మహారాజు

మహారాజు – ఓ మంచి తాగుబోతు. ఈ నెల కౌముది పత్రికలో ప్రచురితం అయిన నా బహుమతి కథ. సంపాదకులకు కృతఙ్ఞతలు. మహారాజు కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలపండి.

“రేయ్ ..రవనా ..లెగరా..బారెడు పొద్దెకుండాది, రేతిరి తాగింది ఇంకా దిగినట్టులేదు ఈడీకి” అనుకుంటా రవణడిని కుదిపాడు రిక్షాసుధాకర్. మొండి గోడ కింద పగటికి రాత్రికి తేడా తెలియని సుప్తావస్థలో పడుకున్న జీవిలాగా పక్కకి పొర్లాడు రవణడు కళ్ళు మూసుకొనే.
“తూ..ఎదవ నాయాలా..! నిన్ను నమ్ముకోని బంగారంటి రెడ్డోళ్ళ బాడిగిని నీకు అప్పచెప్తిని గదరా.. రవంత సేపట్లో జైరామి రెడ్డి కూతురు లతమ్మని బళ్ళో వదలాలి. లెగరా.. “
సుధాకర్ అరుపులకు కనురెప్పలు భారంగా తెరిచి, ఎండ కళ్ళల్లో పడేతలికి చెయ్యి కళ్లకడ్డంగా పెట్టుకున్నాడు వెలుతురుని చూడడం ఇష్టంలేని వాడిలా.
రిక్షా బండి సీటును గోడకానించి దానిమింద ఒళ్ళు తెలీకుండా పండుకోనుండాడు. తొడలపైకి చినిగిపోయి ఉండే ఖాకీ నిక్కరు, మురికిపట్టిన చిల్లుల బనీను. ఒళ్ళంతా మట్టి. లోకంలోని బీదరికమంతా వాడికాడనే ఉన్నట్లుండాది.
“తూ..నీ అవ్వా. నీకిట్టాకాదురా. చెప్తా ఉండు” అంటూ పక్కకి పోయినాడు సుధాకర్ . కరీముల్లా సాయిబు సైకిల్ షాప్ దగ్గర ఇస్మాయిల్ టైర్లను కడగతా ఉండాడు పంచరెసేదానికి. డీసులో ఉన్న నీళ్ళు నల్లగా ఉండాయి. చల్ల కాలవలోని మురికంతా కలిసినట్లు. డీసును రెండుచేతులతో ఎత్తుకొచ్చి, నీళ్ళను దబామని రవణడి నెత్తిన కుమ్మరించాడు. దెబ్బకు మత్తు వదిలి లెగిసి కూర్చున్నాడు రవణడు.
“బడికి పోయేదానికి టైమవతా ఉండాదిరా. తాగితే నీకు ఒళ్ళు తెలవదురా రవణా. బాడుక్కు పోకపోతే ఉండే ఈ ఒక్క ట్రిప్ కూడా నీకు లేకుండా పోతుంది. ఇకన నువ్వు తినేదేంది రా” రవణడి రెక్క పట్టుకొని ఈది కొళాయి కాడికి లాక్కపోయినాడు.
“ఇల్లు ఇల్లనియేవు, ఇల్లు నాదనియేవు..నీ ఇల్లు ఎక్కడే సిలకా” పాట పాడతా
“నాకు నువ్వుండావు గదరా సుధాకరా కూడు బెట్టేదానికి” లేచి నిలబడానికి ప్రయత్నం చేసి సుధాకర్ చేతుల్లో వాలిపోయాడు. కొళాయి కింద రవణడి ని కూలేసాడు సుధాకరుడు.
“ఈడీకి ఇప్పటికి తెల్లారిందా..ఒరే రవణా. ఇందా ఈ సబ్బిళ్ళ తీసుకో” అక్కడే గోచి పెట్టుకొని స్నానం చేస్తా ఉన్న చెంచురాముడు చిన్నలైబ్బాయ్ సబ్బు ముక్కని రవనడి చేతిలో పెట్టాడు పళ్ళు ఇకిలించి ఎర్రి నవ్వు నవ్వతా.
