విమల సాహితి ఎడిటోరియల్ 60 – అనేకానేక ముసుగులు

ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “అనేకానేక ముసుగులు”చదివి మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.

సంతోషం, దుఃఖం, కోపం, కరుణ, ఆవేశం. బహు ముఖాల ఉద్వేగాలు, సంవేదనలను వ్యక్తపరచడం ఒక్క మనుషులకి మాత్రమే సాధ్యం. ఎద లోతుల్లో జనించిన భావాలకు భాష తోడై, మనసుని వెల్లడిచేసే మాటలు పలకడం కూడా ఒక్క మనిషికే సాధ్యం. మిగతా జంతువులకు కూడా ఈతి బాధలు ఉంటాయి. అయితే వాటిని చెట్లు, జంతువులు వ్యక్తం చేయలేవు . భావాలను బహిర్గతం చేయలేవు. జంతువుల నుంచి మనిషిని వేరు చేసే ఈ ప్రత్యేకమైన సంవేదనలకు ఇప్పుడు మనిషి క్రమంగా దూరం అవుతున్నాడా? మనిషి స్పందించే గుణం కోల్పోతున్నాడా? ఈ ప్రశ్నలకు ‘అవును’ అనే సమాధానం ఇటీవలి కాలంలో మనుషులను గమనిస్తే ఇట్టే తెలిసిపోతోంది. ఎటువంటి సంవేదనలు ఇప్పుడు మనిషిని కదిలించడం లేదు. చుట్టూ ఏం జరుగుతున్నా తనకేం పట్టదు. తన అరచేతిలో ఉన్న సెల్ ఫోన్ తప్ప ఇక తనకి అత్యంత ప్రీతికరమైనది ఇప్పుడు ఏది లేదు. దుఃఖం కూడా లేదు. కఠిన శిలలైనా కొంత కాలానికి కరుగుతాయేమో కానీ, మనిషితనం మాత్రం రోజురోజుకి బండరాయిగా మారుతోంది.

పెరిగిన ఆధునిక సాంకేతిక విజ్ఞానాన్ని నెత్తికెక్కించుకుని, రోజువారీ దినచర్యలను కుదించుకుని, కుటుంబంతో గడిపే కాలాన్ని హరించుకుని, తిండి తినడానికి కూడా కాలాన్ని లెక్కగట్టి, చివరికి చేసేపనిలో శ్రద్ధను కోల్పోయి సాధించేది ఏమిటంటే….అరచేతిలో ప్రపంచాన్ని అర నిమిషానికొకసారి ముందుకో, వెనక్కో జరుపుతూ తానుమాత్రం ఎక్కడవేసిన రోగాల గొంగడిలా అక్కడనే పడిఉండాల్సిన పరిస్థితి. ఇది ఆధునిక మానవులుగా మనుషులు తమకి తాము వేసుకునే స్వయంకృత శిక్ష.

దారిన పోతుంటే కళ్ళముందు ఓ అనుకోని ప్రమాదం జరిగింది. బాధితులు నిస్సహాయ స్థితిలో ఉంటారు. ఒకప్పుడైతే స్పందించే మనుషులు చుట్టూ చేరి క్షతగాత్రులకు సాయమందించేవారు కొందరైతే, ప్రమాద సమాచారాన్ని తెలిపి అంబులెన్సుకి ఫోన్ చేసేవాళ్ళు మరికొందరు. ప్రమాదం జరిగినప్పుడు సరైన సమయంలో స్పందించే వారివల్ల ఎందరి ప్రాణాలో నిలబడేవి. ఇప్పుడైతే ప్రమాద ప్రహసనాన్ని మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో పెట్టాలి. అందరికంటే తమ వీడియోలకే ఎక్కువ లైకులు రావాలి. అందుకోసం వార్తను వలువలు చిలవలు చేసి అతిశయోక్తి ప్రదర్శించాలి. ఇంకొందరు ప్రబుద్ధులు ఎక్కడెక్కడో జరిగిన సంఘటనలను వీడియోలు సేకరించి లేదా స్వయంగా వీడియోలు తీసి, చాల జుగుప్సాకరమైన కథనాలను జోడించి, అసత్యాలను అతికించి బూతు జోకులు, వీడియోలు సోషల్ మీడియాలో, యూ ట్యూబ్ లో పోస్ట్ చేస్తూ శునకానందం పొందుతున్నారు.

ఇటీవలి కాలంలో ఈ విపరీత ధోరణి ఎక్కువైపోయింది. ఇటీవలే ఓ తండ్రి, కూతుర్ల వీడియోని వక్రంగా చిత్రీకరించి, వావివరుసలు మరచి, అతి దారుణమైన లైంగిక సంబంధాలకు తెర తీసి, తప్పుడు కధనాలు, లేకి జోకులు సృష్టించి, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో, యూ ట్యూబ్ లో అప్లోడ్ చేసి, నెటిజన్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఆ దుశ్చర్యకి పాల్పడిన అగంతకులను అరెస్ట్ కూడా చేసారు. ఇలా ఎందరినని శిక్షించగలరు. యువత తమకు తాముగా నైతిక విలువలు పాటిస్తే ఇటువంటి ఘోరాలు జరగవు. థ్రిల్ కోసం, డబ్బు కోసం జీవితాలను పతనం చేసుకుంటున్నారు.వారు చేసే పనికిమాలిన వీడియోలు అర్ధరాత్రి వరకు షేర్ చేస్తూ, సమయాన్ని, ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూ, నిద్రలేమి, అనేకానేక మానసిక రుగ్మతలకు గురవుతోంది నేటి యువత. ఈ పైత్యపు ధోరణులకు అడ్డుకట్ట వేయకపోతే, యువత శక్తులన్నీ నిర్వీర్యం అయిపోయి, యువతరం ముందు యుగానికి దూతలు అనే మాటలు చెల్లిపోయి, యువత దేశానికి పట్టిన చీడ పురుగులు అనుకోవాల్సి వస్తుంది. సరైన లక్ష్యం లేకుండా చదువుకోవాల్సిన సమయంలో పబ్బులు, క్లబ్బులు, మందు పార్టీలు, డ్రగ్ బానిసలుగా తిరుగుతూ ఉంటే దేశాభివృద్ధి ఏ విధంగా పురోగమిస్తుంది.

