బాపనోళ్ళ పిల్ల…ముత్తరాసి యానాది పిలగోడు

రేపు “వాలెంటైన్స్ డే” కదా. ప్రేమికుల దినోత్సవం. మరి ప్రేమంటే వలపా..?ఆకర్షణ..?ఒకరివెనుక ఒకరు తిరగడమా..? గిఫ్ట్స్ ఇచ్చుకుంటూ, హోటల్స్, పార్కుల వెంట తిరగడమా..? ఆసిడ్ దాడా..? హత్యో, ఆత్మహత్యో చేసుకోవడమా..? ఏం చేస్తున్నారు ఇప్పటి ప్రేమికులు..? కానీ ప్రేమంటే కాలం ఎంత మారినా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎంత దూరంగా ఉన్నా అనుక్షణం నీ వెంటే నేను, నీ తోడుగా నేను, నీ నీడగా నేను, నీ సంతోషమే నేను కోరుకునేది అనే భరోసా జీవితాంతం కలిగించడం.మొత్తంగా ప్రేమంటే ఇవ్వడమే..
దాదాపు 35 ఏళ్ళ క్రితం నాకు ఊహ తెలిసిన తర్వాత నేను చూసినా మొదటి ప్రేమ కథ ఇది. ఆ వలపుల దృశ్య కావ్యం, లేత పాల కంకి లాంటి పచ్చి జ్ఞాపకాలు ఇంకా నా కళ్ళ ముందర కదలాడుతూనే ఉన్నాయి. మా పద్మ, శ్రీనివాసులు అన్నల జంట అపురూపమైన అనురాగపు జంట. నిచ్చన మెట్ల కుల సమాజంలో,పెద్దలను ఒప్పించి, తమ ప్రేమను పండించుకుని ,ప్రేమంటే తాము ఆనందాన్ని పుచ్చుకోవడమే కాదు, తమ కుటుంబానికి, సమాజానికి కూడా ప్రేమను అందివ్వడమే అని నిరూపించిన అపురూపమైన జంట.
కులాంతర వివాహం చేసుకున్నా, ఏ రోజు ఒకరినొకరు అగౌరవ పరచుకోలేదు. ఒకరి అలవాట్లను మరొకరు గౌరవించుకుంటూ ఒకరిలోఒకరు మమేకం అయినారు. పెళ్ళి అయిన తర్వాత మా శ్రీనివాసులు అన్న మద్రాసులో మెడికల్ పరిశ్రమ స్థాపించి, అంచెలంచెలుగా ఎదిగి, కోట్లు సంపాదించి, గొప్ప అభివృద్ధిని సాధించి కులమతాలకు అతీతంగా ఎన్నో వందల మందికి తమ ఫ్యాక్టరీ ద్వారా ఉపాధి కల్పించారు మా పద్మ,శ్రీనివాసులు అన్న. చక్కని సంతానం. కానీ అన్నీ బాగున్నాయి అనుకున్న తరుణంలో విధివశాత్తు మా శ్రీనివాసులు అన్న ట్రైన్ ఆక్సిడెంట్ లో మరణించడం మేము తట్టుకోలేని విషాదం. ఈ “బాపనోల్ల పిల్ల..ముత్తరాశి యానాది పిలగోడు” మా పద్మ,శ్రీనివాసులు అన్నజంటకు అంకితం. మా శ్రీనివాసులు అన్నకి కన్నీటి నివాళి.
నేను పసితనంలో చూసిన అపురూపమైన ప్రేమ జంట వారు.🌹🌹💖💖

