ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం “పరిపూర్ణ జీవితం” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి.
“గురో: ప్రసాదాత్ అన్యత్ర నాస్తి సుఖం మహీతలే ” గురువు అనుగ్రహం లేనిదే లోకంలో సుఖం పొందడం దుర్లభం. ఎక్కడో ఒకచోట పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు, పుట్టుకతోనే సహజ పాండిత్యం అబ్బిన పోతనామాత్యుల వంటి వారు ఉండవచ్చు కానీ, ప్రతి మనిషికీ గురువు లేకుండా జీవితం సాగదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా, ఎంత ఉన్నత పదవుల్లో ఉన్నవారైనా, బాల్యం అనే దశను దాటుకుని వచ్చినవారే. అయితే ఎవరికైనా అసలు గురువు ఎందుకు? గురువులు ఏం చేస్తారు? ఎందుకు మనం గురువుకి ప్రాధాన్యత ఇవ్వాలి? అసలు గురువంటే ఎవరు? ఒక్కసారి గురు శిష్యుల సంబంధాన్ని మననం చేసుకుందాం.
ఓ తోటలో రకరకాల చెట్లు ఉంటాయి. నిటారుగా పెరిగేవి కొన్ని. గుబురు పొదలు కొన్ని. నేలమీద పాకేవి కొన్ని. ఎలా ఉన్న చెట్లను అలాగే వదిలేస్తే తోట కాస్తా చిట్టడవి అవుతుంది. చెట్లన్నీఇష్టానుసారం పెరిగి, ఫలవంతం కాకుండా గిడసబారిపోతాయి. అందుకే తోటమాలి చెట్లను సంరక్షిస్తాడు. అవసరమైన చోట కొమ్మలు కత్తిరించి, పెరుగుదలను సక్రమం చేస్తాడు. చెట్లన్నీ గుబురు పొదల్లా అల్లుకుని, పుష్పించడం, ఫలించడం అనే ప్రక్రియలు జరపకుండా, పిచ్చిగా పెరుగుతున్న చెట్లను అదుపు చేస్తాడు. సారవంతమైన నేలకోసం ఎరువులు వేసి, నీటికోసం పాదులు చేస్తాడు. చుట్టూ పెరిగే కలుపు మొక్కలను ఏరిపారేస్తాడు. తోటని ఒక ఉద్యానవనంగా మారుస్తాడు. అప్పుడే ఆ తోటలోని మొక్కలు ఫలవంతమవుతాయి. సరిగ్గా తోటమాలి లాంటి వాడే గురువు. చెడు దారుల్లో పయనించకుండా జ్ఞానం అనే అడ్డుకట్టని వేసి, మనిషిని సక్రమమైన మార్గంలో నడిపిస్తూ, జ్ఞానజ్యోతిని శిక్షుల హృదయాల్లో వెలిగిస్తూ, మానవ హృదయం అఖండ విజ్ఞాన జ్యోతిగా వెలగడానికి గురువు సహాయపడతారు. అయితే ఇక్కడ గురువులు అంటే బడిలో పాఠాలు మాత్రమే నేర్పేవారు అనుకోవడం పొరపాటు. మనిషి జీవిత పర్యంతరం వివిధ దశల్లో అనేకానేక గురువులు తారసపడతారు.
జన్మనిచ్చిన తల్లి శిశువుకు తొలి గురువు. కన్న బిడ్డకు లోకాన్ని చూపించేది, నడకను, నడతను, మాటను, మర్యాదను,మన్ననను మొదటగా నేర్పేది కన్నతల్లే. అందుకే శిశువుకు ఇల్లే తొలి పాఠశాల. తల్లి తర్వాత తండ్రి ద్వారా శిశువు ప్రపంచాన్ని చూడడం నేర్చుకుంటాడు. ఆ తర్వాత బడిలో గురువులు విద్యార్థులకు పాఠాలు నేర్పుతారు. నడవడికను నేర్పుతారు. ప్రాచీన గురుకులాల్లో శిష్యులు గురువుల ఆశ్రమాల్లో ఉండి విద్యలు నేర్చుకునేవారు. పెద్ద పెద్ద సామ్రాజ్యాలకు రాజు కావాల్సిన వాడైనా బాల్యదశలో గురుకులంలో ఉండి గురువు దగ్గర శిక్షణ పొందాల్సిందే. విద్యలు నేర్చేటపుడు శిక్షుడు తప్పు చేస్తే లేదా క్రమశిక్షణ తప్పితే, దండన వేసే అధికారం గురువులకు ఉండేది. రాజ్యమేలడానికి కావాల్సిన అన్నీ విద్యలు నేర్చి, అర్హత పొందినవాడే రాజుగా నియమింపబడతాడు. అలా గురువులు వ్యక్తుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇప్పుడు రాజులు లేరు. రాజ్యాలు లేవు. గురువుల ఆశ్రమాలు లేవు. బడిలో పాఠాలు చెప్పడం మాత్రమే కాదు, క్రమశిక్షణను పాటింపచేయడం, నైతిక విలువలను ఆచరించేలా విద్యార్థులను తీర్చిదిద్దే కీలక బాధ్యత ఉపాధ్యాయులదే.
