నాన్న కోరిక

శుభోదయం. ఈ వారం సినీవాలి ఆన్లైన్ వారపత్రిక లో నేను వ్రాసిన కథ “నాన్న కోరిక” ప్రచురితం అయింది. సినీవాలి పత్రిక సంపాదకులు గౌరవనీయులు డా.శ్రీ ప్రభాకర్ జైనీ గారికి ధన్యవాదాలతో. మరి నాన్న కోరిక ఏమిటో తెలియాలంటే ఈ కథని చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలుపగకోరుతూ…

పొద్దున ఐదున్నరకే గంటకొట్టినట్టు మెలకువ వచ్చేసింది సత్యనారాయణయ్యకు. మసక మసకగా కనిపిస్తున్న ఎర్రటి బెడ్ లైట్ వెలుగులోనే తడుముకుంటూ అడుగులు వేసి ఎదురుగా గోడకు గట్టి పురికొస తాడుతో వ్రేలాడదీసిన బాబా పటాన్ని రెండుచేతులతో తడిమి కళ్ళకద్దుకున్నాడు. పక్కనే పటంలో ఉన్న అయన భార్య ఆదిలక్ష్మి పావలా కాసంత ఎర్రటి బొట్టుతో ముఖం నిండా నవ్వు పులుముకుని ” ఏమండీ.. లేచేసారా..! కాఫీ తెస్తా ఉండండి ” అని తనని పలకరించినట్లై పటం వంక ఓ నిముషం చూసి ” నన్ను ఒంటరిని చేసి వెళ్ళి నువ్వు అంత హాయిగా ఎలా నవ్వుతున్నావ్ లక్ష్మీ” అనుకుని దీర్ఘంగా నిట్టూర్చి మళ్ళీ వచ్చి మంచమ్మీద కూర్చున్నాడు. పొడి దగ్గు వచ్చింది. వెంటనే బెడ్ రూమ్ తలుపు తీసి బయటకు వచ్చింది దేవి. ఆయన కోడలు. ” మామయ్య.. ఇంకాసేపు పడుకోకూడదా” కాస్త ముఖంలో విసుకు తొంగిచూస్తుండగా వంటింట్లోకి వెళ్ళింది ఆమె.
ఆమె వెనుకే గదిలోనుంచి బయటకు వచ్చిన మోహన్ ” నాన్న మరి ఇంత చీకటితోనే లేచి నువ్వు ఏం చెయ్యాలని” అంటూనే హాలు తలుపు తెరిచి బయటకు చూసాడు. అప్పుడే కింద నించి గుండ్రంగా మడిచి రబ్బరుబ్యాండ్ వేసి ఉన్న పేపర్ని సైకిల్ దిగకుండానే గురిచూసి మిద్దె మీదకు విసిరాడు పేపర్ అబ్బాయి రమేష్. పేపర్ సరిగ్గా వచ్చి మోహన్ ముందు పడింది. ఒక్క రోజు కూడా ఆ పేపర్ గురి తప్పి పక్కకు పడదు. పేపర్ కి ఉన్న రబ్బర్ బ్యాండ్ తీసి కిటికిలో పెట్టి హాల్లో మంచం మీద పేపర్ పెట్టి తండ్రి పక్కనే కూర్చున్నాడు మోహన్. ఫిల్టర్లో వేసిన నిర్మలా కాఫీ పొడి డికాషన్ చుక్క చుక్కచిక్కగా దిగుతోంది. ఫిల్టరుకి మూత పెట్టలేదు దేవి. ఆ కమ్మటి కాఫీ డికాషన్ పరిమళం వంటింటి నుంచి విస్తరిస్తూ వచ్చి హాల్లో ఉన్న తండ్రి,కొడుకుల ముక్కుపుటాలను కమ్మగా తాకింది. ” పొద్దునే మెలుకువ వచ్చేసింది రా..! ఇక పడుకుంటే దగ్గు వస్తుందని లేచేసాను” పక్కన కూర్చున్న కొడుకు వంక ఆపేక్షగా చూసాడు ఆయన .” సరేలే నాన్న.. ఎన్ని సార్లు చెప్పినా నువ్వు వినవుగా. దేవి కాఫీ పెడుతోంది. పళ్ళు తోముకుందువు కానీ లే ” అంటూ బాత్రూముకి తండ్రిని తీసుకెళ్లాడు మోహన్.
