స్వేచ్ఛ -ట్రోలింగ్-కిల్లింగ్. ఈ నాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి
సర్వ సత్తాక సామ్యవాద లౌకిక రాజ్యం మనది. రాజ్యంగంలో కూడా వ్యక్తి స్వేచ్ఛ గురించి ప్రత్యేకంగా చెప్పబడింది. అఖండ భారతదేశంలో వ్యక్తులు లింగ బేధం లేకుండా తమకు నచ్చిన మతాన్ని ఎటువంటి నిర్బంధం లేకుండా అనుసరించవచ్చు. తమకు నచ్చిన నాయకులను ఎలక్షన్ ద్వారా ఎన్నుకోవచ్చు. ఇంకా మనకి ఎన్నోరకాల స్వేచ్ఛలు చట్టపరంగా ఉన్నాయి. వాటిలో అతి ముఖ్యమైనవి వాక్ స్వాతంత్రం, అభిప్రాయ వ్యక్తీకరణ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ. అంటే స్త్రీ లేదా పురుషుడు సామాజిక పరంగానో, ప్రభుత్వపరంగానో ఇంకేరకమైన విధానంలో అయినా తనకి సంతోషమో, బాధో కలిగితే ఆ ఉద్వేగాన్ని మీడియా ముందో, వార్తాపత్రికల్లోనో ఏదో ఒక మాధ్యమంలో వ్యక్తపరచుకునే స్వేచ్ఛ ఉంది. ఇది వ్యక్తులకు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ.
అయితే ఈ ఉద్వేగ భావ వ్యక్తీకరణ చేసినప్పుడు, అలా చేయడం వల్ల తమకు ఏమైనా కష్టనష్టాలు కలుగుతాయో అని వ్యక్తిగతంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన రోజులు ఇప్పుడు వచ్చాయి. అనుక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన రోజులుగా కూడా ఇప్పుడు మన ముందు ఉన్నాయి. ఎందుకంటే పాత రోజుల్లో ఎక్కడో ఒకచోట ఒక సంఘట జరిగితే ఆ విషయం వార్త పత్రికల్లోనో, రేడియోలోనో వెలుగు చూడడానికి ఎన్నో రోజులు పట్టేది. కానీ ఇప్పటి ఈ అల్ట్రా మోడరన్ యుగంలో ప్రపంచంలో ఎక్కడో ఓ మూల చీమ చిటుక్కుమన్నా క్షణాల్లో అది కాంతి వేగాన్ని, వాయు వేగాన్ని మించి ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ ఆ విషయం తెలిసిపోతోంది. సోషల్ మీడియా, యూ ట్యూబ్, ఇంస్టాగ్రామ్ ఇలాంటి మాధ్యమాల్లో విషయాలు అతివేగంగా వ్యాప్తి చెందుతాయి. వీడియోలో కనిపించేదంతా కూడా నిజం కావచ్చు లేదా ఒక్కోసారి నిజం కాకపోవచ్చు. కళ్ళ ముందు కనిపించేవి కూడా నిజాలు కాకపోవచ్చు. అటువంటి కనికట్టులో మనల్ని భ్రమింపచేసే కుట్రలు జరుగుతున్నాయి ఈ రోజుల్లో. కానీ వీడియోని చూడడం తక్షణం సదరు సంఘటన పైన, సదరు వ్యక్తుల పైనా ఇక అనుకూల, ప్రతికూల కామెంట్స్, విమర్శనాస్త్రాలు, కక్షపూరిత, బెదిరింపు లేదా మానసిక క్రుంగుబాటుకు గురయ్యేలా ట్రోలింగ్ చేయడం..ఫలితం.. రాలిపోయే నిండు జీవితాలు ఎన్నో.
మార్చి నెల మహిళలకు ప్రత్యేకం. ఈ నెల 8 వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపబడింది. కవులు, రచయితలు, రాజకీయ నాయకులు, కళాకారులు ఎందరో మహిళల గొప్పతనాన్ని తెలుపుతూ, ఎన్నో కార్యక్రమాలు జరిపి మహిళలను మహిలో ఉన్న దేవతలు అంటూ పొగిడారు. సభలు నిర్వహించారు. సమావేశాలు జరిపారు. వివిధ రంగాల్లో కృషి చేసిన మహిళలకు పురస్కారాలు ప్రధానం చేసారు. ఇవన్నీ ఒక కోణమే. నాణానికి మరోవైపు చూసినట్లైతే ఎక్కడైతే మహిళలను దేవతలు అని ఆకాశానికి ఎత్తారో అదే చోట ఓ మహిళను నెగటివ్ కామెంట్స్ తో ట్రోలింగ్ చేసి, ఆమె ఆత్మ హత్య చేసుకునేలా ప్రేరేపించి, చివరకి ఆమె మరణానికి కారణమైంది ఈ ట్రోలింగ్.
మనకి తెలుసు కొన్ని రోజుల ముందే “గీతాంజలి” అనే యువతి తనకు కలిగిన ఓ లబ్దికరమైన విషయాన్ని మీడియా ముందు సంతోషంతో పంచుకుంది. అదే ఆమె చేసిన పొరపాటు. ఇక ట్రోలింగ్ దుష్ట శక్తులు ఒక్కసారిగా ఒళ్ళు విరుచుకుని, తమ అసూయాపూరిత, కుట్రపూరిత, పాశవిక ట్రోలింగ్ తో సోషల్ మీడియాలో ఆమె మీదికి దండెత్తారు. సున్నిత హృదయురాలైన ఆమె ఆ పాశవిక దాడిని తట్టుకోలేక ఆత్మనూన్యతకు లోనై, తన ప్రాణం తీసుకుంది. ఆమె మరణం ఆత్మహత్య అని, హత్య అని వివిధ రకాల కథనాలు వినిపిస్తున్నా, ఓ నిండు ప్రాణం ట్రోలింగ్ కి బలైపోయింది కదా.
దేవతలు, లతలు, పువ్వులు, పందిరి తీగలు అంటూ స్త్రీలను భ్రమింపచేసే మాటలు, రచనలు ఇప్పటికైనా ఆపి, మహిళల్లో ఆత్మవిశ్వాసం, ఆత్మస్థయిర్యం, ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకునే ధీరత్వం కలిగించే విధంగా స్త్రీలకు సహకారం అందించాలి. సోషల్ మీద లో పోస్టులు పెట్టేటప్పుడు, లేదా మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయో అని ఒక్క నిమిషం ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరు. ప్రతికూల ట్రోలింగ్ లు వచ్చినప్పుడు ధైర్యంతో ఎదుర్కొనే విధంగా ఇటు శారీరకంగా, అటు మానసికంగా దృఢత్వం కలిగిఉండడం చాల ముఖ్యం. లేకుంటే నిండు ప్రాణాలు గాలిలో కలవడం చాల విచారకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితులకు గురి చేసే ట్రోలింగ్ మహమ్మారిని కఠినంగా శిక్షించడం చట్టం తీసుకోవాల్సిన తక్షణ చర్య. ట్రోలింగ్ మహమ్మారిని తరిమివేసే ప్రక్రియను అటు ప్రభుత్వాలు, ఇటు మానవత్వం కలిగిన మనమందరం బాధ్యతగా నెత్తిన వేసుకోవాల్సిన తరుణం ఇది.
ట్రోలింగ్ కారణంగా చనిపోయిన గీతాంజలి కి నివాళులతో..
రోహిణి వంజారి
సంపాదకీయం