ముందుగా “బహుళ” త్రైమాసిక పత్రిక సంపాదకులు, ప్రముఖ కవులు, కథా రచయిత్రి శ్రీమతి జ్వలిత Jwalitha Denchanala Jwalitha గారికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా స్త్రీ లు ఎదుర్కొంటున్న వివక్షలు, సమస్యలు, పరిష్కారాలు, సలహాలు, చిట్కాలు,మనసుని రంజింపజేసే కథలు, కవితలు, సమీక్షలు, వ్యాసాలు తదితరాలతో రూపొందించబడిన అపురూపమైన పత్రిక “బహుళ”. సంపాదకురాలిగా ఎన్నో వ్యయ ప్రయాసలు తట్టుకుని, మరెన్నో చిత్కారాలను ఓర్పు తో సహించి పత్రికను ఎంతో ఉన్నత స్థాయిలో నిలపటానికి జ్వలిత గారి పట్టుదల, శ్రమ అనన్య సామాన్యం. ప్రారంభ సంచికలోనే వారి ప్రతిభ, ఉన్నతమైన అభిరుచి అడుగడుగునా దృశ్యమానమౌతోంది. జ్వలిత గారు పత్రికను దిగ్విజయంగా నడిపించడానికి వారికి మరిన్ని శక్తియుక్తులు సమకూరాలని కోరుకుంటూ వారికి మరోసారి హృదయపూర్వక అభినందనలు. పత్రికను నడిపించడానికి చేయూతనిచ్చే రచయిత్రులందరికీ పేరు పేరునా అభినందనలు..నరుత్పత్తి కొరకు స్త్రీ శరీరంలో జరిగే సహజ సిద్ధమైన ప్రాకృతిక పరిణామం ఋతు చక్రం. అది మహిళలు చేసిన నేరం ఎట్లవుతుంది..? ముట్టు వివక్ష ని ఎదురొన్న ఓ మహిళ ఆవేదనే నేను వ్రాసిన ఈ కథ “నవనీతం”. “బహుళ” ప్రారంభ సంచికలోనే నా రచనకు అవకాశం కల్పించిన శ్రీమతి జ్వలిత గారికి ధన్యవాదాలతో..”నవనీతం” కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగకోరుతూ…
హఠాత్తుగా మెలకువ వచ్చింది. కిటికీ అద్దంలోనుంచి మసక మసకగా వెలుతురు. కిటికీ కి అవతల ఉండే కానుగ చెట్టు కొమ్మల మధ్య నుంచి తొలిపొద్దు భానుడి కిరణాలు లేలేత కనకాంబరం పూల రంగులో కిటికీ అద్దంలో నుంచి ఏటవాలుగా గదిలో పడుతున్నాయి. నా కళ్ళు అప్రయత్నంగా గోడ గడియారం వైపు మళ్ళాయి. సమయం ఆరుంపావు అని గడియారం ముళ్ళు నన్ను వెక్కిరిస్తున్నాయి ఈ రోజు తాము గెలిచామని.
దిగ్గున లేవాలని చూసాను. పక్క మీద నుంచి అంగుళం కూడా కదలలేకపోయాను. తల అంతా దిమ్ముగా ఉంది. ఈ రోజు నుంచి స్కూల్లో యూనిట్ పరీక్షలు. పిల్లల సీటింగ్ అరేంజ్, నంబరింగ్ పని బాధ్యతను నాకు, తెలుగు మాస్టర్ సోమశేఖరంగారికి అప్పజెప్పారు మా ప్రిన్సిపాల్ మేడం సుభాషిణి గారు. నిన్న సాయంత్రమే కొంత పని పూర్తి చేసి మిగిలినది రాత్రి భోజనాల తర్వాత కూర్చుని పూర్తి చేసి మాస్టర్ కి ఆ పేపర్స్ వాట్సాప్ లో పంపేసరికి రాత్రి పదకండు అయింది.