సాయంత్రం ఐదు గంటలైంది. రవంత ఎండి , రవంత బంగారం కలిసిన రంగులో మెరస్తా ఉన్న ఆకాశంలో పొద్దప్ప పశ్చిమం తట్టుకి మెల్లమెల్లగా తిగతా ఉండాడు. అప్పుడే సన్నగా వాన తూర కూడా పడతా ఉండాది
మిద్దిమెట్టు మీద కూర్చొని పులుసటుకులు తింటా ” ఐ..! ఎండ వాన ఒకటే తూరి ..కుక్కల,నక్కల పెళ్ళి. భలే భలే ” అనుకుంటా ఉండాను.
” మీ బుజ్జమ్మా.. జేమ్స్ గార్డెన్కు పోతా ఉండాను. వస్తావా నువ్వా” చెక్క తలుపు అవతల నుంచే అరిచింది శమంతకమణి అత్త ఎరుపు రంగు సంచి చేతిలో పట్టుకుని.
పులుసటుకుల సిబ్బిరేకుని కొళాయి కాడ అంట్లల్లో పార్నూకి చేతికైనా నూనెని గౌనుకి తుడిచేసుకుని” మొ ..నేను పిన్నమ్మతో జేమ్స్ గార్డెన్ కి పోతా ఉండా” అంటా వాకిట్లోకి ఉరికినా. ఇద్దురం కలిసి జేమ్స్ గార్డెన్ తట్టుకి పోయేదానికి మళ్ళినాము.
మా అమ్మకి చిన్నన్న కిష్టమామ భార్య శమంతకమణి అత్త. అమ్మ తర్వాత నా మీద అమ్మంత ప్రేమ చూపించేది ఆమె. అందుకే ఆమెను ఓ తూరి అత్త అని మరోతూరి పిన్నమ్మ అని నోటికేదొస్తే అలా పిలస్తా నేను.
ముదురాకుపచ్చ రంగు పెయింట్ వేసి ఉన్న పెద్ద గ్రిల్స్ గేటు తీసుకుని ఇంట్లోకి పోయినం నేను, అత్త. మమ్మలిని చూస్తానే ” ఏమే సమంతకం! బాగుండారా ? బుజ్జమ్మని కూడా తీసుకొచ్చావా? ” ప్రశ్నలడగతానే మంచినీళ్ళు ఇచ్చింది లీల పెద్దమ్మ. పత్తితో దీపం ఒత్తులు చేస్తున్న ఆదిలక్ష్మమ్మ అవ్వ మా అత్త గొంతు వినగానే దేవుడింట్లోనించి హాల్లోకి వొచ్చి అత్తతో మాటల్లో పడింది. పద్మక్క స్నానానికి పోయిందట.
నేను తుర్రుమని వరండాలోకి వొచ్చిన. వరండా పక్కన పందిరికి అల్లుకుని పరిమళాలు గుబాళిస్తున్న సన్నజాజి పూలను, చెట్టు నిండా పూచి ఉన్న పాల రోజా పూలను తనివి తీరా చూసి, మిద్దమెట్లమీదకి పరిగెత్తినా. సగం మెట్లు ఎక్కి మలుపు తిరిగే చోట కాస్త ఎత్తులోనే అరిటాకు పచ్చ రంగులో జామ కాయలు గుత్తులుగా ఏలాడతా ఊరిస్తా ఔపడినాయి. కాసేపు మిద్ది మెట్లకు ఉన్న చేపట్టు గోడమీద పార్కులో జారుడు బల్లమీద జారినట్లు జారి, జామ కాయలకోసం చేయి చాపినా. ఉహు.. అందితే కదా. కాయలు ఎట్టా కోయలా అని ఆలోచిస్తా ఉండాను.
మిద్ది పైనుంచి ” పాపా బుజ్జి ” అంటా పిలిచాడు శ్రీనివాసులన్న. మిద్దిపైన ఉన్న రూములో బాడుకకు ఉంటాడు. ఏదో మందుల కంపెనీలో మెడికల్ రెప్రజెంటేటివ్ గా పని చేస్తా ఉండాడు శీనన్న.
ఏంటి అన్నట్లు కళ్ళు ఎగరేసాను నేను.
” జామకాయలు నీకు అందడం లేదు కదా. నేను కోసి ఇవ్వనా ” అన్నాడు కొమ్మ అందుకుని
