సరంగు

“ఆడది తిరిగి చెడుతుంది, మగాడు తిరక్క చెడుతాడు” లాంటి నానుడులు, సామెతలతో పుచ్చిపోయిన సమాజంలో ఓ సగటు ఆడది గడప దాటి ఎందుకు రావలసివచ్చింది, వచ్చి ఎలాంటి విజయం సాధించింది తెలిపే కథ “సరంగు”. ఈ నెల “సాహిత్య ప్రస్థానం ” ఏప్రిల్ 2021 సంచికలో. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపుతారుగా…

ఆకాశమంత విశాలమైన హృదయం, భూమికి ఉన్నంత సహనం ఉండాలంటారు ఆడదానికి. కానీ రోజు రోజుకి మారుతున్న మా పరిస్థితులు నా సహనానికి పరీక్ష పెడుతున్నాయి.
మా వారు చేసే వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు వచ్చాయి. కొన్ని నమ్మక ద్రోహాలు, మరికొన్ని స్వయంకృతాలు, కొంత మా చేతకానితనం వెరసి అప్పులపాలై, ఉన్న ఇల్లు అమ్ముకుని తుఫాన్ గాలికి చెదిరిపోయిన గూటిని వదిలి పిల్ల పక్షులతోపాటు కొత్తగూటిని వెతుక్కుంటూ వెళ్ళే పక్షి జంటలా, ఉన్న ఇల్లు, ఊరు వదిలి చాల దూరం వచ్చేసాం నేను, మావారు.
ఎక్కడ చిత్తూరు . ఎక్కడ హైదరాబాద్. ఏ ధైర్యం మమ్మల్ని ఇంత దూరం తీసుకువచ్చిందో తెలియదు. రేపు ఎలా ఉంటుందో తెలియదు. ప్రవాహవేగానికి నదిలో కొట్టుకుపోతున్న చేపల్లా మేము అప్పుల ఊబినుంచి బయట పడాలని, పరిస్థితులు, కాల ప్రవాహానికి అంత దూరం నుంచి ఇక్కడ వచ్చి పడ్డాం.
కృష్ణా నగర్లో ఓ చిన్న ఇంటిని అద్దెకు తీసుకున్నాం. ఉద్యోగం కోసం ఆయన తిరిగిన చోట తిరగకుండా కాళ్ళు అరిగేలా తిరిగినా లాభం లేకపోయింది. నడి వయసు మనిషికి ఉద్యోగం దొరకడం ఎంత కష్టమని. ఓ పక్క పిల్లల చదువుకి ఫీజులు, మరో పక్క ఇంటి అద్దె, నెల వారి ఖర్చులు. ఈ సంసార సాగరాన్ని ఎలా ఈదాలో తెలియడం లేదు. చిన్న వ్యాపారం చెయ్యాలి అన్నా కాస్త పెట్టుబడి కావాలి. ఇద్దరిలో ఎడతెగని ఆలోచనలు మాకు అనుదినము నిద్రని దూరం చేసాయి.
దంపతుల మనసులు ఒకరిమీద ఒకరికి నమ్మకం అనే దారంతో గట్టిగా ముడి వేసుకున్నప్పుడు ఇక బంగారు పుస్తెల తాడు తో ఏం పని. ఆయన కష్టంలో ఉన్నపుడు ఆదుకోకుండా, నేను మేడలో బంగారం వేసుకుని ఎలా ఆనందంగా ఉండగలను. అందుకే ఆయన వద్దని వారిస్తున్నా నేను పసుపు తాడుకు పుస్తెలు కట్టుకుని, నా దగ్గర ఉన్న ఒకే ఒక్క బంగారు దండని ఆయనకి ఇచ్చాను. బంగారం లాంటి మనసున్న భర్త కన్నా బంగారం గొప్పదా చెప్పండి..? నేనిచ్చిన బంగారు దండ కుదవ పెడితే నలభై వేలు వచ్చింది. చిన్న కంప్యూటర్, ప్రింటర్ కొని,కృష్ణా నగర్ లో చిన్న షట్టర్ కిరాయికి తీసుకుని తనకి బాగా తెలిసిన డి.టి.పి. బిజినెస్ పెట్టాడు ఆయన.