అదలాబదలా ఒళ్ళు రుద్దుకుని కొళాయి కింద తలపెట్టాడు రవణడు. ఎన్ని దినాలయిందో నీళ్ళుబోసుకొని, ఫ్యాక్టరీ గొట్టానికి అతుక్కున్న నల్లబూడిద వాన నీళ్ళకు కరిగి కాలవ కట్టినట్లు వాడి ఒంటి మీది మురికంతా కొళాయి నీళ్ళతో కలిసి వీధిలోకి పారింది.
సుధాకరుడు ఇచ్చిన తుండు గుడ్డ మొలకు చుట్టుకుని రిక్షా కాడికి పోయి సీటు కింద ఉన్న ఖాకీ చెడ్డి తొడుక్కున్నాడు. చిరుగులు పట్టి చివికిపోయిన పాత చెడ్డి చాయ జాలిగా చూసి “ఈ దినంతో మనిద్దరికీ ఋణం తీరిపోయిందే” అంటా కుప్పతొట్లోకి ఇసిరేసాడు. తడిసిన బనీను నీళ్ళుపిండి సత్తెయ్య అయివోరోళ్ళ ఇంటి మొండి గోడమీద ఎండకారేసాడు. ఆ మొండి గోడ కింది జానెడు తావు వాడి రాజాప్రస్థానం. ఎండైన, జడివానైనా, ఎముకలు కొరికే చలైనా ఆ తావు వదలడు వాడు.
“రేయ్ .. రవణా.. లతమ్మను బడి కాడ భద్రంగాదించి రారా ” జైరామి రెడ్డి వోల్ల పనోడు సుబ్బయ్య మాట ఇనపడంగానే వినయంగా సీటును తుడిచి, ఇదిలించి రిక్షాలో పెట్టి, “ఎక్కి కూర్చో పాపామ్మ”అన్నాడు. చెంగున ఎగిరి రిక్షాలో కూర్చుంది ఆ పిల్ల.
“రేయ్..ఒకటో తారీకు కదా ఈ రోజు. రెడ్డి నీకిమ్మన్నాడు” అంటా డబ్బులు రవణడి చేతిలో పెట్టాడు సుబ్బయ్య.
డబ్బులు చేతిలో పడంగానే రవణడి కళ్ళు పెట్రోమాక్స్ లైట్లమాదిరి వెలిగినాయి. ఇక చూస్కో..మేఘాల్లో పుష్పక విమానాన్ని తోలుతున్నట్లు రిక్షా బండిని స్వామిదాసు బడి తట్టు ఉరికించినాడు. లతమ్మని బడికాడ దిగబెట్టి వెనక్కి తిరుక్కున్నాడు.
యెద్దలరేవు సల్లకాల్వ బ్రిడ్జి మీదకి రాంగానే రిక్షాబండి దూకుడు తగ్గింది. బ్రిడ్జి కింద కాలవమీదికి వచ్చిండాడు సూరీడు. పై నీరు వెచ్చగా, లోపల జిల్లుగా ఉన్న కాల్వలో పిలకాయలు ఈత కొడతా ఉండారు. చిన్నప్పుడు తను కాలవల్లో ఈదులాడింది గావనానికొచ్చి, నవ్వుకుంటా బ్రిడ్జి దాటి రిక్షాని శీనయ్య పిండిమిల్లు దగ్గర పెట్టిన రవణడి కాళ్ళు అలవాటుగా చిట్టెమ్మ గుడిసెలోకి నడిచాయి. లోపల గోడ వారగా ఉన్న కుర్చీ మింద దిష్టిబొమ్మ మాదిరిగా చతికిలబడి గూర్చోని
“ఏరా రవణా..! రెడ్డి డబ్బులుగాని ఇచ్చినాడా ఎట్టా. మొకమట్టా వెలిగిపోతా ఉండాది” అని డబ్బులు లెక్క బెట్టుకుంటా “మీ చిట్టెమ్మా ” అంటా కేకేసినాడు ఆ ఎమ్మి మొగుడు తిరపతయ్య నశ్యం ముక్కుల్లో దోపి ఎగబీలుస్తా.
