విమల సాహితి ఎడిటోరియల్ 64 – స్వేచ్ఛ – బందిఖానా

కథలకు శైలి, శిల్పం అవసరమా?

యువత ఎక్కడ బంధింపబడింది?

ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “స్వేచ్ఛ – బందిఖాన” చదవండి.మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹

పంద్రాగస్టు.. భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డ రోజు. భారత గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన శుభదినం. బ్రిటిష్ వలస పాలన నుంచి, విభజించి పాలించిన దాష్టికం నుంచి భారత దేశం విముక్తి పొందిన తరుణం. 1947 ఆగష్టు 15 న భారత స్వాతంత్రం సిద్ధించిన రోజును ఘనంగా దేశ నాయకులు, ప్రజలు అందరం కలిసి జరుపుకుంటున్నాం. శతబ్దాల పోరాటం, ఎందరో వీరుల త్యాగం, అచంచలమైన సంకల్పం, సంఘీభావం, ఆత్మవిశ్వాసం ఈ మహత్తర కార్యానికి బాసటగా నిలిచాయి. తెల్ల దొరల గుండెల్లో ఒణుకు పుట్టించే నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు వంటి వీరులు, దేశాన్ని దాస్యశృంఖలాల నుంచి విముక్తి పొందించడానికి బ్రిటిష్ పాలకులకు ఎదురుదిరిగిన భగత్ సింగ్, రాజ్ గురు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి అసమాన వీరులు, బక్క పలుచగా ఉన్న ఒక్కమనిషి, దేశంలో ఎందరో పేదలు ఒంటినిండా కప్పుకోవడానికి గుడ్డలు లేకుండా అవస్థలు పడుతున్నారు. నాకు అంగ వస్త్రం చాలు. పై అంగీ వద్దు అని, అతి నిరాడంబరంగా జీవిస్తూ, బ్రిటిష్ పాలకుల దాష్టిక పునాదులమీద అహింసా అనే అస్త్రాన్ని ప్రయోగించి, తెల్ల దొరలకు నిద్రలేకుండా చేసిన మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి లాంటి ఎందరో స్వాతంత్య్ర వీరులను తలచుకుని, గర్వపడాల్సిన సమయం, సంతోషించాల్సిన సమయం ఈ స్వాతంత్య్ర దినోత్సవం. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది ఎవరికైనా ఎరుకలో ఉందా?

ఆగష్టు 15 రోజు మహా అయితే స్కూల్స్, ఆఫీసులలో జెండా ఎగరేసి, మొక్కుబడిగా కాసేపు స్వాతంత్య్ర పోరాటం జరిపిన వీరులను గుర్తుకు తెచ్చుకుంటాం. మిఠాయిలు పంచుకుంటాం. అక్కడితో 78 ఏళ్ళ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పూర్తి చేసిన బాధ్యత అయిపోయింది అని ఇళ్ళకు వెళ్ళిపోవడం. అంతే. ఆ కాస్త సేపు మాత్రమే ఆరుబయట మైదానాలలో నిలబడి స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకుంటాం. ఆ తర్వాత నుంచి మళ్ళీ ఎవరికి వారు బందిఖానాలోకి వెళ్లిపోవడమే. నత్తగుల్ల తన కర్పరంలోకి తలపెట్టినట్లు. నత్త తన రక్షణ కోసం తాను కర్పరంలోకి వెళుతుంది. మనుషులు మాత్రం తమ పతనం తామే కొనితెచ్చుకోవడానికి రకరకాల బందిఖానాలలోకి స్వయంగా వెళుతున్నారు. మనిషి వెళ్ళే బందిఖానాలు ఏమిటో చూద్దామా!

ప్రజలను అభివృద్ధి పధం వైపుకు కాకుండా పక్కదారులు పట్టించి బ్రష్టు పట్టించడానికి కావలసినన్ని బందిఖానాలు ఇప్పుడు దేశంలో, సమాజంలో కోకొల్లలుగా ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనది మతం. ఊబిలో పడ్డవాడినైనా రక్షించవచ్చు కానీ, మతం మత్తులో పడినవాడికి విముక్తే లేదు. నిరంతరం ఇతర మతాల వారి మీద పగతో రగిలిపోతూ, ద్వేషపు మంటల్లోకి తమని తాము తోసుకుంటున్నారు. మనుషులమని మరచి దేశాన్ని, మనుషుల దేహాలను ముక్కలుగా నరుకుతున్నారు. మనుషుల మనసులు ఎంతగా మతానికి బానిసలు అయినాయో అనేక చోట్ల ఆడబిడ్డలకు జరిగిన జరుగుతున్న అవమానాలకు అక్కడి రహదార్లు మౌన సాక్షాలు. దేశంలో మతాల కుంపట్లు రగిల్చేదానికి ఎంతోమంది మత దురహంకారులు లెక్కకు మిక్కలి ద్వేషపు ఆజ్యం పోస్తున్నారు.

