అధునాతన ధర్మం ఏం చెబుతోంది? ఈవారం విమల సాహితీ సంపాదకీయం. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి
“ధర్మో రక్షతి రక్షితః ” ఈ వాక్యానికి సూక్ష్మంగా “ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది” అనే అర్ధం ఉంది. ఎక్కడ ప్రజలు కలహాలు, కల్లోలాలు, విద్వేషాలు లేకుండా సంతోషంగా ఉంటారో, ఎక్కడ హింసకి తావు లేకుండా, త్యాగం, ప్రేమ, కరుణ రాజ్యమేలుతాయో అక్కడ ధర్మం నాలుగుపాదాల మీద నిలుస్తుంది అని పెద్దలు అన్నారు. మరి ఇప్పుడు ధర్మం నాలుగు పాదాలమీద నడుస్తోందా?
అసలు ధర్మం అంటే ఏమిటి? దీనికి సమాధానం మాత్రం కాస్త స్థూలంగా చెప్పాలి. “ఇతరులకు మనం మంచి చేస్తే పుణ్యం కలుగుతుంది. చెడు చేస్తే పాపం కలుగుతుంది. ఇదే ధర్మ సూక్ష్మం” నిస్వార్ధంగా జీవిస్తూ తన శ్రేయస్సు కోసం కాకుండా అందరి అభ్యుదయం కోసం జీవించడమనేది అన్నిటికన్నా ఉత్తమ ధర్మం. నిస్సహాయులకు, వృద్దులకు నీవు చేసే సేవ, అందించే సహాయం మానవతా ధర్మం. ఇతరులనుండి నీవు ఏమి ఆశిస్తున్నావో దాన్ని నీవు ఇతరులకు అందించడం, ఇతరులు నీపట్ల ఎలా వ్యవహరించకూడదో అలా నీవు ఇతరులపట్ల వ్యవహరించకుండా ఉండడం అనేది అసలైన, నిజమైన ధర్మం.”ఇక్కడ ఈ భూమిమీద మానవ రూపంలో నీవు చేసిన తప్పులకు పైన మరోలోకం నరకంలో తప్పకుండా శిక్షని అనుభవిస్తావు. అందుకని ఇతరులపట్ల నీవు మంచిగా ఉండు, మంచి చెయి, దానధర్మాలు చెయి, ఆకలిగొన్నవారికి అన్నం పెట్టు. నీకు మంచి జరుగుతుంది” అన్నాడు మహ్మద్ ప్రవక్త. “నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు. దైవం కొరకు కాదు మనషుల కొరకు ప్రార్ధించు. నీ కోసం, నీ కుటుంబం కోసం, నీ సమాజ హితం కోసం పాటుపడు” అన్నాడు క్రీస్తు ప్రభువు” ఎక్కడైతే , ఏ యుగంలో అయితే అన్యాయం పెచ్చుమీరుతుందో, ఎక్కడఅరాచకాలు పెరిగిపోతాయో, ఎక్కడైతే అశాంతి, హింస, దుష్ట గణాలు రాజ్యమేలుతాయో, అక్కడ ఆ యుగంలో శాంతిని కాపాడానికి, అమాయకులైన వారిని, ధర్మం తప్పని వారిని రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి, “ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే” ధర్మాన్ని రక్షించడానికి నేను ప్రతి యుగంలోను ఉద్భవిస్తుంటాను అని గీతాచార్యుడు అన్నాడు. “అహింసా పరమో ధర్మః ” అహింస అన్ని ధర్మాలలోకెల్లా పరమోత్తమమైనది అని తధాగతుడు, మహా వీరుడు కూడా ధర్మం గురించి చెప్పారు. మరి ఇప్పుడు ఈ కలియుగంలో ఆ మహానుభావుల బోధనలు అనుసరిస్తున్నవారు ఎంతమంది ఉన్నారు? తాను బాగుంటే చాలు, తనకులం, తన మతం అభివృద్ధి చెందితే చాలు. ఇతరులు ఏమైపోయినా మనకు అనవసరం. తన బాగు కోసం తాను ఏమైనా చేస్తాడు. తన దారికి అడ్డువచ్చిన ఎవరినైనా తాను హింసించో, హత్య చేసో వారిని వదిలించుకుంటాడు. ఇది నేటి మనుషుల్లో పెరిగిపోయిన స్వార్ధ చింతన. తనకంటే బలహీనులైన వారిపట్ల ఆధిపత్యం, బానిసలుగా చూడడం. కులం, మతం అంటూ రెచ్చగొట్టి, అమాయక ప్రజల మధ్య అడ్డుగోడలు కట్టి, చిచ్చు