అక్కా, చెల్లి, తల్లి, కొడుకు..ఎవరైతే ఏం. మన సుఖానికి అడ్డువస్తే ఏసైడమే. అనుబంధమా..తొక్క..ఇలా మారుతున్న మానవ సంబంధాలు. దిగజారిన నైతిక విలువలు. విమల సాహితి పత్రికలో నేను రాసిన ఎడిటోరియల్ ఆర్టికల్ చదవండి.
సాధారణ పరిభాషలో కుటుంబం అంటే అమ్మ,నాన్న,అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, అవ్వ, తాత, అత్తలు, మామలు, పిన్నమ్మలు, పెద్దనాన్నలు. వీరు కాకుండా స్నేహితులు, ఇరుగు,పొరుగు. ఒక్క కుటుంబంలోనే సామాజిక బంధాలన్నీ ప్రతిఫలిస్తాయి. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు చెదిరిపోకుండా కాపాడే దృఢమైన పునాదులు ప్రేమ, అనురాగాలు. పెద్దలను గౌరవించుకోవడానికి ఫాథర్స్ డే అని, మదర్స్ డే అని జరుపుకుంటూ, కనీసం సంవత్సరానికి ఒకసారైనా కుటుంబ సభ్యులు అందరు కలుసుకుని ఆప్యాయతలను కలబోసుకోవడం మనం గతంలో చూసాం. సోదర,సోదరీమణుల అనురాగానికి ప్రతీకగా ఈ మధ్యనే రాఖీ పౌర్ణిమ పండుగ వచ్చింది. వెళ్ళింది.
ఇప్పుడు ఈ దశాబ్దంలో మానవ సంబంధాలన్నీ పలుచబడి, చివరకు మాయమై పోయి, మనిషి నెత్తి మీదకి స్వార్ధం ఇనుప కాళ్ళతో ఎక్కి చిందులు వేస్తోంది. క్రీస్తు చెప్పిన త్యాగం, కృష్ణుడు బోధించిన ప్రేమతత్వం, బుద్ధుడు నేర్పిన శాంతి ఇప్పుడు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి నేటి మనుషులకు. విప్లవాత్మకంగా అభివృద్ధి చెందిన సోషల్ మీడియా ప్రభావం మనిషి మెదడును విచక్షణ కోల్పోయేలా చేస్తోంది. అరచేతిలో ప్రపంచం. ఒక్క చూపుడు వేలు కదుపుతుంటే చాలు. పోర్న్, క్రైమ్, హరాస్మెంట్. ఏది కావాలన్నా క్షణాల్లో ప్రత్యక్షం అవుతుంది సెల్ ఫోన్ స్క్రీన్ పైన. మరోపక్క విజ్ఞానం, మంచి ఉన్నా, చెడు ఆకర్షించినంత వేగంగా, చెడు వ్యాపించినంతగా మంచి మనుషులను చేరుకోలేదు. ఫలితం స్వార్ధం. కరోనా వచ్చి పోయినా స్వార్ధపు ఆలోచనల వైరస్ మనుషుల మనసులపై నిరంతరం దాడి చేసి, ప్రతి మనిషి తన చుట్టూ తానే ఐసోలేషన్ చట్రాన్ని బిగించుకుంటున్నాడు. ఇక బంధాలకు ఆవగింజకున్నంత విలువ లేదు. నేను బాగుండాలి అనే స్థాయి నుంచి నేనే బాగుండాలి అనే సంకుచిత దిగుడు మెట్లలో పడి , బుద్ధి పాతాళంలోకి చేరుకుంటోంది. ఇది మరింత పతనం కాకుండా ఉండాలంటే నైతిక విలువలతో కూడిన చదువులు చిన్నతనం నుంచే అబ్బాలి. ప్రభుత్వాలు కూడా కుల మత ప్రాంత భాషా ద్వేషాలను వదలి, పేర్లకు పకీర్లకు పుకార్లకు ఇచ్చే అనవసర ప్రాధాన్యతను మరచి కొత్త తరాలను నీతి న్యాయాలనే నిచ్చెనపై నిలువుగా నిలబెట్టే ఆలోచనలకు సానబెట్టాలి. విశ్వ సమాన మానవత్వ భావనలను వారి మెదళ్లలో నాటే ప్రయత్నం చేయాలి