చిట్టెమ్మ తెచ్చిచ్చిన నాటుసారాయి సీసా దించకుండా ఎత్తి గటగటా తాగేశాడు రవనడు. కాయితం పొట్లంలో నాలుగు పులిబొంగరాలు, ఎర్ర కారం ఏసిచ్చింది చిట్టెమ్మ. పులిబొంగరానికి ఎర్రకారాన్ని అద్ది కసుక్కున కొరికాడు. రెండో సీసా తేవడానికి లోపలికెళ్లిన చిట్టెమ్మ ఇంకా రాలేదు. గుడిసె బైట ఎవురిదో ఆడమనిషి ఏడుపు ఇనొస్తా ఉండాది.
అంతా వాకిట్లోకి వొచ్చారు. రేవతమ్మ ఎన్నవలు బెట్టి ఏడస్తా ఉండాది.
“ఏంది రేవతమ్మా..ఆ వాటాన ఏడస్తా ఉండావు. మీ నాయనకి ఒళ్ళు బాగాలేదన్నారు. ఎప్పుడెట్టా ఉంది ” బైటికొచ్చిన చిట్టెమ్మ మాటకి ఎన్నవలు బెట్టి ఏడస్తా
“నాయిన చచ్చిపోయినాడు. రామచంద్రారెడ్డి ఆసుపత్రికాడ శవాల గదిలో పెట్టుండారు నాయిన శవాన్ని. స్మశానానికి తీసుకుపోయేదానికి ఎవురు సాయానికి రావడంలేదు” తలబాదుకుంటున్నది రేవతమ్మ.
“అయ్యో..రేవతమ్మా..నీ పెళ్ళి గాకుండానే మీ నాయన పోయినాడా. ఇప్పుడు ఆసుపత్రి కాడ మీ అబ్బయ్య అన్న ఒక్కడే ఉండాడా పాపం” చిట్టెమ్మనిట్టూరుస్తా రేవతిని పట్టుకుంది.
“అవును చిట్టెక్కా….నాయిన కాడ అందురూ సాయం పొందినవాళ్ళే. మా చిన్నాయన పిలకాయలు కూడా “నాయిన చచ్చిపోయాడని చెప్పి పంపిస్తే, ఊర్లో ఉండి కూడా ఎవురూ సాయానికి రావడం లేదు. సంగంలో ఎవురైనా సాయం చేస్తారని వొచ్చినాను” అంటా నేలమీద కూలబడిపోయింది పదహారేళ్ళ రేవతి.
తాగిన సారాయి మైకం వదిలిపోయింది రవణడికి .
“పద రేవతమ్మా.. ఆసుపత్రికాడికి నేనొస్తా ” అంటనే రిక్షాకాడికి పోయినాడు వాడు.
“రే ..రవణా..రవంతుండు రా” రెక్క పట్టి గుడిసెనక్కు లాక్కపోయినాడు సుధాకర్.
ఏంది మందల అన్నట్లు చూసాడు రవణడు రెక్క విడిపించుకుంటా
“ఆ పోస్టుమాస్టర్ సుబ్రమన్నెం అయివోరుకి అదేదో పిస్టుల్లా జబ్బంట. ముడ్డి దగ్గర తూట్లుపడి నెత్తురు,దొడ్డికి కలిసి బైటకి వస్తుండాయట” సుధాకర్ చెప్పగానే
“రే..సుబ్రమన్నేం అయివోరు బాగున్నాదినాల్లో ఎందురికి డబ్బు సాయం చేసాడో, ఎంత మంది పిలకాయలకి చదువు చెప్పించాడో తెలుసా నీకా. బీడీ కట్టలకి అడిగితే లేదంటాడు గానే..ఆకలంటే మాత్రం ఎన్నితూర్లు నాకు డబ్బులిచ్చాడో లెక్కేలేదు. అటువంటి అయివోరి శవం ఈ దినం దిక్కు మొక్కు లేకండా ఆసుపత్రిలో పడుంటే నాకు మనసొప్పడం లేదు రా సుదా..
