రోహిణక్క కథల మందల

మే నెల విశాలాక్షి మాసపత్రికలో “రోహిణక్క కథల మందల” అంటూ డాక్టర్ పెళ్ళూరు సునీల్ గారు రాసిన సమీక్ష. విజయ మహల్ సెంటర్ కథల మందల గుట్టును సరిగ్గా విప్పి చెప్పిన సమీక్ష ఇది.

శ్రీ కోసూరు రత్నం Ratnam Kosuru గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు Ethakota Subbarao గారికి కృతజ్ఞతలతో 🌹🙏 డాక్టర్ పెళ్ళూరు సునీల్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో 🌹🙏

సమీక్ష చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి. పుస్తకం కొరకు ఈ నెంబర్ ను సంప్రదించండి -9000594630

ఒక ఊరి పేరుతో, ఒక వీధి పేరుతో ఒక ప్రాంతం పేరుతో, స్థలం పేరుతోనూ కథలు రావడం తెలుగులో కొత్తేమీ కాదు. ఆ లిస్ట్ అంతా ఇక్కడ చెప్పడం అప్రస్తుతం. అయితే ఆ కోవలోనే “విజయ మహల్ సెంటర్ కథలు” పేరుతో వంజారి రోహిణి గారు ఓ కథా సంపుటి వేశారు. ఈ కథలన్నీ గతంలో విశాలాక్షి మాస పత్రికలో వచ్చినవే. కథలకు అసలు వస్తువు ఎక్కడి నుంచి తీసుకోవాలి అన్న ప్రశ్న పాతదే అయినప్పటికీ జీవితం నుండి వచ్చే కథలు జీవితాన్ని సమగ్రంగా దర్శింపజేస్తాయి అన్నది మాత్రం నూటికి నూరుపాళ్ళు నిజం. ప్రతి ఒక్కరికి జీవితం ఉంటుంది. అందులో విశేషించి బాల్యం ఉంటుంది. బాల్యంతో పెనవేసుకున్న అనేక బంధాలు అనుబంధాలు అనుభూతులు అభిప్రాయాలు అందరికీ ఉంటాయి. పెద్దవాళ్లమయ్యాక చిన్ననాటి సంగతులను తలుచుకుంటూ అందులోని తీపి గుర్తులను

తవ్విపోసుకునేవారు కొందరైతే, దుఃఖ భరిత సన్నివేశాలను తలుచుకుంటూ కుమిలిపోయేవారు మరికొందరు. తమ బాల్యాన్ని గురించి కథలు కథలుగా తన పిల్లలకు ప్రతి తల్లి తండ్రి చెప్తుంటారు. మనువలు మనవరాళ్లతో తమ చిన్ననాటి విషయాలను పంచుకుంటూ పిల్లలు అయిపోతారు ముసలోళ్ళు. ఎవరి అనుభవాలను వాళ్ల పిల్లలకు వినిపించడంతోనే సరిపెట్టుకుంటారు ఎక్కువ మంది. ఎవరో రోహిణి లాంటి వాళ్లు వాటిని అక్షరీకరించి సమాజానికి కానుకగా ఇస్తారు. తమ జీవితంలో నుంచి ప్రపంచం పొందాల్సిన అనుభవాలు, తరువాతి తరం వాళ్లు గ్రహించాల్సిన విషయాలు ఉన్నాయనిపించినప్పుడు ఈ రకం కథలు పుట్టుకొస్తాయి. పైపెచ్చు ఈ కథలకు ఉన్న గొప్పదనం ఏమిటంటే నెల్లూరు మాండలిక శైలిలో సాగడం. చిన్నప్పుడు ఎటువంటి నాగరిక ప్రపంచమూ మనకు పరిచయం కానప్పుడు, ఏ ప్రభావాలు మన మీద లేనప్పుడు, కేవలం కుటుంబం దాని చుట్టూ ఉన్న వాతావరణమే మనకు ప్రపంచం అయినప్పుడు, చుట్టూ ఉన్న భాష మనలోకి ఇంకిపోతుంది. బాల్యంలో అందరూ మాండలిక ప్రభావానికి లోను కావలసిన వారే. అలా ఎవరైనా కాలేదంటే వాళ్లు సమాజానికి దూరంగా పెరిగారని అర్థం. మనుషుల్లో కాక ఒంటరితనాల్లో జీవించారని అర్థం. బాల్యాన్ని కోల్పోయారని అర్థం. మనం ఎంత చదువుకొని భాషను, నాగరికతను పెంచుకున్నా సరే మాండలికం తల్లి ప్రేమ లాగా స్వచ్ఛంగా అనిపిస్తుంది. ప్రపంచీకరణ పుణ్యమా అని ప్రపంచమంతా ఒకటే భాష రూపొందుకున్నాక, అసలు భాషకే ఎసురు వస్తున్న రోజుల్లో అందులోని మాండలిక సౌందర్యాన్ని ఎవరు పట్టించుకున్నారు చెప్పండి ? ప్రతి మాండలికమూ తనకంటూ ఓ ప్రత్యేకతను కలిగి ఉంటుంది కదా! అలానే నెల్లూరు మాండలికం కూడా. సూళ్లూరుపేట నుంచి కావలి దాకా, ఆత్మకూరు నుంచి మైపాడు దాకా ఉన్న నెల్లూరు ప్రాంతం మాండలిక ఉచ్చారణలో కొంత విభిన్నతను ప్రదర్శిస్తుంది. తెలంగాణ, ఉత్తరాంధ్ర,మధ్య ఆంధ్ర మండలికాలతో పోలిస్తే ఉచ్చారణలో దీర్గాలతో కూడిన ప్రయోగాలు ఇక్కడ కనిపిస్తాయి. నెల్లూరు మండలిక లక్షణాలన్నీ నేను ఇక్కడ చెప్పపోవడం లేదు.