ఒక పక్క మనిషి విజ్ఞానం తో ఎగసి ఎగసి చంద్ర మండలం పైకి చేరుకుంటుంటే, ఇంకోపక్క స్వార్ధం మనిషిని పతనానికి చేరుస్తోంది. సమాజంలో ఇటీవల జరిగిన ఘోరాలను చూస్తుంటే మానవజాతిని అంతం అయ్యే ముసలమేదో పుట్టినట్లు కనిపిస్తోంది. కులం, మతం,జాతి, ప్రాంతాల మధ్య విద్వేషాలతో దేశం అట్టుడికి పోయి, ఇంకా ఆ భయ విహ్వలత నుంచి బయట పడక ముందే మరిన్ని ఘోరాలు నేరాలు. ఈసారి జరిగింది సొంత కుటుంబ సభ్యులమధ్య. ఇటీవల కరీంనగర్ దగ్గర జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ అక్కా,చెల్లి. వారి మధ్య తోడబుట్టిన బంధం పటాపంచలై గాలికి ఎగిరిపోయింది. చెల్లి ఒకరిని ప్రేమించింది. పెళ్ళికి ఇంట్లోవాళ్ళు ఒప్పుకోలేదని, ఇంట్లో ఉన్న నగలు, సొమ్ములు మూటగట్టి ప్రియుడితో కలిసి పక్కాగా ప్రణాళికతో ఊడాయించాలనుకుంది. అడ్డు వచ్చిన అక్కను ప్రియుడి సాయంతో హతమార్చింది. తప్పించుకోవాలని నాటకాలు ఆడింది. నిరువుగప్పిన నిజం గుప్పుమని మండింది. అక్కను చంపిన చెల్లిగా కళంకిత అయింది. అనుబంధాలు మరచి సోదరిని చంపిన చెల్లిని స్వార్ధం, నేర ప్రవృత్తి, కాముకత్వం అన్ని కలగలిసి పతనం చేశాయి.
ఇంకో చోట కన్న తల్లి. పేగు బంధాన్ని మరచింది. కొడుకు తాగుతూ, తిరుగుతూ, తప్పు చేస్తుంటే, కన్న తల్లిగా బిడ్డను మందలించాలి. బుద్ధి చెప్పాలి. అప్పటికీ మారకుంటే చట్టానికి అప్పచెప్పాలి. కానీ పేగు బంధాన్ని మరచి నవమాసాలు మోసి కనిన కొడుకుని హతమార్చింది ఓ తల్లి. చెడ్డ తండ్రో, చెడ్డ స్నేహితుడో ఎవరో ఒకరు ఉంటారు.కానీ చెడ్డ తల్లులు కూడా ఉంటారని ఆమె నిరూపించింది. ఇక ఆస్తి కోసం అయినవాళ్లను అంతం చేసే నీచులు ఎందరో ఉన్నారు సమాజములో.
“సత్యం వద – ధర్మం చర” అనే పవిత్ర నానుడి మారిపోయి నేడు “సత్యం వధ-ధర్మం చెర” గా రూపాంతరం చెందుతోంది. ఎంత వేదనా భరితం ఈ పరిస్థితులు. మళ్ళీ మనుషుల్లో ప్రేమ, సత్యం, త్యాగం, శాంతి కలగాలంటే మరోసారి కృష్ణ భగవానుడో, క్రీస్తు ప్రభువో, బుద్ధుడో మళ్ళీ మానవులుగా పుట్టాలి. ప్రేమ తత్వాన్ని వాళ్ళు భోదించాలి. ప్రపంచ శాంతిని, మనుషుల్లో మానవత్వాన్ని పెంపొందించడానికి ప్రతి మనిషి ఓ దైవం కావాలి. మనిషి మనిషికి బంధం పెరగాలి. ఎదుటి మనుషుల్లోనే దేవున్ని చూడాలి. చివరగా ప్రఖ్యాత కవి, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సినారె గారు రాసిన ఒక పేరొందిన గజల్ కవితలోని ఒక వాక్యం ఉటంకించి ముగిస్తాను
“పరుల కోసం పాటు పడని నరుని బ్రతుకు దేనికని
మూగ నేలకు నీరందనివ్వని వాగు పరుగు దేనికని”
రోహిణి వంజారి
సంపాదకీయం
9000594630