బాగా తలనొప్పిగా ఉండి డిస్ప్రిన్ మాత్ర నీళ్లలో కలిపి తాగి పడుకుంటే ఇప్పటికి మెలుకువ వచ్చింది. బాబోయ్… ఈ రోజు లేవడం ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు వంట మొదలు పెడితే ఎప్పటికి అయ్యేను. మళ్ళీ లేవాలని ప్రయత్నించాను కానీ లేవలేకపోయాను. తలంతా సూదులు గ్రుచ్చినట్టు విపరీతంగా నొప్పి. పొత్తికడుపు దగ్గర పేగులను మెలితిప్పినట్టు విపరీతంగా బాధ. నా పరిస్థితి నాకు అర్ధం అయింది. ప్రతినెలా ఉండేదే అయినా ఈ మూడు రోజుల బాధ ఇప్పుడే రావాలా!?
పక్కకి తిరిగి చూసాను. శ్రీవారు గాఢ నిద్రలో ఉన్నారు. లేపి కాస్త పనిలో సాయం చేయమందామనుకున్నాను. సాయం అడిగితే స్కూలుకి సెలవు పెట్టమంటారు కానీ సాయం అందదు అని ఆ ప్రయత్నం విరమించుకున్నాను. ‘నొప్పి చాల ఎక్కువగా ఉంది. పోనీ సెలవు పెడితే’ అనుకునే లోగానే సెల్ మోగింది. ఐదవ తరగతి స్టూడెంట్ ” కైలాష్ ” వాళ్ళ అమ్మ ఫోన్ చేసి ” గుడ్ మార్నింగ్ మేడం.. డైరీలో ఎగ్జామ్స్ పోర్షన్ రాసుకోవడం మర్చిపోయాడు కైలాష్. కాస్త ఈ రోజు పరీక్ష జరిగే తెలుగు, మాథ్స్ సిలబస్ చెప్పండి. కైలాష్ ని చదివించాలి ” అంది. “ఒక్క ఐదు నిముషాలు ఆగండి. నేను కాల్ చేస్తాను” అని చెప్పి జన్మనెత్తితిరా, అనుభవించితిరా అనుకుంటూ భారంగా మంచం మీది నుంచి దిగాను. మెల్లగా లేచి టేబుల్ మీద ఉండే బుక్ తెరచి సిలబస్ చూసి కైలాష్ వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి పరీక్షల పోర్షన్ చెప్పి సెల్ టేబుల్ మీద పెట్టేసాను.
ఇంకాసేపు పడుకోవాలనిపించింది. ఆ వెనువెంటనే స్కూల్ కి ఆలస్యంగా వెళితే , అదీ ఎగ్జామ్స్ మొదటి రోజు మా ప్రిన్సిపాల్ మేడం తీక్షణమైన చూపులు, ఉగ్ర రూపం గుర్తుకు వచ్చి ‘ఇష్టమైనంత సేపు హాయిగా పడుకునే అదృష్టం నాకు లేదులే ‘ అనుకుంటూ నా అత్యాశకు విరక్తిగా నవ్వుకుని, కబోర్డులో నల్ల కవర్లో దాచివుంచిన సానిటరీ పాడ్, టవల్, డ్రెస్ తీసుకుని వాష్ రూంకి వెళ్ళాను.
సమయం 8.30 అయింది. ఇంకో పది నిముషాల్లో స్కూల్లో ఉండాలి నేను. దొండకాయ కూర కలిపిన అన్నం లంచ్ బాక్స్ లో పెట్టుకున్నాను. బాబు గదిలో చదువుకుంటున్నాడు . వాడు తొమ్మిదింటికి హడావిడిగా రెడీ అయి కాలేజీ కి వెళ్తాడు. ఓ పక్క తల తుడుచుకుంటూ, ఇడ్లి నోట్లో కుక్కుకుంటున్నాను. ఆయన ఇడ్లీలు తిని సింకులో ప్లేట్ వేసి నీళ్ళు తాగుతూ నా వంక చూసాడు.
” ఏంటి లతా ఇప్పుడు తలకి స్నానం చేసావు”. అన్నాడు. ” అది అదీ కడుపు నొప్పిగా ఉందండీ” అన్నాను. అర్ధమైనట్టు తల పంకించాడు.