విజయ మహల్ సెంటర్ కథలు మళ్ళీ బాల్యతీరాల్లోకి మనల్ని లాక్కెళ్లి పోతాయి. ఈ కథా సంకలనంలో 21 కథలు ఉన్నాయి. బుజ్జమ్మ అనే ముద్దుపేరున్న మన రచయిత్రి ఈ కథలన్నీ మనకు చెబుతూ మన చెయ్యి పట్టుకుని విజయ మహల్ సెంటర్ వీధుల్లో నడిపిస్తుంది. ఇవన్నీ సౌలభ్యం కోసం వేరు వేరు కథలుగా వేరు చేసినట్లుగా కనిపిస్తున్నప్పటికీ నిజానికి ఇవన్నీ ఒకటే కథ లో భాగాలు. పాత్రలు, వస్తువు, ఏక సూత్రత కలిగి ఉండడం వలన ఈ అభిప్రాయానికి రావాల్సి వస్తుంది. అలాగని అన్ని కలిపేస్తే నవల అవుతుంది అనుకోవడం పొరపాటు. కథ సంవిధానానికి నవలా నిర్మాణ విధానానికి తేడా ఉంటుంది. ఇందులోని కథలన్నిటిలోనూ కర్పూర దీపం, మహారాజు, రూపాయి దేవుడు- ఈ మూడు కథలు ఒకే పద్ధతిలో నడుస్తాయి. ఈ మూడు కథల్లోనూ ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తి జీవితాన్ని మొత్తం సంక్షిప్తీకరించి చెప్పే ప్రయత్నం చేశారు. కర్పూర దీపం కథలో పాకీ పని చేసే నరసమ్మ జీవితాన్ని ఆవిష్కరిస్తే, మహారాజు కథలో తాగుబోతు రవణడి జీవితాన్ని, రూపాయి దేవుడు లో డాక్టర్ పుల్లయ్య లను గురించి తెలియజేస్తూ ఆ ప్రాంతానికి వాళ్లు చేసిన మంచి పనులను ప్రజల గుండెల్లో వాళ్ళు సంపాదించిన స్థానాన్ని చిత్రించారు. మొదటి రెండు కథల్లో ప్రధాన పాత్ర చివరికి చచ్చిపోతుంది. మూడో కథలోను అలాగే సాగి చచ్చిపోయినంత పని జరుగుతుంది. కానీ చివరకు డాక్టర్ పుల్లయ్య బతికి రావడంతో కథ మూసగా సాగకుండా మలుపు తిరిగినట్లు అయింది. నరసమ్మ, రమణ పాత్ర చిత్రణలో రచయిత్రి పరోక్షంగా సమాజాన్ని దుమ్మెత్తి పోసింది. అవసరానికి ఉపయోగించుకుంటారే తప్ప మనుషుల పట్ల ఉండాల్సిన మానవతా విలువలు లోపించడాన్ని రచయిత్రి ఈ కథల్లో తూర్పారబట్టారు.

గంగిరాయి చెట్టు కింద ఇరగాలమ్మో అనే కథ నెల్లూరు చారిత్రక నేపథ్యాన్ని సూచించే కథ. ఇప్పుడు నెల్లూరు గ్రామ దేవతగా పూజలు అందుకుంటున్న ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఒకప్పటి పేరు ఇరుగాలమ్మ. ఎక్కువగా సంచార జాతులు, యానాదులు ఆవిడను ఎక్కువగా పూజించుకునేవారు. జానపద విధానంలో అమ్మవారి ఆరాధన సాగేది. ఇప్పుడు ఆధునిక నాగరికత ముసుగులో మన జానపద విధానాలను, నమ్మకాలను అపహాస్యం చేసి అమ్మవారికి ఇరుకళల పరమేశ్వరి అనే పేరు మార్చి అక్కడి వాతావరణాన్ని సంస్కృతీకరించే ప్రయత్నం జరిగింది. ఇది మన మూలాల మీద జరిగిన దాడిగా మనం గుర్తించాలి. ఈ కథలో యెద్దల సంఘంలోని యానాదులంతా కలిసి అమ్మవారిని ఆరాధించే విధానం కళ్ళకు కట్టినట్లు రచయిత్రి తెలియజేశారు.

