సాహితీ పెద్దలు శ్రీ విహారి గారు సృజన ప్రియ పత్రిక లో “నల్ల సూరీడు” ని వెలిగించిన అధ్బుతం. సృజయ ప్రియ సంపాదకులు శ్రీ విల్సన్ రావు కొమ్మవరపు Wilson Raoగారికి, Kommavarapu గారికి, గురువులు విహారి గారికి హృదయపూర్వక ధన్యవాదాలతో 🙏🌹
సృజయ ప్రియ ప్రధాన సంపాదకులు, నాకు అత్యంత ప్రియ మిత్రులు శ్రీ నీలం దయానంద రాజు గారి ఆకస్మిక మరణం అత్యంత విషాదకరం. వారికి కన్నీటి నివాళులు 🙏🙏
అనుభూతి కేంద్రంగా వస్తు రూప తేజోవలయం
శ్రీమతి రోహిణి వంజారిగారు తెలుగు పత్రికా పాఠకులకు సుపరిచితురాలైన రచయిత్రి. ఒక దశాబ్దంలో 75 కథలు రాసినవారు. అందులో 21 కథల్ని ‘నల్ల సూరీడు’ పేరుతో సంపుటిగా తెచ్చారు. సాహిత్య సంస్కారం కలిగిన చింతనాశీలిగా రోహిణి గారికి తానెందుకు రచనలు చేస్తున్నారో నిర్దిష్టంగా తెలుసు. తన కళ్ళముందు జరిగిన కొన్ని సంఘటనలు తలచుకున్నప్పుడల్లా ఉలికిపాటుకు గురిచేసి, మనసు పొరల్లో నలుగుతూ ఇక మౌనంగా ఉండలేనప్పుడు ఆమె కథా సృజనకు పూనుకుంటారు. ‘నేను రాసిన ప్రతి కథ వెనుక మరో కథ, ఆవేదన ఉన్నాయి’ అని చెప్పుకున్నారామె. అలాగే, ‘ప్రత్యక్షంగా చూసిన అన్యాయాలు, మోసాలు, పలురకాల వివక్షలు మట్టిమనుషులు, మధ్యతరగతి మనుషులు, వాస్తవాలు…’ తన కథా వస్తువులు అని స్పష్టం చేశారు.. ఇవన్నీ కథా బీజాలు! ఆ కేంద్రం నుండి, ఆ వస్తువుని పాత్ర ప్రమేయంతో కథాత్మకం చేసేది ఇతివృత్తం. ఈ ఇతివృత్త కల్పనలో, చిత్రణలో, వస్తు ఆవిష్కరణలో రచయిత సృజనశక్తి ద్యోతకమవుతుంది. రోహిణిగారి కథల ఇతివృత్తాలన్నీ- మూసకల్పనలకు భిన్నంగా వాస్తవికతనూ, వర్తమానాన్నీ, సామాజికతనూ ప్రోది చేసుకుని చదువరుల్ని అలరిస్తున్నాయి.
అన్యాయాన్ని నిరసించుట వేరు, ఆ నిరసనని కథాత్మకం చేయటం వేరు. మొదటిది వాంఛితం, రెండవది ఆ వాంఛితానికి రూపాన్ని కూర్చటం! ఈ సంపుటిలోని ‘క్రూకెడ్’ కథలో ఈ వాంఛితం, దానికి ఆమె కూర్చిన రూపం ఎంతో స్పష్టతతో మన ముందుకు వచ్చాయి. రచయిత్రి మెట్రో ప్రయాణానుభవంతో ఇతివృత్తాన్ని కూర్చారు. ఆ ప్రస్థానంలో – పురుషుడు – అనునిత్యం – మనసా, వాచా, కర్మణా – స్త్రీని వేధించటం, లైంగికంగా బాధించటం చూసి చూసి, విని విని, ‘మనసంతా చేదు మింగినట్లవుతుంది – (కథ చెప్పే ‘నేను’కు)! చివరికి స్త్రీల పట్ల అర్థరహితమైన, శాడిస్టిక్ కూతలు కూస్తున్న యువకుని చెంప పగలగొట్టేస్తుంది! ఇదీ అన్యాయాన్ని నిరసించే ‘ఆచరణాత్మక’ చర్య! ఇదీ వస్తువు ఇతివృత్తంగా రూపుదాల్చిన ప్రక్రియ! సన్నివేశం, సంఘటన – జమిలిగా కదిలినప్పుడు కథ ‘జరుగుతుంది’! దీన్ని సాధించటమే కథారచనా కళ. ఆ కళనే ‘శిల్పం’ అనేది. అంటే, కథ ‘ఎలా’ చెప్పారు అనేది!
