నమస్తే. ఈ నెల విశాలాక్షి మాసపత్రికలో నా కథ “కుడుములు సామి” ప్రచురితం అయింది. సంపాదకులు శ్రీ ఈతకోట సుబ్బారావు గారికి ధన్యవాదాలతో. కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోరుతూ..
బడి కాడ నుంచి ఇంటికి వస్తానే వాకిట్లో నల్ల కిర్రు చెప్పులు ఔపడ్డాయి నాకు. అంటే ఊరి కాడ్నించి రమణయ్య వొచ్చాడన్నమాట. ఇంట్లోకి పోయి చూస్తే నా ఊహ నిజమే. రమణయ్య, నాయిన మాట్లాడుకుంటా టీ తాగతా ఉండారు.
నన్ను చూస్తానే రమణయ్య ” రారా బుజ్జమ్మా..ఊరి కాడ్నించి నీ కోసం తాటి ముంజలు, బురగుంజు తెచ్చాను. అమ్మ కాడ ఇచ్చాను అన్నాడు. “ఐ తాటిముంజలు ” అనుకుంటా వంటింట్లోకి పోయాను. అప్పటికే నాయన, రమణయ్య టవనోస్పెట లో దుర్గా హోటల్ కి అమ్మిడిగా ఉన్న నాతా వెంకటేశ్వర్లు సామాన్ల అంగడి కాడికి పోయి బెల్లం గడ్డలు, ఏలకులు యూరియా సంచుల నిండా ఏసుకోనొచ్చి వరండాలో పెట్టి ఉండారు. టీ తాగేసి రమణయ్య ఉండుకొని ” నేనింక బయలుదేరుతా సత్తెయ్య. ఎల్లుండి పొద్దన బస్సుకి వొచ్చేయండి మీరు ” అన్నాడు
” అట్నేలే రమణయ్య.. ఉండు నేను కూడా నీతోపాటు బస్టాండ్ దాక వస్తాను. ఇద్దరం చెరో సంచి తీసుకుంటే బెల్లం గడ్డలు అంత బరువు ఉండవు” అంటా నాయన కూడా ఆత్మకూరు బస్టాండ్ కాడికి పోయినాడు రమణయ్యతో పాటు.
ఆదివారం పొద్దనే లేచి స్నానాలు కానిచ్చి అందరం కాఫీలు తాగినాం. అప్పటికే అమ్మ రాత్రి నానబెట్టిన బియ్యాన్ని కడిగి వాటిలో బెల్లం కలిపి టిఫిన్ బాక్స్ లో పెట్టింది. అమ్మ, నాయన, అన్న, నేను అందరం ఆత్మకూరు బస్టాండ్ కాడికి నడుచుకుంటా పోయినాము.
బస్టాండ్ కాడ కొత్తపాలెం బస్సు రెడీగా ఉండాది. మేము ఎక్కి ఎక్కడమే తడువుగా డ్రైవర్ సైదులు బస్సు ను ముందుకు ఉరికించినాడు. దారి పొడుగునా పచ్చటి పంట పొలాలు, చల్లని పైర గాలి. ముక్కాలు గెంటలోనే బస్సు డేవిస్ పేట, జగదేవి పేట , ఇందుకూరుపేట, మొత్తలు, గంగపట్నం ఊర్లు దాటుకొని కొత్త పాలెం చేరుకుంది. అక్కడ నుంచి మూడు మైళ్ళు నడిస్తే మా ఊరు పొగడ దొరువు కండ్రిగ వస్తాది.
శ్రీరాములు శెట్టి పొలం కాడ ఉన్న పంపుసెట్టు పాయింట్ లో ముఖాలు కడుక్కుని కడుపు నిండా నీళ్లు తాగి మట్టి బాట వెంబడి బయలెల్లినాము. దోవలో కనిపించిన వారికంతా మా నాయన ” సాయంత్రం మా పొలం కాడ వినాయకుడికి కుడుములు పోస్తాము, అందరు పొలం కాడికి రాండి” అంటా చెప్తా ఉండాడు.