“మొక్కై వంగనిదే- మానై వంగునా” అన్న నానుడికి అనుగుణంగా విద్యార్థి దశలోనే చెడుమార్గంలో నడవకుండా రక్షించే బాధ్యత కూడా గురువుదే. మనిషి జీవితంలో అనేకానేక గురువులు ఉన్నారు. జీవితంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తి నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకుంటాం. ప్రకృతి మనిషికి ఎన్నో జీవన పాఠాలు నేర్పుతుంది. జీవితంలో ఎదురయ్యే పరిస్థితులు, జరుగుతున్న ప్రతి సంఘటన మనిషికి జీవితం పట్ల అవగాహన కలిగించే పాఠాలు అవుతాయి. జీవితం విసిరిన సవాళ్లు, చేసిన గాయాలను మాన్పుతూ కాలం గొప్ప పాఠాలను నేర్పుతుంది. ప్రకృతి, పరిస్థితులు, కాలం, జరిగే సంఘటనలు అన్నీ మనిషికి జ్ఞానాన్నిచ్చే గురువులే. నేర్చుకోవాలి గాని ప్రతి పాఠం ఒక గురువే.
ఇక జీవిత నౌకలో పయనిస్తూ సంసార భవ సాగరం దాటడానికి ప్రతిఒక్కరికీ ఆధ్యాత్మిక గురువులు కచ్చితంగా అవసరం .భారత దేశం ఆధ్యాత్మిక, తాత్విక భావావేశాలకు పుట్టినిల్లు.ప్రజల అమాయకత్వాన్ని డబ్బుని ఆసరా చేసుకుని బతికే దొంగ బాబాలను పక్కన పెడితే, మనిషిని సన్మార్గంలో నడిపించడానికి, కష్ట కాలంలో ఓర్పును, మనఃశాంతిని, గుండె నిబ్బరాన్ని అందించి, మనిషిని నిమిత్త మాత్రతవైపు, దయాగుణంవైపు, జీవిత కర్మలను ఆచరించే దిశవైపుకు మళ్ళించి, మనిషి మనసును నిశ్చల తటాకం వలే నిర్మలంగా ఉంచే ఆధ్యాత్మిక, తాత్విక గురువులు ఎందరో మన దేశంలో పుట్టారు.
జిడ్డు కృష్ణమూర్తి, రమణమహర్షి, తాజుద్దీన్ బాబా, వివేకానంద స్వామి, శారదా దేవి లాంటి గురువులు ఉన్నారు. మనో వైజ్ఞానిక పరంగా అరిస్టాటిల్, ఫ్రాయిడ్ లాంటి వారు కూడా మనిషి మనసును మూర్త, అమూర్త భావనలకు అనుగుణంగా జీవితాన్ని తీర్చి దిద్దుకోవడానికి, జీవితంలోని అనేకానేక క్లిష్ట స్థితుల నుంచి తప్పించుకోవడానికి దమనం అంటే (బాధాకరమైన విషయాలను దారిమళ్లించడం) ప్రతి గమనం అంటే ( ఓ చోట ఓడిపోయినా, మరోచోట విజయాన్ని వెదుక్కోవడం) లాంటి రక్షణ తంత్రాలను పరిచయం చేసి, మానవ జీవితం ఆనందమయం కావడానికి దోహదం చేసిన వారు కూడా ఉన్నారు. ఇక అంతిమంగా మనిషికి గల అతి ముఖ్యమైన గురువు మనిషి మనసే. మనిషి జీవితాన్ని పరిపక్వం చేసుకోవడానికి, పరిపూర్ణం చేసుకోవడానికి, అహర్నిశలు మనిషిని అంటిపెట్టుకుని, అనుక్షణం మంచి,చెడ్డల గురించి హెచ్చరించే మనసు మనిషికి అతిపెద్ద గురువు.
మనిషి మనసు చంచలమైనది మరియు నిరంతర చైతన్యవంతమైనది. నిప్పు ఉంది కాలుతుంది అని ఓ పక్క హెచ్చరిస్తూ ఉన్నా, ఇంకో పక్క తాకి చూడు ఏం జరుగుతుందో తెలుస్తుంది అని ముందుకు తోస్తూ ఉంటుంది మనసు. గురుముఖంగా సాధన చేసి అదుపుదప్పిన మనసుకు జ్ఞానపు కళ్ళెం వేసి, ఆధీనంలోకి తెచ్చుకుని, జీవితాన్ని పరిపూర్ణం చేసుకోవాల్సిన గురుతర బాధ్యత మనందరిది. మనిషిని సన్మార్గంలో నడిపించే మహానుభావులైన గురువులందరికీ, ఈ రోజు అనగా జూలై 21 న గురుపూర్ణిమ సందర్భంగా వారికి అభివందనాలు అనేక పాదాభివందనాలు.
రోహిణి వంజారి
సంపాదకీయం
22-7-2024