రోహిణి గారికి ఈ ‘శిల్పం’ గురించి నిర్దిష్టమైన అవగాహన ఉన్నది. ‘కథ ఫలానా రకంగా రాయాలి’ అనే ప్రమాణాలేవీ లేవు. కథను ఎలాగైనా రాయవచ్చు. అయితే మనం రాసిన కథని పాఠకులకు కనెక్ట్ అయ్యేలా చేసుకునే ప్రతిభ – మారుతున్న కాలమాన పరిస్థితులను అనుక్షణం పరిశీలిస్తూ ఉండటం, పఠనం, నిరంతర సాధన వల్ల వస్తుందని నేను నమ్ముతాను. అదే ఆచరిస్తున్నాను’ అని స్పష్టం చేశారు. అంటే, కథను ఎలా రాయాలో, ఆమెదైన ఆ ప్రమాణం ఆమెకు ఉన్నది!! ‘క్రూకెడ్’ కథలోని ఎత్తుగడ, సంఘటనల గమనం, గతం ఆలోచనలు, మళ్ళీ ప్రస్తుత సన్నివేశంలో కథనం, పాత్రల స్వరూప స్వభావ సంభాషణల చిత్రణ, ఉత్కంఠ, పట్టు, విడుపు, ముగింపు – ప్రభావవంతంగా అమరినాయి. ఆమె ప్రమాణాలు లేవన్నా, వున్నాయని ఆమె నేర్చిన రచనా విద్య దాని ప్రతిఫలనాన్ని కథలోకి రప్పించి కూర్చో బెట్టాయి. అందుకనే, కథ పాఠకులకు కనెక్ట్ అయింది! అలా, వస్తు శిల్పాల్ని మిశ్రీకరించి ఉత్తమ కథల్ని అందించారు రోహిణిగారు. ఈ ‘నల్ల సూరీడు’ సంపుటిలోని అన్ని కథల్లోనూ ఈ గుణవిశేషాలు విశ్లేషణకు అందుతూ రోహిణి గారికి కథా రచనపట్ల గల ఆరాధనా భావాన్ని తెలుపుతున్నాయి.
రోహిణి గారి స్వీయ జీవితానుభవాలు ‘కటిక నిజాలు’ (ఆ పేరునా కథ వుంది! సమాజం పోకడనీ, మనుషుల మనస్తత్వాల్నీ ఆమె బహుళంగా పరిశీలించి చాలా ‘చదువు’ని గడించారు. పాతికేళ్ళు ఉపాధ్యాయ వృత్తిలో విద్యార్థులకు అవసరమైన ‘చదువు’నీ నేర్పారు. ఈ కారణాన, ఆమె కథల్లో ఎంతో వస్తు వైవిధ్యం కనిపిస్తున్నది.
స్త్రీ వ్యక్తిత్వ నిరూపణం కేంద్రంగా రోహిణి గారు మంచి కథలు రాశారు. ‘సరంగు’ కథ రచయిత్రి ఆత్మీయతా ముద్రతో శిల్పభరితంగా ఉత్తమ కథగా వచ్చింది. కష్టాల కొలిమి – మనిషిని కాలుస్తున్నా అనుభవాల తీగెని సాగదీస్తుంది. మేలిమి బంగరు లక్షణాల్ని అలదుతుంది. సంసారాన్ని ఈదటానికి అచంచలమైన ఆత్మవిశ్వాసంతో నడుం బిగించి విజయం సాధించింది కథానాయిక (నేను)! తన ఇక్కట్ల ఇతిహాసంలో అంతిమ దరహాసాన్ని చూపి – గడుసుగా – ‘ఇప్పుడు చెప్పండి మీరు, నేను విజేతనా, కాదా?’ అనే ముగింపు వాక్యంతో పాఠకునే గద్దించి, కథని ఆలోచనా ప్రేరకం చేసింది రచయిత్రి. బాహ్యరూపం చూసి మనిషి స్వభావాన్ని అంచనావేసి తీర్మానాలు చేయవద్దంటుంది ‘చెల్లె’. ఆత్మ ముగ్ధత్వంతో, తానే అధికురాలిననే ‘ఈగో’తో ప్రవర్తించిన హేమలత టీచర్ చివరికి ‘పిచ్చి చూపులపాలు కావటం – ‘సూపర్ టీచర్ సిండ్రోమ్’ కథ వివరిస్తుంది. విద్యార్థినుల పట్ల అనుచిత ప్రవర్తనతో, నిజానికి ఒక పిల్లపై అత్యాచారంతో, ఉపాధ్యాయవృత్తికే చెడ్డపేరు తెచ్చే ఒక దౌర్భాగ్యుడి ఆట కట్టించే ఎత్తువేసి, ముల్లుని ముల్లుతోనే తీయాలనే ప్రబోధాన్ని అందిస్తుంది రాగిణి – ‘కంచె’ కథలో.