” మీ స్కూటీ లో నన్ను ” నా మాట పూర్తి కాకముందే ” నాకు ఆఫీస్ కి టైం అయింది. నువ్వు ఆటోలో వెళ్ళు. నేను వెళుతున్నా” అంటూ స్కూటీ స్టార్ట్ చేసి మరోసారి నా వైపు చూసాడు. మళ్ళీ నాలో ఆశ ఊపిరి పోసుకుని కాస్త దీనంగా ఆయన వంక చూసాను, రమ్మంటారేమో అని.
” కడుపు నొప్పి మరీ ఎక్కువగా ఉంటే స్కూల్ కి రాలేనని మీ మేడంకి ఫోన్ చేసి చెప్పి రెస్ట్ తీసుకో ” మరో మాటకు చోటివ్వకుండా వెళ్ళిపోయాడు . అంతకంటే ఆయన నుంచి ఎక్కువ ఆశించడం నా అత్యాశ. ఓ పక్క కడుపు నొప్పి. మరోపక్క స్కూలుకి ఆలస్యం అవుతోందని కంగారుతో తినే ఇడ్లి గొంతులోకి దిగలేదు. ఇక తినలేక నీళ్ళు తాగి లంచ్ బాక్స్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని బాబు కి చెప్పి ఇంటి నుంచి బయట పడ్డాను.
రహ్మత్ నగర్ చౌరస్తా దగ్గర ఆటో కోసం ఎదురు చూస్తున్నా. నాలుగు షేర్ ఆటోలు వచ్చివెళ్లాయి. ప్రతి ఆటోలో పదిమందికి తక్కువలేకుండా జనం ఉన్నారు. సమయం ఎనిమిదీ నలభై అయింది. రిజిస్టర్ లో సంతకం పెట్టాల్సిన సమయం అయిపోయింది. ఇక ఈ రోజు లేట్ కమర్ లెక్కే. మేడం దగ్గర ఎలాగూ అక్షింతలు తప్పవు. ఏడుపు వస్తోంది నాకు. దీనంగా నిల్చున్న నా ముందుకు ఒక ఆటో వచ్చి ఆగింది. దాంట్లో కూడా దాదాపు ఎనిమిది మంది దాక ఉన్నారు.
ఇంకా ఎక్కించుకోవాలని ఆటోవాలా “బోరా బండ బోరా బండ ” అంటూ దీర్ఘం తీస్తూ ఒక వింతైన రిథంలో అరుస్తున్నాడు. బస్సు కూడా ఇప్పట్లో వచ్చేటట్టు లేదు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదనుకుని ఆటో ఎక్కి అంగుళం చోటు కూడా లేని సీట్ మీద అవతల వారిని నెట్టుకుంటూ కూర్చున్నాను. ఏం దయ తలచాడో కానీ ఆటోవాలా ఇక ఆలస్యం చేయక ఆటోని ముందుకు ఉరికించాడు. రహ్మత్ నగర్ చౌరస్తా నుంచి మెలికలు తిరిగిన కొండచిలువల్లా ఉన్న గల్లీల నుంచి ఆటో నేలమీది రాకెట్ లా దూసుకు పోతోంది. గుంతలు, మిట్టలు, స్పీడ్ బ్రేకర్లు వచ్చినప్పుడల్లా ఆటో ఎగిరెగిరి పడుతోంది. ఆటో ఎగిరినప్పుడల్లా నా కడుపు నొప్పి తారాస్థాయికి చేరి పేగులు లుంగచుట్టుకు పోతున్నట్టు అవుతోంది. బాధని పంటిబిగువున అణుచుకుంటున్నాను. ఆటోని కార్మికనగర్ చౌరస్తాలో ఆపాడు డ్రైవర్. అక్కడ దిగేవాళ్ళు, ఎక్కేవాళ్ళు. ఐదు నిముషాలు అయింది.
