విమల సాహితి ఎడిటోరియల్ 32 – పడిలేచిన కెరటం నిలువెత్తు ఉద్యమమై

ఈనాటి విమల సాహితీ ఆన్లైన్ వారపత్రికలో నా సంపాదకీయ వ్యాసం “పడిలేచిన కెరటం నిలువెత్తు ఉద్యమమై” చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి..

“వంద మంది దోషులు తప్పించుకోవచ్చు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు” అనే నానుడి మనకు తెలుసు. నిర్దోషికి శిక్ష పడటం విచారకరమే కానీ వంద మంది దోషులు శిక్ష నుంచి తప్పించుకుని సమాజంలోకి పొతే ఏమౌతుందో తెలుసా..? దేశం నేరాల మయం అవుతుంది. మృగాలు వీధుల్లో తిరుగుతూ పైశాచిక క్రీడలు సాగిస్తాయి. మతాల మధ్య, మనుషుల మధ్య విద్వేషాన్ని రగుల్చుతాయి. ఆ పైశాచిక జ్వాలల్లో ఆహుతి అయ్యేది మాత్రం అమాయకమైన ప్రజలే. అలా మతోన్మాదానికి బలైన మహిళ బిల్కిస్ బానో. మత గొడవలు, అల్లర్లతో ఏ మాత్రం సంబంధం లేని ఆమె జీవితం మాత్రం అల్లరిమూకల రాక్షస క్రీడకు గురైంది.

ఇప్పుడు బిల్కిస్ బానో గురించి ఎందుకు చెప్పుకోవాలంటే, ఓ సారి గతంలోకి వెళ్ళాలి. గుజరాత్ లో గోద్రా రైలు దగ్ధం ఘటన తర్వాత 2002 లో జరిగిన గుజరాత్ అల్లర్ల భయాందోళనల నుంచి పారిపోవాలని రాంధిక్ పుర్ గ్రామం నుంచి ట్రక్కులో వెళుతున్న సమయంలో అల్లరి మూకలు అడ్డుకుని, బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిపారు. గర్భవతిని కనికరించండి అని కాళ్ళు పట్టుకున్నా వదలలేదు అల్లరిమూకలు. ఆ సమయంలో ఆమె వయస్సు 21 సంవత్సరాలు. అప్పుడు ఆమె ఐదు నెలల గర్భవతి. అల్లర్లలో ఆమె కుటుంబ సభ్యులను 14 మందిని అల్లరి మూకలు చంపేశారు. ఆమె కళ్ళ ముందే ఆమె మూడేళ్ళ కుమార్తె తలను నేలకేసి కొట్టి చంపేశారు. ఎంతటి విషాదం ఇది. ఎంతటి నికృష్టపు చర్య ఇది. జరిగిన దారుణాలకు ఆమె కృంగిపోయింది.

అయితే ఆమె పడిలేచిన కెరటంలా మనో ధైర్యం తెచ్చుకుని, తన పట్ల జరిగిన దారుణాలకు న్యాయం కోరుతూ చట్టాన్ని ఆశ్రయించింది. దోషులను శిక్షించాలని అలుపెరుగని న్యాయపోరాటం చేసింది. సుదీర్ఘ విచారణల అనంతరం 2008 జనవరి 21 వ తేదీన సీబీఐ ప్రత్యేక కోర్ట్ నిందితులకు జీవిత ఖైదు విధించింది. నిందితులను అరెస్ట్ చేసి జైలుకి పంపింది చట్టం. తనపై జరిగిన పైశాచికానికి, హత్యలకు దోషులకు శిక్ష పడడంతో ఆమెకి కాస్త ఉపశమనం లభించింది. తమ ఇళ్ళన్నీ అగ్నికి ఆహుతి అయినాయి. ఎక్కడో ఓ కొత్త ప్రాంతంలో కొత్త జీవితం ప్రారంబించాలనుకుంది. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. నేరస్తులుగా పరిగణింపపడి జైలులో ఉన్న 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం క్షమాభిక్షను మంజూరు చేసింది. 2022 లో ఆగష్టు 15 న స్వాతంత్ర దినోత్సవం రోజున వారిని విడుదల చేసారు. 1992 పాలసీ ఆధారంగా దోషుల ఉపశమనాన్ని అనుమతించినట్లు గుజరాత్ ప్రభుత్వం తెలిపింది. దానికి కేంద్రం ఆమోదం లభించింది. గొప్ప ఘనకార్యాన్ని సాధించిన వీరుల లాగా దోషులకు పూలమాలలు వేసి మరీ జైలు నుంచి వారిని బయటకు ఆహ్వానించారు. ఆనందంతో స్వీట్స్ పంచుకున్నారు.

ఈ సంఘటనతో యావత్ సభ్యసమాజం నివ్వెరపోయింది. అధికారుల అండదండలు, డబ్బు పుష్కలంగా ఉన్న వారిని విడుదల చేయడానికి న్యాయస్థానం కళ్ళకి గంతలు కట్టుకుంది. ఈ సంఘటనతో బిల్కిస్ బానో కృంగిపోయింది. ఇక తమకు రక్షణ కరువైందని, న్యాయస్థానం మీద నమ్మకం పోయిందని ఆమె వాపోయారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీమ్ కోర్టులో బిల్కిస్ బానోతో సహా పలువురు పిటిషన్లు దాఖలు చేసారు. మానవతా వాదులందరు బిల్కిస్ బానో వైపున నిలిచారు. విచారణ జరిపిన సుప్రీమ్ కోర్టు గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని తేల్చి చెప్పింది. దోషుల విడుదల చెల్లదని, రెండు వారాల్లోగా వారంతా జైలులో లొంగిపోవాలని తీర్పు వెలువరించింది. ఇది సుప్రీమ్ కోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు అని పలువురు హర్షం వ్యక్తం చేసారు. అయితే నిందితులు కొందరు పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఎప్పటికైనా వాళ్ళకి శిక్ష తప్పదు. చట్టం ఎవరికి చుట్టం కాకూడదు. న్యాయస్థానాలు అన్యాయానికి, నిందితులకు కొమ్ముకాయకూడదు. అప్పుడే ధర్మం నిలబడుతుంది.

“ధర్మో రక్షతి రక్షిత: “.

మనం ధర్మాన్ని కాపాడితే,

ధర్మం మనలను కాపాడుతుంది. ఇది ప్రభుత్వాలకైనా, న్యాయస్థానాలకైనా,

వ్యక్తులకైనా వర్తిస్తుంది.

అధర్మాన్ని రక్షించాలని చూస్తే

మాత్రం వినాశనం తప్పదు.

రోహిణి వంజారి

సంపాదకీయం

9000594630