“జీవన గమనాలు” “నల్లసూరీడు రచనా ప్రస్థానం”

“జీవన గమనాలు” “నల్లసూరీడు రచనా ప్రస్థానం”

కథల సంపుటి

శ్రీమతి రోహిణి వంజారి గారు

సమీక్షకురాలు

అరుణ సందడి

విమల సాహితి e పేపర్లో ఈ సమీక్షను ప్రచురించినందుకు యాజమాన్యం వారికి హృదయ పూర్వక నమస్సులు తెలుపుతున్నాను,🙏

********************************************

ఇంగ్లీషులో స్టోరీ అనే పదం కథగా ,షార్ట్ స్టోరీ అనే పదం కథానికగా మారింది. నేడు కథ మరియు కథనం రెండు పరస్పరము మార్చుకోబడ్డాయని చెప్పుకుంటారు…

తొలి తెలుగు కథ “దిద్దుబాటు” 1910 లో గురజాడ గారు రచించారని కొంతమంది భావించారు. అయితే అంతకుముందు అరచంట సాంఖ్యాంకు శర్మ రాసిన లలిత, విశాఖలో ఒక దాన్ని తొలి కథ గా ప్రస్తావించారు. పురాతన కాలం నాటి ఓరియంటల్ కథలను చాలామంది ఇష్టపడతారు…

సాహిత్యంలో వస్తున్న వివిధ ధోరణుల ఫలితముగా స్త్రీ వాదులు బండారు అచ్చమాంబ గారు 1893 నుంచే కథలను రాసిందని బయటపడింది. ధన త్రయోదశి, మరికొన్ని కథలు తొలి తెలుగు కథలు అని కథా పుట్టుక గురించి విభిన్న అభిప్రాయాలు చోటుచేసుకున్నాయి.

మౌలిక సాహిత్యంలోనూ కథలు ఉన్నాయి.

వేద పురాణము ఇతిహాసాల నుండి అనేక కథలు రూపుదిద్దుకున్నాయి.

నేటి నేపథ్యంలో తూలనాత్మకంగా పరిశీలించడం వలన కాలం, ప్రక్రియ, వస్తువు, శిల్పం, భావం వల్ల సాహిత్యము పునర్ముల్యాంకనము జరుగుతున్నది.

కొత్త కోణాలు ఆవిష్కృతమవుతాయి అని చెప్పడంలో సందేహం లేదు.

జీవితంలోని ఒకానొక అద్భుతమైన శిల్ప నైపుణ్యము తో కళ్ళకు కట్టినట్లు చూపించి హృదయాన్ని ఎన్నో అనుభూతులతో నింపేసి మరలా పదేపదే చదవాలి అనిపించే విధంగా ఉన్న కథను గొప్ప కథగా చెప్పవచ్చును.

స్థిరమైన అంశము లక్షణంగా మనసు లగ్నం చేసి చక్కటి శైలితో కథా వస్తువుతో పాఠకుల హృదయాలను ప్రభావితం చేసే విధంగా కథలు ఉండాలి అని చెప్పవచ్చును.

నాడు కరుణ కుమార, కొండ వంటి గంటి, రామశాస్త్రి, లాంటి సీరియస్ కథకులు ఉన్నారు…

కొన్ని కథలు సత్యాలను బహిర్గతం చేస్తూ వాస్తవములో జీవిత సత్యాలను బోధించే విధంగా రాస్తూ ఉంటారు . ఇలాంటి కథలు అపురూపమైనవి అని చెప్పవచ్చు.

ఊహ జనకంలో ఉద్భవించిన కథలను ఒక దిక్కుగా ఉంచితే

మరో దిక్కున ఏదో ఒక పరమార్థ సత్యాన్ని బోధిస్తూ పదుగురికి మార్గదర్శకమై మేలుచేస్తూ ఆదర్శమైన కథలు మరో దిక్కు…

కానీ కథలు.. చుట్టూ ఉన్న స్థితి పరిస్థితులను అవగాహన చేసుకుని మనసులో ఒక అద్వితీయమైన రంగస్థలం నిర్మించుకొని అనేక పాత్రలను సృష్టిస్తూ మాట్లాడిస్తూ అందరికి

అర్థమయ్యేలా పరుగులెత్తిస్తూ

దిశ నిర్దేశ గమ్యాలను అందంగా ఆవిష్కరిస్తూ ముందుకెళ్లాలి…

చిన్న పిల్లలు నిద్రపోవడానికి నాడు చిన్న కథలు చెప్పడం బాగా అలవాటుగా ఉండేది.