బాపనోళ్ల పిల్ల ముతరాసి యానాది పిలగోడు అనే కథ చాలా బ్యాలెన్స్ గా సాగుతుంది. అంటే కులాంతర వివాహం చేసుకున్న జంట గురించి చెబుతూ ఆ కుటుంబాల్లో జరిగే అలజడులని ఆవేశ కావేశాలని చాలా జాగ్రత్తగా అక్షరబద్ధం చేశారు. అత్యాధునిక యుగం అనిపించుకుంటున్న ఈ 21వ శతాబ్దం కాలు భాగం గడిచిపోయాక కూడా కులాల ప్రభావం ఎంత దారుణంగా ఉన్నదో ఈనాడు మనం చూస్తున్నాం. అట్లాంటిది అప్పుడెప్పుడో 40, 50 ఏళ్ల క్రితం సమాజంలో కులాల పట్టింపులు ఇంకెంత దుర్భరంగా ఉండేవో మనం ఊహించుకోవచ్చు. చివరిలో అమ్మాయి తండ్రి కులానికి గాక, కన్న బిడ్డకు ప్రాధాన్యత నిచ్చే సన్నివేశం మనసుకు హత్తుకుంటుంది. ఇంట్లో ఉన్న ముసలోళ్ళు మన మీద కులం తాలూకు బురదను ఎలా పులుముతారో కూడా ఈ కథలో మనం చూడగలం.

వొజ్రం ఇలువ, చిరంజీవే నా మొగుడు, సైన్స్ రికార్డు కొబ్బరి చట్నీ ,తట్టుడి మీకు తీయబడును వంటి కథల్లో రచయిత్రి తన పాఠశాల తాలూకు జ్ఞాపకాలని మనకందించారు. అప్పట్లో ఉపాధ్యాయుల పట్ల ఉన్న గౌరవం భయం అభిమానం మొదలైన వాటిని ఈ కథల్లో చూడవచ్చు.

ఈ కథల్లోని మాండలికం పల్లె మాండలికం కాదు నగరమాండలికం.ఈ రెండిటికీ తేడా ఉన్నది. పల్లెల్లో వాడే భాషలో స్వచ్ఛత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. బూతులు కూడా అత్యంత సహజంగా పల్లెల్లో వాడుతాం. అవేమీ వాడకూడని పదాలుగా మనకు అనిపించవు. అదే నగరమాండలికాల్లో కొంత నాగరికత ప్రభావం కనిపిస్తుంది. ఈ రచయిత్రి బాల్యమంతా నెల్లూరు నగరంలోనే గడిచింది కాబట్టి ఈ కథలో ఆవిడ వాడిన మాండలికం నగరం మాండలికం అని చెప్పక తప్పదు. ఎందుకంటే కొన్ని పదాలు పల్లెల్లో కంటే భిన్నంగా, ప్రామాణికంగా ఆవిడ ప్రయోగించారు. బ్రాహ్మణులు వాడే మాండలికానికి, ఇతరులు వాడే మాండలికానికి ఉండే కొద్దిపాటి తేడా కూడా ఇందుకు కారణం కావచ్చు. రెండు మూడు కథలు సంఖ్య కోసం తప్ప కథ కథనంలో ఏమంత బలంగా ఉన్నాయని అనిపించవు. చాలా కథల ముగింపులోనో, మొదల్లోనో పాటల ప్రస్తావన తీసుకొచ్చారు. అవి కథకు చాలా బలాన్నిచ్చాయి. కథనం ఎప్పుడు ఎదురుగా కూర్చుని చెబుతున్నట్టుగా కాకుండా తమతో పాటు కథా వాతావరణం లో తిప్పుతున్నట్టుగా ఉండాలి. ఈ విషయం లో రోహిణి గారు పూర్తి స్పృహలో ఉన్నారనే చెప్పాలి. లోతుగా పరిశీలిస్తే ఈ కథలోని స్త్రీ పాత్రలన్నీ చాలా బలమైన వ్యక్తిత్వాన్ని కలిగినవి. పోరాట దృక్పథాన్ని రేకెత్తించేవి. నిజమే మన అమ్మలు అవ్వలు అలాంటి పోరాట స్ఫూర్తితో జీవితాన్ని నెట్టుకు వచ్చినవారే. ఈ పోరాటం మగవాళ్లలో లేదని కాదు. ఆడవాళ్ళ కంటే కాస్త తక్కువేనని చెప్పడంలో నాకే సందేహం లేదు. అదీ మందల . “రోహిణక్కా… నీ కతలు బాగుండాయి కా .”

మీ నెల్లూరు పిల్లోడు

డాక్టర్ పెళ్ళూరు సునీల్

9440255647