మూడు నెలలు గడిచాయి. కృష్ణా నగర్లో చిన్నా చితక రచయితలు, దర్శకులు స్క్రిప్ట్ డి.టి.పి. కోసం రాసాగారు. ఎంత కష్టపడ్డా బొటాబోటీ ఆదాయం. మేము తిని, బిడ్డలను చదివించుకుంటే చాలనుకున్నాం.
కాలం ఎంత విచిత్రమైనది అనుకుంటున్నారు..! మనకి సంతోషంగా ఉన్నప్పుడు కుందేలు వేగంతో, మనం కష్టాల్లో ఉన్నప్పుడు నత్త నడక నడుస్తుంటుంది. కాలం ఎప్పుడూ ఒకేలాగా ఉంటుందేమో. ఈ ద్వందాలు మాత్రం మన మనసులోనే ఏమో. అయినా కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటే మనం దానికి విలువ ఇవ్వమని కాలానికి భయమేమో కదా.
ఆ రోజు సాయంత్రం కొద్దికొద్దిగా మొదలై చిక్కగా ముసురుకోసాగాయి చీకట్లు. ఎనిమిదైంది గంట. పిల్లలు చదువుకుంటున్నారు. ఈన పది గంటలపైనా కానీ ఇంటికి రాడు. బియ్యం కడిగి కుక్కర్లో నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టాను. ఇంతలోనే ఫోన్ మ్రోగింది. బంధువులు కానీ, స్నేహితులు కానీ ఫోన్ చేసి దాదాపు నాలుగు నెలలు అయింది. “ఎప్పుడు సంపద గలిగిన అప్పుడె బంధువులు వత్తురది యెట్లన్నన్” పద్యం తెలుసు కదా. మరి ఇప్పుడు మేము ఎండిన చెరువుతో సమానం అందరికి. నాకు ఫోన్ చేసేవారు ఎవరా అని ఫోన్ ఎత్తాను.
” మేడం మీ పేరు విశాల నా..?
ఎవరిదో అపరిచిత గొంతు. ” అవును. మీరు ఎవరు” అన్నాను అనుమానంగా.
” మేడం కృష్ణానగర్లో ఉన్న ” భవాని డి.టి.పి. షాప్ ” మీదే కదా. అందులో ఉండే సుధాకర్ గారికి ఆక్సిడెంట్ అయింది. బాగా దెబ్బలు తగిలి ఉన్నాయి. మీరు వెంటనే బయలుదేరి రండి. నా పేరు లక్ష్మణ్. సుధాకర్ సర్ గ్రాఫిక్స్ పక్కన మా ఫోటో స్టూడియో ఉంది “.
ఆ తర్వాత అతను ఏంచెప్తున్నాడో అర్ధం కాలేదు. చేతిలో నుంచి ఫోన్ జారిపోయింది. మంచం మీద కూలబడి పెద్దగా ఏడ్చేసాను . పిల్లలు బిత్తరపోయి చూస్తున్నారు. కర్తవ్యమ్ గుర్తుకు వచ్చి గబా గబా పర్సు వెదికితే రెండువందల రూపాయలు ఉన్నాయి. అంతకు మించి పైసా లేదు. పిల్లలను ఇంట్లోనే ఉండమని ఆ చీకట్లో ఏడుస్తూ ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న షాప్ కి పరుగు తీస్తూ వెళ్ళాను.
అప్పటికే ఆయన్ను చుట్టుపక్కల ఉన్న ఒకరిద్దరు షాప్ ల వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కి తీసుకువెళ్ళారట. బాత్రూం కోసం రోడ్డుకి ఎదురుగా ఉన్న కాంప్లెక్స్ లోకి వెళ్ళి వస్తుంటే, వేగంగా వస్తున్న బులెట్ బండి ఆయన్ని డీ కొట్టిందట. ఇంతెత్తున లేచి విసురుగా డివైడర్ మీద తల కొట్టుకుని పడిపోయారట.
నాకు ఫోన్ చేసిన లక్ష్మణ్ అనే అతను హాస్పిటల్ అడ్రస్ చెప్పి నన్ను ఆటో ఎక్కించాడు. అతనికి రెండుచేతులు జోడించాను నేను.
అరకొర సౌకర్యాలతో ఉన్న హాస్పిటల్ బెడ్ మీద స్పృహ లేకుండా పడి ఉన్నాడు ఆయన. ఆ స్థితిలో ఆయన్ను చూసి దుఃఖం ఆగలేదు నాకు. ఊర్లో ఎలా బతికాం మేము. ” అవసరం అన్నా ” అంటే ఎంతమందికి లెక్క చూసుకోకుండా సాయం చేసాడు ఈయన. ఈ రోజు మాకు నా అనే దిక్కు లేదు.