“నీ అయ్యా..శవం నుంచి జబ్బు అంటుకుంటుందని అయినోళ్లు కూడా పాకుండా ముఖం చాటేస్తే నీకు బట్టిందా రా..” సుధాకరు అంటానే ఉండాడు
“తూ..ఏం బతుకులురా మనయి. ఆడకూతురు కట్టంలో ఏడస్తా ఉంటే, నేను తాగుపోతూ ఎదవనేగానీ, మానవత్వం లేకండా పోలేదురా. నాకెందుకని ఇదిలిచ్చుకోబోవడానికి నేను గొడ్డుని కాదురా..” అంటా గుడిసె ముందుకు ఇసురుగా వొచ్చి “రిక్షా ఎక్కు రేవతమ్మా..నీ కూడా నేనొస్తాను” అంటానే రిక్షా లాగాడు రవణడు.
“సరే పా రా. నేను కూడా వస్తా ” అంటూ రిక్షా ఎనకమాల నడుచుకుంటా పోయినాడు సుధాకరుడు వాడి నీడలా.
” పాపం ఆ రేవతమ్మకి రావాల్సిన కష్టం కాదిది. ఊరంతా నాదేనంటాడు ఈ రవనడు. ఈడీకి మాత్రం కొంప గోడు లేదు” సారాయి లోటాలో పోస్తా చిట్టెమ్మ.
“ఉన్న పెళ్ళాం రంగి బిడ్డనికనలేక సచ్చిపోయింది. ఈడీ బతుకు వీధిపాలైంది” అంటా నాస్తా కోసం లోపలి పోయినాడు చిట్టెమ్మ మొగుడు.
దిక్కులేనోడికి దేవుడే దిక్కు అన్నట్లు ఉన్నబంధువులంతా దూరంగా పోయిన సుబ్రహ్మణ్యం ఐవోరి అంతిమ యాత్రలో రవణడు, సుధాకర్లు ఆత్మబంధువులైనారు. అబ్బయ్య, సుధాకర్లు మార్చురీ నుంచి ఐవోరి శవాన్ని అతికష్టం మీద రిక్షా ఎక్కించారు. శవం నుంచి ముక్కులు పగలగొట్టే దుర్వాసన. “ఎన్నేళ్లు బతికినా, ఏమి సాధించినా మనిషికి చివరి ఇల్లు మాత్రం ఊరికి ఉత్తరాన ఆరడుగుల తావే” అన్నట్లు సుబ్రహ్మణ్యం ఐవోరి శవయాత్ర బోడిగాడి తోట చాయకి సాగిపోతుండాది.
కొరివి పెట్టే కొడుకు అబ్బయ్య రిక్షాలో, కన్నీళ్లు కారస్తా కూతురు రేవతమ్మ, సుధాకర్ రిక్షా ఎనక. ఓ జీవితానికి స్వస్తి వాక్యం రాలింది.
కాలగర్భం చాలా లోతైనది. ఎంతటి విషాదానైనా తనలో కలిపేసుకుని, ఏమి ఎరగనట్టు దూసుకుపోతూనే ఉండాది.
ఆస్వీయుజ మాసం. చిత్త కార్తె ఎండలు పిట్ట తల పగలగొడతాయి అన్నట్లు సూర్యుడు నిప్పులు చరగతా ఉండాడు. నవరాత్రులు మొదలైనాయి. దసరాలంటే రిక్షా వాళ్ళకి ఆటవిడుపు ఆ సెంటర్లో. రెక్కలు ముక్కలు చేసుకుంటూ, భుజాల గూళ్ళు అరగదీసుకుంటూ తొక్కే రిక్షాలను పక్కనపెట్టి దసరా వేషాలు గట్టే సమయం.
సుధాకర్, చెంచురాముడు, సీనడు, ఇస్మాయిల్, పుల్లయ్య అందురు వేషాలు గట్టేదానికి మల్లుకున్నారు. సుధాకర్, సీనడు ఆంజనేయస్వామి వేషాలు వేశారు. చెంచురాముడు ఆడవేషం వేసుకుని రికార్డు డాన్స్ వాళ్ళతో తిరుగుతున్నాడు. భారీ ఆకారంలో ఉండే ఇస్మాయిల్ మాయలఫకీరు వేషం వేసుకుని, ఓ కుక్కను సంపాదించి వీధుల్లో తిప్పతా ఉండాడు.
