సూపర్ టీచర్ సిండ్రోమ్

నమస్తే!

నేను వ్రాసిన ఈ కథ “సూపర్ టీచర్ సిండ్రోమ్” ఆంధ్రజ్యోతి వారి “నవ్య” వీక్లీ లో 11-05-2020 తేదీన ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన.

——————————————————————————————————————————-

సమయం ఉదయం తొమ్మిది గంటలు. అది హైదరాబాద్ యూసఫ్ గూడలోని ఓ ప్రైవేట్ స్కూల్. ప్రార్ధన సమయం కావడంతో పిల్లలందరూ వరుసగా బారులు తీరి నిలబడి ఉన్నారు. ఇక ప్రార్ధన మొదలవుతోందనగా స్కూల్ లోకి ప్రవేశించింది రాగిణి టీచర్.

రాగిణి టీచర్ ఆ స్కూల్లో చేరి వారం రోజులే అయింది. అంతకుముందు చిన్న టౌన్ లోని స్కూల్లో పనిచేసింది. హైదరాబాద్ ఆమెకు కొత్త. మొదటి వారం రోజులు పిల్లలకు పాఠాలు చెప్పడం, బోర్డు మీద ప్రశ్నలు, జవాబులు రాసి పిల్లల చేత నోట్సులలో రాయించడం, వాటిని దిద్దడం, వారాంతపు పరీక్షల కోసం పిల్లలను ప్రిపేర్ చేయించడం వంటి వాటిలో మునిగిపోయి పక్క టీచర్లను పెద్దగా పట్టించుకోలేదు రాగిణి. దాంతో ‘ ఆ టీచర్ కి గర్వం, ఎవరితోనూ కలవదు’ అంటూ మిగతా టీచర్లు కొందరు చాటుగా గుసగుసలాడుకోసాగారు. ఇక ఇలా కాదు అనుకుని స్టాఫ్ రూమ్ లో కూర్చోసాగింది. అక్కడ తనతో పాటు ఆరోతరగతికి పాఠాలు చెప్పే టీచర్లు హేమలత, సుమతి పరిచయం అయినారు. మిగతా టీచర్ లు కూడా రాగిణి వివరాలన్నీ కనుక్కున్నారు.

కొత్త స్కూల్ లో చేరిన పిల్లలు తోటి విద్యార్థులకు ఎలా అలవాటు పడతారో అలాగే కొత్తగా టీచర్ గా చేరిన వాళ్ళకు, వాళ్ళు ఎంత సీనియర్లయినా, ఎంత అనుభవమున్నా తోటి టీచర్లతో కలవడానికి, స్కూల్ రూల్స్ కి అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది. ఎందుకంటే స్కూలుకో రూల్ చొప్పున ప్రతి స్కూల్ ఇంకొక స్కూల్ కి భిన్నంగా ఉంటుంది.

స్టాఫ్ రూమ్ లో టీచర్లు తమ పనిని పక్కన బెట్టి కబుర్లాడటం, పక్క టీచర్ల గురించి కామెంట్స్ చేయడం ఇవన్నీ రాగిణికి చిరాకు అనిపించింది. స్టాఫ్ రూమ్ లో కూర్చోవడం మానేసింది. ఎవరైనా టీచర్ లీవ్ పెడితే, ఆ క్లాసుకి వెళ్లి కూర్చునేది. పిల్లల దగ్గరే ఎక్కువ సమయం గడుపుతూ, తన పని తాను చేసుకునేది.

‘ఇంటి దగ్గర తల్లిదండ్రుల మాట వినని పిల్లలకు టీచర్ల మాటంటే వేదం. వాళ్ళకి టీచర్లు ఎంత చెప్తే అంత. టీచర్లను మార్గదర్శకులుగా అనుసరిస్తారు విద్యార్థులు. రాగిణి టీచర్ స్కూల్ కి కాటన్ చీరలు, లేకుంటే కొంచెం తక్కువ ధరగల చీరలు కట్టుకుని వెళ్ళేది. మిగతా టీచర్లు మాత్రం రోజుకో రకం కొత్త చీరలు కడుతూ ప్రతిరోజూ ఏదో ఫంక్షన్ కి వెళుతున్నట్టుగా అలంకరించుకుని వచ్చేవాళ్ళు. కొందరు టీచర్లయితే తమ వయస్సును కూడా లెక్క చేయకుండా ఎంతటి భారీకాయమైనా చుడీదార్ లో దించేసి చిన్న సైజు రోడ్ రోలరు లా కనబడేవారు. టీవీ లో యాంకర్స్ లాగా పాఠం చెప్పేటప్పుడు జుట్టు వెనక్కి నెట్టుకుంటూ ఒళ్ళంతా ఊగిస్తూ యాక్టింగ్ చేసినట్టు ఉండేదిగాని పిల్లలకు విజ్ఞాన్నాన్ని బోధిస్తున్నట్లు ఉండేది కాదు.