నేటి కథలు అందర్నీ ఆకట్టుకుంటూ పలు పేరుగాంచిన రచయితలు పుట్టుకొచ్చారు. కొన్ని కథలు ముఖ్యంగా సాహసం, ఔదార్యం, నీతి, ధర్మం శృంగారం వంటి విషయాలు ప్రధాన వస్తువులుగా నడుస్తాయి.

అందుకే ఇతర సాహిత్య ప్రక్రియల కన్నా కథలకు ఆదరణ ఎక్కువగా ఉంటుంది

బండారు అచ్చమాంబ కథలు చక్కటి కథ శిల్పంతో అలరించాయి అని చెప్పవచ్చు. ఆమె కథలు స్త్రీ విద్య స్వయంకృషి అవసరమైన సంఘసంస్కరణ భావాలు పుష్కలంగా కనిపిస్తాయి…

పురుషుల్లో ఉండే స్త్రీ వ్యామోహాని స్త్రీల దుస్థితిని తెలియజేస్తూ సాగిన కథలు

“నల్ల సూరీడు “కథలో కూడా అటు వంటి భావాలు మనం చూస్తాము స్త్రీల సమస్యలను

మన ముందు ఉంచుతుంది ఈ కథా సంపుటి…

రచయిత్రి లీనమైపోయి వాస్తవాలను కనులకు కట్టినట్లు రచించడం మనం

“నల్ల సూరీడు”లోచూస్తాము…

నేడు పోటీ పడి రాస్తున్న ఎందరో కథా రచయితలు గురించి ఇక చెప్పనవసరం లేదు.

ఇటువంటి తీవ్రమైన పోటీలో కూడా తనదంటూ ఉన్న శైలి ఉపయోగిస్తూ కథలను రాస్తూ

అనేక బహుమతులను కైవసం చేసుకుని ముందుకు వెళుతున్నారు ప్రియ నేస్తం ప్రముఖ కవయిత్రి రచయిత్రి రోహిణి వంజారి గారు…

ఈ రచయిత్రి మనసు దోచుకునే కథలను ఎన్నిటినో పాఠకులకు అందించారు.

కన్నుల ముందు జరిగిన కొన్ని వ్యధాపూరితమైన సంఘటనలను వాస్తవములను కథా రూపంలో అందించడం సమాజ హితమును కోరడమే…

ఈ కథలలో రచయిత్రి మనసు స్పష్టంగా పాఠకులకు కనిపిస్తుంది. సమాజం పట్ల రచయిత్రికి ఉన్న బాధ్యత తన కలం ద్వారా చాటిందనే చెప్పాలి. నిజాలను నిర్భయంగా చెప్పడం వలన ధైర్యం సృజనాత్మకమైన హృదయము మనకు కనిపిస్తుంది…

అనుభవాలను కథల రూపంలో అందించాలంటే రచయిత్రి నిజాయితీ ప్రకటితం చేసే మనస్తత్వం కలిగి ఉండటం మనకు కనిపిస్తుంది.

ఇప్పుడు రోహిణి గారు రాసినటువంటి కథల గురించి తెలుసుకుందాము.

మొదటి కథ “క్రూకెడ్ “ఈ కథలో నిత్యం స్త్రీలు ఎదుర్కొంటున్న పరిస్థితులను కన్నులకు కట్టినట్లు రాయడం చూస్తే రచయిత్రి ఎంత బాగా నిశితంగా పరిస్థితులు పరిశీలించి కథ రాసి ఉంటారు అనిపిస్తుంది. ప్రతి ఒక్క మహిళ తన జీవితంలో ఈ కథలో జరిగిన సంఘటనలను ఎదుర్కొనే ఉంటుంది.