ఆటోవాలా ఇంకా “బోరబండ బోరబండ “అని అరుస్తూనే ఉన్నాడు. నా అసహాయత కోపంగా రూపాంతరం చెంది ” భాయ్, జర ఆటో పోనీయ రాదు ఇక. స్కూల్ కి లేట్ అవుతుంది ” ఎంత కోపంగా అందామనుకున్నా అంతకంటే కఠినంగా మాటలు రాలేదు నాకు.
” ఇంకోలని ఎక్కనీయండి మేడం” నిర్లష్యంగా జవాబిచ్చాడు ఆటోవాలా.
ఇక అతనికి చెప్పడం అంటే’ చెవిటివాని ముందు శంఖం ఊదినట్టే’ అని కిమ్మనకుండా కూర్చున్నాను ఆటో కమ్మి పట్టుకుని. ఆటో లోపల రకరకాల మనుషులు. చెమట, జర్దా కిల్లి, సారా వాసనలు కలగలసి కడుపులో తిప్పేస్తున్నాయి. “హు.. ఈ షేర్ ఆటోలో ప్రయాణం అంటేనే డైరెక్టుగా నరకానికి పోవడమే. ఎన్నో సార్లు ఈ ప్రైవేట్ స్కూల్స్ లో జాబ్ మానేద్దాం అనుకున్నాను. ఆయనది చిన్న ఉద్యోగం. బాబు చదువు పూర్తయి వాడు ఓ దారికొచ్చేదాకా ఆయన సంపాదనకు, నా సంపాదన వేడినీళ్ళకు చన్నీళ్ళలా కాస్త ఆసరాగా ఈ జాబ్ చేయాల్సివస్తోంది. ప్రైవేట్ స్కూల్స్ లో టీచర్ అంటే అక్కడ చాకిరీ బారెడు. జీతం మూరెడు. అయినా తప్పదు. బి.ఎడ్. చేసిన నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదు. నా చదువుకి ఇంతకంటే పెద్ద జాబ్ ఎక్కడ వస్తుంది. ఇంకెన్నాళ్ళో నాకీ బాధ.
తీరుబడిగా ఆలోచించడానికి కూడా నీకు అర్హత లేదు అంటూ ఆటో బోరబండ చౌరస్తా లో ఆగింది. చేతిలో ఉన్న చిల్లర పైసలను ఆటోవాలా చేతిలో పెట్టి పరుగు లాంటి నడకతో స్కూల్ లోకి వెళ్ళాను. చేతిలో హాజరు పుస్తకం వంక, మరోవైపు గోడ గడియారం వంక మార్చి మార్చి చూస్తూ ఉంది ప్రిన్సిపాల్ మేడం సుభాషిణి.
” గుడ్ మార్నింగ్ మేడం ” అన్నాను మేక పోతూ గాంభీర్యాన్ని ముఖంలో ప్రదర్శిస్తూ.
” ఎగ్జామ్స్ సమయంలోనే మీకందరికీ ఆలస్యం అవుతుందా? కట్టగట్టుకుని అంతా లేటుగా వస్తున్నారు ” అన్న ఆమె భీకరమైన చూపులకు శక్తి ఉండే నేను అక్కడే మాడి మసైపోయుండేదాన్ని.
” మేడం పీరియడ్ వచ్చింది. బాగా కడుపు నొప్పిగా ఉంటే పనులు తొందరగా చేయలేక పోయాను ” నీళ్ళు నములుతున్నట్టు వచ్చాయి మాటలు నాకు.
” అదేం కొత్తనా. ఎప్పుడూ ఉండేదేగా. నాకింకేం చెప్పొద్దు. స్టాప్ రూమ్ లో శోభారాణి టీచర్, సోమశేఖరం మాస్టర్ ఉన్నారు. వెళ్ళి ఎగ్జామ్స్ సీటింగ్ అరేంజ్మెంట్ విషయం చూడండి ” తల తిప్పేసి ఎవరో పేరెంట్స్ తో మాట్లాడటం మొదలెట్టింది మేడం.
