దత్తత ఫలం

నమస్తే!

నేను వ్రాసిన ఈ కథ “దత్తత ఫలం”  “ప్రియమైన రచయితల నూరు కథల సంకలనం” లో ప్రచురితం అయింది. మీరందరు చదివి మీ అమూల్యమైన అభిప్రాయలు తెలుప ప్రార్ధన.

—————————————————————————————————————————

“అమ్మకు సీరియస్ గా ఉంది వెంటనే బయలుదేరండి” అని బావగారి వద్దనుంచి ఫోన్ రావటంతోనే ఆయన డీలా పడిపోయారు. ఓ ప్రక్క ఆయన్ను అనునయిస్తూనే కర్తవ్యాన్ని గుర్తెరిగిన నేను రైల్వే రిజర్వేషన్ కోసం చూసాను.ఏ ట్రైన్ లో దొరకలేదు. ఇక తప్పదని కేశినేని ట్రావల్స్ బస్ హైద్రాబాద్ నుంచి చెన్నైకి టికెట్స్ బుక్ చేశాను.

మేం చెన్నైలో దిగి ఆసుపత్రికి వెళ్ళేసరికే మా వారి అన్నలు వదినలు, పిల్లలు అంతా వచ్చేసి ఉన్నారు. ఎప్పుడు ఏ వార్త డాక్టర్ దగ్గరనించి వస్తుందో అని అందరం విచారంగా ఉన్నాం. సాయంత్రం ఆరవుతుండగా డాక్టరు అందరినీ లోపలికి పిలిచారు. చివరి చూపుకోసం. అందరం మా అత్తగారి మంచం చుట్టూ చేరి విషణ్ణ వదనాలతో చూస్తూ ఉన్నాం. మా పెద్దబావగారు తులసీదళాలు కలిపి గంగాతీర్ధాన్ని అత్తగారి నోట్లో వేసారు. ఒక్క సారి కళ్ళు తెరచి అందరినీ చూసి ఇక వీడ్కోలు అంటున్నట్లు కళ్ళు మూసుకున్నారు.

రెండో గుటక పడక నీరు గొంతులో నిలిచిపోయింది. అందరం నారాయణ గోవిందా అంటూనే గొల్లుమన్నారు.

అత్తగారి ఉత్తర క్రియలు నెల్లూరులో చేయదలిచాం. తొమ్మిదవ రోజునే అందరం నెల్లూరులో ఉత్తరక్రియలు జరిపే సత్రానికి చేరుకున్నాం. అరకొర సౌకర్యాలు ఉన్నా ఆ నాలుగు రోజులు సత్రంలోనే ఉండాల్సి వచ్చింది మాకు. అక్కడ సత్రంలో పని చేయడానికి ఓ పెద్దావిడ యాదమ్మ అట పేరు. ఆమె ఇరవై ఏళ్ళ కొడుకు సీనయ్య అంట్లు తోమటం, తడిగుడ్డ పెట్టి తుడవటంలాంటి పనులు చేస్తున్నారు. వాళ్ళకి సత్రం వాళ్ళు పని ఉన్న రోజు నూటయాభై రూపాయలు ఇస్తారట. ఇక ఉత్తర క్రియలు జరిపించే వాళ్ళు ఇచ్చే భోజనం, పాత గుడ్డలు, ఎంతో కొంత డబ్బులతో కాలక్షేపం చేస్తారట. పనిలేని నాడు యాదమ్మ కొడుకు సీనయ్య ఆటో అద్దెకు తీసుకుని నడుపుతాడట. వాళ్ళ ఇద్దరితో పాటు ఓ నాలుగేళ్ళ పసిపాప ఉంది. ఎవరని నేను అడిగితే ‘ఆపాప యాదమ్మ కొడుకు సీనయ్య బిడ్డ అని చెప్పారు. ఆ పిల్ల అమ్మ ఈ పసిదాన్ని కని పురిటిలోనే వాతం వచ్చి చనిపోయిందట. అప్పటి నుంచి ఆ పసిదాని బాగోగులు యాదమ్మే చూస్తోందట. ఈ మధ్య ఆమె ఆరోగ్యం సరిలేక పని చేయలేకపోతోందట. నేను పోతే ఈ పసిదాని గతి ఏమిటో వీడికి మళ్ళా పెళ్ళి చేస్తే ఆ వచ్చే కోడలు ఈ పిల్లను సరిగా చూస్తుందో లేదో అని యాదమ్మకు బెంగట. ఇదంతా ఆమె నాకు చెప్పింది. పాపం ఆ పసిపిల్ల ముఖం ఎంతో అమాయకంగా ఉంది. చాలా కళగల పిల్ల. ఆలనా పాలనా చూసే తల్లిలేని ధాన్యం ఆ పిల్ల ముఖంలో కొట్టొచ్చినట్లు కనబడుతోంది. మాసిన గౌను, తైల సంస్కారం లేని జడలు గట్టిన జుట్టు, చీమిడి ముక్కుతో పేదరికానికి ఆనవాలుగా ఉన్న ఆ పసిదాని ముఖంలో ఏదో తెలియని ఆకర్షణ ఉంది. ఆ పిల్ల నవ్వితే బుగ్గలు సొట్టలు పడి, కళ్ళు వింతగా మెరుస్తున్నాయి. ఎందుకో ఆ పసిపిల్ల మీద నాకు జాలి కలిగింది.