మన పరిస్థితి బాగాలేకుంటే తాడే పామై కాటు వేస్తుంది కాబోలు. విసురుగా డివైడర్ మీద ఎగిరి పడడంతో బాగా దెబ్బ తగిలి ఎడం కన్ను ఇంతలావున వాచిపోయి నల్లగా కమిలిపోయి ఉంది. బుజం ఎముక విరిగిందట. కాలు మెలిక పడి ఎముకలు పక్కకు తొలగిపోయాయట. ఆరు నెలలు బెడ్ రెస్టులో ఉండాలి అని డ్యూటీ డాక్టర్ చెప్పాడు నాకు.
జీవితపు పరమపద సోపాన పటంలో మెల్లమెల్లగా నిచ్చెన మెట్లు ఎక్కుతున్న మేము మళ్ళీ పక్కనే ఉన్న పాము నోట్లో పడి పాతళంలోకి నెట్టివేయబడ్డాం. బతుకు మళ్ళీ మొదటికి వచ్చింది. నిరాశ నన్ను పూర్తిగా ఆవరించింది.
నెల రోజులు గడిచాయి. ఆయన మంచం మీద లేవలేని స్థితిలో. మానసికంగా కృంగిపోయి నేను, ఫీజులు కట్టలేదని స్కూల్ నుంచి పంపి వేస్తే నెల రోజులనుంచి స్కూలుకి వెళ్ళకుండా నిముష నిముషానికి నా వంకా, వాళ్ళ నాన్న వంకా బిక్కు బిక్కుమంటూ దిగాలుగా చూస్తున్న పిల్లలు. సంసార నౌక నడిసముద్రంలో నిలబడిపోయిఉంది. ముందుకు కదిలే మార్గం ఏదని..?
ఇన్నాళ్లు ఆయన నన్ను మహారాణిలా చూసుకున్నారు. కష్టమైన, సుఖమైనా కలసి పంచుకున్నాం. ఇప్పుడు ఆయన ఏపని చేయలేని స్థితిలో ఉన్నాడు. ఆకస్మాత్తుగా సంభవించిన ఈ పరిణామానికి మానసికంగా కూడా దెబ్బ తిని ఉన్నాడు. ఇప్పుడు సంసార నౌకను ముందుకు నడిపే సరంగు బాధ్యత నా బుజాల మీద బరువుగా పడింది.
చిన్నప్పుడు నాది వానకాలపు చదువు. పది కూడా పాస్ కాలేదు. నేను ఏ ఉద్యోగం చేయగలనని. కానీ ఆ విషయం సరిగ్గా మధ్యాన్నం అయ్యేసరికి అరిచే మా ఆకలి పేగులకు తెలియదు కదా. ఏదోఒకటి చెయ్యాలి. ఏం చేయాలి. బుర్ర బద్దలు కొట్టుకుని ఆలోచించాను.
తళుక్కున ఓ ఐడియా మెరుపులా మెరిసింది. ఆయనకు చెప్పగానే అంగీకరించారు. ఇక ఆలస్యం చేయకుండా షాప్ ఖాళీ చేసి, కంప్యూటర్, ప్రింటర్ అమ్మేసాను. ఇప్పట్లో ఆయన ఆ పని చేయలేరు. వచ్చిన డబ్బుతో కొన్ని పాత్రలు, పెద్ద గ్యాస్ స్టవ్ కొన్నాను. ఇంటిదగ్గరే పచ్చళ్ళు చేసి చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చాను. వాటి రుచి బాగుండడంతో ఆర్డర్ ఇచ్చి పచ్చళ్ళు చేయించుకొనడం ప్రారంభించారు. పొద్దునే నాలుగు గంటలకు లేచి కూరలు తరుగుకొని రకరకాల మసాలా పొడులతో కర్రీస్ చేసి చిన్న చిన్న పాకెట్స్ లో పెట్టుకుని పెద్ద అంగళ్ల ముందు, వారి అనుమతి తీసుకుని , చిన్న టేబుల్ వేసుకుని దానిమీద కర్రీస్ పెట్టి అమ్మేదాన్ని. సాయంత్రం పచ్చళ్ళు తయారు చేసి పాకెట్స్, బాటిల్స్ లో నిల్వ చేసేదాన్ని.