రోహిణిగారి వ్యక్తిత్వంలోని మంచితనం, సాత్వికత, ఉపకార చింతన – వీటన్నిటి ప్రతిఫలనంగా – ఆమె కథలు కొన్ని సామాజిక వాంఛితాల్ని దృశ్యీకరించాయి. అపకారికి ఉపకారం నెపమెన్నక చేయాలనే కోరికకు దర్పణాలుగా – ‘నల్ల సూరీడు’, ‘దత్తత ఫలం’, ‘జాడలు’ ‘ఇచ్చుటలో ఆనందం’ కథలు – పాఠకులకు అనుభూతిప్రదం అయినాయి. ‘కుబుసం’ కథ కూడా ఆచారం, సంప్రదాయం, పండుగలు పబ్బాల వ్యవహారం ఎలాంటివైనా, వాటన్నిటికంటే కూడా, ‘ఉన్నదాన్ని నలుగురికీ పంచటమే మేలు’ అనే హితోక్తిని చెబుతుంది.
ఈ సంపుటిలోని ‘అభిమతం’ కథ మానవత్వం మహత్వం -ఎంతగా మతాతీతమో విశదం చేస్తుంది. రషీద్, డేవిడ్ లు తమను బిడ్డలుగా చూసి మేలు చేసిన మూర్తి అఖిల దంపతులు ఇప్పుడు కష్టాల్లో వుంటే తమకు చేతనైన సాయాన్ని మౌనంగా అందించి నిష్క్రమించారు.
‘మతమేదైనా మనుషులొక్కటే, మానవత్వమొక్కటే, దైవత్వమొక్కటే’ అని పునర్వచించింది కథనం”!
‘నాన్న కోరిక’ కథ ఒక పెన్షనుదారుని బావభావనోద్వేగానికి చిత్రణ. ఒంటరి దుఃఖంతో బతుకీడుస్తున్న పెద్దాయనకు మనుషులు కావాలి, మాట కావాలి. దాని కోసం ప్రతినెలా పెన్షన్ తెచ్చుకోవటానికి బ్యాంక్ కు వెళ్ళాలనే కోరిక, ఆరాటం. దీన్ని అర్థం చేసుకోలేని కొడుకు, బ్యాంక్ కు వెళ్ళకపోతేనే ఆయనకు సౌకర్యం అనే భావనతో తండ్రి కోరికకు అవరోధం కలిగిస్తాడు. చివరికి ఆ తండ్రి చనిపోయిన తర్వాత జ్ఞానోదయం, పశ్చాత్తాపం! ఇలాంటి కథకు మరో ముగింపు లేదు, మరి!!
రచయిత్రిగా, రోహిణిగారికి కథను అనుభూతి ప్రదం చేసి పాఠకుల మనసుల్ని వెంటాడే ఆలోచనల్ని శరపరంపర చేయటం చేతనవును. ఆమె కథా కథన శైలిలోని ఆర్ద్ర స్పర్శ దీనికి సైదోడు! అలాగే, ఆమెకు మనుషుల మనసు పొరల్లో దాగిన భావోద్రేకాలు వ్యక్తీకరణని ఎలా పఠితల ముందుంచాలో కూడా బాగా తెలుసు.
దీనికి ఆమె ఎన్నుకొని సాధించుకున్న narrative – Linear గా కాకుండా, Circular గా వుండటమనే సాంకేతికాంశం కారణం. కథలెందుకు రాయాలో, ఎలా రాయాలో అర్థం చేసుకున్న చిత్తశు ద్ధీ, సాహిత్య ప్రయోజనం పట్ల గల నిబద్ధత – రోహిణి గారి చేత మరిన్ని మంచి కథల్ని వెలువరింపజేస్తాయని ఆశిద్దాం. మంచి కథల్ని చదవండి!!
– విహారి
98480 25600