ప్రిన్సిపాల్ సార్ రౌండ్స్ కి వస్తే చాలు ముఖాన్ని చాటంత చేసుకుని, ఉన్నవీ లేనివీ కబుర్లు చెప్పేవాళ్ళు. పేరుకు ఇంగ్లీష్ మీడియం స్కూలే అయినా ఇంగ్లీష్ మాట్లాడడం సరిగా రాకున్నా ప్రిన్సిపాల్ సార్ ని అట్ట్రాక్ట్ చెయ్యటం వస్తే చాలు. అలాంటి టీచర్లనే ప్రిన్సిపాల్ సార్ ప్రోత్సహించేవారు. నిజంగా టీచింగ్ లో మంచి టాలెంట్ ఉన్నవాళ్ళని పెద్దగా పట్టించుకునే వారు కాదు.

ఇలాంటి వాళ్ళా పిల్లలకి విజ్ఞానం బోధించే గురువులు అనిపించింది రాగిణికి. అయినా సిటీలో ఇది మాములే అని సరిపెట్టుకుని తన పని తాను చేసుకునేది. “ఒక నెల తిరిగే సరికల్లా రాగిణి పిల్లలకు బాగా అలవాటయింది. ఆమె చెప్పే సైన్స్ పాఠాలు పిల్లలకు బాగా అర్ధం అయి, వారి సందేహాలను తీర్చుకోవడానికి స్వేచ్ఛనివ్వడంతో రాగిణి టీచర్ అంటే ఇష్టం ఏర్పడింది పిల్లలకు. దాంతో అటు పిల్లల్లో, ఎటు పేరెంట్స్ దగ్గరా రాగిణికి మంచి టీచర్ అని మార్కులు పడ్డాయి. అప్పట్నించి మొదలయ్యాయి ఆమె కష్టాలు. అప్పటివరకూ రాగిణి తో మొక్కుబడిగా మాట్లాడే హేమలత, సుమతి టీచర్లకు రాగిణి పట్ల అశాంతి మొదలై, అది అసూయగా మారింది.

హేమలత, సుమతి ఇద్దరికీ ‘ ఈ ప్రపంచంలో తామే గొప్ప టీచర్లమనే భావన. తమకు తెలియనిదంటూ ఏమి ఉండదు. అందరు తమనే పొగడాలి. మెచ్చుకోవాలి. అందరు తమ దగ్గరికే వచ్చి సందేహాలు తీర్చుకోవాలి. తమని కాదని ఇంకెవరినైనా పొగిడితే చాలు, ఇక ఆ టీచర్ కి స్కూల్ నుంచి ఉద్వాసన పలికే వరకు ఊరుకునే వారు కాదు. సామదాన భేద దండోపాయాలు ఉపయోగించి ఆ టీచర్ కి మనశ్శాంతి లేకుండా చేసి తనంత తానుగా ఆ స్కూల్ నుంచి బయట పడేటట్లు చేసేవారు.