వయసుతో నిమిత్తం లేకుండా

చూపులతోనే కాల్చుకు తినే మానవ పిశాచి మనస్తత్వం గురించి చాలా బాగా వివరించారు. ఇలాంటి వ్యక్తుల గురించి బయటకు తెలిస్తేనే కదా కొంతలో కొంతైనా సమాజమునకు సేవ చేసినట్లే

ఈ క్రూకెడ్ కథ మనుషుల మనస్తత్వాలకు అద్దం పడుతుంది అని చెప్పాలి.

“కుబుసం “కథలో ఆచారాలు అంటూ వృధా చేస్తున్న ఆహారము చూసి మనసు చలించి అదే ఆహారంతో పది మంది కడుపు నింపితే కలిగే ఆనందమే వేరు అని చక్కటి విషయాన్ని పాఠకులకు కథా రూపం లో అందించడానికి ప్రయత్నించడం హర్షనీయం.

భక్తి మనసుకు సంబంధించినది మానవసేవనే మాధవసేవ అని తెలిపే చక్కటి కథనే ఈ “కుబుసం” ఈ కథతో రచయిత్రి యొక్క మనస్తత్వం విధితమగుతుంది. ఆర్తులకు అనాధలకు కడుపు నింపాలని తాపత్రయము మనకు కనిపిస్తుంది…

ముచ్చటగా మూడవ కథ ఈ కథ నాయకుడు మధు క్యారెక్టర్ చాలా హృద్యంగా మలిచారు. ఈ కథ హృదయానికి హత్తు కునేది అని చెప్పాలి జీవితంలో అవయవాలు లేకపోయినా అద్భుతంగా ఆశించిన ఆశను సాధించడమే ఈ కథలోని గొప్ప సందేశం మానసికంగా కృంగిపోకుండా హర్ష లాంటి వ్యక్తులు చేయూత అందిస్తే మధు లాంటి వారు ఉన్నత స్థానాన్ని చేరుకోగలరని రచయిత్రి చక్కటి కథనముతో చెప్పడం పాఠకులకు ఆసక్తిని కలిగిస్తుంది…

ఒక మహిళ నేను విజేత నా? కానా ?అని ప్రశ్నించింది అంటే ఆమె గురించి మనం తెలుసుకోవాల్సిందే అలా తెలుసుకోవాలంటే “సరంగు” చదివి తీరాలి. మధ్యతరగతి కుటుంబంలో జీవనం సాగిస్తూ కష్టాలలో భర్తకి యాక్సిడెంట్ కావడం ఇంటి బాధ్యత భార్యపై పడటం ఆమె చేసిన ప్రతి కష్టం కన్నులకు కట్టినట్లు కథలో చూపించారు. స్త్రీలకి మనోధైర్యాన్ని అందించే ఈ కథ అందరి హృదయాలను గెలుచుకుంటుంది అనడంలో సందేహం లేదు.

ఒక దిగువ మహిళ విజేతగా ఎదగడం సారాంశమైన కథ “సరంగు”…

అలాగే “చెల్లె “కథలో ఆడబిడ్డ ఉద్యోగం చేస్తూ వెళ్లి రావడం ఆలస్యం అయితే మనసు ఎంత అలజడిలో మునిగిపోతుందో ఈ కథలో చూస్తాం. మానవత్వం ఇంకా మిగిలి ఉన్నదని సందేశము ఇస్తుంది ఈ కథ. మానవ మృగాలు ఉన్న ఈ సమాజంలో మంచి మనసులు కూడా ఉంటాయని చెప్పడం వెనుక

రోహిణి వంజారి గారి మనసు మనకు కనిపిస్తుంది.

సమాజంలో మంచివారు కూడా ఉంటారు అందర్నీ అనుమానించకూడదు అనే సందేశం మనకు చెప్పినట్లు ఈ కథ మనకు సందేశం ఇస్తుంది.

మరో కథ “పరబ్రహ్మం”అన్నం మనిషికి ఎంత అవసరమో ఈ కథను చదివితే తెలుస్తుంది.