పెట్టి తాను పబ్బం గడుపుకోవడం. నోరు లేని అమాయక ప్రాణులైన జంతువులకు కూడా విద్వేషాలు అంటగట్టడం, మితి మీరిన జంతు హింస, జంతు బలి. తమ ఆనందం కోసం, తమ విలాసం కోసం పండుగలనాడు జంతువులను హింసించడం. ఇక శిఖరాగ్రాన్ని చేరిన దుష్టత్వం ఏదంటే స్త్రీ లను బానిసలుగా చూడడం. అన్ని రకాల ఆంక్షలు స్త్రీలకే. “న స్త్రీ స్వాతంత్రమర్హతి ” అన్న మనువే “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః ” ఒక పక్క స్త్రీలు స్వేచ్ఛకి అర్హులు కారు అంటూనే, మరో పక్క “ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు దయకలిగి ఉంటారు. స్త్రీలకు గౌరవం లేని చోట జరిగే దేవతా పూజాది క్రియలన్నీ వ్యర్థం” అని కూడా అన్నాడు. ఈ ద్వంద్వ నీతిని పక్కన పెడితే, మనమంతా పరమ పవిత్రం అని భావించే భరత ఖండంలో మణిపూర్లో ఇటీవలే స్త్రీలకు జరిగిన అన్యాయం ఏమిటో మనకందరికీ తెలుసు. మరి ప్రజలు, పాలకులు ఏ ధర్మాన్ని అనుసరిస్తున్నారు? కీచకులు, భక్షకులు, వంచకులు, వరకట్న పిశాచులు, కాముక ఉన్మాదులు తరతరాలుగా స్త్రీలను హింసిస్తూనే ఉన్నారు. సతి, విధవ, పతివ్రత, దేవదాసి, మాతంగి, వేశ్య, అబల, పూలతీగ, శృంగార వస్తువు, కామోద్రేకాన్ని చల్లార్చుకునే సాధనం.. ఎన్ని బిరుదులో మహిళలకు. స్త్రీలను ఇంత నీచ భావనలతో చూడమని ఏ ధర్మం చెప్పింది? ఎంత అభివృద్ధి సాధించినా, ఎన్ని తెలివితేటలు ఉన్నా, తరతరాలుగా ఇంకా స్త్రీలు రెండవ జాతి వారుగా చూడబడడం ఏమి అభ్యుదయం? ఇది ప్రజలు, పాలకులు మార్చవలసిన ధర్మం. ఇక మనిషిని మనిషిగా చూడక మనిషి కులాన్ని, మతాన్నిచూడడం, అంటరానితనం పాటించమని ఏ ధర్మం చెప్పింది?
చిన్నప్పుడు ” తల్లీ భారతి వందనం..నీ ఇల్లే మా నందనం, కులమత బేధం మరచెదము..కలతలు మాని మెలగెదము, మానవులంతా సమానమంటూ మమతను, సమతను పెంచెదము” అంటూ మకిలి అంటని మనసులతోబడిలో ప్రమాణం చేసుకున్నాం. ఇప్పుడేది ఆ స్వచ్ఛత? ఎన్నో దుష్ట, మూడాఛారాలను రూపుమాపి, మనుషులంతా సుఖశాంతులతో జీవించాలని ఎందరో మహానుభావులు తరతరాలుగా శ్రమించి, కృషి చేసి , ఎన్నో చట్టాల్లో మార్పులు తెచ్చారు. ఆ మహానుభావులందరికి పాదాభివందనాలు. మనుషులు మారాలి. అలా మారకుండా “నేను చేసేది శృంగారం, ఎదుటివాడు చేసేది వ్యభిచారం” అంటూ నీతులు వల్లిస్తూ, మానవజాతి అభివృద్ధి కోసం కాకుండా తిరోగమనానికి పయనిస్తే, “వినాశకాలే విపరీత బుద్ధి” అన్నట్లు తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుని, పాతాళంలోకి పడిపోవడం మాత్రం ఖాయం. అంతరాలు అన్నీ మరచి అందరి సుఖాన్ని కోరుకోవడం, అభివృద్ధి ఫలాలు అందరికీ అందించడం, సంకుచిత బుద్ధిని వదిలి విశాల దృక్పధంతో అందరిని సమభావంతో చూడడం, తనని తాను ఇష్టంగా ప్రేమించుకున్నట్లు అందరినీ ప్రేమించగలగడం, విశ్వమానవ సౌబ్రాతృత్వమే, విశ్వమానవ కళ్యాణమే, మానవత్వమే అసలు సిసలైన అధునాతన ధర్మం . కాదంటారా?
రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630