విజయమహల్ గేట్ అనగానే, గుర్తొచ్చేది వచ్చే రైలు పోయే రైలు. గేటుకి అటూ ఇటూ ఆగుతూ సాగే ట్రాఫిక్ రద్దీ.
యాభై ఏళ్ళ క్రితం అక్కడ ఎలా ఉండేది? అప్పటికి ఇప్పటికీ ఏమైనా మార్పులున్నాయా?
మిగిలినవన్నీ అటుంచి, ఇప్పటికీ అది విజయమహల్ గేట్ సెంటరే.మరి,ఎప్పుడెప్పుడు గేట్ తీస్తారా ఎప్పడెప్పూడు పట్టాలు దాటెళదామా అని ఎవరి తొందరలో వారు వెళ్ళే క్రమంలో, కాస్త నిదానించి ఆ గేటుకు అటూఇటు విషయాలు చెప్పేదెవరు? చెప్పినా వినేదెవరు?
అందుకేనేమో , 1970 ప్రాంతాల్లో విజయమహల్ గేటు సెంటర్లో పెరిగిన ఓ బుజ్జమ్మ గారి అక్షరాల రైలు పట్టాలమీదకి మీదకి వచ్చేసింది.మరి మనకోసం లడ్డూ మిఠాయి తెచ్చిందా?అబ్బే, పొట్లం కట్టిన కారందోసా, గౌను జేబులో దాచిన కమ్మర్ కట్టీలను మాత్రమే తెచ్చిందండి! ఆహా!
ఇది అదలాబదలా గా చెప్పే మందల కాదు. ‘వొజ్రం విలువ తెలిసిన లోకాలయ్యా మందల!’
కర్పూరదీపమై పోయిన దొడ్డి నరసమ్మ నైనా, ‘అపిలిపండు’ ప్రదాత శకుంతలమ్మ దేవతమ్మనైనా, బూట్ల మిస్సమ్మ దెయ్యాన్నైనా ఒకే భావోద్వేగంతో పరిచయం చేసిన జీవన కథనాలు,శ్రీమతి రోహిణివంజారి గారి విజయమహల్ గేట్ కథలు.
కథలు అని అన్నారు గానీ, వీటిలో కల్పనేమీ కనబడలేదు.ఈ కథనాలకు ఇరవైఏళ్ళ తరువాత మేమూ , అదే విజయమహల్ గేట్ వీధిలో ఉన్నాం.గేటు కివతల ఆసుపత్రి పైకి మారేదాకా. రైలుకట్ట మీది పూరిళ్ళు, తాటాకు గుడిసెల బారు అప్పటికీ ఉన్నాయి. ఈ కథనాల్లోని వ్యక్తులు ఇరుగుపొరుగున తారసపడే ఉంటారు. అండర్ బ్రిడ్జ్ ను ఎప్పటికో గానీ నిర్మించలేదు. అందువలన , ఈ రచనలోని సంఘటనలు, మనుషులు కల్పనలు కావు ,వాస్తవాలని అనుకొంటున్నాను.
ఏమైనా, బాల్యస్మృతుల కాల్పనిక పాత్రలకు బుడుగు ప్రతిరూపమయితే, మిట్టూరోడి సినబ్బది చిన్నప్పటి జ్ఞాపకాలను చెప్పే వాస్తవ కథనాలని అనుకొంటాము. కథకు కల్పనకు నడుమ సూక్ష్మరిగిన వారు కాబట్టే,నామిని గారు తమ కథనాలను కథలకు బదులుగా కతలన్నారు. అయినా, తెలుగునాట చిన్నప్పటి జ్ఞాపకాలు కథలుగా చలామణీ అవుతున్నాయనుకోండి.అదివేరే విషయం.
బోడిగాడి తోట,యెద్దల రేవు,సల్లకాల్వ,సోర్నాల చెరువు, ఇరుగాలమ్మ దేవళం నుంచి సొతంత్ర పార్కు దాకా..ఈ కథనాల్లో పరుచుకొనిఉన్నాయి.
పారేసుకొన్న పావలా నేర్పిన వజ్రం తునక లాంటి జీవితపాఠం, ఆకలి రుచేకాదు కులమూ ఎరగదన్న వాస్తవాన్ని నేర్పిన లలితమ్మ హోటల్ స్థానంలోని కాపోల్లహోటల్, సోర్నాల చెరువుకాడ ఎగిరి పడ్డ పొట్టేలు తలను చూసిన జడుపు, తప్పిపోయి మూగవ్వ పంచన చేరిన చిన్నారి సునీల్,పాడెక్కి ఊరేగే పగటివేషగాడు రవణడు ..చిండబ్బులు చల్లించుకొంటూ చిద్విలాసంగా చేసిన ఆఖరి ఊరేగింపు, నలుగురు ఫకీర్లకు ఒకే ఒక బాలనాగమ్మ, ‘ఒరిడమ్మ బడవ ..ఇదేందిద! నేనేడా చూడలా!’ అనిపించే అనేక సంఘటనలు. ఎక్కడికక్కడ నెల్లూరు వాడుక భాష పలకరిస్తూంటే,ఎంతబావుందో! “అట్టా ఒంటిమీద దెబ్బలు కొట్టుకొంటుంటే,చాలా నొప్పి పుట్టదా నీకు ? ” అని అమాయకంగా అడిగే అమ్మాయి జీవితరహస్యాలను తను నేర్చుకొంటూ మనకు ఎలా నేర్పుతుందో ఎక్కడికక్కడ.
ఎప్పుడు ఊరిమీదకు విరుచుకు పడుతుందో తెలియని స్కై ల్యాబ్, సాంబమూర్తి గారి హరికథలు, శైలజ గారి పాటలు ..ఇలా ఆనాటి ఆవేదనలు ఆనందాలు, భయాలు సంకోచాలు, సంతోషాలు సంబరాలు ,అన్నిటినీ ఒక చోట కూర్చి, మన ముందుకు తెచ్చారు రోహిణిగారు. వారికి అనేక అభినందనలు.
ముఖ్యంగా, పెరుగుతోన్న పట్టణపు మెరుగుల్లో, రణగొణధ్వనుల హోరులో కనబడని వినబడని చిన్నచిన్న జీవన కథనాలను అందించినందుకు, కళ్లకు కట్టినట్టుగా చిత్రించి , వారందరినీ కనుమరుగవ్వకుండా పదిలపరిచినందుకు రోహిణి గారికి ధన్యవాదాలు.
చంద్రలత
12.1.2025