేదు. చానా టైం ఉండాదని తెలుగు పీరియడ్ లో మహా భారతం చెప్తా ఉండాది మాకు. ఆ రోజు విరాటపర్వంలో పాండవులు మారువేషాల్లో విరాటరాజు కొలువులో యెట్లా చేరారు. వాళ్ళ ఆయుధాలు జమ్మి చెట్టు మీద యెట్లా పెట్టారు అవన్నీ చెప్తా ఉంటే మేము పిలకాయలం అందరం నోళ్లు ఎల్లబెట్టుకుని ఇన్నాం.
సాయంత్రం ఆఖరి పీరియడ్ హిందీ. శ్యామలమ్మ టీచర్ ఆ రోజు బడికి రాలేదు. సంగీతం నేర్పించే వరలక్ష్మి టీచర్ ఒచ్చి అందరినీ ఆడుకోమని పంపించింది. బృందావనంలో ఉండే కవిత సంచిలోనించి లడ్డు ప్రసాదం తీసి పొద్దన సాయిబాబా గుడిలో పెట్టారు అని అందరికీ ఇచ్చింది. అప్పుడు గుర్తుకు వొచ్చింది నాకు గుడికి పోవాలి తొందరగా ఇంటికి రమ్మని అమ్మ చెప్పిన మాట. ఆ రోజు బేస్తవారం.
కళ్ళతో పాటు ఒళ్ళంతా ఎరుపు చేసుకుని పడమర పక్కకి వాలిపోయాడు సూర్యుడు నిద్రపోయేదానికి. గెంట సాయంత్రం ఏడు అయింది. ఆకాశంలో అక్కడో చుక్క, ఇక్కడో చుక్క పొడస్తా ఉంది. కనకాంబరం ఎరుపు రంగు పావడ, ఆకుపచ్చ రంగు బుంగల రవిక ఏసుకున్నాను. ముద్ద నందివర్ధనం పూలు కోసి కవర్లో వేసింది అమ్మ. శకుంతలక్క, లతా, చిన్నక్క కూడా ఒచ్చారు గుడికి పోవాలని.
గుడికి తొందరగా పొతే టెంకాయ నీళ్ళు, టెంకాయ చిప్పలు ఇస్తాడు పూజారి చలమయ్య. ఆలస్యం అయితే జనాలు ఎక్కువ అవుతారు. అప్పుడు టెంకాయ చిప్పలు దొరకడం కష్టం. అందుకని అందరం తొందరగా గుడికి పోవాలని రైలు గేటు దాటి ఇందిరా భవన్ పక్క సందునించి వడివడిగా నడస్తా ఉండాం. మెల్లగా చీకటి చిక్కబడతా ఉండాది.
ఐసా యేఈబా! సాయిదిగంబరా/ అక్షయరూప అవతారా/ సర్వహి వ్యాపక తూ శ్రుతిసారా, అనసూయాత్రికుమారా [బాబాయే] మహారాజే ఈబా/
మైకు లో నుంచి పెద్దగా సంధ్యా హారతి వినపడతా ఉండాది. ఆలస్యం ఆయిందని అమ్మ తిడతా ఉండాది. అప్పటికే జనాలతో గుడి నిండి పోయి ఉండాది. చెప్పుల స్టాండ్ దగ్గర అరలు అన్ని నిండిపోయి, గుడిముందర , పక్కన గుట్టలు గుట్టలుగా చెప్పులు పడి ఉండాయి. చెప్పులు వీధిలోనే విడిచేసి గుడిలోపలికి పోయినాం. కొళాయిల కాడ జనాలు గుంపుగా నిలబడి కాళ్ళు కడుక్కుంటా ఉండారు. ఒకళ్ళ కాళ్ళ నీళ్లు ఇంకోళ్ళ కాళ్ళ మీద పడతా ఉండాయి. మేము కాళ్ళు కూడా కడగకుండా మందిరంలోకి పోయినాము.