ఎవరేవేషం గట్టినా నా వేషం ఎప్పుడు మారదు అన్నట్లు తాగుబోతు రవణడు మొండిగోడ కింద పట్ట కప్పుకొని తాగుబోతు వేషంలో జీవిస్తా ఉండాడు. రెండు రోజులు గడిచాయి. దండుకున్న డబ్బులు మేకప్పుకు కూడా సరిపోలేదు ఎవురికి. అప్పుడు గుర్తుకు వచ్చింది వాళ్ళకి, ప్రతేడాది దసరాలప్పుడు రవణడిచేత ఎయించే శవమేషం. ఇక చూస్కో. అందరు ఉషారుగా సత్తెయ్య ఐవోరి మొండి గోడ చాయకి పోయినారు. ఊరంతా ఓ దారి అయితే ఉలిపికట్టదింకోదారని, సెంటర్లో అందురు దసరా పండగ సందడిలో ఉంటే రవణడు మాత్రం “లోకంతో నాకింకా పనియేముంది” అన్నట్లు ఎప్పటిలా మొండి గోడ కింద పడివున్నాడు ఒళ్ళు తెలవకుండా.
“రే తాగుపోతూ నాయాలా..లెగరా.. నవరాత్రుల్లో అందరు నాలుగు రూపాయలు సంపాదించుకుంటే, నువ్వు వొచ్చిన బాడిగ డబ్బులు మందుకు తగలేస్తా ఉండావు” కాలితో రవణడిని ఒక్క తన్నుతన్నాడు చెంచురాముడు, మొద్దు నిద్దర పోతున్న కుంభకర్ణుడి మీదకు పిల్ల వానరాలు బాణమేసినట్లు వాడు అంగుళం కూడా కదల్లేదు. “వీడు ఈ పొద్దు ఇక లేవడు కానీ పాడె కట్టండిరా సుధాకరా, రంగా ” అంటానే పక్కనే ఉండే కామాక్షమ్మ కట్టెల దొడ్డిలోకి పోయి, రెండు పొడుగు వెదురు బొంగులు నాలుగు అడ్డ కర్రలు తెచ్చి, పురికోస తాళ్లతో పాడె కట్టారు. దానిమీద మందుమత్తులో ఉన్న రవణడిని పండబెట్టి వాడు కదలకుండా బిర్రుగా చాంతాడుతో బిగిచ్చి కట్టారు. చెంచురాముడు రెడ్డోళ్ళ స్వర్ణమ్మని బతిమాలి అడిగి తెచ్చుకున్న గుడ్డలతో ఆడవేషం కట్టినాడు. “బులుగు రంగు సిల్కు కొక, ఎర్ర రంగు వెల్వెటు జాకిటు, సవరం పెట్టి అల్లిన జడతో ఉన్న చెంచురాముడిని చూసి , “అచ్చం జయసుధ మాదిరిగా ఉండావురా ” అని సుధాకరు వాడి జడలాగి ఎకసెక్యమాడాడు.
” మీ పాసుగాల. ఇక చాల్లెరా మీ ఎకసెక్కాలు, అంగళ్ళకాడ ఆడండి. పాండిరా యాదవల్లారా ” అన్నాడు రంగడు పాడె ఎత్తతా.
“రే..! అందరు పాడెని ఎత్తుకోండిరా” అంటానే సుధాకరు, సీనడు ఓ పక్క, రంగడు, ఇస్మాయిల్ ఇంకోపక్క పాడెని ఎత్తి “ఒరే రవణా..! అప్పుడే నీకు నూరేళ్లు నిండినాయిరా” అంటా అరుపులు, పెడబొబ్బలతో సెంటర్ లో ప్రతి అంగడికాడ పాడె దింపినారు.