మేము మట్టి బాట వెంట నడిచి, అమ్మిట చింతోపు దాటి, జంగం దొరువు దాటుకొని మా పొలాల కాడికి పోయినాము. కల్లం ఇంకా అర మైలు దూరం ఉండగానే ఏలకుల పొడి కలిపిన బెల్లం కుడుముల వాసన ముక్కులకు కమ్మగా తగిలింది. హుషారుగా కల్లం కాడికి పరిగెత్తినం నేను, అన్న. ఆడ ఈతాకుల చాప మీద ఉడుకుడుకు కుడుములు పోసి నెరపతా ఉండాది వెంకటమ్మ. కట్టెల పొయ్య మీద నుంచి తపిలను దింపి కుడుములు చాప మీదకి దొల్లిస్తా ఉండాడు రమణయ్య. కుడుములను తృప్తిగా చూసి నాయన ” రమణయ్య..కుడుములు చేసే పని మొత్తం అయిపోయినట్టేనా” అన్నాడు.
“ఇంకొక్క తడవ తపిలను పొయ్య ఎక్కిస్తే చాలు. అయిపోయినట్టే. మీరు అన్నాలు తినేయండి. కుడుముల పని వెంకటమ్మ చూసుకుంటుంది. నేను, అబ్బయ్య పోయి ఊర్లో పిలకాయలను మన పొలం కాడికి రమ్మని చెప్పి వస్తాం ” అన్నాడు.
మా కాక్క వండిన చింత చిగురు పులుసుగూర, మినుముల చింతపండు పచ్చడి, ఎర్రటి గడ్డ పెరుగు తో అన్నాలు తిన్నాం. అమ్మ రవ్వంత సేపు కునుకు తీసింది. నేను కూడా రమణయ్య తో పాటు పిల్లకాయలను రమ్మని చెప్పేదానికి పోయినాను.
కల్లు శాంతమ్మ వాళ్ళ పొలం గెనెమ గట్లమీద ఉండే తాటి చెట్టు ఎక్కి కల్లు ముంతలు దింపతా ఉండాడు పెద్ద యానాది . కల్లు శాంతమ్మ ముంతలను లెక్కబెట్టుకుంటా ఉండాది. వాళ్ళ కాడికి పోయి మాపటేళ సత్తెయ్య పొలంలో కుడుములు పోస్తా ఉన్నాం అందరు ఆడికి రండి” అని చెప్పాడు రమణయ్య. అపట దొరువులో బాతులను మేపుతున్న వెంకయ్య, మాతమ్మ వంతెన మీద కూర్చోనున్న పొట్టి రాముడు, జంబాల శీనయ్య, పొట్ట మస్తాన్, ఎర్రయ్య , సంజీవులు అందరిని కేక వేసి పిలచి కుడుములు పొసే సంగతి చెప్పాడు రమణయ్య.
నేను కూడా వెంకటమ్మ ఇంటిదగ్గర ఉన్న నా స్నేహితురాళ్ళు శైల, విమల, సీత, అనురాధ, కరీమా, జుబేదా అందరిని మా పొలం కాడికి రమ్మన్నాను.
గెంట సాయంత్రం నాలుగయింది. ఈదురు గాలి వీస్తా ఉంది. తూరుపక్క నుంచి ఉండుండి మెరుపులు కనిపిస్తా ఉండాయి. ఏడ వాన వస్తుందో అని నాయన భయపడతా ఉండాడు. తొలకర్లు మొదలవగానే కయ్యలు దున్నే ముందు మా కయ్య గెనెమ గట్టు మీద ఉన్న వేపచెట్టు కింద వినాయకుడికి కుడుములు పోయడం ప్రతి సంవత్సరం జరగతా ఉండాది. వినాయకుడికి మొక్కినాకనే పొలం పనులు మొదలు పెడతారు మా రమణయ్య వోళ్ళు.
ఆకాశంలో ఆడాడా నల్లమబ్బులు పనిలేని పాపయ్య మాదిరి అటు ఇటు తిరగతా మాకు దడ పుట్టిస్తా ఉండాయి. కుడుములు పొసేదాకా అయినా వాన రాకుంటే బాగుండు అని అందరం గణపయ్య కు మొక్కతా ఉన్నాం.
గుబురుగా ఉన్న దాసాని చెట్ల నుంచి అరిచెయ్యి అంత వెడల్పు ఉన్న ఎర్రటి రెక్క దాసాని పూలు, పచ్చ గన్నేరు, తెల్ల గన్నేరు చెట్ల నుంచి గన్నేరు పూలను కోసి అమ్మ చేతికి ఇచ్చాడు నాయన. అమ్మ, కాక్క, వెంకటమ్మ ముగ్గురు అరిటినారతో దాసాని, గన్నేరు పూల దండలను కట్టారు.
