విమల సాహితి ఎడిటోరియల్ 25 – పులిరాజాలు ఏం చేస్తున్నారు..?

“పులిరాజ” గుర్తు ఉన్నాడా మీకు? మర్చిపోయి ఉంటే ఓ సారి ఈ సంపాదకీయం చదివి గుర్తు తెచ్చుకోండి మిత్రాస్. ఆరోగ్యమే సకల భాగ్యాల సమ్మేళనం అని తెలుసుకుని అందరం ఆనందంగా జీవితం గడపాలని కోరుకుంటూ🌹🙏ఈ రోజు “విమల సాహితీ పత్రిక” ఎడిటోరియల్ వ్యాసం చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🌹

డిసెంబర్ మాసం ఇష్టసఖి లాంటిది. చిరుజల్లులు ఒకపక్క, పిల్ల తెమ్మెరలు మరోపక్క, లేత నీరెండ ఇంకోపక్క ఒంటిని తాకుతుంటే ఎంత మానసికోల్లాసం. చామంతులు, ముద్ద బంతులు, రంగురంగుల డిసెంబర్ పూలు నయనానందకరంగా ఎన్నెన్నో చిలిపి ఊసులు హృదిని తాకే వేళ.

మనమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎలక్షన్స్ పోలింగ్ రోజు రానేవచ్చింది. పోలింగ్ కూడా పూర్తి అయిపోయింది. చూపుడు వెలికి సింగారంలా మారిన ఇంకు చుక్కను ఫొటోతీసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసి ‘నా బాధ్యత తీర్చుకున్నాను” అంటూ ఓ పనైపోయిందని సంతోషపడడం కూడా అయిపోయింది. ఫలితాలు ఇదిగో, ఈ సాయంత్రానికే తెలిసిపోతాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా సరే, ఎన్నికల ముందు చేసిన వాగ్ధానాలను నిలుపుకోకపోతే మాత్రం నాయకులను నిలదీసి,నిగ్గుతేల్చాల్సిన బాధ్యత ప్రజలదే.

అన్నింటికంటే మరోముఖ్యమైన బాధ్యతని కూడా మనం మరువకూడదు. దశాబ్దికి ఒకసారో, శతాబ్దికి ఒకసారో ప్రజల అప్రమత్తతని గుర్తుచేస్తూ, ప్రజారోగ్యాన్ని సవాలు చేస్తూ, శాస్త్రీయ విజ్ఞానానికి పరీక్షలు పెడుతూ,ప్రజలెందరినో పొట్టన పెట్టుకున్న మహమ్మారిల గురించి మనకందరికీ తెలుసు. 18 వ శతాబ్దిలో ప్రబలిన ప్లేగు, ఆ తర్వాత కలరా, మసూచి లాంటి మహమ్మారుల గురించి మనకి తెలుసు. తలచుకుంటేనే ఒణుకు పుట్టించే మొన్నమొన్నటి కరోనా వైరస్ గురించి కూడా మనకి తెలుసు. కళ్ళముందు గుట్టలు గుట్టలుగా శవాలు, ఎవరెవరో ఆనవాలు కూడా చిక్కకుండా సామూహిక దహనం, ఖననం అయిన విషాదాలుకూడా మన కళ్ళు చూశాయి. మహమ్మారి అంటే అంటు వ్యాధి అని మనకు తెలుసు. కానీ అంటించుకునే వ్యాధి గురించి ఇప్పుడు మరోసారి మాట్లాడుకోవాల్సిన తరుణం ఇది.

ఎందుకంటే డిసెంబర్ ఒకటవ తేదీ “ఇంటర్నేషనల్ ఎయిడ్స్ డే” కాబట్టి.

మానవ జీవితాలను అతలాకుతలం చేసి, మనిషి మెదడుని భయం గుప్పట్లోకి తీసుకుని అనుక్షణం రాబోయే చావుని గుర్తుచేస్తూ కంటిమీద కునుకు లేకుండా చేసే మహమ్మారులు HIV, AIDS వైరస్లు. HIV అంటే Human immunodeficiency virus. AIDS అంటే Acquired immunodeficiency syndrome అని మనకి తెలుసు. HIV వల్ల వ్యాధి నిరోధక శక్తి సన్నగిల్లితే, క్రమంగా ఇతర అన్నిరకాల లైంగిక వ్యాధులు, శారీరక నూన్యతలు మానవ శరీరం మీద పట్టు సాధించి, రక్తంలో వ్యాధి నిరోధక తెల్ల రక్తకణాలమీద దాడి చేసి, మనిషిని మరణానికి చేరువ చేసే భయంకరమైన బూచి ఈ ఎయిడ్స్ వ్యాధి.