“బతుకు జీవుడా ” అనుకుంటూ రెండు ఫ్లోర్లు ఎక్కలేక ఎక్కి సెకండ్ ఫ్లోర్ స్టాప్ రూమ్ లోకి వెళ్ళాను.
అక్కడ శోభారాణి టీచర్ నన్ను చూస్తూనే ” రండి శ్రీలతా టీచర్. నేను ఇప్పుడే వచ్చాను. మేడం ఉగ్రావతారం చూసారా. మీకెందుకు లేట్ అయింది..? ” అంటుంటే చిన్నగా నిట్టూర్చి బల్ల మీద కూర్చుని మెట్లెక్కిన అలుపు కాస్త తీర్చుకుని గట్టిగా ఊపిరి పీల్చి వదిలి
” శోభారాణి టీచర్ ఈ రోజు పొద్దున్న లేస్తూనే నాకు పీరియడ్ వచ్చింది. బాగా తలనొప్పి, కడుపు నొప్పి. ఇంటి పని సరిగా చేయలేక పోయాను. వంట అయి, తలంటు స్నానం చేసేసరికి బాగా లేట్ అయింది. ఆటో కూడా త్వరగా దొరకలేదు. ఇదుగో వచ్చేసరికి ఈ టైం అయింది. మేడం దగ్గర అష్టోత్తర శత, సహస్రనామాలు కూడా అయినాయి టీచర్”
అంటు నా ధోరణిలో చెప్తున్న దాన్ని హటాత్తుగా ఆగిపోయాను. స్టాప్ రూమ్ లో ఉన్న పెద్ద టేబుల్ చుట్టూ వేసి ఉన్న బల్లల్లో మా ఎదురు వైపు ఉన్న చివరి బల్ల మీద ‘సోమశేఖరం ‘ సార్ కూర్చుని ఉన్నారు. ఆయన్ని గమనించకుండా నేను మాట్లాడుతూ ఉన్నాను. ఆయన మా మాటలను విన్నారో లేదో తెలియలేదు కానీ నాకు ఏదో గిల్టీగా అనిపించి చిన్నగా
” గుడ్ మార్నింగ్ సార్ “. “ఈ రోజు రావడం కాస్త ఆలస్యం అయింది. రాత్రి మీ వాట్సాప్ కి సీటింగ్ అరేంజ్మెంట్ రాసిన పేపర్ మెసేజ్ చేశాను. చూసారా సార్. అంతా ఓకే కదా ” అన్నాను
ఓ చూపు నా వైపు చూసి తల ఊపి ఊపనట్లు ఆడించి మళ్ళీ పుస్తకం లోకి తల దూర్చారు ఆయన. ఇంతలోనే ఉపేంద్ర ఆయమ్మ ప్లాస్క్, డిస్పోజబుల్ గ్లాసులు తీసుకుని స్టాప్ రూంలోకి వచ్చి
” శోభమ్మ టీచర్, లతా టీచర్ ఈ రోజు నుంచి పిల్లోల్లకి పరీక్షలని హెడ్ మేడం టీచర్లందరికి ‘ఛాయా ‘ నాచేత తెప్పిచిర్రు . ఇందాక పొట్ట నొచ్చుతోందని మేడంకి చెప్పినవు కదా లతమ్మా . అందుకే ముంగడ మీ ఫ్లోర్ కే “ఛాయా ” తెచ్చిన. ఇదుగో తాగుర్రి. స్కూల్ బస్సు తుడవడానికి రమ్మని డైవర్ “సాయిలు ” అన్న పిలిచిండు. మల్లా ఇంటర్వెల్ లోగా నేను పైకొచ్చియాలా దారాలు పంచనీకి” అంటు వెళ్ళిపోయింది ఉపేంద్ర ఆయమ్మ.
” అబ్బా ! ఈ రోజు మేడం కి మన మీద ఈ ప్రేమ ఏంటో, పొద్దున టిఫిన్ కూడా సరిగా తినలేదు టీచర్. ‘టీ ‘ తాగితే కాస్త రిలీఫ్ గా ఉంటుంది ” అంటూ నేను మూడు గ్లాసులలో టీ పోసి ఒకటి శోభారాణి టీచర్ కి ఇచ్చాను. రెండో గ్లాసును ” సార్ టీ తీసుకోండి ” అంటూ సోమా శేఖరం సార్ కి అందించాను.