జీవితంలో అమ్మానాన్న ఉన్నన్ని రోజులు సుఖసంతోషాలు అనుభవించాక వారు లేని స్థితిలో చదువులకు దూరమైన ఒక వ్యక్తి గురించి అతని హావభావాలను కన్నులకు కట్టినట్టు రాయడంలో రచయిత్రి సఫలీకృతం అయినారని చెప్పవచ్చును.

అన్నం పరబ్రహ్మ స్వరూపం భగవంతుని దీవెన అనే విషయము చక్కగా వివరించారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే అందరికీ కనువిప్పు కలిగే విధంగా ఈ కథ రోహిణి గారు అందించారు…

మరో కథ “జాడలు”లో పేద గొప్ప తారతమ్యాలను చూపుతున్న నేటి సమాజానికి ఇచ్చిన సందేశము మనకు కనిపిస్తుంది. ప్రతి మనిషిలో మానవత్వం ఉంటుందని అవి లేనినాడు అతడు మనిషి కాజాలడనే భావన ఈ కథలో రోహిణి గారు చెపుతారు. మనిషికి మనిషి ఎలా సాయం చేసుకోవాలి అది కూడా బ్రతికుండగానే చేసుకోవాలి తరువాత ఎంత బాధపడిన ప్రయోజనం ఉండదని తెలిపే ఈ కథ హృద్యంగా రచించారు

దీనిని బట్టి రోహిణి గారు ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారు పాఠకులకు బాగా అర్థమవుతుంది. సమస్తం ప్రేమ తత్వము నిండిదనే విషయము

అవగతమవుతుంది…

“ఆసరా” అనే మరో కథలో నేటి సమాజంలో ఆర్థిక ఇబ్బందుల వలన మనిషి ఎలా జీవచ్ఛవం గా మారతారో చక్కగా వివరించారు.

మనసు లేని మనుషులు స్వార్థం నిండిన వ్యక్తిత్వాలు ఎదుటివారి జీవితంలో ఎంత అల్లోకల్లోలం సృష్టిస్తారు అనేది ఈ ఆసరా అనే కథలో మనం చూడవచ్చు. ఈ కథ పాఠకుల హృదయాలను తాకి ద్రవింప చేస్తుంది. కథలో చూపిన వ్యధలకు చివరలో ఆసరా కల్పించడంలో రచయిత్రి యొక్క మనసు తెలుస్తుంది.

ఈ కథను అందించిన రోహిణి గారికి

అభినందనలు తెలుపకుండా ఉండలేము…

ఇంక కథా సంపుటి పేరు

“నల్ల సూరీడు”రోహిణి గారు ఎందుకు ఈ పేరు సెలెక్ట్ చేసుకున్నారు ఈ కథను చదివితే అర్థం అవుతుంది.

కుల మతాల పేరుతో వాస్తవ ప్రపంచంలో మృత్యు మారణ హోమం స్వాగతిస్తున్న సమయంలో సమానత్వం సమన్వయం కూర్చే విధంగా ఈ కథ రాయడం చాలా బాగుంది.

మనిషి కుల మతాలు వేరైనా వారు విభిన్న జాతుల వారైనా మానవత్వం అనేది మనసులో సూర్యుని వెలుగులా తేజోవంతమై ప్రకాశిస్తుంది.

నూటికో కోటికో కొందరు అలా చరిత్రలో నిలిచిపోతారు.

ఈ “నల్లసూరీడు” కూడా అంతే

తక్కువ కులంలో తాను పుట్టిన జాలిగల హృదయమై అన్ని దానాలలో రక్తదానం మిన్న అని భావించి అలాంటి దానాన్ని చేసి బ్రతుకుకు వెలుగైనాడు. అందుకే

నల్ల సూరీడు గా వర్ణించారు.

కథా బలం పేరు బలమై మంచి గుర్తింపు తీసుకు రాగలదు…

రోహిణి గారి మానవీయతతో ఎదుటి వారి బాధను ఏలా తన బాధగా తీసుకుంటున్నారో ఈ కథను చదివితే అర్థమవుతుంది నేటి తరం వారు తప్పక చదవాల్సిన కథ ఇది..

