మది నదిలో నిరంతరం ప్రవహించే భాష – అంతరంగపు భాష

శ్రీ జల్ది విద్యాధర్ రావు గారి “అంతరంగపు భాష” కవనానికి నా చిరు సమీక్ష. ఈ నెల” విశాలాక్షి మాసపత్రికలో”. శ్రీ జల్ది విద్యాధర్ రావు గారికి, శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో..
సమీక్ష చదివి మీ విలువైన అభిప్రాయాలను తెలుపగోరుతూ..

ప్రతి దేశానికీ ఓ ప్రత్యేక భాష ఉంటుంది. ప్రతి ప్రాంతానికి కూడా ఓ ప్రత్యేక భాష ఉంటుంది. ప్రకృతిలోని జీవకోటిలో ప్రతి జీవి తన స్పందనలను ఓ ప్రత్యేక రీతిలో తెలుపుతుంది. అలాగే మనుషులు కూడా తమ భావాలను మాటలరూపంలో తెలుపుతారు. కానీ స్వరపేటిక నుంచి వెలువడే ప్రతి మాట నిజం కాకపోవచ్చు. ఒక్కోసారి ముఖస్తుతి చేయాల్సి రావచ్చు. అవసరాన్ని బట్టి మాట మారవచ్చు.కానీ మాట కంటే ముందు మనసు గదిలో, లోపలి అంతరంగంలో కొన్ని భావనలు నిరంతరం జీవనదిలా ప్రవహిస్తూనే ఉంటాయి. అవి సజీవం. కల్మష రహితం, లోపభూయిష్ఠ రహితం. స్వచ్ఛమైన పాలవంటి తెలుపు, వెన్నెలంటి మృదుత్వం రంగరించి, మనసు పొరలను చీల్చుకొని వచ్చిన ఓ భాష ఉంటుంది. దానిలో ఎటువంటి ముసుగులు ఉండవు. అదే అంతరంగపు భాష.
డా. జెల్ది విద్యాధర్ రావు గారు హృదయాంతరాలనుంచి వెలువడిన సుతిమెత్తని భావ పరంపర అంతా అక్షరసుమాలుగా మారి కవితలహారాలై పాఠకుల మదిని దోచుకుంటాయి అని చెప్పడం అతిశయోక్తి ఎంత మాత్రం కాదు. వారి హృదయ లిపిలో ఒకచోట అమ్మపాడే కమ్మనైన జోలపాట ఉంటుంది. మరోచోట విస్ఫోటనమౌతున్న అగ్నిపర్వతాలు ఉంటాయి. ఇంకోచోట మెల్లగా వీచే సోమరిగాలి చెంపలను నిమిరిపోయినట్లు, చేయిపట్టి నడిపించి హితవు చెప్పే నేస్తంలా కవిత సాగిపోతుంది.
“కవిత్వం ఓ తీరని దాహం” అని ఓ మహాకవి అంటారు. శ్రీ జెల్ది విద్యాధర్ రావు కవితలు ఒక్కొక్కటి చదువుతుంటే వారు ఒక్కరే అనేక రూపాల్లో కనపడతారు. ప్రకృతిని చూసి మురిసిపోయే ఓ సౌందర్య పిపాసి, కాలపు యంత్రాన్ని వెనక్కి తిప్పి గతానుభవాల్లోకి తొంగి చూసే ఓ అమాయకపు బాలుడు, కాలం చేసే వింత గారడితో విస్మయం చెంది, తామరాకుమీద నీటిబొట్టులా ఉంటేనే జీవితం పూర్ణం అని తలచే తాత్వికుడు, వర్తమాన వాస్తవికతే అంగీకరించాల్సిన నిజం అని నమ్మే మార్మికుడు, ఊహలపల్లకి ఎక్కి జలతారు వెన్నెల్లో ఊరేగే విహారి, ధరణి,తరుణీ లేనిదే జీవితం లేదని తన హృదయాన్ని వనిత పాదాల చెంత ఉంచే నవనీతపు మనసున్న ప్రేమికుడు, స్నేహనికి ఇస్తాను నా ప్రాణాన్ని సైతం అని మిత్రుని భుజం తట్టే ఆత్మీయ నేస్తం ..ఇలా వారు బహు రూపాల్లో తన అంతరంగపు భాషని అభివ్యక్తీకరించారు.
“వేళతప్పి దారి మరచి దప్పికతో