“ఎప్పుడైతే రాగిణికి స్కూల్ లో కొంచెం మంచి పేరు వచ్చిందో ఆ రోజు నుంచి వాళ్ళు ఆమెతో మాట్లాడడం మానేశారు. రాగిణి టీచర్ వాళ్ళకు ఎదురుపడితే ముఖం తిప్పుకోవడం, చాటుగా చేరి గుసగుసలు చెప్పుకుంటూ నవ్వుకోవడం చేసేవాళ్ళు. క్లాసులో కూడా వాళ్ళిద్దరివీ పక్క పక్క క్లాసులైతే పిల్లలను వారి మానాన వాళ్ళని వదిలేసి క్లాస్ రూమ్ బయటకొచ్చి, ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటుండేవారు. ప్రిన్సిపాల్ సార్ రౌండ్స్ కి వచ్చినప్పుడు మాత్రం సీరియస్ గా పిల్లలకు పాఠాలు చెబుతున్నట్లు నటించేవారు.
‘వాళ్ళు సీనియర్ టీచర్లు కాబట్టి ప్రిన్సిపాల్ సార్ వాళ్ళకి ఏదైనా సమాచారం చెబితే ఆ విషయాన్నీ వాళ్ళు రాగిణి టీచర్ కి చెప్పేవాళ్ళు కాదు. దాంతో స్కూల్ కు సంబంధించిన కొన్ని పనులలో రాగిణి వెనుకబడి ప్రిన్సిపాల్ సార్ చేత చీవాట్లు పడాల్సి వచ్చేది. ప్రిన్సిపాల్ సార్ రాగిణి ని మందలించే సమయంలో, సుమతి, హేమలత టీచర్ల కళ్ళలో కనిపించే సంతోషం మాటల్లో చెప్పలేనిది.

‘ఆ రోజు హేమలత టీచర్ ఓ పిల్లవాడిని వాతలు తేలేటట్టు కొట్టింది. కారణం ‘రాగిణి టీచర్ పాఠాలు బాగా చెప్తుంది’ అని పక్క పిల్ల వాడితో వాడు అనడం ఆవిడ చెవిన పడిందట. అదే వాడు చేసిన పెద్ద నేరం. ఇక వాడికి ఆమె క్లాసు లో రోజు నరకయాతనే.

ఇతర టీచర్లు కొంచెం మంచి పేరు తెచ్చుకున్నా, తన కంటే ముందే వర్క్ కంప్లీట్ చేసినా హేమలత టీచర్ ఓర్చుకో లేకపోయేది. తననే అందరు ” సూపర్ టీచర్” అనాలి. అదొక ఫోబియా గా మరి, చివరికి సైకో గా మారిపోయిందామె. ఇతర టీచర్ల మీద ఉన్న అసూయ, కోపంగా మరి పిల్లల నెత్తిమీద డిప్పకాయలుగా, వీపుల మీద విమానం మోతలుగా వాచిపోయేవి.

“స్టాప్ రూంలోకి అడుగు పెట్టిన హేమలత టీచర్ కి, ఆరోజు తనకంటే ముందుగా ఎవ్వరూ రాలేదని నిశ్చయంగా తెల్సిన తర్వాతగానీ ఆమె మనసు కుదుట పడలేదు. ఇంతలో సుమతి రానే వచ్చింది. మన తర్వాతే మిగతా వాళ్ళు వచ్చేది” అంది హేమలత టీచర్.

“అవును. ఆ వనజా టీచర్ రోజు లేటుగా వస్తుందని నిన్న కూడా ఆమెకి అక్షింతలు వేశారు ప్రిన్సిపాల్ సార్ అంది సుమతి టీచర్. అలా ఇద్దరు తమ గురించి గొప్పలు, ఇతరుల గురించి చులకన మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ కబుర్లలోకి దిగారు ఆ రోజు ఇంటర్వెల్ తర్వాత ప్రిన్సిపాల్ టీచర్లందరినీ పిలిపించి ఆఫీస్ రూంలో చిన్న మీటింగ్ నిర్వహించారు. డిసెంబర్ నెలలో స్కూల్ లో ఏర్పాటు చేసే సైన్స్ ఫెయిర్ గురించి, టీచర్లు విద్యార్థులతో చేయించవలసిన ప్రయోగాలు, మోడల్స్ గురించి మాట్లాడారు. ప్రతి టీచర్ కి ఐదు మోడల్స్ చొప్పున తయారు చేయమని చెప్పారు.

“సైన్స్ ఫెయిర్ ను స్కూల్ లో ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులే కాక చాల మంది ఆ ‘సైన్స్ ఫెయిర్ ‘ కి వచ్చి చాల బాగుందని కొనియాడారు. హేమలత, సుమతి టీచర్లు రకరకాల మట్టిని సేకరించి విద్యార్థుల చేత ప్రదర్శింపజేశారు. ఇంకా దేశ నాయకుల మోడల్స్ ని థర్మకోల్తో తయారు చేయించి పెట్టారు.