ఇక ప్రజలను సాలి పురుగు గూడులాగా ఆకర్షణ వలలో బంధించే సామాజిక మాధ్యమాలకు కొదవ లేదు. మనకి ఎంతమాత్రం సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు సెలెబ్రిటీలు కూడా కావచ్చుగాక. వివాహం, విడాకులు, ఇతరేతర సంబంధాల గురించి మాటల్లో చెప్పలేనంత ఆసక్తి. అక్కడ జరిగింది చాటంత అయితే, చూపించేది కొండంత. మసిపూసి మారేడుకాయ చేసి,లేదా కృత్రిమ రంగుహంగులద్ది, చర్చలు అంటూ, పదే పదే సంఘటన తాలూకు ఫోటోలను ట్రోల్ చేస్తుంటే, వాటిని చూస్తూ సామాన్య ప్రజలు సామాజిక మాధ్యమాల వలలో చిక్కుకుపోయి, బయటపడలేక గంట గంటకు ఒకసారి సోషల్ మీడియా లేదా వార్తా మీడియాల్లోకి తొంగి చూడడం, ఏం జరిగిందో తెలుసుకోలేకపోతే అమాంతంగా బి.పి. పెంచుకోవడం. ఇలా రోజులో ఎన్ని గంటలు తనవి కాకుండా నిరర్ధకం చేసుకుంటున్నారు ఇప్పుడు. ఇక యువతని బంధించే బోలెడన్ని ఆకర్షణలు. సెల్ ఫోన్ మీద వేళ్ళను కదుపుతూ, తానూ చూస్తున్న ప్రపంచంలోకి స్వయంగా అడుగిడి, అక్కడి స్వర్గాలను పొందాలనే తహతహలో తనని తాను కోల్పోతోంది యువత. చెడు వ్యసనాలకు బానిసై, దేశ ప్రగతి సంగతి పక్కనపెడితే వ్యక్తులుగా నైతికంగా దిగజారి, ఒక్కొక్క మెట్టు దిగుతూ పాతాళంలోకి తిరోగమిస్తోంది నేటి యువత.

ఇక ప్రకృతి మనుషుల మీద దయతో ఎన్నో వనరులు ఇస్తుంటే, అత్యాశకు పోయి విచక్షణా రహితంగా సహజ వనరులైన చెట్లను కొట్టేసి, ప్రాణవాయువుని భూతలం మీద తగ్గిస్తూ, రక్షక పొర ఓజోన్ వలయాన్ని ఛిద్రం చేస్తున్నారు. అతినీలలోహిత కిరణాల దాడిలో బంధీలుగా మారుతున్నారు. భూమి గుండెల్లో తూట్లు పొడుస్తున్నారు. కొన్ని చోట్ల నీటి చుక్క కానరాక కరువు కోరలకు, మరి కొన్ని చోట్ల వరద బీభత్సాలకు బంధీలు అవుతున్నారు.

ఇన్ని రకాలుగా బంధించబడ్డ మనుషులకు ఇంక స్వేఛ్చ ఎక్కడ ఉంది? ఇప్పుడు ప్రజలను చైతన్యవంతులను చేసే శక్తి గల సాహితీ కారులు కూడా అనేక రకాల భ్రమల చట్రాలలో బంధీలు అవుతున్నారు. అవార్డులు, సన్మానాలు ప్రతిభకు కొలమానాలు. అసలైన ప్రతిభాకారులకు కొన్ని చోట్ల అన్యాయం జరిగి, లాబీయింగులతో పైకి వచ్చే ఊకపొట్టు లాంటి కవులు, సాహితీ కారులకు ఇప్పుడు కొదవ లేదు. నాకే అంతా తెలుసు అనుకోవడం ఆత్మవిశ్వాసం కాదు. అహంభావం. విద్య వినయాన్ని పెంచుతుంది. జ్ఞానం విచక్షణను నేర్పుతుంది. ఇప్పుడు సాహితీ లోకంలో తరచుగా వినిపిస్తున్న కథ, శైలి, శిల్పం ల గురించి విజ్ఞులైన ప్రముఖ సాహితీ కారులు శ్రీ ఏ.ఎన్. జగన్నాధ శర్మ వంటి వారు ఎప్పుడో చెప్పారు. ‘కథలు ఎలాగైనా రాయవచ్చు. దేనినైనా కథా వస్తువుగా మలచవచ్చు. శైలి, శిల్పం లాంటివి కథలో ఉన్నా, లేకున్నా పాఠకుడిని చదివించే నైపుణ్యం ఉండడం కథకి ప్రధాన లక్షణం’ అని వారు ఎన్నో దశాబ్దాల క్రిందటే చెప్పారు. ఇప్పుడు మిడిమిడి జ్ఞానం తో కొందరు సాహితీ కారులు తమను మించిన వాళ్ళు లేరనుకుంటూ పిచ్చి భ్రమల్లో అహంకారాన్ని చిందిస్తున్నారు. వారి పట్ల జాలి పడటం తప్ప ఇంకేం చేయగలం.

వీరంతా అహంభావపు భ్రమల్లో బంధీలు అయినవారు. ఇలా అన్ని రంగాల్లోని మనుషులందరూ ఏదో ఒక చట్రంలో బంధీలు అయి, స్వేచ్ఛను కోల్పోతున్నారు. తమని తాము అదఃపాతాళంలోకి నెట్టేసుకుంటున్నారు. అడుగు వేసే ముందు తాము నడిచే బాట మంచిదా, చెడుదా అని విశ్లేషించుకుని ఒక్క క్షణం ఆగి తరచి చూసుకుంటే, తమ బతుకు కోసం, తమ భవిష్యత్ కోసం తాము బంగారు బాటను వేసుకున్నవారు అవుతారు. అన్నీ చట్రాల ఉక్కు సంకెళ్లను బద్దలు కొట్టుకుని స్వేచ్చా జీవన మాధ్యురాన్ని తనివి తీరా అనుభవిస్తారు. విమల సాహితీ పాఠకులకు 78 వ స్వాతంత్య్ర దినోత్సవపు శుభాకాంక్షలు.

రోహిణి వంజారి

సంపాదకీయం

28-8-2024