అంతకంటే భాగ్యమా అనుకుని ” అవును శీనన్నా! నాకు అందడం లేదు. నువ్వు కోసీవా ” చేతులు చాపి బతిమిలాడినట్లు అడిగాను
కొమ్మలను కిందికి వంచి నాలుగు దోర జామకాయలను కోసిచ్చాడు. అప్పుడే ఓ కాయను కసుక్కున కొరికి తింటన్నా నేను. అబ్బా ! దోర కాయ ఎంత రుచిగా ఉండాదో. మిగిలిన కాయల్ని గౌను జేబులో పెట్టుకుని మిద్ది దిగి కిందికి వస్తా ఉంటే ” పాపా బుజ్జి.. “మళ్ళా పిలిచాడు శీనన్న.
ఈ తూరి దేనికి పిలిచాడో అన్నట్లు చూసినా అన్న చాయ. “ఈ చీటీని మీ పద్మక్కకి ఇవా ” అంటా మడిచిన కాగితాన్ని నా చేతిలో పెట్టాడు శీనన్న. ఏం రాసి ఉండాదన్నా చీటీలో అని అడగబోయి, అడిగితే ఈ తూరి కాయలు కోసీడని గమ్మున చీటీని చేతిలో మడిచి పెట్టుకుని ఇంట్లోకి పోయినా.
అమ్మణ్ణి పెద్దమ్మ రవ్వ లడ్డు తెచ్చి ఇచ్చింది తినమని. ముంతమామిడి పప్పు ఏసి ఉన్న రవ్వలడ్డు చూడగానే నోరూరింది నాకు. ఇక్కడకు వస్తేనే నాకు ముంతమామిడి పప్పు దొరికేది. అవి రేటు జాస్తి అని నాయన కొనడు. రవ్వ లడ్డు తొందరగా అయిపోతాదని నాక్కుంటా, చూసుకుంటా రవ్వంత రవ్వంత కొరికి తింటా ఉండాను
పద్మక్క తలకు స్నానం చేసి వచ్చింది. పచ్చ రంగు పావడా, జాకిట్టు, ఎరుపు రంగు పైట ఏసుకొని నడుం కిందిదాకా ఉన్న జుట్టును తుండుగుడ్డతో తడి తుడుచుకుంటా ఉంటే అక్క ఎంత బాగుండాదో.
“అకా..నువ్వట్టా తల దువ్వుకుంటా ఉంటే అచ్చం హీరోయిన్ సుహాసిని మాదిరిగా ఉండావు” అన్నాను అక్క చాయనే చూస్తా.
నా మాటలకు ముద్ద దాసాని పువ్వు విరబూసినట్లు నవ్వింది పద్మక్క.
అప్పుడు గుర్తుకు వచ్చింది మిద్దిపైన శీనన్న ఇచ్చిన చీటీ. అక్క అమ్మిడికి పోయి “పద్నక్కా..! మిద్దిపైన శీనన్న నీకు ఈ చీటీ ఇమ్మన్నాడు” అంటా గౌను జోబీలో మడిచి పెట్టుకున్న చీటీ తీసి పద్మక్కకి ఇచ్చాను. అప్పుడే గేటు తలుపు నెట్టుకోని లక్ష్మయ్య పెద్దనాన్న ఇంట్లోకి వస్తా ఉండాడు ఇంత పెద్ద కూరగాయల సంచి మోసుకుంటా.
పద్నక్క కంగారుగా నా చేతిలో నుంచి చీటీ లాక్కుని స్నానాల దొడ్డిలోకి పరుగెత్తింది. పద్మక్కకి అంత కంగారెందుకో నాకు అర్ధం కాలేదు. కొంపదీసి అది కాని లవ్ లెటర్ నా అని అనుమానం వొచ్చింది నాకు. నేను పద్మక్కకి తెచ్చియిచ్చానని తెలిస్తే నా దుంప తెగుతుంది దేవుడో అని బయపడుకుంటా ఉండాను.
లీల పెద్దమ్మ, శమంతకమణి అత్త, ఆదిలక్ష్మమ్మవ్వ ఆమాట, ఈమాట మాట్లాడుకుంటావుండారు. అమ్మణ్ణి పెద్దమ్మ వంట చేస్తా ఉండాది.
నేను కాలు కాలిన పిల్లి మాదిరిగా చెట్లల్లో తిరగతా ఉండాను. కాలు గెంట తర్వాత ” మీ బుజ్జమ్మ.. ఇంటికి పోదాం లోపలకు రా ” అత్త గట్టిగా అరిచింది
