విమల సాహితి ఎడిటోరియల్ 63 – ఓటమి – గెలుపు

‘ఓటమి -, గెలుపు’. ఈ వారం విమల సాహితీ ఆన్లైన్ వారపత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపండి 🌹🙏

సహనా వవతు! సహనౌ భునక్తు! సహవీర్యం కరవావహై! తేజస్వినావధీతమస్తు! మావిద్విషావహై!

ప్రపంచంలో ఉన్న స్వేచ్ఛను, సమానత్వాన్ని, సంపదలను అందరం కలిసి అనుభవించాలి. అందరు కలిసిమెలిసి మానసిక వికాసాన్ని, చైతన్యాన్ని సాధించాలి. దేశ ప్రజలందరూ తేజోవంతులుగా ఒకరిపట్ల ఒకరు ప్రేమాభిమానాలు కలిగి ఉండి దేశ పరువు ప్రతిష్టలను, గౌరవ మర్యాదలను అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించేలా అందరూ ప్రవర్తించాలి. ఎవ్వరిపట్ల కూడా ద్వేషం, కుటిల రాజనీతి, వివక్ష చూపకుండా దేశ ప్రగతికి తోడ్పడి, విశ్వవిజేతలు కావడానికి అందరూ సమాయత్తం కావాలి.

ఇప్పుడెందుకీ శాంతి మంత్రం మనకి అంటే భారతీయ క్రీడా చరిత్రలో ఇంతవరకు ఎవరు ఊహించని సంఘటన చర్చాంశం అయింది. కేవలం వంద అంటే వంద గ్రాముల బరువు ఓ అసమాన ప్రతిభ గల మల్లయోధురాలిని ఆటలో పాల్గొనడానికి అనర్హురాలిని చేసింది. 2024 ఒలింపిక్ క్రీడలు పారిస్ లో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. వినేష్ ఫోగట్ అంతర్జాతీయ స్థాయిలో పేరు గడించిన రెజ్లర్. తను పుట్టిన గ్రామంలో సాధారణ క్రీడాకారిణి స్థాయి నుంచి పారిస్ ఒలింపిక్స్ లో సెమి ఫైనల్స్ చేరుకునే వరకు తన ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు, అవమానాలు ఎదురైనా అన్నింటినీ ఆత్మస్థయిర్యంతో ఎదుర్కొంది. మల్లయోధుల ఫోగట్ ల కుటుంబ నేపధ్యంతో చిన్నప్పటినుంచి పెద్దనాన్న మహావీర్ సింగ్ ఫోగట్ దగ్గర శిక్షణ పొందింది. సొంత గ్రామంలోనే వివక్ష ఎదుర్కొంది. మల్లయుద్ధం లాంటి క్రీడలు పురుషులకు మాత్రమే అనే అభిప్రాయంతో ఉండే తన గ్రామ ప్రజలకు తన విజయాలతో సమాధానం చెప్పింది. క్రీడలకు లింగ వివక్ష లేదు అని నిరూపించింది.

గ్రామ ప్రజల మనసులు చూరగొంది. ఇంట గెలిచింది. జాతీయ స్థాయిలో రెజ్లర్ గా ఎన్నో విజయాలు సాధించింది. ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డు, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు అందుకుంది. పద్మశ్రీ, లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డులకు నామినేట్ చేయబడింది. దృఢ సంకల్పంతో, నిరంతర సాధనతో ప్రతిభ గల రెజ్లర్ గా తనని తాను నిరూపించుకుంది. ఇటువంటి ఈ కుటుంబ స్ఫూర్తిదాయకమైన జీవన సమరంపై బాలీవుడ్ టాప్ హీరో అమీర్ ఖాన్ “దంగల్” అనే సినిమా తీసినప్పుడు కూడా భాషలకతీతంగా భారత చలనచిత్ర రంగంలో చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది ఈ సినిమా. అంతటి పేరు ప్రఖ్యాతులు గల కుటుంబ నేపథ్యం వీరిది. ఇదంతా ఒక కోణం అయితే మరోవైపు జాతీయ క్రీడా సమాఖ్యలో వివక్ష, బెదిరింపులు, లైంగిక వేధింపులకు పాల్బడిన అధికారులకు వ్యతిరేకంగా పోరాటం జరిపింది. మల్లయోధురాలిగానే కాదు పోరాట యోధురాలిగా నాయకత్వం వహించి పలువురి అసహనాన్ని ద్వేషాన్ని చవిచూసింది. జాతీయ స్థాయిలోనే కొన్ని దుష్ట మూకలు చేసిన అపవాదులు, తీవ్రమైన పదజాలంతో కూడిన విమర్శలను దైర్యంగా ఎదుర్కొంది. అయినా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగింది.