రెప్ప పాటులో ఆయన లేచి నిలబడి ” బైట చేరాను అని ఇందాకే కదా చెప్తున్నావు. ఓ మూల కూర్చుని ఉండక తగుదునమ్మా అంటూ ఇల్లు వాకిలి ఏకం చేస్తూ అన్ని ముట్టుకోవడం ఎందుకు. పైగా నీ చేత్తో నాకు టీ ఇస్తావా..” అంటూ విసురుగా స్టాప్ రూమ్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు.
ఒక్క క్షణం పాటు ఏం జరిగిందో తెలియలేదు నాకు. శోభారాణి టీచర్ కూడా విస్తుపోయింది ఆయన ప్రవర్తనకి .
” అయ్యో ! సార్ ఏంటి అలా అనేసారు ” అంది.
టీచర్ మాటలు నాకు వినపడలేదు. పొద్దున్న నుంచి నొప్పి, నా పరిస్థితి తెలిసి కూడా మా వారు నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయకపోవడం, స్కూలుకి లేటుగా రావడం, మేడం దగ్గర తిట్లు, ఇప్పుడు సార్ దగ్గర ఈ అవమానం వెరసి గుండెల్లోని బాధ అంతా కట్టలు తెంచుకుని కన్నీటి రూపంలో బయటకు వచ్చింది నాకు.
” అయ్యో లతా టీచర్..! బాధ పడకండి. సార్ మాటలను లైట్ తీసుకోండి. ఇలాంటివి చాల సార్లు ఎదుర్కొన్నాను నేను. ఇప్పుడు సార్ అన్నారు. ఇంతకు ముందైతే సీనియర్ టీచర్లు కొందరు ఈ విషయంలో నన్ను, ఇంకొందరిని చాల బాధ పెట్టారు. మన ఆడవాళ్ళే మన సమస్యను అర్ధం చేసుకోకుండా ఇదేదో మనం స్వయంగా చేసిన నేరం అన్నట్టు చూస్తారు” అంది శోభారాణి టీచర్ నా వైపు ఓదార్పుగా చూస్తూ.
నా బాధ, శోభారాణి టీచర్ మాటలు విని శ్రావణి, సుజాత టీచర్ లు కూడా స్టాప్ రూమ్ లోకి వచ్చారు ఏం జరిగింది అంటూ.
సోమశేఖరం సార్ ఆ స్కూల్లో చాల సీనియర్ టీచర్. దాదాపు రిటైర్మెంట్ కి దగ్గర వయసు. సనాతన సంప్రదాయంలను బాగా వంటబట్టించుకున్న వారు. రోజు టీచర్లలందరితో, నాతో సహా బాగా మాట్లాడుతారు. అడగక పోయిన ‘ఇదిగో అమ్మాయి ఈ పాఠం ఇలా చెప్పాలి, ఈ పని ఇలా చెయ్యాలి ‘ అంటూ సలహాలిచ్చేవారు. అటువంటిది ఈ రోజు నా పట్ల ఆయన చూపిన ఏహ్య భావం నన్ను నా కడుపు నొప్పి కంటే ఎక్కువ బాధ పెట్టింది. అందరు టీచర్లు తలోమాట అంటుండగానే ఇంటర్వెల్ గంట మ్రోగింది.
లోపలి గంట కొట్టడంతోనే ప్రిన్సిపాల్ మేడం టీచర్లను వాళ్ళకి అలాట్ చేసిన రూంలకి పంపించింది ఎగ్జామ్స్ ఇన్విజిలేషన్ కోసం. పొద్దున ఓ పరీక్ష, మధ్యాహ్నం లంచ్ తర్వాత మరో పరీక్ష పూర్తైయేసరికి సాయంత్రం నాలుగయింది. ఆ తర్వాత ఓ గంట స్టడీ అవర్. అప్పటివరకు ఒక్క నిముషం కూడా కూర్చోవడానికి కుదరలేదు నాకు.