ఇంతలో సందుపక్క నుంచి పద్మక్క గబగబా నా కాడికి వొచ్చి తను కూడా ఓ మడిచిన కాగితాన్ని నా చేతిలో పెట్టి ” బుజ్జి..ఈ చీటీని మిద్దిపైకి పోయి శీనన్నకు ఇచ్చిరా. నీకు ఇంకో రవ్వ లడ్డు ఇస్తాను. పాలరోజా పూలన్నీ నీకు కోసిస్తా ” అనింది. అబ్బా ఈ రోజు నాకు జామకాయలు, రోజాపూలు డబుల్ ధమాకా అనుకున్నా. మళ్ళా ఏం జరుగుతుందో అని భయం ఓ తట్టు. మెల్లగా మిద్దిపైకి పోయి రూంలో ఉన్న సీనన్నకి చీటీ ఇచ్చాను.
” థాంక్స్ బుజ్జి” అంటా అన్న నవ్వతా చీటీ తీసుకున్నాడు.
అప్పుడు శీనన్న మొఖంలోకి పరీక్షగా చూసాను. కాస్త చామన ఛాయా, ఒత్తైనక్రాఫు తో పొడుగ్గా చూడగానే చాల అందంగా ఉండాడు అన్న ” అనిపించింది నాకు.
ఇంటికి పోదాం రమ్మని శమంతక అత్త మళ్ళా కేకేసింది. సంచినిండా కూరగాయలు, పండ్లతో అత్త, రవ్వలడ్డు, జామకాయలు, పాల రోజా పూలు ఉన్న ప్లాస్టిక్ కవర్ తో నేను మా విజయమహల్ సెంటర్ దారి పట్టినం.
సినిమాల్లో హీరో హీరోయిన్ చీటీల్లో ప్రేమలేఖలు రాసుకుని ఒకరికొకరు ఇచ్చుకున్నట్లు పద్మక్క, శీనన్న కూడా లవ్ లెటర్స్ రాసుకుంటున్నారేమో! అంటే వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారా! ఇద్దరు బాగుంటారు. వాళ్ళ ఇద్దరికి పెళ్లి అయితే ఎంత బాగుంటుంది.
“నా కళ్ళు చెపుతున్నాయి నిను ప్రేమించానని” పాటని వాళ్లిద్దరూ పాడుకుంటున్నట్లు ఊహించుకుంటా అత్త చేయి పట్టుకుని నడస్తా ఉన్నా నేను.
మేము ప్రేమ పక్షులం.ఎప్పుడూ ఎగిరిపోతూనే ఉంటాం అంటా పదిరోజులు ఎనక్కి చూడకుండా ఎగురుకుంటా పోయినాయి.
ఉన్న పళంగా రమ్మని శమంతకత్తని పిల్చకపోయేదానికి రిక్షాతో సహా మునుస్వామి వొచ్చాడు ఇంటికాడికి. తోకంబడి నారాయణ మాదిరి రిక్షా ఎక్కి అత్త పక్కన నేను కూడా కూర్చున్నాను.
రిక్షా దిగి అదలా బదలా ఇంట్లోకి ఉరికింది అత్త ఏమైందోనని. ఎనకే నేను. ఇల్లంతా నిశబ్దంగా ఉండాది. హాల్లో, పనుకునే రూములో, వంటింట్లో కూడా ఎవురు అవపడలేదు మాకు. ఎవురికి ఏమైందో తెలియడం లేదు. ఏం జరిగిందోనని అని బిత్తరగా ఉండాది మాకు. సందుపక్కకి పోయినం.
ఆడ లీల పెద్దమ్మ, అమ్మణ్ణి పెద్దమ్మ ఓ తట్టు, లక్ష్మయ్య పెద్దనాయన, ఆదిలక్షమవ్వ ఇంకో తట్టు కూర్చొని ఉండారు. మమ్మలిని చూడగానే లీల పెద్దమ్మ ఎన్నవలు పెట్టి ఏడుపు ఎత్తుకున్నాది. పెద్దనాయన కత్తివాటుకి నెత్తురు చుక్క రాలనట్లు ముఖం గంటు పెట్టుకుని ఉండాడు. మమ్మలిని చూస్తానే ” మీ సమంతకమా ! వచ్చావా ? మన పద్మ ఎంత పని చేసిందో చూసావా” అనింది అమ్మణ్ణి పెద్దమ్మ.