మందిరం జనాలతో కిటకిటలాడతా ఉండాది. టెంకాయ చిప్పలు కాదు కదా విభూది,తీర్ధం కూడా ఈ రోజు దొరికేటట్లు లేదు. ఇక ఈ వారంలో టెంకాయ చట్నీ తినే యోగం నాకు లేదని నిరాశ కలిగింది. అమ్మా, చిన్నక్కా ఓళ్ళు హారతి పాడేదానికి మల్లుకున్నారు. ఎప్పుడు కొబ్బరి చట్నీ చేయమన్నా అమ్మ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటుంది. బేస్తవారం పూట దండిగా టెంకాయ చిప్పలు ఉంటే పూజారి చలమయ్య మాకు ఒకటో రెండో ఇస్తాడు. ఈ రోజు ఇంతమంది జనాల్లో చిప్పలు మా వరకు వస్తాయో లేదో. ఆలోచిస్తా ఉండాను నేను జనాల మధ్యలో నిలబడి.
ఆకుపచ్చ రంగు మెరుపులా చీనాంబరం, మెడలో లెక్కలేనన్ని రోజా, మల్లెపూల మాలలు, బంగారు రంగు కీరిటం ధరించి, దూప,దీప, గంధ పరిమళాలతో మందిరం గర్భగుడిలో సాయినాధుడు మెరిసిపోతూ ఉన్నాడు. మనం ఎటు చూసినా, తన దృష్టి మనవైపే ఉంటుంది అన్నట్లు చిద్విలాసంగా నవ్వులు కురిపిస్తుంటుంది బాబా విగ్రహం. నీ సమస్య నాకు వదిలేయి. పరిష్కారం నేను చూపిస్తా అనే భరోసా బాబా కళ్ళల్లో కనిపిస్తుంది.
“రాజాధిరాజ యోగి రాజా పరబ్రహ్మశ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధ్ మహారాజ్ కి జై ” అని ఓ భక్తుడు పెద్ద స్వరంతో చెప్పడంతో సంధ్యా హారతి ముగిసింది.
బాబాకు కర్పూర హారతి ఇచ్చాడు పూజారి చలమయ్య. చలమయ్య కొడుకు సాయిరాం భక్తులందరిదగ్గరకు హారతిపళ్లెంని తీసుకుని వచ్చి చూపిస్తున్నాడు. చలమయ్య అందరికి తీర్ధం ఇస్తున్నాడు. మందిరం చివరలో ఉన్న మా దగ్గరకు వచ్చేతలికి హారతి కర్పూరం కరిగిపోయి కొండెక్కబోతా ఉంది. అమ్మ పళ్లెంలో పది పైసలు వేసింది. శకుంతలక్క పావలా వేసింది. నేను హారతిని కళ్ళకద్దుకున్నాను. సాయిరాం హారతి పళ్లెంని తీసుకుని వెనుతిరిగాడు. అప్పుడు వొచ్చింది నాకు ఓ ఐడియా.
“అబ్బాయి సాయిరాం”కాస్త గట్టిగా పిలిచాను. సాయిరాం నన్ను చూసి నవ్వతా ” అమ్మాయి ..నువ్వు కూడా ఈ రోజు ప్రైవేటుకి పోలేదా” అన్నాడు నా వంక ఎందుకు పిలిచావు అన్నట్లు చూస్తా.
“మరి ఇంటికాడ మా నాయనకి ఒంట్లో వేడి చేసి ఉండాది. కొంచెం టెంకాయ నీళ్లు ఇస్తావా” ఆశ,అవసరం కోసం దూసుకువచ్చేసింది ఓ అబద్ధం.
ఒక్కక్షణం ఆలోచించి “చెంబు ఏమైనా తెచ్చావా బుజ్జామ్మ” అన్నాడు సాయిరాం. తేలేదు అంటే ఇవ్వడని చిన్నక్క తెచ్చిన లోటా ని సాయిరాంకి ఇచ్చాను. ఆ లోటా మరీ చిన్నది. “ఇక్కడే ఉండు బుజ్జామ్మ” అంటా జానాల్లోనించి దూసుకుని లోపలకు పోయాడు సాయిరాం.
