“సిరులెన్ని ఉన్నా చిరునవ్వు ఏది ? ఈ వారం విమల సాహితి పత్రికలో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపండి.
గేటెడ్ కమ్యూనిటీలో 3 బీకే ప్లాట్, విల్లా లాంటి పెద్ద భవంతి, పెద్ద ఉద్యోగాలు, లక్షల్లో బ్యాంకు బాలన్సు, తిరగడానికి ఖరీదైన కారు. అన్నీ ఉన్నా ముఖంలో చిరునవ్వు కరువు. సకల సౌకర్యాలు ఉన్నా, బంగారు పువ్వు వేసిన వెండి పళ్ళెంలో తినేది మాత్రం రాగి సంగటి ముద్ద, రెండంటే రెండు పుల్కాలు. లేదంటే కొర్రలు, సామల అన్నం. తీపి, ఉప్పు, పులుపు, కారం ఏ రుచి నాలుకకి తగలని చప్పిడి కూడు. ఎందుకంటే అప్పటికే వారి శరీరంలో చెక్కర ఫ్యాక్టరీ, కొలెస్ట్రాల్ ఫ్యాక్టరీలు నిండి పోయి ఉంటాయి. వెనుకటి రోజుల్లో మన హాస్య నటులు రేలంగి ఒక మాట అనేవారట “రాళ్ళూ, రప్పలు తిని అరాయించుకునే రోజుల్లో తినడానికి అన్నం కూడా దొరకదు. కష్టపడి ఇల్లు – వాకిలి, నగ – నట్రా సంపాదించి, నాలుగు రాళ్ళు వెనకేసుకున్నాక స్థిమితంగా తిందాములే అనుకుంటే, అప్పటికి మాములు అన్నం కూడా జీర్ణమయ్యే స్థితి ఉండదు” అనే వారట సహనటులతో విరక్తిగా.
అంతులేని జీవన పోరాటంలో పడుతూ, లేస్తూ, ఆశ నిరాశల మెట్లు ఎక్కుతూ, దిగుతూ, పరుగులు తీసే బిజీ లైఫ్ లో మనిషి తన గురించి తాను ఆలోచించుకోవడం మానేసాడు. సముద్రంలో పడినవారైనా ఈదుకుంటూ ఒడ్డుకు చేరవచ్చేమో కానీ, సంపాదన యావలో పడ్డవారు బయటపడడం చాల కష్టం. ప్రతి విషయంలో పక్కవారితో పోల్చుకోవడం, వారు ఇల్లు కొంటే, మనం కూడా కొనాలి. వారు పిల్లలను చదువుకు విదేశాలకు పంపితే, మనమూ మన బిడ్డలను ఫారెన్ యూనివర్సిటీల్లో చదివించాలి. ఏ విషయంలోనైనా మనం పక్క వారికంటే కాస్త పైస్థాయిలో ఉండాలి. నిరంతరం ఇదే తపన. ఏం తింటున్నామో, ఎలా బతుకుతున్నామో అనే దాని మీద ధ్యాస ఉండదు. ఫలితం శారీరక, మానసిక అనారోగ్యం.
అసలు ఆరోగ్యం అంటే ఏమిటి? అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ నిర్వచనం పరిశీలిస్తే, “మనిషి శారీరకంగానూ, మానసికంగానూ, సామాజికంగానూ, ఆర్ధికంగానూ, తను ఉన్న పరిసరాలలో హాయిగా జీవించడాన్ని ఆరోగ్యం” అనవచ్చు. ఆరోగ్యం ప్రతి మనిషికీ ఉన్న ప్రాథమిక హక్కు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలి.