ఇంటి గడపకు అటు నే నిలబడితే

ఇటు ఎదురుచూసి నిదురమాని
కనురెప్పలను గులాబీ రెక్కలుగా

ఇల్లంతాపరచి ఇలవేల్పువై నిలిచి
ఆర్టిగోన్న ప్రాణానికి అమృతాన్ని పోసి
నను ఓర్చి దారి చేర్చిన నా జీవన సహచరీ..!
“గులాబీ రెప్పలు ” కవితతోనే జీవనసహచరి విజయ సౌభాగ్య జ్యోతి గారి సహనాన్ని, వారి పట్ల ఆమెకి ఉండే అవాజ్యమైన ప్రేమ, బాధ్యతని తలచుకుంటూ తన జీవన జ్యోతి ఆమె అని చెప్పుకుని మురిసిపోతారు. సభలు, సమావేశాలు అంటూ తిరిగే కవి అర్ధరాత్రి అలసి, సొలసి ఇంటికి వస్తే, ఏ మాత్రం విసుగు చెందక,తన సేవలతో భర్త అలసటను పోగొట్టి అక్కున చేర్చుకున్న భార్య గొప్పతనం ఈ కవితలో మనకి కనిపిస్తుంది. ఎంత మంది మగవారు ఇలా నిజాయితీగా తమ భార్యల గొప్పతనాన్ని ఒప్పుకోగలరు చెప్పండి..?
“నీ గాయాల బాధలు గాథలుగా విన్నవించుకో
కానీ ద్వేషపు మంటలను ఊపిరిగా ఊదమాకు
ఎదురుగాలి వీచి నీ ముఖమే మాడిపోతుందేమో “
ఈ అంతరంగపు ఆవేదన చూసారా..! నువ్వు నేను ఒకటే.. మనుషులమని మరచి కులమని, మతమని ద్వేషపు అగ్నిని రగిల్చేవారికి చెంప పెట్టు ఈ కవితా సరాలు. బుద్ధిబలం భుజబలం కలిస్తే మనకి మనమే చాణుక్యచంద్రగుప్తులము. మనమధ్యన ఉన్న ద్వేషపు అడ్డుగోడను కూలిస్తే, అన్నదమ్ముల్లా మనం కలిసివుంటే ఇక మన ప్రేమకు ఏది అడ్డుగోడగా నిలవ సాహసించదు అంటూ “అభేధ్య దుర్గమమే” అనే కవితలో సాటి మనుషుల పట్ల తన సహోదర ప్రేమని తెలుపుకుంటాడు కవి. చూడండి ఎంత గొప్ప ప్రేమ భాషో ఇది.
“మానవ సంబంధాలు….పెంపుడుపక్షుల లాంటివి !
అనుబంధాలను గారంగా నిలుపుకోవాలి
స్నేహసంబంధాలు గాఢంగా పొదుపుకోవాలి
ఒక మంచి మనిషిని కలిసినప్పుడు
విస్తృతంగా పరచుకున్న మంచినీటి సరస్సును
చూస్తున్న ఆనందానిభుతి కలగాలి
స్నేహ మాధుర్యాన్ని ఖాళీబస్తాలా పదేపదే దూలపకూడదు
తడిగుడ్డ చుట్టిన కొత్తకుండలా నింపుకుంటూ పోవాలి “
ఉమ్మడి కుటుంబాలుకరువై న్యూక్లియర్ కుటుంబాలు ఇప్పుడు అంతటా. ఇక బంధుజనాలు, స్నేహితులు అన్నీ రకాల మానవ సంబంధాలు స్వార్ధపరమైన బంధాలు గా మారుతున్న ఈ విశృంఖల, విపరీత యుగంలో ఎంత జాగ్రత్తగా బంధాలను అతిసున్నితంగా,గారంగా, గాఢంగా నిలుపుకోవాలో “పెంపుడు పక్షులు” అనే కవితలోని పై వాక్యాలను గమనిస్తే కవి హృదయంలో ఎన్ని మెటాఫర్ భావనలు, స్నేహ మాధుర్యాన్ని తడిగుడ్డ చుట్టిన కొత్తకుండలా నింపుకోవాలి అనే పోలికలో కవి తన అంతరంగంలో స్నేహమాధుర్యానికి ఎంతటి విలువ ఇచ్చాడో తెలుస్తోంది.
“ఆస్తులను విలువ కట్టగలమేమో కానీ ఆప్తులను కాదుగా
సేవలకు ధర చెల్లింపు చేయగలమేమో కానీ ప్రేమలకు లేదుగా
వస్తువులకైతే రేటుఉంది కానీ గుండెలో చోటుకు లేదుగా”