రాగిణి టీచర్ ‘మానవ ఆరోగ్యంలో విటమిన్ల పాత్ర’ అనే అంశాన్ని తీసుకుని ఒక్కొక్క విటమిన్ కి ఒక్కొక్క విద్యార్థి చొప్పున విటమిన్ లకి సంబంధించిన కూరగాయలతో విద్యార్థులకు డ్రెస్సులు తయారు చేసి, విటమిన్ల గురించి వారు చక్కగా వివరణ ఇచ్చేలా తర్ఫీదు ఇచ్చింది. ఇంకా ఆకులతో డ్రెస్సులు కుట్టించి, ఇద్దరు పిల్లలకు అడవి మనుషులలాగా వేషాలు వేయించింది. ట్రైబల్స్ అరుపులు, మాటలు మాట్లాడేటట్లు వారికి తర్ఫీదునిచ్చింది.

‘సైన్స్ ఫెయిర్ కి వచ్చిన వారందరు కామెంట్ బుక్ లో విటమిన్ల గురించి, అడవి మనుషుల గురించి రాశారు. “రాగిణి టీచర్ చాల చక్కగా విద్యార్థులకు నేర్పించింది” అంటూ అందరూ పొగిడారు. రాగిణి టీచర్ పట్ల తల్లిదండ్రుల రెస్పాన్స్ చూసి ప్రిన్సిపాల్ సార్ కూడా ఆవిడను మెచ్చుకున్నారు.
దాంతో జంట కవులైన హేమలత, సుమతి టీచర్ల ముఖాలు కందగడ్డలైనాయి. ఆ రోజు నుంచి వాళ్ళలో రాగిణి టీచర్ పట్ల ఈర్శ్య, అసూయ పెరిగి ‘ఇంతింతై వటుడింతై ‘ లాగ పెరిగిపోసాగింది. ఏదో ఒక వంక పెట్టి రాగిణి టీచర్ని స్కూల్ నుంచి వెళ్ళగొట్టేందుకు వాళ్ళు కంకణం కట్టుకున్నారు.

ఆ రోజు ఆరునెలల పరీక్షల సెలవుల తర్వాత స్కూల్ తెరిచిన మొదటి రోజు. ‘ స్టాఫ్ రూమ్ ‘ లో రాగిణి, కుమారి టీచర్లు కూర్చుని ఉన్నారు. కుమారి టీచర్ తో , “ఈ రోజు స్కూల్ రీ ఓపెనింగ్ డే కాబ్బట్టి పిల్లలు కూడా ఎక్కువ మంది రాలేదు. ఈ రోజు స్టడీ హౌర్స్ ఉంటాయా టీచర్” అని అడిగింది.

“పిల్లలు ఎక్కువ మంది లేరు కదా, ఈ రోజు స్టడీ అవర్ ఉండదులే ” అంది కుమారి టీచర్. చాటు నుంచి వాళ్ళ మాటలు విన్న హేమ లతా, సుమతి టీచర్లు అలర్ట్ అయిపోయి లాంగ్ బెల్ అవగానే స్టడీ అవర్ లో ఉండే పిల్లలను ఒకరిద్దరిని ఇంటికి పంపకుండా క్లాస్ ఉందంటూ కూర్చోబెట్టేసారు.

సుమతీ టీచర్ స్టాఫ్ రూమ్ కి వచ్చి ” ఏంటి, మీరు స్టడీ అవర్ క్లాసులు తీసుకోరా ” అంది. దాంతో రాగిణి టీచర్ “సార్ ఈ రోజు తీసుకోమని చెప్పలేదు కదా ! మనంతట మనం ఎందుకు నిర్ణయం తీసుకోవడం అంది. అదే ఆవిడ చేసిన పెద్ద నేరం. ఆ మాట కి ఇంకొన్ని మాటలు చేర్చి ప్రిన్సిపాల్ సార్ కి ఉన్నవి లేనివి కల్పించి రాగిణి టీచర్ మీద చాడీలు చెప్పారు హేమలత, సుమతీ టీచర్లు. దాంతో సార్ రాగిణి, కుమారి టీచర్ల ను పిల్చి స్టడీ అవర్ తీసుకోండి అంటూ చీవాట్లు పెట్టారు. ఆయన హేమలత, సుమతీలు చెప్పిన చాడీలు విని రాగిణి టీచర్ పట్ల చాల కఠినంగా వ్యవహరించాడు. దాంతో ఆత్మాభిమానం దెబ్బ తిన్న రాగిణి టీచర్ త్వరలోనే స్కూల్ నుంచి బయట పడాలనుకుంది.

