విమల సాహితి ఎడిటోరియల్ 67 – సాహిత్యమా – వ్యాపారమా

ఈనాటి విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం ” సాహిత్యమా – వ్యాపారమా ” చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.

ఓ పిల్ల తెమ్మెర మేనిని తాకినప్పుడు మనసు పరవశించో, కళ్ళ ముందు జరిగిన అన్యాయం హృదయాన్ని ముక్కలు చేసినప్పుడో, మోసమో, ద్రోహమో భరించలేక గుండె లోతుల్లో అగ్నిపర్వతాలు బ్రద్దలైనప్పుడో, ఓ కవి అంతరంగంలో కవితాక్షరాలు పురుడు పోసుకుంటాయి. ఓ కథకుని మదిలో వస్తుశిల్పాలు పోటీపడి కథని నడిపిస్తాయి. ఆ ప్రాచీన కవులు ఎప్పుడో భావకవిత్వం రాసారు. కథకులు పాఠకులను ఊహాలోకంలో తేలియాడించారు. కానీ ఆధునిక సాహితీకారులు ఊహాలోకం నుంచి నేలమీదికు వచ్చి, వాస్తవాలను కథలుగా, కవితలుగా మలచారు. అన్యాయాన్ని ఎదిరించారు. బలహీనులకు అండగా నిలబడ్డారు. ఆనాటి సాహితీ కారులు తమ రచనలను చదవమని ఎవరినీ అడగలేదు. పొగడమని అంతకన్నా బతిమాలలేదు. పాఠకులే వారికి బ్రహ్మరథం పట్టారు.

‘దేశమును ప్రేమించుమన్నా- దేశమంటే మట్టి కాదోయ్ – దేశమంటే మనుషులోయ్, ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం- నర జాతి సమస్తం పరపీడన పరాయణత్వం’ ఈ కవితా పంక్తులు ఎవరు రాసారో, ఏ సందర్భాల్లో రాసారో, ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రజలందరికి తెలుసు. ఆ కవులు తమ రచనల గురించి సమీక్షలు రాయమని ఎవరినీ అడగలేదు. వారి ఆదర్శాలను, రచనలను అభిమానించినవారు స్వచ్ఛంగా వారి రచనల గురించి విశ్లేషిస్తూ ఉంటారు నేటికీ. వారి తర్వాతి తరాల కవులు, కథకులు కూడా ఆనాడు సమీక్షల కోసం తాపత్రయపడలేదు. తమ రచనల్లో ఉన్న నైపుణ్యమే వారిని పాఠకులకు దగ్గర చేసింది.

ప్రస్తుతం తెలుగు సాహిత్యం మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తుంది. అనేకమంది కవులు కథా రచయితలు తమ కలాలకు పదును పెడుతున్నారు. ఇదే సమయంలో అనుకోని విధంగా కొన్ని అవలక్షణాలు సైతం కమ్ముకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈనాటి రచయితలకు తమ రచనలు పాఠకునికి ఎలా అందించాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారు. అచ్చు పత్రికలు ఒకటీ, అర తప్ప చాల వరకు కాలం గాలానికి చిక్కి కనుమరుగైపోయాయి. ఆన్లైన్ పత్రికలు అందరికీ చేరవు. ఇక సామాజిక మాధ్యమాల్లో కుప్పలు తెప్పలుగా వస్తున్నా రీల్స్, యూ ట్యూబ్ వీడియోలు, పనికి రాని చెత్త న్యూస్ లు ఆకర్షించినంతగా పుస్తకాలు మెరిపించలేకపోతున్నాయి. పుస్తకం హస్త భూషణం అనే నానుడి చెల్లిపోయి సెల్ ఫోనే చేతికి ఆభరణం అనే రోజులు వచ్చాయి. కథలు, కవితలు రాసి ఏ పత్రికకు పంపకుండా నేరుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుని, వాటినే పుస్తకాలుగా వేసుకునే వారు కొందరైతే, పత్రికలకు తమ రచనలను పంపి, నిపుణులైన సంపాదకుల పర్యవేక్షణలో తమ రచనలు వెలుగు చూడాలనుకునే వారూ ఉన్నారు. ఒక అసంబద్ధ, అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతూ సాహితీకారులు తమ రచనలకు ఆదరణ లభించాలంటే సమీక్షలు రాయించాల్సిందే అనే అభిప్రాయంలో ఉన్నారు. ఒక మాదిరిగా ఉన్న కవిత్వం, కథలు, నవలలు కూడా ప్రముఖ పత్రికల్లో వచ్చిన సమీక్షల వల్ల, మార్కటింగ్ మెళుకువలు తెలిసిన పబ్లిషర్స్ పర్యవేక్షణలో తమ రచనలను పాఠకులకు చేర్చడంలో సఫలమౌతున్నారు. ఇవేమి తెలియని వారు ఉన్నత విలువలు, ప్రతిభావంతమైన నైపుణ్యం గల రచనలు కూడా సరైన ప్రచారం లేక మరుగున పడి పోతున్నవి చాలా ఉన్నాయి.