ఏదైనా వ్యాపారం మొదలు పెడితే ఊరికే లాభాలు, విజయం మన దగ్గరకు వచ్చేస్తాయా ఏంటి..? నిద్రాహారాలు అంటే ఏంటో మర్చిపోయేంతగా నా దృష్టిని పనిమీదకు మళ్ళించాను. నేను కష్టపడడం చూసి ఆయన మనసు కష్టపెట్టుకోసాగారు.కానీ తప్పనిసరి పరిస్థితి.
ఆరునెలల కాలం ఎలా గడిచిందో కూడా తెలియనంతగా నేను కర్రీస్ వ్యాపారంలో మునిగిపోయాను. ఇప్పుడు ఆయన కాస్త లేచి చిన్నగా నడవగలుగుతున్నాడు. కానీ బయటకు వెళ్ళి ఏ పని చేసేదానికి ఆయన శరీరం సిద్ధంగా లేదు. అయినా మగవాడు బయట తిరిగి సంపాదించాలి, ఆడది ఇంట్లో ఉండి వంట చేయాలి అని చాదస్తపు భావాలనుంచి ఇకనైనా మనం బయట పడాలి. ఆయన ఇంట్లోనే నాకు పచ్చళ్ళు ప్యాక్ చేయడం లాంటి పనులలో సాయం చేస్తున్నాడు.
ఇప్పుడు నేను కృష్ణా నగర్లో ఓ షట్టర్ కిరాయికి తీసుకుని దాంట్లో కర్రీ పాయింట్ పెట్టాను. చిన్న చిన్న సినీ ఆర్టిస్ట్స్, రచయితలు, జూనియర్ ఆర్టిస్ట్స్, డాన్సర్స్ ఇలా చాల మంది ఇప్పుడు నా రెగ్యులర్ కస్టమర్స్ అయినారు. రుచి, శుచి తో కర్రీస్, పచ్చళ్ళు చేస్తానని పేరు తెచ్చుకున్నాను. మెల్లమెల్లగా ఫంక్షన్లకు, పెళ్ళిళ్ళకు క్యాటరింగ్ ఆర్డర్ మీద భోజనం సరఫరా చేస్తున్నాను. ఇప్పుడు నా దగ్గర పది మంది పనివాళ్ళు ఉన్నారు. వారందరి జీతాలు, మంచిచెడ్డలు స్వయంగా చూసుకుంటున్నాను. త్వరలోనే జూబ్లీహిల్స్ లో సొంతంగా మరో బ్రాంచ్ ని తెరువబోతున్నాను. ఇప్పుడు మంచి కర్రీపాయింట్ ఎక్కడ ఉంది అంటే అది “విశాల” గారు నడిపే “భవాని కర్రీపాయింట్” అని కృష్ణ నగర్లో ఎవరిని అడిగినా చెప్పే స్థాయికి నేను ఎదిగానని ఆనందంగా చెప్పగలుగుతున్నాను.
ఈ సంవత్సరం మహిళా దినోత్సవం రోజు నన్ను నా గురించి, నా వ్యాపార విజయం గురించి మాట్లాడమని కృష్ణా నగర్లో ఉండే స్థానిక మహిళా మండలి వాళ్ళు నాకు ఆహ్వానం పంపారు.
నేను పెద్ద చదువులు చదవలేదు. బడా వ్యాపారవేత్తను కాను, గొప్ప వ్యవస్థాపకురాలిని కాదు. కానీ నడి సముద్రంలో కొట్టుకుపోతూ దారి,తెన్నూ తెలియని మా సంసార నౌకను దారిలోకి తెచ్చి, ఓ ఒడ్డుకు చేర్చే ప్రయత్నం చేశాను.
చిన్నప్పుడు మా అమ్మ, అమ్మమ్మ, నానమ్మ ల దగ్గర నేర్చుకున్న వంటలు, పచ్చళ్ళ తయారి, మా పెళ్ళైన కొత్తల్లో నా వంటలకు మురిసిపోయి నన్ను పొగడ్తల్లో నింపిన మా వారి నమ్మకం నన్ను ఈ కర్రీపాయింట్ వ్యాపారదిశగా మళ్ళించాయి. నేను బడి పాఠాలు సరిగా చదవలేదు. కానీ కాలం నేర్పిన జీవిత పాఠాలు ఆకళింపు చేసుకున్నాను. జీవితం పెట్టే ప్రతి పరీక్షలో విజయం సాధిస్తూ వచ్చాను.