మార్చి నెల. శివరాత్రితో శివశివా అంటూ చలి జారుకోగానే నేనున్నానంటూ ఎండ మెల్లగా వచ్చి తీవ్రమవసాగింది. ఐదు నిముషాల పవర్ కట్ ని కూడా పిల్లలు భరించలేక పుస్తకాలను ఫ్యాన్లుగా [విసన కర్రలు] చేసి విసురుకుంటున్నారు. సంవత్సరం ఆఖరి పరీక్షలు దగ్గర పడడంతో విద్యార్థులకు రివిజన్ చేయించే పనిలో పడ్డారు టీచర్లందరూ.

ప్రిన్సిపాల్ అనుమతి మీద అప్పుడే కొందరు టీచర్లు స్కూల్ లో కొత్త అడ్మిషన్ల కోసం ఎక్కడెక్కడ పిల్లలు ఉన్నారా? అని గల్లీగల్లీకి వెళ్ళి జల్లెడ పట్టసాగారు. చదువుకునే రోజులు పోయి చదువు ‘కొనే ‘ రోజులు వచ్చేసాయి మరి! విద్యావ్యాపారం వింత పోకడలు పోతోంది. టీచర్ల జీతాలు పోను నెల ఫీజులు, యూనిఫామ్, పుస్తకాలు ఆఖరికి చిన్న రబ్బర్ ముక్క, పెన్సిల్ లిడ్స్ కూడా స్కూల్లోనే కొనుక్కోవాలి పిల్లలు. మరుసటి సంవత్సరం మరో గల్లీలో అదే స్కూల్ కి చెందిన మరో బ్రాంచ్ బిల్డింగ్ లేస్తుంది. సిటీలో ప్రతిస్కూలుకి ఇలా ఐదారు బ్రాంచులు తప్పకుండా ఉంటాయి. పరీక్షలు అయిపోయి విద్యార్థులకు సెలవులు ఇస్తారు. ఇక ఆ స్కూల్లో మానేద్దామనుకున్న రాగిణి టీచర్ త్వరత్వరగా పిల్లల పేపర్లు దిద్దేసి మార్కుల జాబితాను తయారు చేసేసింది. ఇక సార్ కి చూపించడమే తరువాయి.

శరవేగంతో అందరికన్నా మొదట మార్కుల లిస్ట్ తయారు చేసి సార్ దగ్గర ఇంప్రెషన్ కొట్టేసి తన రికార్ట్ ఎవరూ బద్దలు కొట్టకూడదనుకున్న హేమలత టీచర్ నిద్రాహారాలు మాని పేపర్లు దిద్దసాగింది. ఆ రోజు ఫస్ట్ పీరియడ్ లోనే రాగిణి టీచర్ ప్రిన్సిపాల్ సార్ రూమ్ లోకి వెళ్ళి మార్కుల లిస్ట్ మీద సంతకాలు చేయించుకుని విద్యార్థుల రిజల్ట్ గురించి సార్ తో మాట్లాడసాగింది.

ఆఫీస్ రూమ్ లోకి వెళుతున్న రాగిణి టీచర్ ని చూడనే చూసింది సుమతి టీచర్. ఆత్రుతను అణుచుకోలేక క్లాస్ వదిలేసి హేమలత టీచర్ క్లాస్ దగ్గరకి పరుగెత్తింది. ” చూడు టీచర్, ఆవిడ అప్పుడే సార్ దగ్గరికి వెళ్ళింది. కొంపదీసి మార్కుల లిస్ట్ మీద సంతకాలు పెట్టించుకుంటుందేమో” అంది హేమలత టీచర్ తో.

