విమల సాహితి ఎడిటోరియల్ 57 – మేథావి – బికారి

మేథావి -బికారి. ఎవరు వీళ్ళిద్దరూ. ఈనాటి విమల సాహితీ పత్రిక లో నా సంపాదకీయ వ్యాసం చదవండి. మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి 🌹🌹

మహాప్రస్థాన సృష్టికర్త శ్రీ శ్రీ మరణాంతరం వారి సతీమణి ఇంట్లో జరుగుబాటులేక, శ్రీ శ్రీ గారికి వచ్చిన సర్టిఫికెట్స్, షీల్డ్ ఏదో పదిహేను వందల రూపాయలకు అమ్మకానికి పెట్టారట. ఎవరో అది చూసి “వాటి విలువ పదిహేను వందలు కాదమ్మా. ఎన్నో లక్షల రూపాయలు చేస్తాయి. అయినా డబ్బుతో కొలిచేవి కాదు. శ్రీ శ్రీ గారి మనోఫలకం పైనుంచి జాలువారిన ఆర్తనాదాలు. విప్లవ గీతికలు. నిస్రాణంగా వడలిపోయిన మనసులను చైతన్య పరచే రధచక్రాలు” అని శ్రీ శ్రీ గారి బహుమతులను భద్రపరచి, వారి సతీమణికి సాయం చేశారట.

సినీనటులు చిత్తూరు నాగయ్య గారు కూడా నటించే కాలంలో అందరికంటే ఎక్కువ పారితోషికం తీసుకుని,సకల సౌకర్యాలతో గొప్పగా బతికి, చేయికి ఎముక లేనంతగా సాయం చేసి, చివరి అవసానదశలో ఔషదాలు కొనుక్కోవడానికి కూడా చేతిలో డబ్బులు లేక, నా అనే దిక్కు

లేకుండా పోయిందట. గొప్ప బతుకును చూసిన మహానటి సావిత్రి కూడా చివరిదశలో డబ్బులు లేక, మందుకు బానిసై కన్నుమూశారని మనకి తెలుసు. సినీ నటులు, సాహిత్యకారులనే కాదు. ఏ రకమైన కళాకారుల జీవితాలను చూసినా అందరి బతుకులు పూల పాన్పులు కావు. అందరి జీవితాలు వడ్డించిన విస్తరులు కావు. పాఠకులకో, ప్రేక్షకులకో వినోదం అందించడానికో, వారికి సంతృప్తి కలిగించడానికో కళాకారులు ఎన్నో నిద్రలేని రాత్రులు మేధోమధనంతో శ్రమిస్తారు. అనుకున్న ఆకృతి మనసును సంతృప్తి కలిగించేవరకు నిరంతరం కార్యదీక్షలోనే తనమునకలై ఉంటారు. అటువంటి సాహితీ కారులు, ఇతర కళాకారులు కోరుకునేది ఏమిటి..! మంచి పేరునా? ధనాన్నా? పురస్కారాలనా?