“దత్తత ఫలం”లో పేదరికంలో ఉన్న చిన్న పాపను ఎవరు లేని ఒంటరిగా మారుతుందని దత్తత తీసుకుందామని ఆలోచన రావటము నాయక నాయకులకు మంచి మనసును తెలుపుతుంది. వెంటనే ఆ పాపను తమతో తీసుకుపోవడానికి సిద్ధపడటం ఈ కథలో ప్రధానమైనటువంటి ముగింపు. పాప రావటంతో అదృష్టం కలిసి వచ్చిందని

తలుస్తారు.. ఇందులో రచయిత్రి తల్లి మనసు మనకు కనిపిస్తుంది. తల్లి బిడ్డల భవిష్యత్తు గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని పెంచి పెద్దవారిని చేస్తారు. ఈ మనస్తత్వం ఈ కథలో గొప్ప సేవా దృక్పథం కనిపించేటట్లు

తెలియజేయడము జరిగింది.

రచయిత్రి తాను ఏమీ తెలియచేయాలనుకున్నారో అది తెలపటం లో సఫలం అయినారని చెప్పవచ్చును…

మరో కథ “బుజ్జమ్మ పిల్లి” లో రోహిణి గారికి ఉన్న జంతు ప్రేమను చాలా బాగా చూపించారు. బుజ్జమ్మకి ఇష్టమైన పిల్లి ఎంతో ప్రేమగా పెంచుకున్నది. అలాంటి ఇష్టమైన పిల్లి కూన మరణిస్తే తల్లిగా తల్లడిల్లి పోతుంది.

తిరిగి మరో పిల్లి కూడా పెంచి ఎలా సంబరపడిందో ఈ కథలో మనం చూడొచ్చు. జంతు ప్రియులందరూ అంతే కదా అవి మనతో ఉంటే ఆ సంతోషమే వేరు అంటారు. రోహిణి గారు మూగజీవులకు మనుషులకు ఉన్న దగ్గర సంబంధము చక్కగా ఈ కథలో చూపించారు…

ఇలా ప్రతి కథలోనూ ఒక ప్రత్యేకమైన సందేశం ఇచ్చే విధంగా తీర్చిదిద్దారు రోహిణి వంజారి గారు తక్కిన కథలు డ్రైవరో నారాయణో హరిః, ఇచ్చుటలోని ఆనందం,

సూపర్ టీచర్ సిండ్రోమ్, కంచె, అభిమతం, నాన్న కోరిక, విజేత, ధనాత్మకం, దమనం కటిక నిజం…

ఇలా ప్రతి ఒక్క కథ నైతికపరమైన బాధ్యతలను గుర్తుచేస్తుంది.

సమాజంలో జరిగే సర్వసాధారణ విషయాలు అక్షరీకరించాలంటే దానికి ఎంతో ప్రజ్ఞత అవసరమవుతుంది.

పైగా రచయిత్రి రోహిణి వంజారి గారు తన వృత్తిపరమైన బాధ్యతలను ఒక ప్రక్క నిర్వహిస్తూ, రెండో ప్రక్క రచయిత్రిగా కవయిత్రిగా రెండు వైపులా పదును పెడుతూ ముందుకు సాగుతున్నారు…

రాసే కథలన్నీ కూడా గొప్ప సందేశాత్మకమైన విషయాలతో మేలుకొలుపుతున్నారు. ఈ కథలు అన్ని పాఠకుల హృదయాలకు ఆనందాన్ని అందిస్తాయని కచ్చితంగా చెప్పవచ్చు.

సహృదయత ఆప్యాయత అనురాగాల సంబంధాలకు పెద్దపీఠం వేయడం రోహిణి గారి మనసును అడ్డం పడుతుంది

రోహిణి గారి కలం మరెన్నో కథలకు వన్నె తీసుకురావాలని

ఉత్తమమైన కథలు వారి చేతి కలం నుండి జాలువారాలని కోరుకుంటూ…

నేస్తం శ్రీమతి వంజారి రోహిణి గారికి

శుభాభినందనలు తెలుపుతున్నాను…,🌹

సమీక్షకురాలు

అరుణ సందడి, ✍️