మాకు ఏం అర్ధం కాలేదు. “పద్మకు ఏం అయింది వదినా ” గాబరాగా లీల పెద్దమ్మ చేతులు పట్టుకుని అడిగింది అత్త. లీల పెద్దమ్మ చీర కొంగు మరిగింత గట్టిగా చుట్టి కళ్ళు ఒత్తుకుంది.
” దాన్నెందుకు అడుగుతావే.. అద అట్టా ఒంటికి కొవ్వు పట్టి పోవడానికి వీళ్ళే కారణమైతే” ఇంట్లో అందరి మీద ఉన్న కోపాన్ని అంతా ముఖంలో చూపిస్తా అనింది ఆదిలక్ష్మవ్వ ఒక్కాకు చిన్న స్టీలి రోట్లో ఏసి దంచతా.
పద్మక్కకి ఏమైందో అని మాకు దడగా ఉండాది. ” అనా..పద్మకి ఏమైంది ” భయంగా అనింది అత్త.
పెద్దనాయన బెల్లం కొట్టిన రాయిలా ఉలక్కుండా, పలక్కుండా గమ్మున తలవంచుకొని ఉండాడు. వాడేందుకు చెప్తాడే..! ఎవురు, ఏంది మందల కనుక్కోకుండా రొక్కం దండిగా వస్తుందని ఎవరికి పడితే వారికి రూము బాడుగకు ఈబాకురా అని నెత్తి, నోరు కొట్టుకుని మొత్తుకుంటే, ముసిలి ముండని నా మాట ఎవురు విన్నారని. ఇప్పుడు పద్మ ఆ ముత్తరాసి యానాది వాడితో లేచిపోయింది ” అనింది ఆదిలక్ష్మవ్వ పెద్దగా అరస్తా.
ఆ మాటతో పిడుగు పడ్డట్టు ఉలిక్కి పడతా పెద్దనాయన చాయ చూసింది శమంతకత్త.
నాకు గుండెల్లో దడ పుట్టింది. ఆ రోజు శీనన్న, పద్మక్కకి మధ్య చీటీల రాయభారం నడిపింది నేను అని కానీ వీళ్ళకి తెలిస్తే నా పని గోవిందా గోవిందా. ఏదో సరదాకి చీటీలు ఇచ్చుకున్నారు అనుకున్నాను కానీ వాళ్ళు ఇలా చేస్తారనుకోలేదు. తేలు కుట్టిన దొంగలా నిమ్మకున్నాను.
“అన్న..! ఏందిది..నిజమా” నమ్మలేని భయం గొలిపే నిజాన్ని విన్నట్లు అత్త ముఖం వంకరలు పోయింది.
” ఇంకా నిజమా అంటావేందే.. అది లేచి పోయి రెండు దినాలు అవతా ఉండాది . కూరగాయల మార్కెట్లో అందరికీ తెలిసిపోయింది. బందువులకు కూడా ఇక తెలిసిపోతుంది. ఇప్పటికే ఊర్లో గుసగుసలు మొదలైనాయిట. ఉన్న పరువు ఊడిపోయింది” చేతులు ఊపుతా తన అక్కసు అంతా బయట పెడుతోంది ఆదిలక్ష్మవ్వ.
” మీరు ఊరుకోండి అత్తమ్మ. మొదులే పిల్ల చేసిన పనికి మేము బాధ పడుతుంటే ఎందుకు అట్లా దెప్పిపొడుస్తావు” బాధగా అందరికీ కాఫీ అందిస్తా అనింది అమ్మణ్ణి పెద్దమ్మ. భర్త చనిపోయాక పిల్లలు లేని ఆమె చెల్లి, మరిది ఇంటి నీడన చేరింది. ఇంటి బాధ్యతని నెత్తికెత్తుకుంది.
” ఆ.. నా మాటలు అట్లానే ఉంటాయే. అది చేసిన పాడుపనికి దాన్ని తెచ్చి చంపిపారేయకుండా, అది పెళ్లి చేసుకున్నాం అని వీడికి కబురు పెట్టడం, వీడు వాళ్ళని ఇంటికి ఆహ్వానించడం. ఇదిగో లక్ష్మణా.. నేను ముందే చెప్తా ఉండాను. ఇప్పటికే ఈ ఇంటి పరువు మట్టి గొట్టుకుపోయింది. ఇంకా ఆ ముత్తరాసి యానాది వాడిని ఇంటికి తెచ్చి అల్లుడు అంటా ఇంట్లో పెట్టుకున్నావంటే నేను ఊరిపోసుకుని చచ్చిపోతాను.” శోకాలు శాపనార్ధాలుగా మారి ఆదిలక్ష్మవ్వ కాస్తా రుద్రకాళమ్మగా మారింది.