సాహిత్యం పరంగా తీసుకుంటే, ఒకప్పుడు కుటుంబం, నాయికానాయకుల ప్రేమ, శృంగారం, వర్ణనలు ఇవే అప్పుడు పాఠకులను అమితంగా ఆకట్టుకున్న అంశాలు. కాలం బండరాయి కాదుకదా. అది ముందుకే తిరుగుతూ, మనుషుల ఆలోచనలను కూడా పురోగమనంలోకి తీసుకువెళ్ళింది. శృంగార, భావావేశ ఒరవడి స్థానంలో అస్తిత్వం, స్త్రీవాదం, బానిస బతుకులనుంచి విముక్తి, మూఢనమ్మకాలను గోతిలో తొక్కిపెట్టే ఆధునిక రచనా చైతన్యం సాహితీకారుల్లో కలిగింది. సాహితీ రంగం ఉత్కృష్టమైన స్థాయికి వెళ్లి, కొన్ని దశాబ్దాలపాటు కొనసాగింది. సాహితీ కారులకు కింది స్థాయి వెయ్యి రూపాయలనుంచి కథల పోటీలు, పురస్కారాలు అందించే సంస్థలతో పాటు, లక్షరూపాయల రివార్డు, పురస్కారాలు అందించే జాతీయ సంస్థలు, N.R.I. సంస్థలు కూడా ఇప్పుడు ఉన్నాయి మనకు. 80,90 దశాబ్దల్లో పత్రికా రంగానిది స్వర్ణయుగం అని చెప్పవచ్చు. అప్పుడు సోషల్ మీడియా అభివృద్ధి చెందలేదు. యూ ట్యూబ్ లేదు. పనికి మాలిన రీల్స్ లేవు. పోర్న్ అంటే ఏదో విదేశాల వాళ్ళు చూసేది. అటువంటి కాలంలో ఏకైక వినోద సాధనం పత్రికా రంగం. ప్రతి ఒక్కరి చేతిలో పత్రికలు ఉండేవి. జర్నలిస్టులు, రచయితలు, పాఠకులు, ముద్రణా సిబ్బంది తో పత్రికా కార్యాలయాలు కళకళలాడుతుండేవి. మరి ఇప్పుడు అరాకొర తప్ప పెద్ద పత్రికలు లేవు. ఆన్లైన్ పత్రికలు ఎంతమందికి చేరుతాయో తెలియదు. ఎవరి You Tube కుంపటి వారికి ఉండనే ఉంది. ఇక పత్రికలు చదివే పాఠకుల కంటే, కథలు, కవితలు రాసే రచయితల సంఖ్యే ఎక్కువవుతోంది. ఎవరి సమూహాల్లో వారు రాసుకుంటున్నారు. మరి కొందరు నాలుగు మాటలు నోటికి వచ్చినవి రాసి, అదే గొప్ప కవిత అని తమని తాము ప్రస్తుతించుకునే వాళ్ళు కూడా ఉన్నారు.

అయితే ఈ విపత్కర కాలంలో పత్రికా రంగం నుంచి తమ అస్తిత్వాన్ని, ఉపాధిని వెతుక్కుంటూ, టీవీ, సినీ రంగాలకు వలస పోతున్న మేధావి రచయితలు ఎంతమందో అవకాశాలకోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. వేరే ఇతర ఉపాధి లేకుండా కేవలం సాహిత్యం మీద మాత్రమే ఆధారపడే వాళ్ళు అయితే ఇప్పుడు చాల తక్కువ మంది ఉన్నారు. ఇక వెయ్యి రూపాయల పురస్కారం వచ్చినా ఏదో ఒక అవసరానికి ఉపయోగపడుతుంది అనుకునే సాహితీకారులు ఉన్నారు. లక్ష రూపాయలు వచ్చినా ‘నాకు పెద్దగా అవసరం లేదు. ఛారిటీకి ఇచ్చేస్తాను’ అనేవారు లేకపోలేదు. కాబట్టి ఇక్కడ డబ్బుకు విలువ కట్టకూడదు. మేధావి రచయితల రచనలు నలుగురిలోకి వెళ్ళాలి. నైతిక విలువలను వలువల్లా దిగజారుస్తున్న నేటి సమాజపు పోకడల బారి నుంచి యువతను కాపాడడానికి, మేధావి రచయితలు నడుంకట్టాలి. గొప్ప రచనలు చేసేవారు కోరుకునేది నిజంగా పాఠకుల నుంచి ఓ స్పందన. తమ రచన చదివిన వంద మందిలో ఒక్కరు ఆలోచించినా చాలు. ఆ రచయిత కష్టం నెరవేరినట్లే. సాహితీ రంగమే కాదు, మరి ఏ ఇతర కళా రంగమైనా కళా కారులు కోరుకునేది ప్రజలనుంచి చప్పట్లు, ప్రశంసలు, పురస్కార వేదికల పైన కప్పే శాలువాతో పాటు, కాసింత రివార్డు అందచేసినా చాలు, ఈ నెల గడిచిపోతుంది అనుకునే అల్ప సంతోష మేధావులు ఉన్న రోజులు ఇవి. సాహితీకారులను గౌరవిద్దాం. అవార్డు మరియు రివార్డులతో.

రోహిణి వంజారి

సంపాదకీయం

9000594630