ఎన్ని విలువైన ఆస్తులు కూడగట్టుకున్న, పంచుకోవడానికి నలుగురు ఆప్తులు నీకు లేకపోతే ఆ సంపద అంతా వ్యర్ధమే కదా. ప్రేమించే మనుషులు, స్పందించే హృదయాలు లేకుండా వస్తువులను ఎంత ప్రేమించినా తిరిగి ప్రేమను నువ్వు పొందగలవా..? అంటూ సూటిగా ప్రశ్నిస్తాడు కవి “ఎంత బాకీ పడ్డానో” కవితలో. బాల్యం నుంచి తనకు తారసపడిన వ్యక్తులు, గురువులు, మాతాపితలు, తోబుట్టువులు, స్నేహితులు అందరినుంచి తాను ఎంత ప్రేమను పొందాడో, అంత రుణ పడి ఉన్నాను. తిరిగి ప్రేమను ఇవ్వడం తప్ప తాను ఇక ఏం చేయగలనని ఎంతో వినమ్రతతో కృతజ్ఞతా తెలుపుకుంటాడు కవి.
“టాటాలైనా బిర్లాలైన జీవిక
దీపానికి టాటా చెప్పక తప్పదు
అందుకే హాయిగా నవ్వండి
జీవితాంతం యాత్రలో నవ్వుతూ నడవండి
మంచిని మాత్రమే చేస్తూ మనిషిగా బ్రతకండి”
ఆహా..! ఎంత గొప్ప తాత్విక భావనలు చూసారా..! కోట్లకు అధిపతులైనా గొప్ప గొప్ప వాళ్ళు కూడా కాలచక్రం ముందు తలవంచాల్సిందే. జీవితపు ప్రమిదలో చమురు అయిపోతే దీపం ఆరిపోక తప్పదు. వెలుతురు ఉన్నంతవరకు దానిని నలుగురికి పంచాలి. దీపం ఆరిపోకముందే ఇంకొన్ని దీపాలను వెలిగించాలి. నవ్వుతూ, నవ్విస్తూ, సాయం చేస్తూ మంచి మనిషిగా బతకాలి. జీవితపు మధుర ఫలాలను పదుగురికి పంచాలి అంటూ ” చిట్టచివరి చిరునవ్వు ” కవిత తాత్విక, మార్మిక ధోరణిలో సాగింది.
“ఎదురు చూపుల బ్రతుకు చక్రంలో నిరంతర పరిభ్రమణ
నిదురలేని రాత్రుల్లో అనంత జీవన మాధుర్య అన్వేషణ “
మరలిపోయిన మేఘాలు, ఎగిరిపోయిన సీతాకోక చిలుక రెక్కలు, రాలిపడిన పుప్పొడి రేణువులు లాంటివే జారవిడుచుకున్న తీపి గురుతులు. గతకాలపు గుర్తులు స్మృతిపథంలో మాత్రం మాధుర్యాన్ని నింపే తేనె తుట్టెలు జ్ఞాపకాలు” అంటూ మార్మికత్వాన్ని కవితలో నింపి , మనలను కూడా మధుర జ్ఞాపకాల అన్వేషణకు పురిగొల్పుతాడు కవి.
వంద కవితలు. మచ్చుకకు కొన్ని ఇక్కడ మీ కోసం. అమ్మ చెట్టు, నేనంతా నీవే,మౌన గులాబీ, అతడు ఎవరైతేనేం.., సంధికాలం, ఇదంతా నిజంగా నిజమేనా, స్వార్ధపు విత్తులు, మీరొస్తే చాలు, ఖాళీ పెట్టె లాంటి గొప్ప అంతరంగ ఉల్లాస కవితా మధురిమను అంతరంగం నిండా నింపుకోవాలంటే మాత్రం శ్రీ జెల్ది విద్యాధర్ రావు నమ్రతతో, దయతో, కరుణతో, ప్రేమతో ఒకడు అనేకుడై, అనేకుడు పలు శాఖలై విస్తరిస్తూ తన కవితా మధురిమను తనదైన భాష , తన మనో వీధిలో ప్రాణం పోసుకుని విచ్చుకున్న ప్రేమ పుష్పం ” అంతరంగ భాష “.
శ్రీ జెల్ది విద్యాధర్ రావు గారు తన హృదయ భాషను మరింత మనకు పంచాలని, వారు మరిన్ని కవితా సంపుటాలను వెలువరించి, మరింత గొప్ప విజయాలను సాధించాలని మనసారా కోరుకుంటూ, నాకు ఈ చక్కని సమీక్షకు అవకాశం ఇచ్చిన ” విశాలాక్షి పత్రిక ” సంపాదకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

“అంతరంగపు భాష” ప్రతులకు
డా. జెల్ది విద్యాధర్ రావు, IRS, MBA, Ph.D
సెల్ నం. 9490469606
ఇమెయిల్: [email protected]


సమీక్షకురాలు
రోహిణి వంజారి