పొద్దున లేస్తూనే పొగలు కక్కే కాఫీ తాగడం అలవాటు సత్యనారాయణయ్యకు. భార్య లక్ష్మీ బతికున్నంత వరకు తనకంటే ముందే లేచి తను లేవగానే కాఫీ తెచ్చిఇచ్చేది. ఇప్పుడు తను లేచిన అరగంటకు కానీ కొడుకు, కోడలు లేవరు. మనవళ్ళు ఏ ఎనిమిదికో కానీ లేవరు. కాలం తెచ్చిన మార్పులు అంగీకరించలేక, అనుసరించక తప్పని కాలం ఆయనది. ముంచుకొచ్చిన ముదిమి కాలం.
తీరికగా కాఫీ తాగారు తండ్రి, కొడుకులు ఇద్దరు. ఆ కాసేపే వాళ్ళు ఇద్దరు కలిసుండేది. ఇక రోజంతా ఎవరికి వారే యమునా తీరే. ఎవరి లోకం వారిది. ” నాన్న.. మరి ఈ పేపర్ చదువుతూ ఉండు. నేను రైతు బజార్ వెళ్ళి కూరగాయలు తెస్తాను. వచ్చాక నీకు స్నానం చేయిస్తాను. సరేనా” అన్న కొడుకు మాటలకు ‘రాముడు మంచి బాలుడు ‘ అన్నట్లు తల ఊపాడు ఆయన. యూరియా సంచి తీసుకుని మెట్లు దిగబోతున్నవాడల్లా ” అబ్బయ్యా..” అన్న తండ్రి పిలుపుతో కాస్త విసుగ్గా ఏమిటన్నట్లు చూసాడు. ” రెండు రోజుల్లో ఒకటో తారీకు వస్తుంది కదా. నన్ను బ్యాంకు కు తీసుకువెళతావు కదా” పసిబిడ్డ తాయిలం అడిగినంత ఆశగా కొడుకు వంక చూస్తూ అడిగాడు సత్యనారాయణయ్య.
” నాన్న..మొదలుపెట్టావా..? ఇంకా అడగలేదేమా అనుకున్నా..! వారం నుంచి చెప్తున్నావ్ ఇదే మాట. తీసుకువెళ్తాలే. పేపర్ చదువుకో. లేదంటే ఈ రోజు బేస్తవారం కదా బాబా పాటలు వస్తాయి. దేవిని టీవీ పెట్టమని చూడు ” తండ్రి వంక చూడకుండానే మెట్లుదిగి సైకిల్ తాళం తీసి కూరగాయల మార్కెట్ వైపు సైకిల్ ని మళ్ళించాడు మోహన్.
సత్యనారాయణయ్య బి.ఎడ్. కళాశాల గ్రంథాలయ ఉద్యోగిగా పనిచేసి రిటైర్ అయినాడు. పదవీ విరమణ చేసి దాదాపు పదేళ్ళు అయింది. ఇంటి నుంచి నాలుగు మైళ్ళ దూరంలో ఉండే కాలేజికి ఒక్కనాడు కూడా రిక్షాలో వెళ్ళి ఎరుగడు. సైకిల్ తొక్కడం రాదు. రిటైర్ అయ్యే రోజువరకు తన రెండు కాళ్ళ వాహనంలో నడిచి వెళ్ళడమే ఆయన ఆరోగ్య రహస్యం అనేవారు అప్పుడందరూ. ఇంటి నుంచి కాలేజీకి వెళ్ళితే, మళ్ళీ కాలేజీ అయినాక ఇంటికి రావడం, సాయంత్రం బాబా గుడికి వెళ్ళడం, దారిలో ఎదురుపడి కనపడినవారిని చిరునవ్వుతో పలకరించడం, ఇంటికివచ్చి భోజనం చేయడం, టీవిలో వార్తలు చూసి తొమ్మిదిన్నరకు నిద్రకుపక్రమించడం. దాదాపు ప్రతిరోజూ ఇదే క్రమం తప్పని ఆయన దినచర్య. వచ్చే చిరు జీతంతో సర్దుకుని, తమ అవసరాలు తగ్గించుకుని మరి మోహన్ చదువు కోసం పొదుపు చేసేవారు సత్యనారాయణయ్య దంపతులు.