మళ్ళా ఓ తూరి పంపుసెట్టు పాయింట్ కాడ స్నానాలు చేసాం మేము.పూల దండలు, పసుపు, కుంకుమ, కర్పూరం బిళ్ళలు పెట్టిన తాంబాలం తట్టను అమ్మ తీసుకుంది. కాక్క, వెంకటమ్మ టెంకాయలు ఉన్న వైరు బుట్టలను తీసుకున్నారు. కుడుములు పోసి ఉన్న పెద్ద గంపలను నాయన, రమణయ్య బుజాలకెత్తుకున్నారు. నేను సాంబ్రాణి కడ్డీలు , కుంకుమ కలిపినా అక్షింతలు లక్క పిడతలో పోసి పట్టుకున్నాను.
అప్పటికే మోహనన్న వినాయకుడి కయ్య కాడికి పోయి ఉండాడు. గెనెమ మీద నడుచుకుంటా అందరం కయ్య కాడికి పోయినాం. కయ్య గట్టు మీద పెద్ద వేప చెట్టు ఉండాది. చెట్టు కింద పచ్చి బంక మట్టితో చేసిన వినాయకుడి బొమ్మ ఉండాది. పొద్దన ” నిడిముసిలి ” నుంచి వొచ్చిన కరీమ్ బాషా వినాయకుడి బొమ్మను బలే చక్కగా చేసాడు. బొమ్మకు సున్నం పూసి నల్ల రంగుతో కళ్ళు, ఎఱ్ఱరంగుతో నోరు కుంచెతో పెడతా ఇంకా మెరుగులు దిద్దతానే ఉన్నాడు. వేపచెట్టు కింద చిన్న, పెద్ద అంతా కలిసి ముప్పై మంది దాకా చేరి ఉండారు. పొలం కాడ కూలి చేసే ఆడోల్లు, పశువులు మేపే పిలకాయలు కూడా వొచ్చి చేరారు. చిన్న యానాది, మోహనన్న పిలకాయలను గోలచేయకుండా గెనెమ గట్టు మీద వరుసగా కూర్చోబెట్టారు.
శైల, అనురాధ కూడా తమలపాకులు, సాంబ్రాణి కడ్డీలు తీసుకుని వొచ్చారు. నాకు ఎంత కుశాలుగా ఉండాదో ఇప్పుడు.
ఆమాట ఈ మాట మాట్లాడుకుంటుండగానే చిన్న కండ్రిగ నుంచి సుబ్బరాయ శాస్త్రి వొచ్చాడు. ఆయన వేప చెట్టు కిందకి వస్తానే “శుక్లాం భరధరం ” అంటా ఎత్తుకొని ఆస్తోత్ర శతనామాలు చదివాడు. దాసాని,గన్నేరు పూల దండలు వినాయకుడికి వేసాం. కల్లు శాంతమ్మ తట్టలో కస్తూరి విడి పూలు తెచ్చి ఇచ్చింది. తోట కిష్టయ్య వాళ్ళ తోటలో కాసిన అరటి పండ్ల గెలను తెచ్చి ఇచ్చాడు. పూజ అయినాక నాయన, రమణయ్య, అమ్మ అందరు టెంకాయలు కొట్టారు. సుబ్బరాయ శాస్త్రి కర్పూరం వెలిగిచ్చి టెంకాయలు, అరటి పండ్లు, కుడుములు వినాయకుడికి నైవేద్యం పెట్టినాడు.
అప్పటిదాకా పూజ ఎప్పుడౌతుందా అని చూస్తా ఉన్న పిలకాయలు వేపచుట్టుతా చేరి టిఫిన్ డబ్బాలను, తట్టలను పట్టుకొని రెడీగా ఉండారు. ముందు సుబ్బరాయ శాస్త్రి రెండు చేతుల నిండా పట్టినన్ని కుడుములను తీసుకుని దణ్ణం పెట్టుకుని వినాయకుడి బొమ్మ మీద పోసాడు.