మా అత్తగారి దశదిశ కర్మలు అన్నీ పూర్తయినాయి. ఆమె మంచితనం, బంధు ప్రీతి వల్ల ఆమె ఉత్తర క్రియలకు అధిక సంఖ్యలో బంధుమిత్రులు హాజరైనారు. పన్నెండో రోజు సాయంత్రం దానాల కార్యక్రమం జరిగింది.

అత్తగారి పేరుమీద హిరణ్య, సువర్ణ, వస్త్ర, ఛత్ర మొదలైన అనేక దానాలు చేసారు మా వారు , బావగారు అందరూ కలిసి .. గోపూజ చేసి పేద బ్రాహ్మణులకు గోదానం చేశారు. ఇంకా ఎందరికో నగదు దానం చేసారు. ఆ తర్వాత శాస్త్రి గారు అందరినీ కూర్చోబెట్టి “మా అత్తగారు ఉన్నప్పుడు ఎలా కలిసి మెలిసి ఉన్నామొ ఇక మీదట కూడా అలాగే బంధుమిత్రులు కలిసి ఉండాలి.
ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అంటూ మాకు హితవు చెప్పి కథలు చెప్పి ఆదరింపు కార్యక్రమం జరిపించారు.

ఇక పదమూడవరోజు శుభం కోసం అంతా బావగారి ఊరికి బయలుదేరుతున్నాం . అప్పుడు మా పెద్ద బావగారు వచ్చి “మూర్తి త్వరగా తెమలండి రా” బస్సుకు టైమవుతోంది అన్నారు. సరే అన్నా అంటూ మా వారు బ్యాగులు సర్దటంలో నిమగ్నమైనారు. అప్పుడు నేను సందేహిస్తూనే వెళ్ళి ఏమండీ మీరంతా అత్తగారి ఆత్మశాంతి కోసం ఆమె పుణ్యలోకాలు చేరాలని శ్రద్ధగా కర్మకాండలు, దానాలు చేయించారు. ఒక మనిషి చనిపోతే మాధవునిలో కలుస్తారు అంటారు కదా. మరి ఆ మాధవునికి నిజంగా ఏమి ఇష్టం మీరు చెప్పండి” అన్నాను. “ఇంకేముంది రాగిణి మాధవుడికి ఇష్టమైనది మానవ సేవేకదా అన్నారాయన.మరి మీరంతా దానాలుచేసారు కదా! అత్తగారి ఆత్మశాంతికోసం నేనుకూడా ఓమంచి పని చేద్దామనుకుంటున్నా నండి” అన్నాను. ఏమిటిన్నట్లు చూసారు ఆయన. ఆ సత్రంలో పనిచేసే యాదమ్మ మనుమరాలు ఆ పసిపిల్లని చూసారు కదా మీరు. ఆ పిల్ల తల్లిలేని బిడ్డ. ఇక్కడ వీళ్ళతో ఉంటే రేపొద్దున పెరిగి పెద్దయి ఈ పాపకూడా ఇక్కడ పనిలోనే చేరుతుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న ఈ పాప జీవితం అలా కాకూడదు.
అందుకే ఈ పాపను మనం దత్తత తీసుకుందామండి. మనతో పాటు ఊరికి తీసుకువెళ్ళి చదువు, సంస్కారం నేర్పించి మంచి జీవితాన్ని అందిద్దాం. ఆ పాప అవ్వనాన్నలతో కూడా మాట్లాడాను. వాళ్ళు పాపని మనకి దత్తత ఇవ్వడానికి ఆనందంగా ఒప్పుకున్నారు. నా నిర్ణయాన్ని మీరు కాదనరనే నమ్మకంతో ఈ పని చేసాను నేను” అన్నాను.

“తప్పకుండా రాగిణి. నువ్వు తీసుకున్న ఈ నిర్ణయానికి నా సంపూర్ణ మద్దతు. సహకారం అందిస్తాను” అంటూండగానే ఆయన సెల్ మ్రోగింది. ఫోన్ మాట్లాడుతూ వచ్చి సంతోషంగా ఆయన “రాగిణి మనం ఆ పాపని దత్తత తీసుకోవాలి అనుకున్న క్షణమే చూడు నాకు మన మేనేజర్ దగ్గరనుంచి ఫోన్ వచ్చింది. మనం వేసిన టెండర్ కి అనుమతి లభించి కాంట్రాక్ట్ మనకే వచ్చిందట. ఇది ఎన్నో రోజులుగా నేను కంటున్న కల. నష్టాలలో కూరుకు పోయిన మన కంపెనీ తిరిగి పుంజుకుంటుంది. మనకి మంచి రోజులు వస్తున్నాయి.సంతకాలు చేయడానికి వెంటనే మనల్ని బయలుదేరి రమ్మన్నాడు మేనేజర్. రాగిణి ఇది యాదృశ్చికమో లేక ఆ దేవుని కృపో ఏమోకానీ నువ్వు అన్నట్లు పాపని మనతో తీసుకెళదాం అనుకోవటం మా ఆమ్మకి కూడా నచ్చిందేమో. పైనించి తన ఆశీర్వాదాలు కూడా మనకి లభించాయి” అంటూ నా భుజం తట్టారు ఆయన మెరిసే కళ్ళతో.

“మా దత్తత నిర్ణయానికి నలుగురూ నాలుగు మాటలన్నా, ముక్కున వేలేసుకున్నా ఎవరినీ పట్టించు కాకుండా మేం హైదరాబాద్ కి తిరుగు ప్రయాణమైనాము. ఆ పసిపాపతో సహా.