“అమ్మా దేవి.. కాస్త టీవీ పెట్టివెళ్ళమ్మా” గట్టిగా అరిచాననుకున్నాడు కానీ ఆయన స్వరం హాలు దాటి పోలేదు. కానీ కోడలు దేవికి వినపడింది. “మిక్సీలో చట్నీ వేయాలి. ఇడ్లి పెట్టాలి. కాస్త లేచి టీవీ స్విచ్ వేసుకోకూడదా మామయ్య”. విసుగ్గా టీవీ స్విచ్ వేసి గబా గబా వంటింట్లోకి వెళ్ళింది దేవి. నిర్లిప్తంగా నిట్టూర్చాడు ఆయన.
***
కాలేజీ గ్రంథాలయాన్ని నిశ్శబ్ధ దేవాలయంగా భావించేవాడు ఆయన. విద్యార్థులు, ఆఫీస్ స్టాఫ్, అధ్యాపకులు ప్రతిఒక్కరికి ఎప్పుడో ఒకప్పుడు గ్రంథాలయం లో పుస్తకాలతో అవసరం ఏర్పడుతుంది. రోజులో ఎవరో ఒకరు అక్కడికి వస్తూనే ఉంటారు. సత్యనారాయణయ్య ఎంతో ఓపిక తో వాళ్ళు అడిగిన పుస్తకాలతో పాటు, కొన్ని చిరునవ్వులు వాళ్ళకి అదనంగా ఇచ్చేవాడు. తను ఎక్కువ మాట్లాడేవాడు కాదు. కానీ ఎదుటి వారు చెప్పే విషయాలు ఆప్యాయంగా వినేవాడు. అందరు ఆయన్ని సత్యం సార్ అనేవాళ్ళు.
అర్ధరాత్రి నిద్రలేపి పలానా టి.ఎస్. రామారావు గారు రాసిన సైకాలజీ పుస్తకం ఎక్కడ ఉంది అని అడిగితే ” లైబ్రరీలో కుడి పక్క ఐదవ రాక్ లో మూడో వరుసలో ఉన్న ఏడో పుస్తకం అదే ” అని టక్కున చెప్పే పరిజ్ఞానం ఆయనది. కాలేజీలో స్టాఫ్ మొత్తానికి చాల మంచి వాడు, ఒక్కరిని పల్లెత్తి మాట అనని వాడు ఎవరు అంటే “సత్యం” సార్ అని అందరు ముక్తకంఠంతో చెప్తారు. సంవత్సరం మొత్తంలో ఒక్కసారికూడా సెలవు పెట్టి ఎరగడు ఆయన. ఎప్పుడో ఓ సారి ఒంట్లో నలతగా ఉందని, డాక్టర్ విశ్రాంతి తీసుకోమన్నాడని సెలవు పెడితే సాయంత్రానికి కాలేజీ నుంచి ప్రిన్సిపాల్ మేడం శశికళ, ఫీలాసఫీ మేడం శారదా, ఆఫీస్ గుమస్తా వేమాలయ్య తో సహా ఇంకొందరు లెక్చరర్లు పళ్ళు పట్టుకుని ఇంటికి వచ్చేసారు. ఆ రోజులు గుర్తుకు వచ్చి పెదాలమీద ఓ నవ్వు మొగ్గ మొలిచి మాయమైంది ఆయనకు.
***
” లే.. నాన్న.. స్నానం చేస్తువు కానీ” అంటూ మోహన్ పిలవడంతో నెమ్మదిగా స్నానం కానిచ్చాడు. దేవి పళ్ళెంలో ఇడ్లీలు, చెట్ని వేసి తెచ్చి ఇచ్చింది. మోహన్ గబా గబా తినేసి కోర్టుకి టైం అయింది అంటూ వెళ్ళిపోయాడు. మనవళ్ళు ఇద్దరు రెడీ అయి స్కూలుకి వెళ్ళిపోయారు. టైలరు దగ్గరికి వెళ్ళి వస్తా నంటూ దేవి కూడా బైటకు వెళ్ళింది. ఇడ్లీలు ఎంత నెమ్మదిగా తిన్నా చెట్ని కారానికి తెరలు తెరలుగా దగ్గు వచ్చి పొరపొయింది సత్యనారాయణయ్యకి.