” ఆ పని చేయి. పీడా వదిలిపోతుంది ” గట్టిగా అరిచి ముఖం చేతుల్లో దాచుకుని వలవలా ఏడస్తా ఉండాడు లక్ష్మణ పెద్దనాన్న. ఆయన ఏడవడం చూసి అందరూ ఏడవడం మొదలు పెట్టారు.
ఏం జరుగుతుందో అని నాకు భయం భయంగా ఉండాది.
శమంతక అత్త కొంచం తేరుకుని ” అన్నా..! మీరంతా ఇట్టా దిగాలు పడితే ఎట్ట చెప్పా.. నువ్వు అమ్మ మాటలు పట్టించుకోబాక. తెలిసో తెలియకో ఆ అమ్మి పొరపాటు చేసింది. అట్టని కన్నబిడ్డని వదులుకుంటామా. నీకు కొడుకైనా, కూతురైనా ఆ ఎమ్మే కదా. నీ ఆస్తికి వారసురాలు పద్మ. కులం,మతం, వర్ణ సంకరం అని ఆ పిల్లను దూరం చేసుకోకుండా పద్మని, అల్లుడిని ఇంటికి తెచ్చుకోండి నా మాటిని” అనింది పెద్దనాన్న గడ్డం పట్టుకుని బతిమాలతా.
“అది ఇంట్లోకి వస్తే నేను ఇక్కడ ఉండను. మన బ్రాహ్మల్లో చెడబుట్టింది అది. ఆ ముత్తరాసి వాడు కోడిగుడ్లు, మాంసాలు తింటాడు. ఇక మన బంధువులు అందరూ మనల్ని వెలేస్తారు ” మళ్ళా ఎత్తుకుంది అవ్వ.
” ఉండక పొతే నీ ఇష్టం వొచ్చిన చోటికి పో.. పద్మని, అల్లుడిని ఇంటికి రమ్మంటాను. నేనే అందరినీ వెలేస్తాను. నాకు నా కూతురు సంతోషం తప్ప ఇంకేం వొద్దు ” చెల్లెలు సమంతకం ఇచ్చిన భరోసాతో స్థిర నిర్ణయము తీసుకున్న వాడిలా పెద్దనాన్న లేచి హాల్లోకి పోయి కొక్కేనికి తగిలిచ్చి ఉన్న చొక్కాని వేసుకుని వీధి గేటు తలుపు తీసి బయటకు వెళ్ళాడు.
వారం తర్వాత ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటున్నాం రమ్మని కబురు పంపాడు లక్ష్మయ్య పెదనాయన.
ఈ తూరి అత్త, నాతో పాటు మా అమ్మ కూడా బయలుదేరింది పద్మక్క వాళ్ళ ఇంటికి టెంకాయ, అరటిపళ్ళు, కదంబం పూలు ,రవికల గుడ్డ, పసుపు, కుంకుమ పొట్లాలు తీసుకుని.
పద్మక్క, శీనన్నల పెళ్లి అయి వాళ్ళు ఇంటికి వచ్చిన వేళా విశేషమేమో కానీ వాళ్ళు కులాంతర వివాహం చేసుకున్నారని కొందరు నొచ్చుకున్నా వ్రతం చెడ్డా ఫలం దక్కిందన్నట్లు నెల తిరిగేలోగా శీనన్న చేసే మందుల వ్యాపారం బాగా పుంజుకుని మద్రాసులో దండిగా డబ్బు పెట్టి పెద్ద ఫార్మాస్యూటికల్ ఫ్యాక్టరీని పెట్టాడు. తాము బాగుపడి ఎంతో మందికి తమ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు ఇప్పించారు కులం కన్నా గుణం మిన్న అని నిరూపించిన మంచి మనసున్న మా పద్మక్క, శీనన్న.