అయితే వికసించే సూర్యుడిని ఏ చేతులు అడ్డు పెట్టి ఆపలేవు. ప్రతిభ ఎప్పటికైనా బయట పడాల్సిందే. కాస్త ఆలస్యం అయినా మంచి రచనలు తప్పకుండా పాఠకులకు చేరుతాయి. పత్రికలు, సమీక్షకులు నిస్పక్షపాతంగా రచనలను సమీక్షించాలి. ప్రాంతీయ విభేదాలు, ఆదిపత్యపు కోటరీలు, విషకూటములు పెట్టుకుని కొందరికి ఆకుల్లో, మరికొందరికి కంచాల్లో అన్నం వడ్డించినట్లు కాక అందరినీ ఆదరించాలి. రచయితలు కూడా సమీక్షకుల విమర్శలను సహృదయంతో స్వీకరించాలి. పొగడ్త ప్రోత్సాహం ఇస్తుంది కానీ, అదే అతిశయోక్తి అభివృద్ధికి, నైపుణ్య పురోగమనానికి అడ్డుకట్ట వేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. విమర్శ ఒక్కటే సాహితీకారులు తమ రచనా కౌశలాన్ని మెరుగు పరుచుకోవడానికి అవకాశం ఇస్తుంది.

ఇప్పుడు సాహితీ కారులు తమ రచనలు పాఠకులకు చేర్చడం ఎలా అనే మీమాంసలో ఉన్న తరుణంలో కొందరు అవకాశవాదులు సాహితీ రంగంలో కొత్త వ్యాపారాలకు తెర తీశారు. మీ కథల సంపుటి గురించి సమీక్ష రాస్తాం. మీ కవితలను డిజిటల్ యానిమేషన్ లో చదివి వీడియో చేస్తాం అని తీపి కబుర్లు చెబుతారు. సాహితీకారులు ఆశపడి వారి ప్రతిపాదనకు అగీకరిస్తే చాలు. రెండు నిముషాలు కూడా పట్టని కవితకు, రెండు పేజీలు కూడా నిండని సమీక్షకు వందలు, వేల రూపంలో డబ్బుని తీసుకుంటున్నారు. ముందు డబ్బు తీసుకుంటామని చెప్పకుండా రచయితలను మభ్యపెట్టి, తర్వాత వారి వద్ద నుంచి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న వారు సాహితీ లోకంలోకి చాప కింద నీరులా ప్రవేశిస్తున్నారు. ఆ ఒరవడి అలా కొనసాగి సాహితీ లోకాన్ని ముంచి వేయకముందే సాహితీకారులు మేల్కొనాలి. చైతన్యవంతులు కావాలి. ఇటువంటి వారిని ప్రోత్సాహించడం ఎంతమాత్రం ఆరోగ్యకరం కాదు. ఎందుకంటే ఏదైనా కథో, కవితో నచ్చితే, హృదయాన్ని కదిలిస్తే, ఆలోచింపచేస్తే, ఆచరణప్రాయం అనిపిస్తే సమీక్షకులు స్వచ్చంధంగా ఆ రచనలకు సమీక్ష చేస్తారు. విశ్లేషిస్తారు ఒక్క పైసా తీసుకోకుండా. అసలుసిసలైన సాహితీ సేవ చేసే సహృదయులు ఎందరో ఉన్నారు. కావున సాహితీ కారులారా….కాస్త ఆలోచించి అడుగు ముందుకు వేయండి. డబ్బు తీసుకుని సమీక్షలు రాసే/రాపించే వారికి అడ్డుకట్ట వేయండి.

రోహిణి వంజారి

సంపాదకీయం