చెంచురాముడు జుట్టు ఇరబోసుకొని “నన్ను అన్నాయం జేసి పోయినావు గదరా తాగుబోతు చచ్చినోడా” అంటా ఎన్నవలు పెట్టి ఏడస్తా ఉండాడు. సోడాల రావమ్మా అంగడి ముందర పాడెని దించారు. అందరు రవణడి మీద పడి ఎన్నవలు పెట్టి ఏడస్తా ఉండారు. “ఆపండిరా ఎదవల్లారా. పొద్దున్నే పాడు సంత. ఈ తూరి కూడా వాడిని బతకనీరా మీరా” అంటా సోడాల గ్యాస్ మిషన్ ఆపి రెండు రూపాయలు పాడె మీదికి ఇసిరేసింది సోడాల రావమ్మా. “ఐదు రూపాయలు అయినా ఇస్తావనుకున్నాను రావక్క” అన్నాడు చెంచురాముడు.
“మీ యెదవేశానికి ఇదే ఎక్కవ” తొందరగా ఈడ్నించి తీస్కపాండిరా” విసుక్కుంటా అంగట్లోకి పోయింది ఆమె.
పాడె ఎత్తుకొని సెంటర్లో ప్రతి అంగడికాడా దించడం. వాళ్ళు చీదరించుకుంటా డబ్బులు విసిరేయడం. ప్రతి ఏడాది మాదిరిగానే రైలుకట్ట దాటి చానా సందులు, గొందెలు తిరుక్కోని ట్రంక్ రోడ్ పక్కకి వొచ్చి కొత్తహాలు మీదుగా వొచ్చి రైలుకట్ట దాటి, బాగా పొద్దు పోయినాక విజయమహల్ సెంటర్ కి వొచ్చేసి, మొండిగోడ కింద పాడెని దించి, తాళ్లిప్పి రవణడిని లేపారు. అప్పటికి వాడికింకా మత్తు వదల్లేదు.
నెత్తిన, మొకాన నీళ్లు చల్లి లేపి కూర్చోబెట్టి, సుగుణమ్మని అడిగి తెచ్చిన మజ్జిగన్నం నోట్లో పెట్టాడు సుధాకర్. రెండు ముద్దలు తిని మళ్ళా మొండి గోడమీదికి తూలిపోయాడు రవణడు. అంతా అన్నాలు తిని, పొద్దునించి వొచ్చిన డబ్బులు లెక్కపెట్టారు. రోజు కంటే రెండొందలు ఎక్కువొచ్చాయి ఆ రోజు. అందరికి చానా సంబరమైంది. ఇక మిగిలిన నాలుగు దినాలు కూడా శవం వేషమే మంచి గిట్టుబాటు తమకి అనుకున్నారు .రవణడికి పీకల్దాకా మందు తాగించి, పాడెకి కట్టి నెత్తిన బెట్టుకొని నిప్పులు చెరిగే సూరీడితో పోటీ పడుతూ మూడు దినాలు నెల్లూరు వీధులన్నీ తిరుక్కున్నారు నాలుగు రూకల కోసరం.
ఆ రోజు దుర్గాష్టమి. సాయంత్రం దాకా రవణడిని వీధుల్లో తిప్పి ఇక వేషం ఆపేద్దామనుకున్నారు. మరుసటి రోజు విజయదశమికి రిక్షాలకు ఆయుధాలపూజ చేయాలనుకున్నారు. ఎప్పటి మాదిరిగానే ఉదయం రవణడికి సారాయి బాగా పట్టించారు. పాడెకి గట్టిగా కట్టేసారు.
ఎవురి మీదో తీర్చుకోవాలనుకున్న కసి, కోపాన్ని మనుషుల మీద తీర్చుకుంటున్నట్లు సూరీడు నిప్పుల కొలిమిలా మండుతున్నాడు. కనకమహల్ సెంటర్ కాడ పాడె దించి “బాబు ఐస్ క్రీం” అంగడి ముందర ఉండే సోడా బండి కాడ అందురూ గోలీసోడాలు తాగారు. పాడె మీది రవణడు మాత్రం కదలడానికి లేకండా కట్టేసి ఉన్న తాళ్ళ మధ్యన మత్తులో మునిగిపోయి ఉండాడు. వాడిని ఎవురూ లేపలేదు.