ఈ విజయం నాకు ఊరికే రాలేదు. కర్రీస్ తయారు చేసి అమ్మే క్రమంలో నేను ఎన్ని అవాంతరాలు, కష్టాలు ఎదుర్కోన్నానో నాకు తెలుసు. షాపుల ముందు బెంచి వేసుకుని కర్రీస్ అమ్ముకుంటానని ఎంత మంది షాపుల వాళ్ళ కాళ్ళు పట్టుకుని బతిమిలాడాను, మా ఆయన నిస్సహాయతను అవకాశంగా తీసుకుని ఎన్ని వేట ఉచ్చులతో నన్ను వలలో బంధించాలని ఎంత మంది ప్రయత్నించారో ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ పొతే ఓ పెద్ద గ్రంథము అవుతుంది.
నేను చెప్పేది ఒక్కటే. రాత్రి-పగలు, చీకటి-వెలుతురూ ఎంత సహజంగా ఒకదానివెంట ఒకటి వస్తాయో అలాగే జీవితంలో కష్టసుఖాలు ఒకదాని వెన్నంటి ఒకటి వస్తూనే ఉంటాయి. సుఖాలకి పొంగిపోక, దుఃఖాలకు కృంగిపోక మనపని మనం చేసుకుపోతూ పోవడమే. అసలైన విజయం అంటే తృప్తిగా బతకడమే. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలవడమే. ఉన్న ఊరిని వదిలి మహానగరానికి వచ్చాము ఎలా బతుకుతామో అని మొదట్లో నేను బెంగ పడ్డాను. కానీ మనం ఎక్కడ ఉండే అదే మన ఊరు. మన నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది అనట్లు వ్యాపారంలో నా నిజాయితీ, నలుగురిలో కలగొలుపుతనం ఇప్పుడు నాకు ఇక్కడ చాల మంది ఆప్తులను చేర్చి పెట్టాయి. ఎలా బ్రతుకుతామో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న నేను ఇప్పుడు నా ద్వారా పది మందికి ఉపాధి కలిగించగలుగుతున్నానని మాత్రం గర్వంగా చెప్పగలుగుతున్నాను.
నేను ఓ పక్క వ్యాపారాపగ్గాలు పట్టి విజయం సాధించినా , మరో పక్కమా జీవితంలో నమ్మకం అనే దీపం ఆరిపోకుండా ఎప్పటికప్పుడు ప్రేమ అని చమురుని నింపి ఆనందపు ఒత్తిని సరిచేసుకుంటూనే ఉన్నాం మా దంపతులం. చీకటిని నిందిస్తూ కూర్చునే కన్నా ఆ చీకటిని పారద్రోలే చిరుదీపం వెలిగించే ప్రయత్నం చేయడం మంచిది కదా .ఆ ప్రయత్నమే నేను చేశాను. విజయం సాధించాను. ఇప్పుడు చెప్పండి మీరు నేను విజేతనా కాదా?

3 thoughts on “సరంగు”

  1. ఆనంద్ కుమార్

    కథ చదువుతుంటే ఆత్మవిశ్వాసం
    తొణికిస లాడుతోంది.. మొక్క వోణి ధైర్యం తో సంసారాన్ని నెట్టుకు వోచిన చెల్లెమ్మ నీకు నా హృదయ పూర్వక అభినందనలు. నిజముగా ఈ కథ చదువుతుంటే ఇరుగింట్లోనో పొరుగింట్లోనో జరిగి నట్టు అని పిస్తోంది..నమ్మకం అనే దీపము అరిపోకుండా ప్రేమ అనే చమురుతో నింపి అది ప్రకాశవంతంగా వెలిగి నట్లే తన జీవితాన్ని వెలిగించుకున్న విశాల గారికి నా హృదయ పూర్వక అభినందనలు..
    రచయిత్రి రశ్రీమతి రహిని గారి కి నా శుభాసిస్సులు

  2. Ramakrishna Chintalapalli

    నమస్తే… ఇది ఆవిడ కథ మాత్రమే కాదు… కొద్దిగా పోలికతో మా కథ కూడా ఇలాంటిదే… కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ????????????

Comments are closed.