ఎలా సంక్రమిస్తుంది? సురక్షితం కానీ లైంగిక సంబంధాల్లో ఒకరికి ఎయిడ్స్ వైరస్ ఉంటే, మరొకరికి వ్యాప్తి చెందుతుంది. తల్లికి ఎయిడ్స్ వైరస్ ఉంటే, పుట్టిన శిశువుకి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉంది. సురక్షితం కానీ రక్తమార్పిడి వల్ల అమాయకులు ఎయిడ్స్ వ్యాధికి బలవడం కడు శోచనీయం. ప్రభుత్వం ఏం చేస్తోంది? మనం ఏం చేయాలి? ప్రతి సంవత్సరం డిసెంబర్ నెలలో పాఠశాల స్థాయినుంచి విద్యార్థులకు లైంగిక విజ్ఞానం గురించి అవగాహనా తరగతులు నిర్వహిస్తుంది. LGBT వారికి, సామాన్య ప్రజలకు కూడా సురక్షిత లైంగిక సంపర్కం గురించి అవగాహన కల్పించి, ప్రతి ఆరోగ్యకేంద్రం నుంచి ఉచితంగా కండోమ్స్ కూడా సరఫరా చేస్తుంది. తల్లి నుంచి శిశువుకు వ్యాధి సంక్రమించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రక్తదానం చేసే చోట సురక్షితమైన పరికరాలు వాడడం వంటి జాగ్రత్తల గురించి అప్రమతం చేస్తుంది.

మరి ప్రజల బాధ్యత ఏమిటి. జెండర్ తో సంబంధం లేకుండా ఇద్దరు వ్యక్తులు ఇష్టపడి సెక్స్ చేస్తే అది చట్టప్రకారం నేరం కాదు అని న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది మనకి తెలుసు. కానీ ప్రతి మనిషి తనచుట్టూ ఓ నైతిక చట్రం గీచుకుని, దాన్ని అతిక్రమించకుంటే, ఎయిడ్స్ లాంటి వ్యాధులు సంక్రమించకుండా ఉంటాయి. లేదు, న్యాయస్థానమే నేరం కాదన్నది. మా దారి రహదారి అనుకుంటే మాత్రం, కనీసం సురక్షిత లైంగిక పద్ధతులు పాటిస్తే, ఎయిడ్స్ బారినపడకుండా ఉంటారు.

ఇక సమాజంలో ఒక వ్యాధి గ్రస్తుడిని ఇతరులు ఎంత నీచంగా చూస్తారో మనకి తెలియనిది కాదు. కుష్ఠు వ్యాధి వారిని కనీసం తాకడానికి కూడా ఎవరు ఇష్టపడరు. అలాగే ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుడి చేయి తగిలినా ఎక్కడ తమకి అంటుకుంటుందో అని భయం. కానీ ఎయిడ్స్ తాకడంవల్ల, దుస్తులవల్ల, ఆహరం వల్ల సంక్రమించదు.

ఇక నైతిక విలువల గురించి మాట్లాడితే “మీలో నేరం చేయనివారు ఎవరో చెప్పండి? ఏ దోషం లేనివారు ఎవరో చూపండి?” అనే పాటలో అన్నట్లు మన మంచి, చెడు,నేరం, దోషం ఎవరికి తెలియకున్నా మన మనసుకి తెలుస్తాయి. కాబట్టి వ్యాధి గ్రస్తులను ఈసడించుకోకుండా వారిని ప్రేమగా చూసి, వారికి బతికేందుకు మనో స్తైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మాత్రం మనదే. కాదంటారా?

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలోని ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఎయిడ్స్‌పై గ్లోబల్ ప్రోగ్రామ్ కోసం ఇద్దరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్లు జేమ్స్ డబ్ల్యూ. బన్ మరియు థామస్ నెట్టర్ చేత ఆగస్టు 1987లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని మొదట రూపొందించి ప్రారంభించారు. ప్రతి సంవత్సరం, ఐక్యరాజ్యసమితి, యునైటెడ్ స్టేట్స్ ప్రభుత్వం మరియు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయా ప్రభుత్వాలు, అనేక స్వచ్ఛంద సంస్థలు ఎయిడ్స్ యొక్క విభిన్న నేపథ్యంపై కేంద్రీకృతమై ప్రచారాలను సమన్వయ పరుస్తున్నాయి. భారతదేశంలో మెలిండా గేట్స్ ఫౌండేషన్ విస్తృతంగా ఎయిడ్స్ నివారణ కోసం విశేష కృషి సల్పి అనేక సంస్థలను, రాష్ట్ర ప్రభుత్వాలను భాగస్వామ్య పరచి, సమన్వయపరచి, ప్రజలను చైతన్యపరచి కార్యక్రమాలను విజయవంతం చేస్తుంది.

డిసెంబర్ 1 న ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం.

రోహిణి వంజారి

సంపాదకీయం

9000594630