” అయ్యో.. పొరపొయిందా..నీళ్ళు తాగండి. కాస్త నెమ్మదిగా తినండి” అంటూ కంగారుగా చూస్తూ తన తల మీద చిన్నగా తట్టే తన భార్య లక్ష్మి గుర్తుకువచ్చింది ఆ క్షణంలో ఆయనకు. పొరపొయినందుకో, భార్య గుర్తుకు వచ్చినందుకు ఏమో కానీ ఆయన రెండు కళ్ళ నిండా నీళ్ళు నిండాయి. ఇక తినలేక కాస్త నీళ్ళు తాగి పళ్ళెంలోనే చేయి కడిగేసి మంచం కింద పెట్టాడు పళ్ళేన్ని. ఐదు నిముషాలకు తేరుకుని మాత్రల డబ్బాలో నుంచి మాత్ర తీసి వేసుకుని నడుం వాల్చాడు. మళ్ళా తన ఒంటరి లోకం ఆయనకు స్వాగతం పలికింది. మళ్ళా ఆలోచనల దారాలన్నీ చిక్కగా అల్లుకోసాగాయి ఆయన మదిలో.
ఆ రోజు తన మొదటి భుజం విరిగిపోయిన రోజు. రిటైర్మెంట్ రోజు. సాయంత్రం కాలేజీ, ఆఫీస్ స్టాఫ్ అంతా పెద్ద మీటింగ్ పెట్టి ఆయనను పూలదండలతో ముంచెత్తారు. ఆయన మంచితనం, డ్యూటీలో సిన్సియారిటీ గురించి ప్రతిఒక్కరు మాట్లాడి పొగడ్తల పన్నీటిజల్లు కురిపించారు. శాలువా కప్పి సన్మానించి ఇక రేపటినుంచి విశ్రాంతి తీసుకోండని చెప్పేసారు. లెక్చరర్ శివప్రసాద్ తనకు తోడుగా రిక్షాలో ఇంటిదాకా వచ్చి దిగబెట్టి వెళ్ళిపోయాడు. అంతే ఆ రోజునుంచి తన ఉనికి ని తెలిపే తన దేవాలయం గ్రంథాలయం తనకు దూరమైంది. తన కుడి భుజం విరిగిపోయింది.
” మామయ్య.. ఒంటిగంట అవుతోంది అన్నం తినండి” అంటూ పళ్ళాన్ని స్టూల్ మీద పెట్టి స్టూల్ ని మంచం ముందరికి జరిపింది దేవి. ఎక్కువ కారం తినలేడు తాను. తక్కువగా వేయలేదు కోడలు. మజ్జిగన్నం తినడమే ఇష్టం తనకు. ఈ మధ్య అది కూడా నెమ్ము చేస్తోంది అనిపిస్తోంది. ఏం తినాలో ఇక. తనలో తానే గొణుక్కుంటూ తిన్నాననిపించాడు. పోస్టాఫీస్ సుబ్బారావు వచ్చి పదినిముషాలు అది, ఇది మాట్లాడి వెళ్ళిపోయాడు. ఇంటికెవరైనా తనకోసరం వస్తే పండగే సత్యనారాయణయ్యకు. సుబ్బారావు వెళ్ళగానే మళ్ళా ఇల్లంతా, మనసంతా శూన్యం ఆవరించింది.
నిద్ర రాక పోయినా రెప్పలు మూసాడు ఆయన. ఆ రోజు తన రెండవ భుజం విరిగిన రోజు గుర్తుకువచ్చింది. యాభై ఏళ్ళ నుంచి తనకు తోడు, నీడగా ఉండి తనతో కష్టం,సుఖం పంచుకున్న తన సహధర్మచారిణి ఆదిలక్ష్మి తనకి దూరమైన రోజు. ఊపిరి తిత్తులు కోలుకోలేనంతగా పాడై ” ముందు నేను వెళ్ళిపోతాను. నా వెనుకే మీరు రండి ” అంటూ తన లక్ష్మి తనను వదిలివెళ్లిన రోజు. తాను శాశ్వతంగా అవిటివాడైన రోజు.
రిటైర్మెంట్ తొలిదెబ్బ అయితే భార్య చనిపోవడం ఆయన తిరిగికోలుకోలేనంతగా కృంగదీసింది. మనోవ్యాధికి మందు లేదు అంటారు. మనో వేదనతో పాటు ముదిమి తెచ్చిన శారీరక బలహీనత ఆయన్ను మరింత ఆశక్తుడను చేసింది. అంతకు ముందు ఒకటవ తేదీ టంచనుగా బ్యాంకు కు వెళ్ళి పింఛన్ డబ్బులు తెచ్చుకునేవాడు. ఈ మధ్య కొడుకు సాయం లేకుండా బయటకు వెళ్లలేకపోతున్నాడు.