దాని మొహం. ఆవిడకంత సీను లేదు. ఎప్పుడూ మన తర్వాతే కదా ఆవిడ లిస్ట్ పూర్తీ చేసేది. ఆయన మనంత త్వరగా ఇంకెవరూ పేపర్లు దిద్దలేరు అంటూ గర్వంతో కూడిన బింకాలు పోయింది హేమలత టీచర్. ఇంతలో చిన్న సార్ రౌండ్స్ కి రావడంతో ఒక్క గెంతులో తన క్లాసులోకి దూకింది సుమతీ టీచర్. సార్ అటు వెళ్ళాక రాగిణి టీచర్ ఇంకా ‘ప్రిన్సిపాల్ సార్ గాడి నుండి బయటకు రాలేదే ! అని క్షణక్షణానికి ఆత్రుత ఎక్కువై గుండె వేగం హెచ్చసాగింది హేమలత టీచర్ కి.

అటుగా వెళుతున్న ఆయమ్మను పిలిచింది సుమతీ టీచర్. ‘ ఆయమ్మా, నువ్వు ఎప్పుడు ఆఫీస్ రూమ్ నుంచి వస్తున్నావు కదా. అక్కడ రాగిణి టీచర్ ఉంది కదా ఏం చేస్తోంది” అడిగింది సుమతీ టీచర్.
“ఆ టీచర్ ప్రిన్సిపాల్ సార్ దగ్గర మార్కుల జాబితా ల మీద సంతకాలు చేయించుకుంటోంది” అంది ఆయమ్మ. అంతే సుమతీ టీచర్ తుపాకీ నుంచి వెలువడిన బుల్లెట్ లాగ హేమలత టీచర్ ఉన్న క్లాస్ లోకి దూసుకొచ్చి ” టీచర్ ఏది విన్నారా! ఆ రాగిణి మహాతల్లి మనకంటే ముందుగానే మార్కుల లిస్ట్ మీద సంతకాలు చేయించుకుందట ” అంది మూతిని ముప్పై వంకర్లు తిప్పుతూ .

అంతే, ఒక్కసారిగా భూమి బద్దలై పాతాళం లోకి జారిపోతున్నట్లు తన చెవులు వినకూడని అపభ్రంశపు మాటలేవో వినబడినట్లు తన మెదడు మొద్దుబారి పోయి చేష్టలుడిగి శిలా ప్రతిమలా నిలబడిపోయిన హేమలత టీచర్ వెయ్యి ఓల్టుల విద్యుత్ షాక్ తగిలిన పక్షిలా [ క్లాస్ లో పిల్లల సాక్షిగా] కుప్పకూలిపోయింది. అది గమనించిన మిగిలిన టీచర్లు పరుగున వెళ్ళడం, ముఖాన నీళ్ళు చల్లడం జరిగింది. ఐదు నిమిషాలకు తెప్పరిల్లి కళ్ళు తెరిచినా హేమలత టీచర్ ని లేవదీయడానికి ప్రయత్నించారు మిగతా టీచర్లు. కానీ మూతి వంకరపోయి నోటి నుంచి కారిన చొంగ ముఖం మీద చల్లిన నీటితో కలిసి పోగా కుడి కాలు, కుడిచేయి స్వాధీనం తప్పాయి. ఎంత ప్రయత్నం చేసిన లేవలేకపోయింది. ఆ రోజు నుంచి హేమలత టీచర్ ‘మంచం మేడి మర బొమ్మ’ అయింది.

ఇతర టీచర్ల మీద ఆమె పెంచుకున్న అసూయ పక్షవాతం రూపంలో ఆమెనే దహించి వేసింది. ఆమె బారినపడి ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కున్న ఇతర టీచర్లు ఆమె పరిస్థితికి లోలోపల తెగ సంతోషపడి పైకి మాత్రం జాలి పడినట్టు నటించి ఆమె ఎదుట మొసలి కన్నీరు కార్చారు.
నేను అందరికంటే గొప్ప. నన్ను మించిన వాళ్ళు లేరు. నన్నే అందరు పొగడాలి. నన్నే అందరు అనుసరించాలి అనుకున్న హేమలత టీచర్ ఈ రోజు ఇతరుల సాయం లేకుండా తన పని కూడా తాను చేసుకోలేక మంచం మీద పడి మనస్సులోని మాట కూడా బయటకు చెప్పలేక పిచ్చి చూపులు చూడసాగింది. సూపర్ టీచర్ అనిపించుకోవాలనుకున్న ఆమెను “సూపర్ టీచర్ సిండ్రోమ్ ” ఆవహించింది.