ఒలింపిక్ క్రీడల్లో పారిస్ చరిత్రలో బంగారు పతకాన్ని సాధించి భారత దేశపు కీర్తికిరీటంలో ఓ కలికితురాయిని నిలపాలనుకుంది. సెమీస్ లో వినేష్ క్యూబాకు చెందిన ‘యుస్నిలిస్ గుజ్మాన్ లోపెజ్’ పైన విజయం సాధించి, తన చారిత్రాత్మక పతకాన్ని ఖాయం చేసుకుంది. ఒలింపిక్ ఫైనల్ కి చేరుకున్న మొదటి భారతీయ మహిళా రెజ్లర్ గా నిలిచింది. ఇక ఫైనల్ పోటీ కోసం తన శక్తి వంచన లేకుండా శ్రమించింది. 50 కేజీల బరువు తరగతికి మారి ఎన్నో మానసిక, శారీరక సవాళ్లు ఎదుర్కొంది. ఒలింపిక్ క్రీడా నియమావళిని అనుసరించి, బరువు తగ్గడం కోసం రాత్రంతా స్కిప్పింగ్, జాగింగ్ లాంటివి చేసి, ఆహార నియమాలు పాటించింది. చివరి నిమిషంలో కేవలం వంద గ్రాముల బరువు ఎక్కువ ఉండడంవల్ల ఫైనల్ కి అర్హత కోల్పోయింది. ఇది చాల విచారించవలసిన సంఘటన. జరిగిన ఈ విస్మయ సంఘటన వెనుక ఏ కాల మహిమ ఉందొ, ఏ దుష్ట పరిస్థితులు ఆమె గెలుపుకి అడ్డుగా నిలిచాయో అనేది కాలం తేటతెల్లం చేయాల్సిన సత్యం.

‘తిలాపాపం తలా పిడికెడు’ అన్నట్లు వినేష్ ఫోగట్ అనర్హతకు కారణమైన ప్రతి పరిస్థితి, ప్రతిఒక్కరు అనగా కోచ్, న్యూట్రిషనిస్ట్ etc,.సమాధానం చెప్పే రోజు కూడా వస్తుంది. సామాజిక మాధ్యమాల్లో కొందరు వికృత మనస్కులు, దేశ ప్రగతి కోరుకునే సాహితీ కారులం అని చెప్పుకునే వారు కూడా వినేష్ ఫోగట్ మీద వ్యంగ్యపు వ్యాఖ్యానాలు చేస్తూ బురద చల్లడం గమనించవలసిన విషయం. కొన్ని దుష్ట శక్తులు ఆమె అనర్హత విషయానికి పైశాచిక ఆనందం పొందడం కూడా గమనార్హం. అయితే ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటి ఉంది. సిరివెన్నెల్ల సీతారామశాస్త్రి గారన్నట్లు “పసిడి పతకాల హారం కాదురా విజయ తీరం. ఆటనే మాటకార్ధం నిను నువ్వే గెలుచు యుద్ధం”. అలా చూస్తే వినేష్ ఫోగట్ తనని తాను ఎప్పుడో గెలిచింది. భారత ప్రజల హృదయాలను గెలుచుకుని ఆమె ఎప్పుడో విజేత అయింది. ఇప్పుడు ఆమె కొత్తగా కోల్పోయింది ఏమి లేదు.

జరిగిన పరిణామాలకు తీవ్ర నిరాశతో అంతర్జాతీయ క్రీడలకు వినేష్ ఫోగట్ రిటైర్మెంట్ ప్రకటించింది. అయితే ఆమె సిల్వర్ మెడల్ కోసం క్రీడా సమాఖ్యను ఆశ్రయయించింది. ఏం జరగనున్నది అనేది కాలమే నిర్ణయిస్తుంది. భారత దేశ క్రీడా లోకంలో గొప్ప ప్రతిభ గల రెజ్లర్ గా వినేష్ ఫోగట్ చరిత్రలో నిలిచిపోతుంది. తన ప్రతిభతో పోరాట స్ఫూర్తితో కోట్లాదిమంది హృదయాలను గెలుచుకున్న ఆమెకు దేశ ప్రజలు అనేకులు అనూహ్యమైన నైతిక మద్ధత్తును ఇస్తున్నారు. ఇంకా ఇంకా మేమున్నాం అనే భరోసా ఇవ్వాల్సిన సమయం ఇది.

రోహిణి వంజారి

సంపాదకీయం

11-8-2024