రిజిస్టర్ లో సాయంత్రపు సంతకం చేసి బయట పడేసరికి ఐదున్నర అయింది. రహ్మత్ నగర్ వైపు వెళ్ళేది నేను, సోమశేఖరం మాస్టర్. మేమిద్దరమే. ఆయన రహ్మత్ నగర్ దాటి యూసుఫ్ గూడ బస్తి అవతల ఉన్న మథురా నగర్ వెళ్ళాలి. రోజు పాత మోపెడ్ బండిలో ఆయన, షేర్ ఆటోలో నేను వెళ్ళేవాళ్ళం.
ఎంతసేపు బోరబండ చౌరస్తాలో నిలబడ్డా ఎందుకో ఈ రోజు ఒక్క షేర్ ఆటో కానీ, బస్సు కానీ రాలేదు. పొద్దున నుంచి జరిగిన అవమానాలు, తలనొప్పి నిలబడలేకపోతున్నాను నేను. ఇక లాభం లేదని కార్మిక నగర్ వరకు నడుచుకుంటూ పోయి అక్కడ ఆటో ఎక్కుదాం అనుకుని మెయిన్ గల్లీ నుంచి కాస్త పక్కకు ఉన్న సైడ్ గల్లిలో చిన్నగా నడుచుకుంటూ పోతున్నాను. గల్లిలో ఎక్కడా జనసంచారమే లేదు. సోమశేఖరం సార్ కూడా వెళ్లిపోయారేమో. ఆయన తీరు తలచుకుంటేనే మనసంతా బాధతో నిండిపోతోంది. గల్లిలో అంతా అడుగడునా పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. వాటిలో నీరు నిండి మురుగు వాసనా వస్తోంది. జాగ్రత్తగా అడుగు వేయక పొతే గుంటలో పడడం ఖాయం. ఆ గల్లిలో పెద్దగా ఇళ్ళు కానీ, షట్టర్లు కానీ లేవు.
అడుగులో అడుగేసుకుంటూ మెల్లగా నడుస్తున్నాను. అప్పటికే చీకటి “నా డ్యూటీకి నేను వచ్చేస్తున్నా” అంటూ బొగ్గు రంగు పులుముకుని చిక్కగా అల్లుకుంటోంది. వాహనాల ట్రాఫిక్ ఉండదని ఈ గల్లీ లోకి రావడం నా పొరపాటైంది. చీకట్లో ఎక్కడ గుంటలో అడుగు వేస్తానో అని భయంగా మెల్లిగా నడుస్తున్నాను.
ఉన్నట్టుండి వెనుక నుండి దబ్బున ఏదో పడ్డ చప్పుడైంది. వెనువెంటనే ” అమ్మా” అన్న అరుపు గాల్లో ప్రతిధ్వనించింది. దిగ్గున వెనక్కి తిరిగి చూసాను నేను. నాకు కాస్త దూరంలోనే గుంటలో పడ్డ సోమశేఖరం మాస్టర్ కనిపించారు. ఆయన మోపెడ్ బండి పక్కకు పడిపోయి ఉంది. పరీక్ష పేపర్లు అన్ని చెల్లా చెదురుగా పడిపోయాయి. గుంత అంచు బలంగా నుదుటికి కొట్టుకున్నట్లు ఉంది. నుదుటి నుంచి ధారగా రక్తం కారి మాస్టారి తెల్ల చొక్కాని ఎర్రగా తడిపేస్తోంది. గుంటలో నుంచి లేవడానికి విఫల ప్రయత్నం చేస్తూ నా వైపు చేయి చాచి రమ్మని సైగ చేస్తున్నాడు ఆయన.
” అయ్యో సార్, పడిపోయారా..! ” అప్పటి దాకా ఆయన మీద ఉన్న కోపం, బాధ ఎగిరిపోయాయి నాకు. ఆయన్ని ఎలాగైనా కాపాడాలి. ఇదే ఆలోచన నాలో.
పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకి వెళ్ళి చేయి అందించబోయాను. ఆయన కూడా నాకు చేయి అందించబోయారు. వెంటనే షాక్ కొట్టినట్టు చేయి వెనక్కి తీసుకుని దూరం జరిగి ఆగిపోయాను. ఆయన విస్మయంగా నా వైపు చూసారు.
” సార్ నేను మిమ్మల్ని ముట్టుకోకూడదేమో ” అన్నాను.
” అమ్మా… లతా.. నన్ను మన్నించు. నువ్వు నా బిడ్డలాంటిదానవు. నా మాటలతో, చేతలతో నిన్ను బాధ పెట్టాను. నీ పరిస్థితి పట్ల సానుభూతి చూపాల్సిన నేను నీ పట్ల వివక్ష చూపాను. శారీరకంగా, మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న వారిని అర్ధం చేసుకోని, అవసరం అయితే వారిని ఆదుకుని సాంత్వన కలిగించడమే సదాచారం అని ఇన్నాళ్లకి గ్రహించాను తల్లి”. అంటూ అతి ప్రయత్నం మీద చేతులు జోడించబోయారు .
” అయ్యో..! మీరు కదలవద్దు సర్ ” అన్నాను నేను కంగారుగా చేయి ఊపుతూ.
” నువ్వు బయలుదేరిన కొంచెంసేపటి తర్వాత నేను కూడా స్కూల్ నుంచి బయలు దేరాను. ఆ గల్లీలో ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. త్వరగా వెళదామని ఈ గల్లీలోకి వచ్చాను. నువ్వు ఈ గల్లీలో ఉండడం నా అదృష్టం తల్లి. నడుం విరిగినట్టు నొప్పిపుడుతోంది. నన్ను పైకి లేపమ్మా ” దీనంగా అన్నాడు ఆయన చేయి అందించి.
పొద్దున్నించి గాయపడి ఉన్న నా మనసుకి మాస్టారి మాటలు గాయానికి నవనీత లేపనం అద్దినట్లు ఉపశమనం కలిగించాయి. మనసు తెలీక పడింది. గుంట దగ్గరగా వచ్చి ఆయనను పైకి లేవదీయడానికి నా చేయి అందించాను.
Chaalaa baagundi Rohini. TappakunDaa ఇలాటివి అందరికీ తెలియాలి . . ప్రచురించిన బహుళ. పత్రికకూ, మీకూ అభినందనలు
ధన్యవాదాలు మేడం గారు 🙏🙏
చాలా బాగుంది అండీ. ఆడవారి సమస్య పైకి చెప్పలేని వేదన గురించి కథ బావుంది రోహిణి గారూ!
ధన్యవాదాలు గిరిజా మేడం గారు 🙏🙏
బావుంది రోహిణీ గారూ.
ధన్యవాదాలు మేడం గారు 🙏
చాలా మంది ఈ కథలోని మాష్టారిలా ఇంకా సంకుచితంగానే ఆలోచిస్తున్నారు. ఏదో ఒక సంఘటన జరిగినప్పుడు, అది వారికి ఉపయోగకరంగా ఉన్నప్పుడే మాత్రమే కళ్ళు తెరుచుకుంటారు. ఈ పాత్ర ద్వారా తెలుకోవాల్సిన విషయాన్ని కథ ద్వారా చెప్పాలని ప్రయత్నించినందుకు మీకు అభనందనలు.
ధన్యవాదాలు సుదర్శన్ గారు
చాలా బాగుంది రోహిణీ! మాస్టారిలాగానే ఇంకా ఆలోచిస్తున్న వారెందరో ఉన్నారు. ఈ సమస్య స్త్రీలకు మాత్రమే అనుభవైకవేద్యం! చక్కగా వ్రాసావు, అభినందనలు అమ్మా!
ధన్యవాదాలు నాగమణి అక్కా
స్త్రీలు పడే బాధను చక్కగా రాసేవమ్మ.
చాలా చాలా ధన్యవాదాలు మేడం 🙏🙏
ధన్యవాదాలు మేడం