***
సాయంత్రం ఇంటికి వస్తూనే మోహన్ ” నాన్న.. మన ఎదురింటి నిరంజన్ వాళ్ళు ఇల్లు అమ్మేశాక వేరే వాళ్ళు కొని షాపింగ్ కాంప్లెక్స్ కడుతున్నారు కదా. సరిగ్గా మన ఇంటి ఎదురు గదిలోనే బ్యాంకు ఏ.టి.ఏం. మిషన్ పెడుతున్నారు. ఇక పింఛన్ కోసం మనం అంత దూరం బ్యాంకు కి వెళ్ళబల్లేదు. ఏ.టి.ఏం.కార్డు తీసుకుంటే ఇక్కడే డబ్బు తీసుకోవచ్చు ” చాల ఉత్సహంగా అన్నాడు తండ్రి వంక చూస్తూ మోహన్.
ఆ మాట వినంగానే గుండెల్లో రాయి పడింది ఆయనకు. తనకెంతో ఇష్టమైన దానిని ఎవరో బలవంతంగా తనకు దూరం చేస్తున్నట్టు ఆయన మనసు విలవిలలాడింది. వెంటనే “వద్దురా.. ఇందాక సుబ్బారావు కూడా ఆ విషయం చెప్పాడు. కానీ నాకు ఆ ఏ.టి.ఏం మిషన్ లో డబ్బులు వద్దు. నన్ను బ్యాంకు కు తీసుకుపోరా” తాయిలం కొనిమ్మని అడిగితే వద్దని వారించిన తండ్రి వంక బతిమాలుతున్నట్లు, జాలిగా చూసే పసిబిడ్డలా కొడుకు వంక చూసాడు ఆయన.
“నాన్న..చెప్తే వినవా నువ్వు. పోయిన సారి నిన్ను బ్యాంకు కు తీసుకుపోవడానికి నేను కోర్టుకు సెలవు పెట్టాల్సివచ్చింది. కాలం తో పాటు మనం మారాలి. ఇంటి ముందే డబ్బులు తీసుకునే సౌకర్యం ఉంటే పనిగట్టుకుని అంత దూరం ఎందుకు పోవాలి నాన్న. కాస్త నీ చాదస్తం మానుకో ” ఇక ఆయన మాట వినిపించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయాడు మోహన్.
ఆ రోజు రాత్రి అందరికి భోజనాలు అయినాయి. వార్తలు అయినాయి. టీవీ కట్టేసి ” నాన్న..మంచం కింద చెంబులో మంచి నీళ్ళు పెట్టాను. ఇక పడుకో ” మాత్ర తండ్రి చేతికి ఇచ్చి తన గదిలోకి వెళ్ళబోయాడు మోహన్. ” అబ్బయ్యా మోహనా.. రేపు ఒకటోతేదీ రా. నన్ను బ్యాంకు కు తీసుకెళ్ళరా” అన్నాడు సత్యనారాయణయ్య. ” నాన్న నువ్వు పడుకో ముందు. రేపు సంగతి రేపు ఆలోచిస్తాం లే ” అంటూ గదిలోకి వెళ్ళిపోయాడు మోహన్.
***
” ఆ రోజు పొద్దున ఏడు గంటలకు కానీ మెలకువ రాలేదు దేవికి. తలుపు తీసి బయటకు వచ్చి
” అమ్మయ్యా.. ఈ రోజు మామయ్య ఇంకా లేవలేదు లే ” అనుకుంటూ మంచం దగ్గరకు వచ్చి చూసింది. కళ్ళు తెరుచుకునే కదలక, మెదలక ఉండిపోయిన ఆయన్ని చూసి ” మామయ్య ” అంటూ కదిలించింది. అంతే ” ఏమండీ మామయ్య ” అంటూ పెద్దగా అరిచింది.
ఒక్క ఉదుటన గదిలో నుంచి బయటకు వచ్చాడు దేవి కేక విని మోహన్. నిద్రలోనే పోయినట్లు ఉన్నాడు ఆయన. కళ్ళలో నుంచి ప్రాణం బయట పడినట్లు కళ్ళు తెరిచే ఉన్నారు. ” నన్ను బ్యాంకు కు తీసుకుపోరా ” అని తనను అర్థిస్తున్నట్లే ఉండి, కుప్ప కూలిపోయాడు మోహన్ “నాన్న” అంటూ.