సోడాలు తాగి సేదదీరాక “పాండిరా..ఈ రోజే వేషాలకి ఆఖరు. రేపట్నుంచి రిక్షాలు లాగాల్సిందే” అంటా పాడె ఎత్తుకున్నాడు సుధాకరుడు.
పొద్దననుంచి సందేళదాకా ఎండలో పాడె మోస్తూ గొందెలన్నీ తిరిగారు. అందరి కాళ్ళు తీపులెక్కి ఉండాయి .పొద్దుపోయినాక చీకటీగలు ముసిరేవేళకి అందురూ మొండి గోడ కాడికొచ్చి పాడె దించి కూలబడ్డారు. కిష్టయ్యస్వామి చిల్లర బంకు నుంచి పులిబొంగరాలు, ఎర్ర కారం పొట్లం కట్టించుకొనొచ్చాడు పోలయ్య. ఈది కొళాయి కాడ కాళ్ళు, చేతులు కడుక్కొనొచ్చి తలా ఓ పులిబొంగరం అందుకున్నారు. ఎర్ర కారం అద్ది పులిబొంగరాన్నికొరకబోయాడు చెంచురాముడు. అంతలోనే గుర్తొచ్చినట్లు, ” ఉండరా..! రవణడిని కూడా లేపుదాం. వోడు పొద్దన నుంచి ఏమి తినింది లా ” అంటా రవణడిని పట్టుకుని కుదిపాడు.
“రే రవణా..లేగారా.. ఈ పొద్దుతో నీ వేషం అయిపోయింది. లేచి పులిబొంగరాలు తిందుగాని ” తాళ్ళు ఇప్పుతూ చెంచురాముడు.
“తాగుబోతు నాయాలా. లేగారా ” పాడిని ఒక్క తోపు తోసాడు రంగడు. ఉహు.. రవణడు లేస్తేనా.. ఉలుకు పలుకు, ఉ.. ఉప్పు రాయి. ఏమి లేదు వాడి నుంచి. సైకిల్ షాపులో టైర్లు కడుగుతున్న ఇస్మాయిల్ బొక్కెనతో నీళ్లు తెచ్చి కుమ్మరించాడు. అన్ని నీళ్ళు ఒంటిమీద పడ్డా చలనం లేదు వాడిలో. నిట్రాడి కర్ర మాదిరి బిగసకపోయి ఉండాడు. అప్పుడొచ్చింది అందరికి అనుమానం.
గబగబా మొత్తం తాళ్ళని ఇప్పేసారు. “ఓరే రవణా..లెగరా.. నీ పీనిగ వేషానికి దండిగా డబ్బులొచ్చినాయిరా. ఇంకో మూడు నెల్లు దుడ్డుకు దిగుల్లేదురా మనకు. బిన్నా లేగారా” పట్టుకోని ఉపేస్తా ఉండాడు చెంచురాముడు ఏడస్తా.
వీళ్ళ అరుపులకి వీధిలో జనాలంతా చుట్టూ జనాలు మూగారు. మిద్దెల మీది నుంచి మొండిగోడ దగ్గరి వింత చూస్తా ఉండారు.
వాణ్ణి తట్టి లేపారు, కొట్టి లేపారు, బూతులు తిట్టి లేపారు. ఎవరేం చేసినా కిమ్మనకుండా పాడె మీద పడుండాడు వాడు. వాళ్లందరికీ తన పీనిగ వేషంతో డబ్బులు సంపాదించి ఇచ్చి తనకి మాత్రం శాశ్వతంగా పీనిగ అవడం ఇష్టం అన్నట్లు వాడు ఆ సందేళ ఆ పాడె మీద శవం వేషంలో నటించడం మానేసాడు.
సీనడు తల బాదుకుంటా ఏడ్చాడు. రవణడి మీద పడి గగ్గోలు పెట్టాడు రంగడు. చొక్కా చింపుకొని మొత్తుకున్నాడు సుధాకరు. మట్టి నేలమీద పడి పొర్లుతూ ఎన్నవలు పెట్టాడు ఆడమనిషి వేషంలో ఉన్న చెంచురాముడు.