అక్కడ ఇనప కమ్మితో టెంకాయలు కొట్టి ఇత్తళ్ళి బిందెలో టెంకాయ నీళ్ళు పోస్తా ఉండాడు చలమయ్య పూజారి. పానకాల శాస్త్రి టెంకాయ చిప్పలను గంపలో ఏస్తా, గంప నిండగానే ముందరున్నోళ్ళకి టెంకాయ చిప్పలు ఇస్తా ఉండాడు. జనాలు టెంకాయ చిప్పల కోసం ఎగబడతా ఉండారు. ఐదు నిముషాలు గడిచింది. నాకు ఐదు యుగాలు అయినట్లు ఉండాది.
మందిరం బైట ప్రాంగణంలో ఉషశ్రీ అనే పెద్దాయన హరికథ చెప్తా ఉండాడు. ఎలాగూ ఈ రోజు టెంకాయ చిప్పలు దొరకవని ఆశ వదులుకుని అమ్మా వాళ్ళు హరికథ వినేదానికి పోయినారు. నేను ఆశ చావక సాయిరాం కోసం చూస్తా ఉండాను. ఇంకో ఐదు యుగాలు గడిచాయి నాకు.
గుంపులుగా ఉన్న జనాలను, ప్రదక్షిణం చేసే వాళ్ళను తప్పించుకుని ఒక చేతిలో పెద్ద స్టీలు చెంబు నిండా టెంకాయ నీళ్ళు, ఇంకో చేతిలో రెండు టెంకాయ చిప్పలతో శంఖు, చక్రాలు ధరించిన విష్ణుమూర్తిలా నా దగ్గరకి వచ్చి “ఇదిగో బుజ్జామ్మ..టెంకాయ నీళ్ళు తీసుకో అంటూ ” చెంబు, టెంకాయ చిప్పలు నా చేతికి ఇచ్చాడు సాయిరాం నా కళ్ళల్లోకి చూసి నవ్వతా.
ఇక దొరకదనుకున్న నిధి దొరికినట్లయి నాకు కొండ ఎక్కినంత సంబరమైంది.
“థాంక్స్ సాయిరాం ” అంటా ఆనందంగా రెండు చేతుల్లో టెంకాయ నీళ్ళు, టెంకాయ చిప్పలను చూసుకుంటూ అమ్మవాళ్ళకాడికి పోబోతూ,వెనక్కి తిరిగి సాయిరాం అని పిలిచేతలికి, “ఏందీ బుజ్జమ్మా.. నాయిన పిలస్తా ఉండాడు పోవాలి” అన్నాడు. “మరి ఈ చెంబు నీకు ఎట్లా ఇవ్వడం ” అన్నాను. “పర్వాలేదులే..రేపు సాయంత్రం ప్రైవేటుకి తెచ్చిద్దువులే కానీ నాకో సాయం చేస్తావా ” అన్నాడు ఆశగా నా కళ్ళల్లోకి చూస్తా.
“చెప్పు సాయిరాం. ఏం చేయాలి నేను” ఏం అడుగుతాడో అని ఆలోచిస్తా ఉండాను. “మరి నాకు సైన్స్ రికార్డు లో బొమ్మలు వేసిస్తావా బుజ్జమ్మా. నాకు సరిగా గీయడం రాదు. బొమ్మలు సరిగా వెయ్యకపోతే నరసింహారెడ్డి అయివారు వీపు వాయగొడతాడు. నువ్వు బొమ్మలు బాగా వేస్తావు కదా” నేను ఏమంటానో అని ఆతృతగా చూస్తావుండాడు సాయిరాం.
“ఇంతేనా తప్పకుండా ఏసిస్తా సాయిరాం. సైన్స్ రికార్డు రేపు ప్రైవేట్ కి తీసుకునిరా” అన్నాను అభయమిస్తున్నట్లు. సంతోషంగా వెనుదిరిగాడు సాయిరాం. అప్పటి నుంచి స్టీలు చెంబు , సైన్స్ రికార్డు మా చేతులు మారతానే ఉండాయి.