నెల రోజుల తర్వాత తన తండ్రి చనిపోయాడని ఇక పింఛన్ అకౌంట్ క్యాన్సిల్ చేయించాలని బ్యాంకు కు వెళ్ళాడు మోహన్. ఆ రోజు ఒకటవ తేదీ. బ్యాంకు అటెండర్ చలమయ్య దగ్గర నుంచి బ్యాంకు మేనేజర్ ప్రతాపరెడ్డి వరకు అందరు మోహన్ చుట్టూ చేరారు. సత్యం సార్ పోయారట కదా. చాల మంచి వాడు. ఎంత కలగొలుపు మనిషో, బ్యాంకు కు వస్తే ప్రతిఒక్కరిని పలకరించి కానీ వెళ్ళేవాడు కాదు అన్నారు అందరు. అప్పుడే పింఛన్ తీసుకోవడానికి వచ్చిన బి.ఎడ్. కాలేజీ గుమస్తా అనంతయ్య, రిటైర్డ్ లెక్చరర్లు శివప్రసాద్, శారదా మేడం అందరు మోహన్ తో తండ్రి మరణం గురించి మాట్లాడారు.
” మీ నాన్న గొప్ప మనసు కలవాడయ్య. నా కూతురుని కాపురానికి పంపేటప్పుడు నాకు ఆర్ధిక ఇబ్బందులు ఉంటే నాకు సాయం చేసి ఆదుకున్నారు ఆయన. ఎప్పుడు చెరగని నవ్వుతో మమ్మల్ని పలకరిస్తూ ఉండేవారు” అన్నాడు అనంతయ్య.
శారదా మేడం “సత్యం సార్ చాల సౌమ్యుడు. ఆయన మరణం చాల విచారకరం అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకుంది. సత్యనారాయణయ్యకి ఆప్త మిత్రుడు శివప్రసాద్ మాట్లాడుతూ “బాబు మోహన్ మీ నాన్నతన ఆరోగ్యం సహకరించకపోయినా నెలకో సారి బ్యాంకు కు రావాలని తపన పడేవాడు. ఇక్కడ అందరం కలసి కాసేపు చెప్పుకునే ముచ్చట్లకు ఆయన ఎంత మురిసిపోయేవారో. ఆయన మరణాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం బాబు. నీకో విషయం తెలుసా..! మేమంతా ఒకటవ తేదీన టంచనుగా బ్యాంకు కు వచ్చేది పింఛన్ కోసం కాదు.. ఆ నెపంతో ఇక్కడ ఆప్యాయతలు పంచుకునేవాళ్ళం. సత్యం పలకరింపుతో మేము పులకరించిపోయేవాళ్ళం. ఆ స్వచ్ఛమైన పలకరింపు, ఆయన చిరునవ్వులు లేని ఈ బ్యాంకు ప్రాంగణం ఈ ఒకటవ తారీకున ఇలా బోసిపోయింది…వింటున్న మోహన్ చలించి పోయాడు.
గుండెగదులన్నీ దుఃఖంతో పూడుకుపోగా భారంగా అడుగులేస్తూ బ్యాంకు బయటకు నడిచాడు మోహన్. ఇంటికి రాగానే నాన్న లేని ఖాళీ మంచం అతని మనసుని మెలిపెట్టింది. మంచం మీద కూర్చున్నాడు. ఎదురుగా గోడ మీద అమ్మ ఫోటో పక్కనే నాన్న ఫోటో. రెండిటికి కలిపి వేసిన పూల దండ నుంచి పరిమళం నాన్న ప్రేమలా తనని చుట్టేస్తోంది.
” బ్యాంకు కు తీసుకుపోరా” నెలకో సారి తన ఉనికిని తెలుసుకునే ప్రదేశం. తన సహాచరులతో కాసేపు కష్టసుఖాలు పంచుకునే రచ్చబండ. తన తోటి వారి పలకరింపులు, ముచ్చట్లు, చిరునవ్వులు పంచుకునే దివ్యామృతాలయం. అమ్మ పోయాక నాన్నకు నెలకు ఒక్కసారి దొరికే ఆలంబన . ఆహర్నిశలు తన బాగు కోసం తపించిన నాన్న కోరిన చిన్న కోరిక. నాన్న చివరి కోరిక తీర్చలేకపోయాడు తను. చేతుల్లో ముఖం దాచుకుని మరోసారి దుఃఖంతో కుప్ప కులాడు మోహన్” నాన్న” అంటూ .