ఆరోగ్యం గురించి ఇంత వివరణ ఎందుకంటే ప్రతి సంవత్సరం నవంబర్ ఏడవ తేదీన “జాతీయ కాన్సర్ అవగాహన దినోత్సవం” మన దేశంలో జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా కాన్సర్ వ్యాధి గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలి. మానవ శరీరంలో అసహజ కణాలు అనియంత్రితంగా పెరిగినప్పుడు శరీరంలోని ఏదైనా అవయవం లేదా కణజాలంలో మొదలయ్యే వ్యాధుల యొక్క పెద్ద సమూహం ఈ కాన్సర్ వ్యాధి. దేహంలో ఒక ప్రాంతంలో ప్రారంభమైన ఈ వ్యాధి, పక్కనే ఉన్న ఇతర భాగాలపై దాడి చేస్తూ, శరీరమంతటా వ్యాప్తి చెందుతుంది. ఈ ప్రక్రియను ‘మెటాస్టాసైజింగ్’ అంటారు. ఇది కాన్సర్ నుండి మరణానికి దారితీసే ప్రధాన కారకం. ‘నియోప్లాజం’, ‘ప్రాణాంతక కణితి’ అనేవి కాన్సర్ కి ఉన్న సాధారణ పేర్లు.పురుషుల్లో సాధారణంగా ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, కొలొరెక్టల్, కడుపు మరియు కాలేయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. మహిళల్లో అయితే రొమ్ము కాన్సర్, ఊపిరితిత్తులు, గర్భాశయ మరియు థైరాయిడ్ క్యాన్సర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాన్సర్ చికిత్సలను పరిశీలిస్తే సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ, క్రమం తప్పకుండా ఔషధాలను వాడడం ద్వారా కాన్సర్ వ్యాధిని నివారించవచ్చు.
అసలు కాన్సర్ వ్యాధి రావడానికి కారణాలు ఒకసారి పరిశీలిస్తే, అస్తవ్యస్తమైన జీవన విధానాలు, పొగ త్రాగడం, ఆల్కహాల్ వినియోగం, కొవ్వు పదార్ధాలతో, మసాలాలతో కూడిన ఆహారపదార్ధాలు అధికంగా తినడం, ఇన్ఫ్రారెడ్ కిరణాలకు గురికావడం, కాలుష్యం మొదలైనవి చెప్పుకోదగినవి.
“Prevention is better than cure ” అనే నానుడి మనకు తెలుసు కదా. వ్యాధి వచ్చాక వైద్యుడి దగ్గరకు పరిగెత్తడం కన్నా, అసలు వ్యాధి రాకుండా జాగ్రత్త పడడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఆధునిక విజ్ఞాన ఫలాలు, సౌకర్యాలు అందుకుంటూనే, కాస్త జీవన శైలిలో కూడా మార్పులు చేసుకోవాలి. ఊబకాయం సకల రోగాలకు మూలం. రోజులో కాసేపైనా వ్యాయామం చేయడం, ప్రాణాయామం చేయడం, ఏరోబిక్ మరియు అనారోబిక్ వ్యాయామాలు చేయడం, కనీసం ఒక అర్ధగంట అయినా వేగంగా నడవడం ప్రతిఒక్కరు తమ జీవితంలో భాగంగా చేసుకోవాలి. మంచి పౌష్టికమైన ఆహరం, స్వచ్ఛమైన నీరు, సీజనల్ ఫ్రూప్ట్స్ తీసుకోవాలి. శరీరాన్నే కాదు, మనసును కూడా శుద్ధి పరుచుకోవడానికి ధ్యానం, ప్రార్ధన, జీవితం పట్ల ఆశావహ సానుకూల ధృక్పథం ఏర్పరచుకోవడం వంటివి చేయాలి. కాన్సర్ అనే కాదు, ఏ ఇతర వ్యాధికి గురైన వ్యక్తినైనా ఇటు కుటుంబ సభ్యులు, అటు సమాజం చీదరించుకోకుండా, వారు పట్ల జాలి, కరుణ చూపించి, వారు వ్యాధి నుంచి బయటపడే విధంగా వారికి ప్రేమను అందించినట్లేతే ఈ భూమి మీదే మనుషులు స్వర్గాన్ని చూస్తారు.
మిత్రమా..లే..ఎన్ని రోజులైంది నువ్వు సూర్యోదయాన్ని చూసి. భానుడి నులివెచ్చని కిరణాల స్పర్శని తనివితీరా అనుభవించు. రాత్రి కురిసిన మంచులో తడిచిన పూల కొమ్మలు చెప్పే కబుర్లు విను. మకరందపు పరిమళాలను గుండెలనిండా పీల్చుకో. పక్షుల కిలకిలా రావాలు నేర్పే పాటలు తియ్యగా పాడుకో. రేపు వచ్చే ఆనంద సమయాలకోసం ఎదురు చూడు..
రోహిణి వంజారి