12 thoughts on “బాపనోళ్ళ పిల్ల…ముత్తరాసి యానాది పిలగోడు”

  1. కళ్ళ ముందు జరిగిన వృత్తాంతాన్ని అనుభవంతో చెప్పారు. నిజానికి ప్రేమ అంటే ఏమిటో ఆ ప్రేమ లేఖల్లో నే ఉంటుంది. ఆనాటి ప్రేమ పదం కూడా అపురూపమైంది.

  2. విరించి

    నెల్లూరు మాండలికంలో వాస్తవ సంఘటనల ఆధారంగా చక్కటి సందేశాన్ని ఇస్తూ రాసిన కథ “బాపనోల్ల పిల్ల…..” చాలా బాగుంది…ఎన్నో ఉత్తమ కథలు రచించిన రోహిణి గారి కలం నుంచి మరిన్ని మంచి కథలు రావాలని కోరుకుంటున్నాను..రోహిణి గారికి అభినందనలు.

    1. వంజారి రోహిణి

      ధన్యవాదాలు సర్. మీ ప్రోత్సాహం ఎల్లప్పుడూ అవసరం నాకు.

  3. బాగుంది,,, ఎదురు గా చెప్పిన ట్లు, విన్నట్లు,,,, బాగా చెప్పారు మేడం

  4. Dr. Sreedevi Sreekanth

    ఉత్తమ కథా రచయిత్రి వంజరి రోహిణి గారి కథ, కథనం చాలా ఆసక్తిగా ఉన్నాయి. నెల్లూరి స్నేహితులు ఉండేవారు నేను చెన్నైలో ఉండగ. Dialect చాలా బాగా రాశారు. అలాగే చెన్నై లో స్థిర పడ్డ తెలుగు వారి యాస కూడా కథలో అక్కడక్కడా కనిపించింది. పాత్రలు చైతన్యం గా కథలాడినాయి.
    కథ చాలా ఆసక్తి తో చదివించింది. సజీవ పాత్రల తో సంభాషణల నేర్పు, కూర్పు కథ అందాన్ని ఇనుమడింప చేసింది. రచయిత్రి మరెన్నో కథలు రాయాలని, విజయాన్ని కైవసం చేసుకోవాలని ఆశీర్వదిస్తూ..అభినందనలు. డా. శ్రీదేవీ శ్రీకాంత్. బోట్స్వానా.

    1. వంజారి రోహిణి

      చాలా చాలా ధన్యవాదాలు శ్రీదేవి మేడం గారు. మీ ప్రోత్సాహం ఎల్లప్పుడూ నాకు అవసరం 🙏🙏

  5. పెమ్మరాజు విజయ రామచంద్ర

    కథలో సంఘటనని రోహిణి గారు మీరు కళ్లకు కట్టినట్లు చూపించారు. నెల్లూరి యాస కథకి వన్నె తెచ్చింది. మీ నుంచి మరిన్ని మంచి కథలు రావాలని కోరుకుంటున్నాను

    1. వంజారి రోహిణి

      హృదయపూర్వక ధన్యవాదాలు సర్ 🙏

  6. Rachapalem Raghu

    ” మీ బుజ్జమ్మ ” = ” మే బుజ్జమ్మ ! ” అని ఉండాలి
    సరిచేయండి మిత్రమా
    Excellent Story
    Wonderful Naration
    కథనం నడిపిన తీరు బహు గొప్పగా సింపుల్ గా ఉంది.
    శీనయ్య చనిపోవడం చాలా చాలా విషాదం

Comments are closed.