మొండి గోడ ఇంటి సత్తెయ్య, ఆయన పెళ్ళాం ఆదెమ్మ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు. సైకిల్ షాప్ ఇస్మాయిల్ పడిపడి ఏడ్చాడు. చుట్టూ చేరిన జనం కళ్ళ నీళ్ళు తుడుచుకున్నారు. మిద్దెలమీది జనం నిశ్శబ్దంగా కళ్ళు ఒత్తుకున్నారు.
రవణడు శవమైనాడన్న వార్త క్షణాల్లో ఊరంతా పాక్కుంటూ పోయింది. సోడాల రావమ్మా ఏడస్తా అందరికి లైమ్ జ్యూస్ సీసాలు ఇచ్చింది. అప్పయ్య సన్నాయి తీసుకుని వొచ్చి మంగలి మేళంపాట విషాదంగా ఊదాడు. యెద్దలరేవు సంఘం నించి మునెయ్య వోళ్ళు తప్పేట్లు తెచ్చి కొట్టారు. ఏనాది సంఘం నించి పెంచెలయ్య వోళ్లొచ్చి పలకలు కొట్టారు. మాలాడ నించి నారయ్య వొచ్చి డప్పు కొట్టాడు.
సాయిబాబా గుడి పూజారి చలమయ్య వొచ్చి పంచ పాత్రలో తులసీ దళాలు ఏసిన నీళ్ళను రవణడి నోరు తెరిపించి ఉద్ధరిణతో నోట్లో ఏసాడు. సైకిల్ షాప్ కరీముల్లా వొచ్చి నమాజ్ చదివాడు. క్యాసెట్ల అంగడి జాన్ వొచ్చి ఏడస్తా ప్రార్ధన చేసాడు.
ఆ నవరాత్రి దినాల్లో, ఆ రోజు ఆ సందేళ, ఆ సెంటర్లో, ఆ మొండిగోడ కింద విషాదం కారుమేఘాల్లా కమ్ముకుంది.
వారం రోజులుగా రవణడిని శవం వేషంలో ఊరంతా తిప్పిన పాడె ఆ రోజు వాడి పీనిగని మోయలేనంటూ కన్నీరు కార్చింది. పై నుంచి చూస్తున్న ఆకాశానికి కూడా ఏడుపు వచ్చింది. జలజలా వర్షపు నీటిని కిందికి కార్చింది.
రవణడు ఆ సెంటర్లో పెట్టని కోటలాంటి వాడు. మొండిగోడ కింది తావు వాడి సామ్రాజ్యం. అందరి తలలో నాలుక వాడు. పిలిస్తే పలికే మాట సాయం వాడు. చేత సాయం వాడు. పిలవకున్నా వొచ్చి చేసే సాయం వాడు. ఎదుటోడి కష్టం తన కష్టంగానే చూసేవాడు. రవణడి పేరు ముందు తాగుబోతు అనే బిరుదు కలవాడు. అందరి బంధువు వాడు. ఆ సెంటర్లో అందరి మనసులు గెలుచుకున్న మహారాజ వాడు.
ఆ గోధూళి వేళ, ఆ మసక చీకటి వేళ, దీపాలు పెట్టేవేళ, ఆ వర్షంలో కన్నీరు కలిసేవేళ, వారం రోజులుగా ఊరంతా వాడిని తిప్పిన పాడె మీదే, సన్నాయి వాయింపులతో, పలకల చప్పుళ్లతో, డప్పుల మోతలతో, పిలకాయల చిందులతో పదిమంది చేతులు వేసి మోస్తున్న పాడే మీద, దారి పొడుగునా బంతిపూలు, చిండబ్బులు చల్లించుకుంటూ, రవణడు కదిలాడు పల్లకిలో ఊరేగే మహరాజులా. ఎప్పుడూ పోని కొత్త తోవ వైపు, బోడిగాడి తోట దిక్కుకు, మాహాప్రస్థానమనే రాజకోటకు..