ఒక్క కుడుము కూడా కింద పడకుండా పిలకాయలు తీసేసుకున్నారు. అపట నాయన, మా కాక్క , రమణయ్య, అమ్మ, నేను, మోహనన్న, కల్లు శాంతమ్మ, వెంకటమ్మ అందరం వినాయకుడికి కుడుములు పోసాము.
నాలుగు కుడుములు చేతిలోకి తీసుకొని నాయన కయ్యల తట్టు చూస్తా దణ్ణం పెట్టుకొని కుడుములను కయ్యలోకి విసిరేసాడు. తొలకర్లు పడి వాగులు, వంకలు, చెరువులు నిండి, నీటికి కరువు లేకుండా వానలు కురవాలి, పంటలు బాగా పండాలి,అందరి కడుపులు నిండాలి అని అందరం వినాయకుడికి మొక్కుకున్నాం.
పిలకాయలందరికీ వాళ్ళు తిన్నన్ని కుడుములు ఇచ్చి, వాళ్ళ ఇంటి కాడికి తీసుకుపోయేదానికి కూడా ఇచ్చాము. తియ్యటి బెల్లం కుడుము నోట్లో పెట్టుకుంటే జున్ను ముక్కలా కరిగిపోతోంది. అందరి నోళ్లు తీపి చేసుకున్నాం.
“కుడుముల సామికి దండాలు, తొలకరి దేవుడికి దండాలు, మా అండాదండా నువ్వేనయ్యా గణపతి దేవా నీకు కోటి దండాలు ” అని పాటలు పాడుతూ ఇళ్ల దారి పట్టారు అందరు.
అప్పటికే చానా పొద్దుపోయింది. చీకటి నల్ల రాక్షసుడి మాదిరి కమ్ముకొని వస్తా ఉండాది. సన్నగా వాన తుంపర్లు కూడా మొదలైనాయి. ఇక నెల్లూరికి రేపే పొయ్యేది అనుకుని గుడిసె ఇంట్లోకి వొచ్చి తాటాకు చాపలు పరుచుకున్నాం. కుడుములు తిని అందరి పొట్టలు నిండిపోయి ఉండాయి. అట్నే చాపల మీద వాలిపోయాం.
రాత్రి జోరు వాన కురిసినట్టు ఉండాది. గుడిసె బైట అంతా రొచ్చు రొచ్చుగా ఉండాది. కయ్యలన్నీ నీళ్లతో నిండి పోయి ఉండాయి.
” చూడపోతే రెండు పదునుల వాన పడినట్లు ఉండాది. వారం తర్వాత ఇక కయ్యలు దున్ని చాడ ఏసుకోవచ్చు “
అంటానే నాయన ఏదో గుర్తుకొచ్చినట్లు బురదగా ఉన్న ఖాతరు చేయకుండా వినాయకుడి కయ్య కాడికి పరుగులాంటి నడకతో పోతా ఉండాడు. నాయన వెనకామాలే నేను కూడా పరిగెత్తినా.
కయ్యలన్నీ నీళ్లతో నిండిపోయి ఉన్నా, నాయన భయపడినట్లు కాకుండా వేపచెట్టు కింద మాత్రం చుక్క వాన పడినట్లు కనపడలే. అంత వాన పడ్డా చెక్కు చెదరకుండా” మిమ్మలను కాపాడడానికి నేను ఎప్పుడూ ఈడ్నే ఉంటాను” అన్నట్లు నవ్వతా కుడుముల సామి మాకు ఔపడ్డాడు.
కథలు వ్రాయడం ఒక ఎత్తు అయితే,యాసను అనుసరించి కథనం నడిపించడం మరో ఎత్తు.
యాసలో ఎక్కడా పట్టు జారనీయక ,ప్రారంభం నుండి ముగింపు వరకు తీసుకు రావడం అనేది అంత సులువైన ప్రక్రియ కాదు.
కల్మషం లేని హృదయం తో కోరుకున్న కోరిక,నాలుగు క్షేమం కోసం చేసిన పూజ సత్ఫలితమే ఇస్తుందనే ముగింపు చాలా బాగుంది..
హృదయ పూర్వక అభినందనలు సోదరి.
Thnak you brother
Thanks brother
Very good Rohini dear👌👌👍👍Keep it up
Thanks Rajyalakshmi😊
Thanks dear