ఇక చివరగా మనుషులు ఒకరినొకరు పలకరించుకోవడం మానేశారు. పక్కింటిలో ఎవరున్నారో మనకి తెలియదు. మనం ఎవరో ఎదురింటివాళ్లకు తెలియదు. పుట్టినరోజు వస్తే ఫేస్బుక్ లో వందల మంది విషెస్ కామెంట్స్ పెట్టవచ్చు. ఇంటి దగ్గర మాత్రం నిన్ను ఆత్మీయంగా పలకరించే వారు ఒక్కరు ఉండరు. ఇంట్లో వాళ్ళకి కూడా ఫేసు బుక్కే గుర్తుచేస్తుంది పుట్టినరోజని. ఫేస్బుక్, వాట్సాప్,ఇన్స్ట్ర, దేనిలో అయినా సరే పుట్టిన రోజు వస్తే ఓ నవ్వు ఎమోజి, ఓ పువ్వు ఎమోజి పెట్టిస్తే చాలు. చావు పోస్ట్ దగ్గర ఓ ఏడుపు ఎమోజి పెట్టేసి అరక్షణంలో మరో పోస్ట్ దగ్గరకు పోవడమే. సెల్ ఫోన్ స్క్రీన్ మీద చూపుడు వేలును ముందుకు కదిల్చినంత వేగంగా, మానసిక ఉద్వేగాలు కూడా మారిపోతున్నాయి. పెళ్ళి పిలుపుల కోసం అప్పట్లో ఇంటింటికి తిరిగి బంధుమిత్రులను అందరిని కలుసుకొని, ఆప్యాయతలు కలబోసుకుని, పెళ్ళికి రమ్మని ఆహ్వానించేవారు. ఇప్పుడు పిలిచేవాళ్లకు సమయం లేదు. ఇంటికి వెళ్లినా ఎవరు ఉండరు. ఉరుకుల పరుగుల బతుకులో తీరుబడి ఎవరికీ ఉండదు. వాట్సాప్ లో శుభలేఖ పెట్టేస్తే చాలు. వెంటనే అటునించి, ఓ రెండుచేతుల ఆశీర్వాదపు ఎమోజి, విషెస్ వచ్చేస్తాయి.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ విషాదం ఏమిటంటే, ఏదైనా చావు వార్త ఫేస్బుక్ లేదా వాట్సాప్ లో వచ్చినా చాలు, ఓ ఏడుపు ఎమోజిని పెట్టేసి,చేతులు దులుపుకుని తర్వాతి పోస్టుకి పోతున్నారు. శుభకార్యాలకు వెళ్లకపోయినా ఎవరు పెద్దగా బాధపడరు. కానీ ఎవరైనా చనిపోయారంటే మాత్రం తప్పకుండా వెళ్ళాలి. చనిపోయాక వెళ్ళి, శవాన్ని చూస్తే ఎంత, చూడకపోతే ఎంత అనుకునే ధోరణి మంచిది కాదు. ఓ ఏడుపు ఎమోజి పెట్టి చేతులు దులుపుకోవడం కాదు. మనం వెళ్ళేది చనిపోయినవారి కోసం కాదు. ఆత్మీయులను కోల్పోయిన వారికి మేమున్నాము అనే ఒక భరోసా, ఓదార్పు ఇవ్వడం చాల అవసరం. లేకుంటే మనుషులు ఒంటరి ద్వీపంలో బంధీ అయి మానసికంగా కృంగిపోతారు. అటువంటి వారు స్మశాన వైరాగ్యం నుంచి, జీవితపు నైరాశ్యం నుంచి బయట పడే వరకు అయినా వారికి ఆసరాగా ఉండాలి.

మనిషికి ఉద్వేగాలు అవసరమే. వాటిని మాటల్లో చెప్పలేక ఎమోజిల రూపంలో వ్యక్తపరచడం అనివార్యమే ఈ వేగవంతమైన రోజుల్లో. అయితే సాధ్యమైనంత వరకు మనుషులు ప్రత్యక్షంగా కలుసుకుని, తమ సుఖ దుఃఖాలను పంచుకోవడంలోనే అసలైన ఆనందం ఉంది. టేబుల్ మీద ప్లాస్టిక్ రోజా పూలు వాజ్లోనే ఏళ్లతరబడి ఉంటాయి. కానీ ఒక్క రోజు కూడా పరిమళాలను వెదజల్లలేవు. మనం మనుషులం. ప్లాస్టిక్ లేదా మర బొమ్మలం కాదు. మన ఉద్వేగాలు మనుషులకే తెలుపుదాం. ప్రాణం లేని సెల్ ఫోన్ కి కాదు.

జులై 17న ప్రపంచ ఎమోజి దినోత్సవం సందర్భంగా విమల సాహితీ పాఠకుల కోసం.

రోహిణి వంజారి

సంపాదకీయం

9000594630

16-07-2024